సాక్షి, కాకినాడ : జాతీయరహదారులు జగన్నినాదాలతో హోరెత్తాయి. జిల్లా మీదుగా సాగే 16, 216 సంబర్ల జాతీయ రహదారులపై ఎక్కడికక్కడ జనదిగ్బంధంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేట వద్ద పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ఎన్‌హెచ్-16ను ఐదుగంటలపాటు దిగ్బంధించారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించి, ఉట్టికొట్టి, కోలాటమాడి, కోడిపందాలు, గుర్రపు స్వారీలతో నిరసన తెలిపారు. పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ శెట్టి బత్తుల రాజబాబు, జ్యోతుల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
మోరంపూడి జంక్షన్‌లో...
మోరంపూడి జంక్షన్‌లో ఎన్‌హెచ్-16ను పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజుల ఆధ్వర్యంలో 2 గంటల పాటు దిగ్బంధించి రహదారిపైనే వంటావార్పు చేశారు. పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు బొడ్డు వెంకటరమణచౌదరి క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు నరవ గోపాలకృష్ణ అల్లూరి సీతారామరాజు వేషధారణలో ‘తెలుగువీర లేవరా’ అన్న పాటతో అలరించారు. విజయలక్ష్మి, వీర్రాజులతో పాటు 24 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడిచిపెట్టారు.
లాలాచెరువు జంక్షన్‌లో...
ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తనయుడు వాసు ఆధ్వర్యాన ఎన్‌హెచ్-16ను లాలాచెరువు జంక్షన్ వద్ద 3 గంటలపాటు దిగ్బంధించారు. ట్రేడ్ యూనియన్ రాష్ర్ట కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాసు, మాజీ కార్పొరేటర్‌లు, నాయకులు కబడ్డీ, ఖోఖో, అష్టాచెమ్మా, కర్రసాము వంటి ఆటలు ఆడారు.
అచ్చంపేటలో వేణు అగ్నిదీక్ష
జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులుకర్రి సత్యనారాయణ తదితరులు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద ఎన్‌హెచ్-216ను దిగ్బంధించారు. సెంటర్‌లో చుట్టూ మంటలు ఏర్పాటు చేసి మధ్యలో వేణుతో సహా సుమారు 100 మంది కార్యకర్తలు కూర్చొని గంటకుపైగా అగ్నిదీక్ష చేపట్టడం హైలెట్‌గా నిలిచింది. తుని నుంచి కత్తిపూడి వరకు ఐదు ప్రాంతాల్లో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఎన్‌హెచ్-16ను దిగ్బంధించి వంటావార్పుతో నిరసన తెలిపారు. పార్టీ మహిళా కన్వీనర్ రొంగలి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
‘వరుపుల’ కబడ్డీ.. ‘దొరబాబు’ బైక్ ర్యాలీ
మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం ఎర్రవరం వద్ద ఎన్‌హెచ్-16ను ఐదుగంటల పాటు దిగ్బంధించి రోడ్డుపైనే కబడ్డీ ఆడి, సహపంక్తి భోజనాలు చేశారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పిఠాపురం సమీపంలోని చిత్రాడ రైల్వే ఫ్లైఓవర్‌పై 216 జాతీయ రహదారిని రెండుగంటల పాటు దిగ్బంధించారు. మానవహారం చేసి పట్టణంలో బైక్‌ర్యాలీ చేపట్టారు.
అమలాపురంలో 30 మంది అరెస్టు
అమలాపురం ఎర్రవంతెన వద్ద పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో ఎన్‌హెచ్-216ను దిగ్బంధించారు. మాజీఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు, కో ఆర్డినేటర్లు చింతా కృష్ణమూర్తి, మిండగుదిటి మోహన్‌తో సహా సుమారు 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
రావులపాలెంలో నిరసనల హోరు
మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావుల పాలెంలో ఎన్‌హెచ్-16ను దిగ్బంధించి నిరసనలతో హోరెత్తించారు. పార్టీ మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి, రాష్ర్ట సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష, కో ఆర్డినేటర్ రెడ్డి ప్రసాద్, కిసాన్ సెల్ కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, అధికార ప్రతినిధి డేవిడ్‌రాజు, సేవాదళ్ జిల్లా కన్వీనర్ ఎం.గంగాధర్ పాల్గొన్నారు.
దిండి-చించినాడ వంతెన దిగ్బంధం
రాజోలు కో ఆర్డినేటర్ మట్టా శైలజ ఆధ్వర్యంలో దిండి-చించినాడ వంతెనను దిగ్బంధించి ఉభయగోదావరి జిల్లాల మధ్య రాకపోకలను స్తంభింప చేశారు. కోఆర్డినేటర్లు చింతలపాటి వెంకటరామరాజు, బొంతు రాజేశ్వరరావు పాల్గొన్నారు. పి.గన్నవరం అక్విడెక్టుపై రహదారిని పార్టీ కో ఆర్డినేటర్లు విప్పర్తి వేణు గోపాల్, కొండేటి చిట్టిబాబు, రైతు విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీలు దిగ్బంధించారు. పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో మామిడికుదురు వద్ద రాస్తారోకో చేసి ఎన్‌హెచ్-216పై రాకపోకలను అడ్డుకున్నారు. రాజమండ్రి-భద్రాచలం రహదారిని కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో రంపచోడవరం వద్ద దిగ్బంధించారు. మురమళ్ల రాఘవేంద్ర వారధిపై కో ఆర్డినేటర్ గుత్తుల సాయి, మాజీ జెడ్పీటీసీ పెన్మత్స చిట్టిరాజుల ఆధ్వర్యంలో గంటకుపైగా రాస్తారోకో చేశారు. రామచంద్రపురం బైపాస్ రోడ్డును సుమారు గంట పాటు దిగ్బంధించారు.
జయప్రకాష్ దీక్ష భగ్నం
జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా మలికిపురంలో పార్టీ కో ఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ చేపట్టిన ఆమరణ దీక్ష ఐదవ రోజైన గురువారం రాత్రి 10 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. ఆయనను ఆస్పత్రికి తరలించారు. కాగా రాజమండ్రి కంబాలచెరువు సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ నేత జక్కంపూడి రాజా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఐదవ రోజుకు చేరింది. రాజాకు పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సంఘీభావం తెలిపారు. శిబిరం వద్ద సాంస్కృతిక విభాగం రాష్ర్ట కన్వీనర్ వంగపండు ఉష ధూం..ధాం నిర్వహించారు. జగన్‌కు మద్దతుగా అనపర్తి మండలం కుతుకులూరులో నల్లమిల్లి దుర్గావరప్రసాద్‌రెడ్డి చేపట్టిన ఆమరణదీక్షను పార్టీ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ నేత బొడ్డు వెంకటరమణచౌదరి ప్రారంభించారు. పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ మందపాటి కిరణ్‌కుమార్ అయినవిల్లిలో, జిల్లా యూత్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు కడిమి చిన్నవరాజు ఉప్పలగుప్తంలో చేపట్టిన 48 గంటల దీక్షలు గురువారంతో ముగిశాయి. ధవళేశ్వరంలో పార్టీ నాయకులు మేకా సత్యనారాయణ, కేవీ రావు,అమీద్‌బాష, రబ్బానీ, మిరప రమేష్ 48 గంటల దీక్ష చేపట్టారు. జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో రిలే దీక్షలు ఐదవ రోజు కొనసాగాయి.
జగన్ దీక్షకు పోటెత్తిన సంఘీభావం
Published Fri, Aug 30 2013 12:36 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement