సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టా ప్రజల వందేళ్ల కల అయిన పులిచింతల ప్రాజెక్టు నేడు జలకళతో కళకళలాడుతోంది. ఆ కలను సాకారం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుడితే.. ఆ మహానేత తనయుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ స్వప్నాన్ని పరిపూర్ణం చేశారు. తెలంగాణ సర్కార్‌తో చర్చించి, ముంపు సమస్యను పరిష్కరించారు. దీంతో ప్రస్తుతం పూర్తి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేయగలిగారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఆ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం ఇదే ప్రథమం కావడం విశేషం. దీని వల్ల ప్రస్తుత ఖరీఫ్‌లో కృష్ణా డెల్టాలో పంటలకు సమృద్ధిగా నీరు లభించడంతో పాటు, వచ్చే ఖరీఫ్‌కు కూడా సకాలంలో నీళ్లందుతాయంటూ రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.
1911లోనే నివేదిక
కృష్ణా నదిపై బ్యారేజిని నిర్మిస్తే డెల్టాను సస్యశ్యామలం చేయవచ్చని సర్ ఆర్థర్ కాటన్ 1852లో నాటి బ్రిటిష్ సర్కార్‌కు నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా 1852లో కెప్టెన్ చారీస్ రూ. రెండు కోట్ల ఖర్చుతో బ్యారేజి నిర్మించారు. అయితే 1954లో వచ్చిన వరదలకు బ్యారేజి కుంగిపోవడం వల్ల 1954–57 మధ్య ప్రకాశం బ్యారేజి నిర్మించారు. ఈ బ్యారేజి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు. వర్షాభావ పరిస్థితుల్లో కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గడం.. ఖరీఫ్ పంటలకు జూన్‌లో నీళ్లందించే అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం బ్రిటిష్ అధికారి కల్నల్ ఇల్లీస్ అధ్యయనం చేశారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మించడం ద్వారా కృష్ణా డెల్టాకు సమర్థవంతంగా నీళ్లందించవచ్చని 1911లో బ్రిటిష్ సర్కార్‌కు నివేదిక ఇచ్చారు.
సింహభాగం వైఎస్ హయాంలో పూర్తి
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎన్నికలకు ముందు పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం, ఓట్ల గండం గడిచాక దాన్ని అటకెక్కించడం రివాజుగా మార్చుకున్నారు. మే 14, 2004న ముఖ్యమంత్రిగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు స్వీకరించాక జలయ/æ్ఞంలో భాగంగా రూ. 1,281 కోట్ల అంచనాతో పులిచింతల ప్రాజెక్టును చేపట్టారు. ఆ ప్రాజెక్టు పనులను 2009 నాటికే సింహభాగం పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులు కొంత భాగం మిగిలాయి. 2009 నుంచి ఇటీవల కాలం వరకూ పునరావాసం పనులను పూర్తి చేయలేకపోయారు. దీనివల్ల ప్రాజెక్టు పూర్తయినా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేని దుస్థితి. పులిచింతలలో నీటిని నిల్వ చేయకపోవడం వల్ల 2014–15లో 73.33, 2015–16లో 9.259, 2016–17లో 55.21, 2018–19లో 38.88 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలిసిపోయాయి. తెలంగాణ సర్కార్‌కు కేవలం రూ.42 కోట్ల మేర పరిహారం చెల్లించడంలో టీడీపీ సర్కార్ విఫలం కావడం వల్ల 2017లో పులిచింతలలో 30 టీఎంసీలకు మించి నిల్వ చేయలేని దుస్థితి ఏర్పడింది.
పూర్తి సామర్థ్యం మేరకు నిల్వ
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పులిచింతల ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయడానికి వీలుగా తెలంగాణ సర్కార్‌కు చెల్లించాల్సిన పరిహారాన్ని విడుదల చేయించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చించి.. ముంపు గ్రామాలను ఖాళీ చేయించి.. ప్రాజెక్టులో నీటి నిల్వకు సహకరించాలని కోరారు. ఇందుకు కేసీఆర్ సమ్మతించారు. ఇటీవల వచ్చిన వరదల సమయంలో ఇటు గుంటూరు.. తెలంగాణలో సూర్యాపేట జిల్లాల కలెక్టర్లను సమన్వయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. నిర్వాసితులకు పునరావాసం కల్పించి ప్రాజెక్టులో తొలి సారిగా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేశారు. దాంతో కృష్ణా డెల్టా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైందని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు.
కృష్ణా డెల్టా చింతలు తీరినట్లే..
కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌లో ఆలస్యంగా వరి సాగు చేయడం వల్ల అక్టోబర్, నవంబర్ నాటికి పంట కోతకు వస్తుంది. ఆ సమయంలో తుపాన్‌ల వల్ల పంట నష్టం జరుగుతోంది. జూన్‌లోనే వరి సాగు చేస్తే తుపాన్‌ల బారి నుంచి పంటలను రక్షించవచ్చునని భావించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పులిచింతల ప్రాజెక్టును చేపట్టారు. పులిచింతల ప్రాజెక్టులో నిల్వ చేసే నీటితో కృష్ణా డెల్టాలో వరి సాగుకు జూన్‌లోనే నీళ్లందివచ్చు. ప్రస్తుత ఖరీఫ్‌లో పంటలకు సమర్థవంతంగా నీటిని సరఫరా చేయడంతోపాటు.. వచ్చే ఖరీఫ్‌కు సంబంధించి జూన్‌లోనే సాగు నీటిని విడుదల చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment