కొమ్మమూరు..కన్నీరు
Published Tue, Mar 14 2017 5:46 PM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM
కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి.
కాంట్రాక్టు సంస్థ వందల కోట్ల విలువైన కాలువ పనుల్లో అవకతవకలు జరిగాయి.
పనులు చేయాల్సిన గడువు ముగిసిపోయినా.. పలుమార్లు నోటీసులిచ్చినా కనీసం స్పందించని కాంట్రాక్టు సంస్థపై సర్కారు చూపుతున్న వల్లమాలిన ప్రేమలో పదో వంతు కూడా తమపై లేదని రైతులు మండిపడుతున్నారు.
నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నా ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడా లేదు.
ఫలితంగా వర్షాకాలంలోనూ కాలువలో సక్రమంగా నీరు పారక..
సాగునీరందక రైతులు ఏటా నష్టాలు మూటగట్టుకుంటున్నారు.
► కాలువ రాదు.. చేను తడవదు
► ఏటా అన్నదాతకు అవస్థే
► తొమ్మిదేళ్లు గడుస్తున్నా కొలిక్కిరాని కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ
► పనుల విలువ రూ.196 కోట్లు
► ఇప్పటి వరకు చేసింది రూ.50 లక్షల పనులే
► ఈ ఏడాదీ మొదలుకాని పనులు
చీరాల:
కృష్ణాడెల్టా పరిధిలో ఎప్పుడో కాటన్ దొర సమయంలో కాలువల పనులు జరిగాయి. ఆనాటి నుంచి నేటి వరకు తట్ట మట్టి తీసిన పాపాన పోలేదు. దీంతో ఏటా సాగునీరందక రైతులు విలవిల్లాడుతున్నారు. రైతుల మొర ఆలకించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.2 వేల కోట్లతో కృష్ణాడెల్టా ఆధునికీకరణ చేయాలని సంకల్పించారు.
ప్రకాశం జిల్లా పరిధిలోని ప్రధాన సాగునీటి వనరైన కొమ్మమూరు కాలువను నల్లమడ కాలువ నుంచి పెదగంజాం వరకు రూ.196 కోట్లతో ఆధునికీకరించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు సాగునీటి కాలువలకు 2007లో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. 47 కిలోమీటర్ల పొడవున నల్లమడ నుంచి పెదగంజాం వరకు ఉన్న కొమ్మమూరు కాలువను పూర్తిస్థాయిలో ఆధునికీకరించడంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న మరో 50 చిన్న కాలువలను అభివృద్ధి చేయాల్సి ఉంది.
ఇంకెన్నేళ్లు.?
కృష్ణా డెల్టా ఆ«ధునికీకరణ టెండర్ల ప్రక్రియ పూర్తయి తొమ్మిదేళ్లు సమీపిస్తున్నా కనీసం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన ప్రోగ్రెసివ్ అండర్ కన్‌స్ట్రక్షన్‌సంస్థ పనులు పూర్తి చేయడం లేదు. ముందుగానే కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ప్రభుత్వం చెల్లించింది. గతంలో సంభవించిన లైలా, జల్, ఓగ్ని, నీలం, థానే వంటి తుఫాన్లకు కొమ్మమూరు కాలువ కరకట్టలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రధాన కాలువ కట్టలు సైతం బలహీనపడి కోతకు గురయ్యాయి. కృష్ణా డెల్టా నుంచి కొంత మేర నీరు వదలినప్పటికీ కొమ్మమూరు కాలువలకు ఇరువైపులా బలహీనంగా ఉన్న కట్టలకు గండ్లు పడి చుట్టు పక్కల ఉన్న పొలాలను నీరు ముంచెత్తుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ కారణంతోనే కృష్ణా పశ్చిమ డెల్టా నుంచి పూర్తి స్థాయిలో కాకుండా నామమాత్రంగా కొమ్మమూరు కాలువకు నీరు వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వలన దిగువ ప్రాంతాలకు నీరందక పంట పొలాలు ఎండిపోయాయి. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో, కాటన్ దొర హయాంలో జరిగిన మరమ్మతులు మినహా మరలా పూర్తి స్థాయిలో కాలువల అభివృద్ధి జరగలేదు.
ఆధునికీకరించాల్సింది ఈ విధంగా...
కృష్ణా డెల్టా ఆధునికీకరణలో భాగంగా సాగునీటి కాలువ కొమ్మమూరు కెనాల్‌ను 47 కిలో మీటర్ల మేరకు ఆధునికీకరించాల్సి ఉంటుంది. గుంటూరు జిల్లాలో నల్లమడ కాలువ నుంచి కాలువ చివరి ప్రాంతమైన పెదగంజాం వరకు పనులు చేయాలి. ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న మరో 50 చిన్న కాలువలను మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇప్పుడున్న కాలువను 5 లక్షల క్యూబిక్ మీటర్ల లోతు తవ్వడంతో పాటు కాలువ పొడవునా నడిచి వెళ్లేందుకు వీలుగా 34 ర్యాంపులు, 35,500 క్యూబిక్ మీటర్లు సీసీ లైనింగ్, ఇసుక ప్రాంతంలో 4.92 లక్షల చదరపు మీటర్ల పొడవున రాతితో లైనింగ్ ఏర్పాటు, 11 రెండు లైన్ల బ్రిడ్జిలు, 26 ఒక లైన్ బ్రిడ్జిలు, 64 బాక్స్ కల్వర్టులు, 15 అండర్ టన్నెళ్లను హై పర్టిక్యులర్స్ పద్ధతి ప్రకారం ఆధునికీకరించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు రూ.50 లక్షలను ఖర్చు పెట్టి పెదగంజాం ప్రాంతంలో కొన్ని కల్వర్టులు మాత్రమే నిర్మించారు. గడువు పూర్తై చాలాకాలం అయినా కృష్ణా డెల్టా ఆధునికీకరణపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
నోటీసులు ఇచ్చాం...పెనాల్టీలు విధించాం
– ఇరిగేషన్ డీఈ, విజయ్‌కుమార్, చీరాల.
ఇప్పటికే కాంట్రాక్టు సంస్థకు పనులు చేయని కారణంగా పలుమార్లు నోటీసులు జారీ చేశాం. అలానే నష్ట పరిహారం విధించినా ఆ సంస్థ స్పందించడం లేదు. ఏదో ఒక కారణంతో గడువును పొడిగించుకుంటున్నారు. కొమ్మమూరు ఆ«ధునికీకరణ జరిగితేనే జిల్లాలోని రైతులకు మేలు జరుగుతుంది.
Advertisement
Advertisement