puli chinthala project
-
కృష్ణా నదికి పెరుగుతున్న వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక
సాక్షి, విజయవాడ: కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పులిచింతల నుంచి ఔట్‌ఫ్లో 5.11లక్షల క్యూసెక్కులుగా ఉంది. దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాగులు దాటే ప్రయత్నం చేయొద్ధని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు. -
‘గేటు’.. బాధ్యులపై వేటు!
సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసేందుకు గేట్లను ఎత్తే సమయంలో 16వ గేటు ఊడిపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గేటు ఊడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయన్న అంశంపై అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. పులిచింతల ప్రాజెక్టు భద్రతకు చర్యలు తీసుకోవాలని, గేటు ఊడటానికి కారణమైన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం కోసం పులిచింతల ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా ఉండింది. 2003లో ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచిన నాటి చంద్రబాబు సర్కార్.. రూ.268.89 కోట్లకు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు చెందిన ఎస్సీఎల్–సీఆర్18జీ(జాయింట్ వెంచర్) సంస్థకు కట్టబెట్టింది. చేసిన పనులకు అదనంగా బిల్లులను దోచి పెట్టడానికి వీలుగా బొల్లినేని కోసం కాంట్రాక్టు ఒప్పందంలో ఆర్బిట్రేషన్ నిబంధనను చంద్రబాబు చేర్పించారు. దీంతో ప్రాజెక్టు పనులను బొల్లినేని ఇష్టారాజ్యంగా చేశారు. ప్రాజెక్టు స్పిల్ వే పియర్స్(కాంక్రీట్ దిమ్మెలు) 4.5 మీటర్ల వెడల్పుతో 58.24 మీటర్ల ఎత్తుతో నిర్మించాలి. కానీ, కాంక్రీట్ దిమ్మెలను తక్కువ వెడల్పుతో వంకర టింకరగా నిర్మించారు. స్పిల్ వేకు గేట్లను బిగించేందుకు వీలుగా పియర్స్‌కు 45.59 మీటర్ల వద్ద ట్రూనియన్ బీమ్‌లను నిర్మించాలి. 2 పియర్లకు ఏర్పాటు చేసిన ట్రూనియన్ బీమ్‌లకు గేట్ల ఆర్మ్ గడ్డర్లను అమర్చడం ద్వారా 18.5 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 560.25 మీటర్ల పొడవున్న స్పిల్ వేకు 24 గేట్లను బిగించాలి. ఒక్కో గేటుకు ఒక్కో వైపున 2 ఇనుప తీగలు (రోప్)లను బిగించి.. మొత్తం 4 ఇనుప తీగల ద్వారా సంప్రదాయ పద్ధతిలో ఈ గేట్లను ఎత్తే ఏర్పాట్లు చేయాలి. కానీ.. బొల్లినేని రామారావు సంస్థ పులిచింతల స్పిల్ వే పియర్లు, ట్రూనియన్ బీమ్‌లను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసింది. లోపాలు చూపినా పట్టించుకోని బాబు సర్కార్ పులిచింతల ప్రాజెక్టు పనులను 2015 జనవరి 5న రిటైర్డు సీఈ కె.సత్యనారాయణ, డిజైన్స్ సలహాదారు, రిటైర్డు ఈఎన్సీ డాక్టర్ పి.రామరాజు అధ్యక్షతన ఏర్పాటైన స్పెషల్ డ్యామ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ టీమ్ పరిశీలించింది. డిజైన్ల మేరకు పనులు చేయలేదని స్పష్టం చేసింది. 9వ పియర్‌ను 4.5 మీటర్ల వెడల్పుతో కాకుండా 3.80 మీటర్ల వెడల్పుతోనే చేసినట్లు తేల్చింది. స్పిల్ వేలో లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు గ్రౌటింగ్ చేయడం కోసం 24 చోట్ల బోర్లు తవ్వి.. గ్రౌటింగ్ (బోరు బావి తవ్వి.. అధిక ఒత్తిడితో కాంక్రీట్ మిశ్రమాన్ని పంపడం ద్వారా భూమి పొరల్లో పగుళ్లను పూడ్చడం) చేయకుండా వదిలేశారని.. దీని వల్ల భారీ ఎత్తున నీరు లీకేజీ (సీపేజీ) అవుతోందని చెప్పింది. గేట్లను ఎత్తడానికి సంబంధించిన ఇనుప తీగల(రోప్‌ల)ను ఇష్టారాజ్యంగా బిగించారని ఎత్తిచూపుతూ నాటి చంద్రబాబు సర్కార్‌కు నివేదిక ఇచ్చింది. ఇది ప్రాజెక్టు భద్రతకు ముప్పు వాటిల్లేలా చేస్తుందని తేల్చింది. స్పిల్ పియర్లను బాగు చేయాలని.. ట్రూనియన్ బీమ్‌లను సరి చేయాలని.. గ్రౌటింగ్ చేయడం ద్వారా సీపేజీకి అడ్డుకట్ట వేయాలని సూచించింది. ప్రాజెక్టు భద్రతకు తక్షణమే చర్యలు చేపట్టాలని సర్కార్‌కు సూచించింది. కానీ.. ఆ నివేదికలో పేర్కొన్న అధిక అంశాలను అమలు చేయకుండా చంద్రబాబు సర్కార్ బుట్ట దాఖలు చేసింది. ఈ పాపం టీడీపీ సర్కార్‌దే.. 2015లో ఎస్‌డీఎస్‌ఐటీ ఇచ్చిన నివేదిక మేరకు టీడీపీ సర్కార్ పులిచింతల ప్రాజెక్టులో లోపాలను సరిదిద్ది ఉంటే.. గేటు ఊడిపోయే అవకాశమే ఉండేది కాదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గేటు ఊడిపోవడానికి దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా అధ్యయనం చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈఎన్సీ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన సీడీవో సీఈ శ్రీనివాస్, డిజైన్స్ సలహాదారు గిరిధర్‌రెడ్డి, రిటైర్డు సీఈ కె.సత్యనారాయణ సభ్యులుగా ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడానికి జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఈ కమిటీకి పులిచింతల ఎస్ఈ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఊడిపోయిన గేటు స్థానంలో తాత్కాలికంగా స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసి, ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసి.. కృష్ణా డెల్టా రైతులకు ఇబ్బందులు లేకుండా ఒక వైపు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. మరో వైపు నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రాజెక్టు భద్రతకు చర్యలు చేపట్టనుంది. -
కృష్ణమ్మ ఉరకలు
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/అమలాపురం టౌన్/శ్రీశైలం ప్రాజెక్ట్/అచ్చంపేట(పెదకూరపాడు): ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణా నది ఉరకలెత్తుతోంది. మంగళవారం జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,90,452 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా ఆరు గేట్లను ఎత్తి 4,24,530 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4,13,198 క్యూసెక్కులు చేరుతుండగా, అంతే స్థాయిలో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి విడుదల చేసిన జలాల్లో పులిచింతల ప్రాజెక్టుకు 3,90,452 క్యూసెక్కులు చేరుతుండగా.. 3,83,002 క్యూసెక్కులను గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 42.72 టీఎంపీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు డీఈ తెలిపారు. పులిచింతల నుంచి భారీ ఎత్తున వరదను దిగువకు విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద గంటగంటకూ వరద భారీ ఎత్తున పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 1,79,124 క్యూసెక్కులు వస్తుండగా 50 గేట్లు తెరిచి 93,173 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం నాటికి ప్రకాశం బ్యారేజీలోకి 3.50 లక్షల క్యూసెక్కుల వరద పెరిగే అవకాశం ఉంది. కాగా, ఒక నీటి సంవత్సరం (జూన్ 1 నుంచి మే 31 వరకూ) కృష్ణా బేసిన్లో అన్ని ప్రాజెక్టుల గేట్లను రెండు పర్యాయాలు తెరిచి వరద నీటిని దిగువకు విడుదల చేయడం గత పదేళ్లలో ఇదే ప్రథమం. శ్రీశైలం గేట్ల పైనుంచి నీరు.. శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్ల పైనుంచి వరద నీరు ఓవర్ ఫ్లో అయ్యింది. జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఉండటంతో సోమవారం రాత్రి 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.85 టీఎంసీలు కాగా.. 215.3263 టీఎంసీలను అధికారులు నిల్వ చేశారు. వరద ప్రవాహం ఎక్కువ ఉండటం, జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పాదనను పెంచడం, తగ్గించడం వంటి కారణాలతో జలాశయంలో నీరు గేట్లపై నుంచి ఓవర్‌ఫ్లో అయ్యింది. ఇది గమనించిన అధికారులు 10 అడుగుల మేర తెరిచిన గేట్లను మంగళవారం 23 అడుగులకు ఎత్తారు. దీంతో ఓవర్‌ఫ్లో నిలిచిపోయింది. శాంతించిన గోదావరి.. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో వరద ఉధృతి తగ్గింది. గత మూడు రోజులుగా మహోగ్రంగా ప్రవహించిన గోదావరి మంగళవారం కాస్త శాంతించింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎగువున ఉన్న ఏజెన్సీ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే ధవళేశ్వరం దిగువున ఉన్న కోనసీమ ప్రాంతంలో లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు 14,59,000 క్యూసెక్కుల వరద నీరును విడిచిపెట్టగా.. అది రాత్రి 7 గంటలకు 11,39,000 క్యూసెక్కులకు తగ్గించారు. ఇక భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రానికి నీటి మట్టం మూడు అడుగుల మేర తగ్గింది. దేవీపట్నం మండలాన్ని ఇంకా వరద నీరు వణికిస్తూనే ఉంది. కోనసీమలో మంగళవారం రాత్రికి దాదాపు 48 లంక గ్రామాలు జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. 17 లంక గ్రామాలకు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. చింతూరు మండలంలో 15 గ్రామాల్లో వరద నీరు ప్రభావంతో ఆంధ్రా, ఒడిశా మధ్య రాకపోకలు పూర్తిగా పునరుద్ధరణ కాలేదు. కోనసీమలో బుధవారం నుంచి వరద తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మరో మూడు రోజుల్లో సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. స్థిరంగా వంశధార ప్రవాహం వంశధార నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 27,832 క్యూసెక్కులు చేరుతుండగా కాలువలకు 3,925 క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 23,907 క్యూసెక్కులను గొట్టా బ్యారేజీ 22 గేట్లు తెరిచి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టులోకి నాగావళి వరద ప్రవాహం కొనసాగుతోంది. -
శతవసంతాల కల.. సాకారమైన వేళ
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టా ప్రజల వందేళ్ల కల అయిన పులిచింతల ప్రాజెక్టు నేడు జలకళతో కళకళలాడుతోంది. ఆ కలను సాకారం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుడితే.. ఆ మహానేత తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ స్వప్నాన్ని పరిపూర్ణం చేశారు. తెలంగాణ సర్కార్‌తో చర్చించి, ముంపు సమస్యను పరిష్కరించారు. దీంతో ప్రస్తుతం పూర్తి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేయగలిగారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఆ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం ఇదే ప్రథమం కావడం విశేషం. దీని వల్ల ప్రస్తుత ఖరీఫ్‌లో కృష్ణా డెల్టాలో పంటలకు సమృద్ధిగా నీరు లభించడంతో పాటు, వచ్చే ఖరీఫ్‌కు కూడా సకాలంలో నీళ్లందుతాయంటూ రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. 1911లోనే నివేదిక కృష్ణా నదిపై బ్యారేజిని నిర్మిస్తే డెల్టాను సస్యశ్యామలం చేయవచ్చని సర్ ఆర్థర్ కాటన్ 1852లో నాటి బ్రిటిష్ సర్కార్‌కు నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా 1852లో కెప్టెన్ చారీస్ రూ. రెండు కోట్ల ఖర్చుతో బ్యారేజి నిర్మించారు. అయితే 1954లో వచ్చిన వరదలకు బ్యారేజి కుంగిపోవడం వల్ల 1954–57 మధ్య ప్రకాశం బ్యారేజి నిర్మించారు. ఈ బ్యారేజి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు. వర్షాభావ పరిస్థితుల్లో కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గడం.. ఖరీఫ్ పంటలకు జూన్‌లో నీళ్లందించే అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం బ్రిటిష్ అధికారి కల్నల్ ఇల్లీస్ అధ్యయనం చేశారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మించడం ద్వారా కృష్ణా డెల్టాకు సమర్థవంతంగా నీళ్లందించవచ్చని 1911లో బ్రిటిష్ సర్కార్‌కు నివేదిక ఇచ్చారు. సింహభాగం వైఎస్ హయాంలో పూర్తి దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎన్నికలకు ముందు పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం, ఓట్ల గండం గడిచాక దాన్ని అటకెక్కించడం రివాజుగా మార్చుకున్నారు. మే 14, 2004న ముఖ్యమంత్రిగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు స్వీకరించాక జలయ/æ్ఞంలో భాగంగా రూ. 1,281 కోట్ల అంచనాతో పులిచింతల ప్రాజెక్టును చేపట్టారు. ఆ ప్రాజెక్టు పనులను 2009 నాటికే సింహభాగం పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులు కొంత భాగం మిగిలాయి. 2009 నుంచి ఇటీవల కాలం వరకూ పునరావాసం పనులను పూర్తి చేయలేకపోయారు. దీనివల్ల ప్రాజెక్టు పూర్తయినా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేని దుస్థితి. పులిచింతలలో నీటిని నిల్వ చేయకపోవడం వల్ల 2014–15లో 73.33, 2015–16లో 9.259, 2016–17లో 55.21, 2018–19లో 38.88 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలిసిపోయాయి. తెలంగాణ సర్కార్‌కు కేవలం రూ.42 కోట్ల మేర పరిహారం చెల్లించడంలో టీడీపీ సర్కార్ విఫలం కావడం వల్ల 2017లో పులిచింతలలో 30 టీఎంసీలకు మించి నిల్వ చేయలేని దుస్థితి ఏర్పడింది. పూర్తి సామర్థ్యం మేరకు నిల్వ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పులిచింతల ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయడానికి వీలుగా తెలంగాణ సర్కార్‌కు చెల్లించాల్సిన పరిహారాన్ని విడుదల చేయించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చించి.. ముంపు గ్రామాలను ఖాళీ చేయించి.. ప్రాజెక్టులో నీటి నిల్వకు సహకరించాలని కోరారు. ఇందుకు కేసీఆర్ సమ్మతించారు. ఇటీవల వచ్చిన వరదల సమయంలో ఇటు గుంటూరు.. తెలంగాణలో సూర్యాపేట జిల్లాల కలెక్టర్లను సమన్వయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. నిర్వాసితులకు పునరావాసం కల్పించి ప్రాజెక్టులో తొలి సారిగా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేశారు. దాంతో కృష్ణా డెల్టా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైందని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. కృష్ణా డెల్టా చింతలు తీరినట్లే.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌లో ఆలస్యంగా వరి సాగు చేయడం వల్ల అక్టోబర్, నవంబర్ నాటికి పంట కోతకు వస్తుంది. ఆ సమయంలో తుపాన్ల వల్ల పంట నష్టం జరుగుతోంది. జూన్‌లోనే వరి సాగు చేస్తే తుపాన్ల బారి నుంచి పంటలను రక్షించవచ్చునని భావించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పులిచింతల ప్రాజెక్టును చేపట్టారు. పులిచింతల ప్రాజెక్టులో నిల్వ చేసే నీటితో కృష్ణా డెల్టాలో వరి సాగుకు జూన్‌లోనే నీళ్లందివచ్చు. ప్రస్తుత ఖరీఫ్‌లో పంటలకు సమర్థవంతంగా నీటిని సరఫరా చేయడంతోపాటు.. వచ్చే ఖరీఫ్‌కు సంబంధించి జూన్‌లోనే సాగు నీటిని విడుదల చేయవచ్చు. -
శీనయ్య కోసమే కేబినెట్ సీను!
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ప్రత్యేకంగా భేటీ అవుతోంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కరాళ నృత్యం చేస్తున్న కరువు బారి నుంచి రైతులను కాపాడటం కోసమో.. రాష్ట్రంలో విజృంభించిన డెంగ్యూ, స్వైన్ ప్లూ వంటి విషజ్వరాల బారిన పడిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసమో.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమో కాదు. మరి ఎందుకంటే.. సీఎం చంద్రబాబు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమాలకు సన్నిహితుడైన పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్ బొల్లినేని శీనయ్యకు రూ.384.65 కోట్లకు పైగా మొత్తాన్ని ‘అదనం’గా ఇచ్చే ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయడం కోసం. పులిచింతల ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం) కాంట్రాక్టు ఒప్పంద విలువ కంటే అధికంగా రూ.384.65 కోట్లకు పైగా అదనంగా ఇవ్వాలన్న ప్రతిపాదనను ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తీవ్రంగా తప్పుబట్టారు. మచిలీపట్నం కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసి.. కాంట్రాక్టర్ లేవనెత్తిన 27 అంశాలపై సాధికారికంగా వాదనలు విన్పించగలిగితే కాంట్రాక్టర్‌కు అదనంగా బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదని.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వానికి సూచించారు. న్యాయ సలహా (లీగల్ ఒపినీయన్) పేరుతో.. హైకోర్టును ఆశ్రయించకుండా వ్యూహాత్మకంగా రెండున్నరేళ్లపాటు జాప్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సాకుగా చూపి అదనపు బిల్లులు ఇచ్చేందుకు రంగం సిద్ధంచేసింది. కానీ, ఈ ప్రతిపాదనను మంత్రి మండలికి పంపేందుకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందనే భయాందోళనతోనే ఉన్నతాధికారులు అందుకు వ్యతిరేకంగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నాడూ నేడూ కాంట్రాక్టర్‌కే దన్ను! వాస్తవానికి ఈ కాంట్రాక్టు ఒప్పంద విలువ రూ.268.87 కోట్లు. 2009 నాటికే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. బిల్లుల చెల్లింపులో ఏవైనా వివాదాలు ఏర్పడితే వివాద పరిష్కార మండలి (డీఏబీ)ని ఆశ్రయించే వెసులుబాటు కల్పిస్తూ 2003లో బొల్లినేని శీనయ్యకు చెందిన ఎస్సీఎల్–సీఆర్18జీ(జేవీ)తో అప్పటి టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఒప్పందం చేసుకుంది. ప్రాజెక్టు పనులు పూర్తయ్యాక 27 అంశాల్లో అదనంగా రూ.285 కోట్లు ఇవ్వాలని 2012లో కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. డీఏబీ చేసిన ప్రతిపాదనలను ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లతో కూడిన అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీ తోసిపుచ్చింది. కానీ.. అప్పట్లో తన ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన చంద్రబాబు సూచనల మేరకు పులిచింతల కాంట్రాక్టర్‌కు అదనంగా రూ.199.96 కోట్లు ఇచ్చే ఫైలుపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిబ్రవరి, 2014లో సంతకం చేశారు. దాంతో కాంట్రాక్టర్‌కు అదనపు బిల్లులు ఇవ్వాలని జలనవరుల శాఖ ఉన్నతాధికారులు అప్పట్లో మోమో జారీ చేశారు. దీన్ని పులిచింతల ప్రాజెక్టు ఎస్ఈ మచిలీపట్నం కోర్టులో సవాల్ చేశారు. ఈలోగా 2014 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ సర్కార్‌ను ఏర్పాటుచేసింది. ఆ తర్వాత మచిలీపట్నం కోర్టు అదనపు బిల్లులు చెల్లించే విషయంపై సుదీర్ఘంగా విచారణ జరిపింది. కాంట్రాక్టర్ లేవనెత్తిన 27 అంశాలను తిప్పికొట్టేలా వాదనలు విన్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా కాంట్రాక్టర్‌కు అనుకూలంగా సదరు కోర్టు జూన్ 2, 2016న తీర్పునిచ్చింది. రూ.199.96 కోట్లను అక్టోబరు 3, 2013 నుంచి 15 శాతం వడ్డీతో కాంట్రాక్టర్‌కు చెల్లించాలంటూ పేర్కొంది. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేయడానికి అనుమతివ్వాలని కోరుతూ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు అనేకసార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ, న్యాయపోరాటానికి అనుమతివ్వకుండా సర్కార్ వ్యూహాత్మకంగా జాప్యం చేస్తూ వచ్చింది. ఇదే అంశాన్ని ‘సాక్షి’ ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో తీర్పును సర్కార్ అమలుచేయడంలేదని కాంట్రాక్టర్ ఎగ్జిక్యూషన్ పిటిషన్ (ఈపీ) వేశారు. దీనిపై కూడా గత నెల 24న కోర్టు తీర్పు ఇచ్చింది. స్వరాజ్య మైదానం, జలవనరుల శాఖ భవనాలను వేలం వేసి కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు అమలుచేస్తే పులిచింతల కాంట్రాక్టర్‌కు అసలు కింద రూ.199.96 కోట్లు, అక్టోబరు 3, 2013 నుంచి ఇప్పటివరకూ వడ్డీ రూ.144.63 కోట్లు వెరసి రూ.344.59 కోట్లు.. ప్రాజెక్టు పూర్తయినా యంత్రాలను అక్కడే ఉంచడంవల్ల వాటిల్లిన నష్టం రూ.40.06 కోట్లతో కలిపి వెరసి రూ.384.65 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. చీకటి దందాను ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో.. కాంట్రాక్టర్‌తో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమాలకు ఉన్న సంబంధాలు.. న్యాయపోరాటానికి అనుమతివ్వడంలో సర్కార్ వ్యూహాత్మకంగా జాప్యం చేసిన తీరును ఆధారాలతో సహా గత నెల 26న ‘సొంత కాంట్రాక్టర్ కోసం స్వరాజ్య మైదానం బలి!’ శీర్షికన ప్రచురించిన కథనం ప్రభుత్వంలో కలకలం రేపింది. ఈ క్రమంలోనే మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సాకుగా చూపుతూ బుధవారం నిర్వహించే మంత్రివర్గ సమావేశానికి పులిచింతల కాంట్రాక్టర్‌కు అదనపు బిల్లులు చెల్లించడానికి వీలుగా ప్రతిపాదన పంపాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కానీ, అందుకు ఉన్నతాధికారులు విముఖత వ్యక్తంచేసినట్లు సమాచారం. అలా చేస్తే ఆ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని.. భవిష్యత్తులో న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మంగళవారం సాయంత్రం వరకూ కేబినెట్‌కు జలవనరుల శాఖ ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు. కానీ.. ఉన్నతస్థాయి నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. అందుకు తలొగ్గాల్సి వస్తే రెండు రకాల ప్రతిపాదనలను పంపాలని అధికార వర్గాలు నిర్ణయించాయి. మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సూచించిన మేరకు న్యాయపోరాటం చేయాలన్నది ఒక ప్రతిపాదన కాగా.. అదనపు బిల్లులు చెల్లించేందుకు మరో ప్రతిపాదనను పంపాలని నిర్ణయించారు. కేబినెట్ భేటీలో దేనిని ఆమోదిస్తారో చూడాలి. -
పులిచింతల విద్యుత్ ప్లాంట్ జాతికి అంకితం
చింతలపాలెం: పులిచింతల ప్రాజెక్టులో అంతర్భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జల విద్యుత్ ప్లాంట్‌ను తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో అండ్ జెన్కో సీఎండీ దేవుల్లపల్లి ప్రభాకర్‌రావు జాతికి అంకితం చేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని జలవిద్యుత్ ప్లాంట్ నాలుగో యూనిట్‌ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యుత్ ప్లాంట్ వల్ల ప్రభుత్వానికి రూ. 22 కోట్లు ఆదా అయ్యిందన్నారు. ప్రభుత్వ సహకారం, ఇంజనీర్ల కృషితో ప్లాంట్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగామన్నారు. రూ.560 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంట్ పనుల్లో ఇప్పటి వరకు రూ. 486 కోట్ల విలువగల పనులు పూర్తయినట్లు చెప్పారు. మిగతా పనులను కూడా అంచనా వ్యయానికి మించకుండా పూర్తిచేయనున్నట్లు తెలిపారు. పులిచింతల ప్రాజెక్ట్‌లోకి వచ్చే వరద నీటి మీద ఆధారపడి 220 మిలియన్ యూనిట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సాగర్ దిగువన ఉన్న టెయిల్‌పాండ్ రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.250 కోట్లు ఆదా అయినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల కరెంటును ఇవ్వగలుగుతున్నామని ఆయన చెప్పారు. పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరో రూ.22 కోట్ల అంచనా వ్యయంతో 7 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, సీఎండీ (ట్రాన్స్‌కో) జె.శ్రీనివాసరావు, డైరెక్టర్ (గ్రిడ్) జె. నర్సింహారావు, డైరెక్టర్ (ట్రాన్స్మిషన్) జగత్‌రెడ్డి, డైరెక్టర్ (హెచ్ఆర్ జెన్కో) అశోక్‌కుమార్, డైరెక్టర్ (ఎన్పీడీసీఎల్) గణపతిరావు, డైరెక్టర్ (హైడల్) వెంకటరాజం, ఎస్ఈలు సద్గుణ కుమార్, శ్రీనివాసరెడ్డి, సీఈలు సురేశ్‌కుమార్, రత్నాకర్, ఈఈ అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
కోడ్ ఉల్లంఘన..!!
ఆఘమేఘాలపై కొత్త భవనాల ప్రారంభోత్సవం పేరు కోసమేనా ఈ తొందర సీఈ సాంబయ్య వైఖరిపై విమర్శలు సాక్షి, విజయవాడ : ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మరీ కృష్ణా ఇరిగేషన్ సర్కిల్లో మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను ప్రారంభించేందుకు అధికారులు హడావుడి పడుతున్నారు. ఎన్నికల ముందు పూర్తికాని పులిచింతల ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జాతికి అంకితం చేస్తే, ఇప్పుడు ఈ భవనాలను మరో రెండువారాల్లో పదవీ విరమణ చేసే చీఫ్ ఇంజినీర్ ప్రారంభించడానికి చూడటం వివాదాలకు దారి తీ స్తోంది. ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 16న కౌంటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇది జరగడానికి వారం రోజులు మాత్రమే గడువు ఉన్న సమయంలో హడావుడిగా ఈ భవనాన్ని ప్రారంభిం చేందుకు చీఫ్ ఇంజినీర్ సాంబయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాదిలో రిటైర్ అయిన సాంబయ్య ఇప్పటికే రెండుసార్లు తన పదవీ కాలాన్ని పొడిగించుకున్న సంగతి తెలిసిందే. ఈ పదవీ కాలం కూడా ఈ నెలాఖరుకు ముగుస్తుంది. కొత్త రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో ఈ భవనాన్ని కొత్త పాలకులతో ప్రారంభింపచేస్తే బాగుంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. కృష్ణాసర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కార్యాలయ భవనాలను బ్రిటీష్ హయాంలో నిర్మిం చారు. కృష్ణాడెల్టా ఆధునీకరణలో భాగంగా చీఫ్ ఇంజినీర్, ఎస్ఈ, కృష్ణా తూర్పు, కృష్ణా సెంట్రల్, స్పెషల్ డివి జన్ ఈఈ కార్యాలయాల కోసం పాత భవనాల స్థానం లో మళ్లీ భవనం నిర్మించాలని భావిం చారు. దీని కోసం రూ.3 కోట్లతో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈపీసీ పద్ధతిలో భవనం నిర్మిం చాల్సి ఉంది. భవనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో నెల పడుతుంది. పనులన్నీ పూర్తయ్యాకే ఈ భవనాలను కాంట్రాక్టర్ ఇరిగేషన్ శాఖకు అప్పగిస్తారు. అయితే తన హయాంలో ప్రారంభించాలని చీఫ్ ఇంజినీర్ డి. సాంబయ్య నిర్ణయించినట్లు తెలిసింది. దీనిలో భాగంగా కాంట్రాక్టర్‌పై ఒత్తిడితెచ్చి ఆగమేఘాలపై పనులు చేస్తున్నారు. ఈ నెల 14న రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేయాలని సీఈ నిర్ణయించారు. ఈ నిర్ణయంపై సర్కిల్ అధికారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 19 వరకూ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఈ తరుణంలో హడావుడిగా తీసుకునే నిర్ణయం వల్ల తనకు ఇబ్బంది వస్తుందని ఎస్ఈ శ్రీనివాసరావు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు తెలిసింది. ఈ భవనాన్ని కొత్త ప్రభుత్వంలో సీఎం లేదా ఇరిగేషన్ మంత్రి ప్రారంభిస్తే బావుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సీఈ సాంబయ్య కొత్త రాష్ట్రం లో తన పేరు కోసం హడావుడి చేస్తే చూస్తూ సహించబోమని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఈ సాం బయ్య దృష్టికి తీసుకువెళ్లామని, మొండిగా ప్రారంభోత్సవానికి సిద్ధపడితే అడ్డుకుంటామని హెచ్చరి స్తున్నారు. మరో వైపు ఈ భవనాలను నాసిరకంగా నిర్మించారని, వర్షం వస్తే నీరంతా లోపలే ఉంటోందని ఉద్యోగులు చెబుతున్నారు. సర్కిల్ కార్యాల యంలో నిర్మించిన ఈ భవనానికి మోపిదేవిలో పనిచేసే అసిస్టెంట్ ఇంజినీర్‌కు బాధ్యతలు అప్పగించారు. అయితే నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేసిన గత ఎస్ఈ నరసింహమూర్తి కొంతకాలం పనులు నిలుపుదల చేశారు. ఐతే పైఅధికారి నుంచి ఒత్తిడి తెచ్చి ఈ పనులను పూర్తి చేయిస్తున్నట్లు సమాచారం.