పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు కొట్టుకుపోవడంతో దిగువకు వెళ్తున్న వరద నీరు
సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసేందుకు గేట్లను ఎత్తే సమయంలో 16వ గేటు ఊడిపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గేటు ఊడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయన్న అంశంపై అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. పులిచింతల ప్రాజెక్టు భద్రతకు చర్యలు తీసుకోవాలని, గేటు ఊడటానికి కారణమైన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం కోసం పులిచింతల ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా ఉండింది. 2003లో ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచిన నాటి చంద్రబాబు సర్కార్.. రూ.268.89 కోట్లకు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు చెందిన ఎస్సీఎల్–సీఆర్18జీ(జాయింట్ వెంచర్) సంస్థకు కట్టబెట్టింది. చేసిన పనులకు అదనంగా బిల్లులను దోచి పెట్టడానికి వీలుగా బొల్లినేని కోసం కాంట్రాక్టు ఒప్పందంలో ఆర్బిట్రేషన్ నిబంధనను చంద్రబాబు చేర్పించారు. దీంతో ప్రాజెక్టు పనులను బొల్లినేని ఇష్టారాజ్యంగా చేశారు.
ప్రాజెక్టు స్పిల్ వే పియర్స్(కాంక్రీట్ దిమ్మెలు) 4.5 మీటర్ల వెడల్పుతో 58.24 మీటర్ల ఎత్తుతో నిర్మించాలి. కానీ, కాంక్రీట్ దిమ్మెలను తక్కువ వెడల్పుతో వంకర టింకరగా నిర్మించారు. స్పిల్ వేకు గేట్లను బిగించేందుకు వీలుగా పియర్స్‌కు 45.59 మీటర్ల వద్ద ట్రూనియన్ బీమ్‌లను నిర్మించాలి. 2 పియర్లకు ఏర్పాటు చేసిన ట్రూనియన్ బీమ్‌లకు గేట్ల ఆర్మ్ గడ్డర్లను అమర్చడం ద్వారా 18.5 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో 560.25 మీటర్ల పొడవున్న స్పిల్ వేకు 24 గేట్లను బిగించాలి. ఒక్కో గేటుకు ఒక్కో వైపున 2 ఇనుప తీగలు (రోప్)లను బిగించి.. మొత్తం 4 ఇనుప తీగల ద్వారా సంప్రదాయ పద్ధతిలో ఈ గేట్లను ఎత్తే ఏర్పాట్లు చేయాలి. కానీ.. బొల్లినేని రామారావు సంస్థ పులిచింతల స్పిల్ వే పియర్లు, ట్రూనియన్ బీమ్‌లను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసింది.
లోపాలు చూపినా పట్టించుకోని బాబు సర్కార్
పులిచింతల ప్రాజెక్టు పనులను 2015 జనవరి 5న రిటైర్డు సీఈ కె.సత్యనారాయణ, డిజైన్స్ సలహాదారు, రిటైర్డు ఈఎన్‌సీ డాక్టర్ పి.రామరాజు అధ్యక్షతన ఏర్పాటైన స్పెషల్ డ్యామ్ సేఫ్టీ ఇన్‌స్పెక్షన్ టీమ్ పరిశీలించింది. డిజైన్‌ల మేరకు పనులు చేయలేదని స్పష్టం చేసింది. 9వ పియర్‌ను 4.5 మీటర్ల వెడల్పుతో కాకుండా 3.80 మీటర్ల వెడల్పుతోనే చేసినట్లు తేల్చింది. స్పిల్ వేలో లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు గ్రౌటింగ్ చేయడం కోసం 24 చోట్ల బోర్లు తవ్వి.. గ్రౌటింగ్ (బోరు బావి తవ్వి.. అధిక ఒత్తిడితో కాంక్రీట్ మిశ్రమాన్ని పంపడం ద్వారా భూమి పొరల్లో పగుళ్లను పూడ్చడం) చేయకుండా వదిలేశారని.. దీని వల్ల భారీ ఎత్తున నీరు లీకేజీ (సీపేజీ) అవుతోందని చెప్పింది. గేట్లను ఎత్తడానికి సంబంధించిన ఇనుప తీగల(రోప్‌ల)ను ఇష్టారాజ్యంగా బిగించారని ఎత్తిచూపుతూ నాటి చంద్రబాబు సర్కార్‌కు నివేదిక ఇచ్చింది. ఇది ప్రాజెక్టు భద్రతకు ముప్పు వాటిల్లేలా చేస్తుందని తేల్చింది. స్పిల్ పియర్లను బాగు చేయాలని.. ట్రూనియన్ బీమ్‌లను సరి చేయాలని.. గ్రౌటింగ్ చేయడం ద్వారా సీపేజీకి అడ్డుకట్ట వేయాలని సూచించింది. ప్రాజెక్టు భద్రతకు తక్షణమే చర్యలు చేపట్టాలని సర్కార్‌కు సూచించింది. కానీ.. ఆ నివేదికలో పేర్కొన్న అధిక అంశాలను అమలు చేయకుండా చంద్రబాబు సర్కార్ బుట్ట దాఖలు చేసింది.
ఈ పాపం టీడీపీ సర్కార్‌దే..
2015లో ఎస్‌డీఎస్‌ఐటీ ఇచ్చిన నివేదిక మేరకు టీడీపీ సర్కార్ పులిచింతల ప్రాజెక్టులో లోపాలను సరిదిద్ది ఉంటే.. గేటు ఊడిపోయే అవకాశమే ఉండేది కాదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గేటు ఊడిపోవడానికి దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా అధ్యయనం చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన సీడీవో సీఈ శ్రీనివాస్, డిజైన్స్ సలహాదారు గిరిధర్‌రెడ్డి, రిటైర్డు సీఈ కె.సత్యనారాయణ సభ్యులుగా ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడానికి జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఈ కమిటీకి పులిచింతల ఎస్‌ఈ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఊడిపోయిన గేటు స్థానంలో తాత్కాలికంగా స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసి, ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసి.. కృష్ణా డెల్టా రైతులకు ఇబ్బందులు లేకుండా ఒక వైపు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. మరో వైపు నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రాజెక్టు భద్రతకు చర్యలు చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment