
సాక్షి, హైదరాబాద్: తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం జలాశయం నుంచి మరో 15 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ విన్నవించింది. సాగర్ ఎడమ కాల్వ కింది అవసరాలకు 10 టీఎంసీ లు, కల్వకుర్తి కింది అవసరాలకు మరో 5 టీఎంసీలు కేటాయించాలని కోరింది. ఈ మేరకు బుధవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీకి నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. ఇప్పటికే హైదరాబాద్, నల్లగొండ తాగునీటికి 4 టీఎంసీలు, కల్వకుర్తి కింద 5 టీఎంసీలు కలిపి 9 టీఎంసీల కేటాయింపులకు అదనంగా మరిన్ని కేటాయింపులు కావాలని కోరారు. శ్రీశైలంలో 871 అడుగుల్లో 147.28 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని, ఇందులో కనీస నీటి మట్టం 834 అడుగులకు ఎగువన 93.43 టీఎంసీల మేర నిల్వలున్నాయని బోర్డు దృష్టికి తెచ్చారు.
సాగర్‌లో 514.2 అడుగుల వద్ద 138.91 టీఎంసీల నిల్వలుండగా, ఇందులో కనీస నీటి మట్టం 510 అడుగుల ఎగువన కేవలం 7.24 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయన్నారు. శ్రీశైలంలో ఉన్న లభ్యత నీటిలోంచి నల్లగొండ, ఖమ్మం, మిషన్ భగీరథ అవసరాల కోసం సాగర్ ఎడమ కాల్వ కింద 10 టీఎంసీలు కేటాయించాలన్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల తాగునీటి అవసరాలకు కల్వకుర్తి నుంచి 5 టీఎంసీలు అవసరమని తెలిపారు. నీటి కేటాయింపులు తేల్చేందుకు త్రిసభ్య కమిటీ భేటీని మరోమారు నిర్వహించాలని కోరారు. మరోవైపు శ్రీశైలం ఎడమ కాల్వ కింద విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలం టూ బోర్డు చేసిన ప్రతిపాదనను రాష్ట్రం తిరస్కరించింది. రాష్ట్ర విద్యుత్ అవసరాల దృష్ట్యా ఉత్పత్తి కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ బోర్డుకు మరో లేఖ రాసింది.