దామరచర్ల : మూసీ పక్కన అటవీ భూముల్లో సాగు చేసిన వరిపొలం
సాక్షి, దామరచర్ల(నల్గొండ) : పక్కనే మూసీ, కృష్ణా నది.. నీటి వనరులు పుష్కలం.. చుట్టుపక్కల విస్తారమైన అటవీ ప్రాంతం.. ఇంకేముంది అక్రమార్కులు అడవిపై పడ్డారు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని కబ్జాపర్వం మొదలుపెట్టారు. కొందరు పంటలు సాగు చేసుకుంటుండగా, మరికొందరు క్రయ విక్రయాలు కూడా జరుపుతున్నారు. ఇదీ.. దామరచర్ల మండలంలోని అటవీభూముల్లో ఆక్రమణల తీరు. అధికారుల నిర్లక్ష్యం.. అక్రమార్కులకు వరంగా మారింది. దామరచర్ల మండలంలో వందలాది ఎకరాల అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.
వందల కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూములను కొందరు వ్యక్తులు దర్జాగా కబ్జా చేసుకొని సాగు చేసుకుంటున్నారు. ఇవి క్రయ విక్రయాలు జరుగుతున్నా అటవీశాఖ అధికారులకు మాత్రం పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టంలోని లొసుగులను ఆ«ధారంగా చేసుకొని కొందరు అధికారులు తప్పుడు పట్టాలు ఇచ్చారు. వందలాది ఎకరాలు పరాధీనం అవుతున్నా, పచ్చని చెట్లు కనుమరుగవుతున్నా పట్టించుకోకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక్కడి వందలాది ఎకరాల డీఫామ్ పట్టా భూములు సైతం వివాదాస్పదంగా మారాయి.
ప్రభుత్వం ఓవైపు హరితహారం పేరిట వందల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతుండగా, మరో పక్క కొందరు అవినీతి అధికారుల కారణంగా ఉన్న అడవి నాశనం అవుతోంది. మిర్యాలగూడ రేంజర్ పరిధిలో4,99,259.91 హెక్టార్ల అటవీ భూమలున్నాయి. అందులోని దామరచర్ల మండలం పలుగ్రామాల్లో అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ తంతు దశాబ్దకాలంగా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దామరచర్ల రెవెన్యూ పరిధిలోని 430 సర్వే నంబర్‌లో 1,089 ఎకరాల అటవీ భూములున్నాయి.
వీటిల్లో సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు కొంతమేర కేటాయించారు. డీఫామ్ పట్టాల భూముల్లో సైతం ఆక్రమణదారులు చేరారు. ఈ భూములన్నీ మూసీ నది పక్కన ఉండడం, లిప్టు సౌకర్యం ఉండటంతో దర్జాగా సాగు చేసుకుంటు న్నారు. కరెంట్, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసుకొని, బోర్లు వేసి çవరి, పత్తి లాంటి పంటలు పండించుకుంటున్నారు. వీటిని కొందరు వ్యక్తులు విక్రయాలు సైతం జరుపుతున్నారు. సర్వే నంబర్ 826లో 1097 ఎకరాల అటవీ భూములున్నాయి.
వీటిల్లో సైతం పలువురు కబ్జా చేసుకొని సాగు చేసుకుంటున్నారు. కొందరైతే తాము ఆక్రమించుకున్న అటవీ భూములను అమ్ముకుంటున్నారు కూడా. వీటిపై ఉన్నతాధికారులకు ఇప్పటికే పలువురు ఫిర్యాదు కూడా చేశారు. దామరచర్ల కనుచూపు మేరలోనే అటవీ భూముల అక్రమాల పర్వం జరుగుతున్నా, ఎవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కనుమరుగవుతున్న వనసంపద
దామరర్ల మండలంలోని కృష్ణా, మూసీనది, అన్నమేరు వాగుల నడుమ వందలాది ఎకరాల్లో ఉన్న అటవీ భూముల్లోని వనసంపద కనుమరుగవుతోంది. విలువైన, సారవంతమైన భూములు కావడం, నీటి సౌకర్యం ఉండడంతో చెట్లు ఏపుగా పెరిగాయి. ఈ చెట్లను నరికి యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నారు. దామరచర్ల, నర్సాపురం, వాచ్యాతండా, కల్లేపల్లి, తాళ్లవీరప్ప గూడెం, గణేష్‌పాడ్, వాడపల్లి తదితర గ్రామాల్లోని అటవీ భూములు కబ్జాకు గురవుతున్నాయి.
అధికారుల్లో స్పష్టత కరువు
సాగర్ నిర్వాసితుల కోసం దామరచర్లలోని సర్వేనంబర్ 430, నర్సాపురం సర్వేనంబర్ 826, గాంధీనగర్ సర్వేనంబర్ 441లోని అటవీ భూముల్లో కొంతభాగాన్ని డీ ఫారెస్టు చేసి పట్టాలు ఇచ్చారు. అయితే వీటిపై అధికారుల్లో స్పష్టత లేదు. నిజమైన లబ్ధిదారులు ఎవరు? వారికి ఏ సర్వేనంబర్‌లో ఎంతమేర భూములు.. ఎక్కడెక్కడ కేటాయించారు? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. డీ ఫారెస్టు భూములు క్రయ విక్రయాలకు వీలుండడంతో, కొందరు అవినీతి అ«ధికారులు అక్రమ పట్టాలు ఇచ్చారు.
వీటిని ఆసరాగా చేసుకొని కబ్జాల పర్వం సాగుతోంది. అటవీశాఖ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే చేసి, నిజమైన డీఫామ్ పట్టాదారులను గుర్తిస్తే కబ్జాకు గురైన వందలాది ఎకరాల అటవీభూములును రక్షించే వీలుంది. తాజాగా మండలంలోని 430లో సర్వే చేస్తున్నందున, మిగిలిన చోట్ల కూడా సర్వే జరిపి కబ్జాదారుల కబంధ హస్తాలనుంచి అటవీ భూములను రక్షించాల్సి ఉంది. దీనికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment