సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ప్రత్యేకంగా భేటీ అవుతోంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కరాళ నృత్యం చేస్తున్న కరువు బారి నుంచి రైతులను కాపాడటం కోసమో.. రాష్ట్రంలో విజృంభించిన డెంగ్యూ, స్వైన్ ప్లూ వంటి విషజ్వరాల బారిన పడిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసమో.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమో కాదు. మరి ఎందుకంటే.. సీఎం చంద్రబాబు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమాలకు సన్నిహితుడైన పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్ బొల్లినేని శీనయ్యకు రూ.384.65 కోట్లకు పైగా మొత్తాన్ని ‘అదనం’గా ఇచ్చే ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయడం కోసం.
పులిచింతల ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం) కాంట్రాక్టు ఒప్పంద విలువ కంటే అధికంగా రూ.384.65 కోట్లకు పైగా అదనంగా ఇవ్వాలన్న ప్రతిపాదనను ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తీవ్రంగా తప్పుబట్టారు. మచిలీపట్నం కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసి.. కాంట్రాక్టర్ లేవనెత్తిన 27 అంశాలపై సాధికారికంగా వాదనలు విన్పించగలిగితే కాంట్రాక్టర్‌కు అదనంగా బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదని.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వానికి సూచించారు. న్యాయ సలహా (లీగల్ ఒపినీయన్) పేరుతో.. హైకోర్టును ఆశ్రయించకుండా వ్యూహాత్మకంగా రెండున్నరేళ్లపాటు జాప్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సాకుగా చూపి అదనపు బిల్లులు ఇచ్చేందుకు రంగం సిద్ధంచేసింది. కానీ, ఈ ప్రతిపాదనను మంత్రి మండలికి పంపేందుకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందనే భయాందోళనతోనే ఉన్నతాధికారులు అందుకు వ్యతిరేకంగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
నాడూ నేడూ కాంట్రాక్టర్‌కే దన్ను!
వాస్తవానికి ఈ కాంట్రాక్టు ఒప్పంద విలువ రూ.268.87 కోట్లు. 2009 నాటికే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. బిల్లుల చెల్లింపులో ఏవైనా వివాదాలు ఏర్పడితే వివాద పరిష్కార మండలి (డీఏబీ)ని ఆశ్రయించే వెసులుబాటు కల్పిస్తూ 2003లో బొల్లినేని శీనయ్యకు చెందిన ఎస్‌సీఎల్–సీఆర్18జీ(జేవీ)తో అప్పటి టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఒప్పందం చేసుకుంది. ప్రాజెక్టు పనులు పూర్తయ్యాక 27 అంశాల్లో అదనంగా రూ.285 కోట్లు ఇవ్వాలని 2012లో కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. డీఏబీ చేసిన ప్రతిపాదనలను ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లతో కూడిన అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీ తోసిపుచ్చింది. కానీ.. అప్పట్లో తన ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన చంద్రబాబు సూచనల మేరకు పులిచింతల కాంట్రాక్టర్‌కు అదనంగా రూ.199.96 కోట్లు ఇచ్చే ఫైలుపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిబ్రవరి, 2014లో సంతకం చేశారు. దాంతో కాంట్రాక్టర్‌కు అదనపు బిల్లులు ఇవ్వాలని జలనవరుల శాఖ ఉన్నతాధికారులు అప్పట్లో మోమో జారీ చేశారు. దీన్ని పులిచింతల ప్రాజెక్టు ఎస్‌ఈ మచిలీపట్నం కోర్టులో సవాల్ చేశారు. ఈలోగా 2014 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ సర్కార్‌ను ఏర్పాటుచేసింది.
ఆ తర్వాత మచిలీపట్నం కోర్టు అదనపు బిల్లులు చెల్లించే విషయంపై సుదీర్ఘంగా విచారణ జరిపింది. కాంట్రాక్టర్ లేవనెత్తిన 27 అంశాలను తిప్పికొట్టేలా వాదనలు విన్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా కాంట్రాక్టర్‌కు అనుకూలంగా సదరు కోర్టు జూన్ 2, 2016న తీర్పునిచ్చింది. రూ.199.96 కోట్లను అక్టోబరు 3, 2013 నుంచి 15 శాతం వడ్డీతో కాంట్రాక్టర్‌కు చెల్లించాలంటూ పేర్కొంది. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేయడానికి అనుమతివ్వాలని కోరుతూ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు అనేకసార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ, న్యాయపోరాటానికి అనుమతివ్వకుండా సర్కార్ వ్యూహాత్మకంగా జాప్యం చేస్తూ వచ్చింది. ఇదే అంశాన్ని ‘సాక్షి’ ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో తీర్పును సర్కార్ అమలుచేయడంలేదని కాంట్రాక్టర్ ఎగ్జిక్యూషన్ పిటిషన్ (ఈపీ) వేశారు. దీనిపై కూడా గత నెల 24న కోర్టు తీర్పు ఇచ్చింది. స్వరాజ్య మైదానం, జలవనరుల శాఖ భవనాలను వేలం వేసి కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు అమలుచేస్తే పులిచింతల కాంట్రాక్టర్‌కు అసలు కింద రూ.199.96 కోట్లు, అక్టోబరు 3, 2013 నుంచి ఇప్పటివరకూ వడ్డీ రూ.144.63 కోట్లు వెరసి రూ.344.59 కోట్లు.. ప్రాజెక్టు పూర్తయినా యంత్రాలను అక్కడే ఉంచడంవల్ల వాటిల్లిన నష్టం రూ.40.06 కోట్లతో కలిపి వెరసి రూ.384.65 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
చీకటి దందాను ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో..
కాంట్రాక్టర్‌తో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమాలకు ఉన్న సంబంధాలు.. న్యాయపోరాటానికి అనుమతివ్వడంలో సర్కార్ వ్యూహాత్మకంగా జాప్యం చేసిన తీరును ఆధారాలతో సహా గత నెల 26న ‘సొంత కాంట్రాక్టర్ కోసం స్వరాజ్య మైదానం బలి!’ శీర్షికన ప్రచురించిన కథనం ప్రభుత్వంలో కలకలం రేపింది. ఈ క్రమంలోనే మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సాకుగా చూపుతూ బుధవారం నిర్వహించే మంత్రివర్గ సమావేశానికి పులిచింతల కాంట్రాక్టర్‌కు అదనపు బిల్లులు చెల్లించడానికి వీలుగా ప్రతిపాదన పంపాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కానీ, అందుకు ఉన్నతాధికారులు విముఖత వ్యక్తంచేసినట్లు సమాచారం.
అలా చేస్తే ఆ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని.. భవిష్యత్తులో న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మంగళవారం సాయంత్రం వరకూ కేబినెట్‌కు జలవనరుల శాఖ ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు. కానీ.. ఉన్నతస్థాయి నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. అందుకు తలొగ్గాల్సి వస్తే రెండు రకాల ప్రతిపాదనలను పంపాలని అధికార వర్గాలు నిర్ణయించాయి. మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సూచించిన మేరకు న్యాయపోరాటం చేయాలన్నది ఒక ప్రతిపాదన కాగా.. అదనపు బిల్లులు చెల్లించేందుకు మరో ప్రతిపాదనను పంపాలని నిర్ణయించారు. కేబినెట్ భేటీలో దేనిని ఆమోదిస్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment