కృష్ణమ్మ ఉరకలు | Ongoing flooding in the Krishna River | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ ఉరకలు

Published Wed, Sep 11 2019 5:18 AM | Last Updated on Wed, Sep 11 2019 5:35 AM

Ongoing flooding in the Krishna River - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/అమలాపురం టౌన్‌/శ్రీశైలం ప్రాజెక్ట్‌/అచ్చంపేట(పెదకూరపాడు):  ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణా నది ఉరకలెత్తుతోంది. మంగళవారం జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,90,452 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా ఆరు గేట్లను ఎత్తి 4,24,530 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4,13,198 క్యూసెక్కులు చేరుతుండగా, అంతే స్థాయిలో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి విడుదల చేసిన జలాల్లో పులిచింతల ప్రాజెక్టుకు 3,90,452 క్యూసెక్కులు చేరుతుండగా.. 3,83,002 క్యూసెక్కులను గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుతం 42.72 టీఎంపీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు డీఈ తెలిపారు. పులిచింతల నుంచి భారీ ఎత్తున వరదను దిగువకు విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద గంటగంటకూ వరద భారీ ఎత్తున పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 1,79,124 క్యూసెక్కులు వస్తుండగా 50 గేట్లు తెరిచి 93,173 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం నాటికి ప్రకాశం బ్యారేజీలోకి 3.50 లక్షల క్యూసెక్కుల వరద పెరిగే అవకాశం ఉంది. కాగా, ఒక నీటి సంవత్సరం (జూన్‌ 1 నుంచి మే 31 వరకూ) కృష్ణా బేసిన్‌లో అన్ని ప్రాజెక్టుల గేట్లను రెండు పర్యాయాలు తెరిచి వరద నీటిని దిగువకు విడుదల చేయడం గత పదేళ్లలో ఇదే ప్రథమం.  

శ్రీశైలం గేట్ల పైనుంచి నీరు..
శ్రీశైలం డ్యామ్‌ క్రస్ట్‌ గేట్ల పైనుంచి వరద నీరు ఓవర్‌ ఫ్లో అయ్యింది. జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఉండటంతో సోమవారం రాత్రి 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.85 టీఎంసీలు కాగా..   215.3263 టీఎంసీలను అధికారులు నిల్వ చేశారు. వరద ప్రవాహం ఎక్కువ ఉండటం, జలవిద్యుత్‌ కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పాదనను పెంచడం, తగ్గించడం వంటి కారణాలతో జలాశయంలో నీరు గేట్లపై నుంచి ఓవర్‌ఫ్లో అయ్యింది. ఇది గమనించిన అధికారులు 10 అడుగుల మేర తెరిచిన గేట్లను మంగళవారం 23 అడుగులకు ఎత్తారు. దీంతో ఓవర్‌ఫ్లో నిలిచిపోయింది. 

శాంతించిన గోదావరి..
ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో వరద ఉధృతి తగ్గింది. గత మూడు రోజులుగా మహోగ్రంగా ప్రవహించిన గోదావరి మంగళవారం కాస్త శాంతించింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎగువున ఉన్న ఏజెన్సీ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే ధవళేశ్వరం దిగువున ఉన్న కోనసీమ ప్రాంతంలో లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు 14,59,000 క్యూసెక్కుల వరద నీరును విడిచిపెట్టగా.. అది రాత్రి 7 గంటలకు 11,39,000 క్యూసెక్కులకు తగ్గించారు. ఇక భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రానికి నీటి మట్టం మూడు అడుగుల మేర తగ్గింది. దేవీపట్నం మండలాన్ని ఇంకా వరద నీరు వణికిస్తూనే ఉంది. కోనసీమలో మంగళవారం రాత్రికి దాదాపు 48 లంక గ్రామాలు జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. 17 లంక గ్రామాలకు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. చింతూరు మండలంలో 15 గ్రామాల్లో వరద నీరు ప్రభావంతో ఆంధ్రా, ఒడిశా మధ్య రాకపోకలు పూర్తిగా పునరుద్ధరణ కాలేదు. కోనసీమలో బుధవారం నుంచి వరద తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మరో మూడు రోజుల్లో సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.

స్థిరంగా వంశధార ప్రవాహం
వంశధార నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 27,832 క్యూసెక్కులు చేరుతుండగా కాలువలకు 3,925 క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 23,907 క్యూసెక్కులను గొట్టా బ్యారేజీ 22 గేట్లు తెరిచి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టులోకి నాగావళి వరద ప్రవాహం కొనసాగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement