గోదావరిలో వరద ఉన్నప్పుడు కృష్ణలో కూడా వరద ఉంటే పట్టిసీమ లిఫ్టును వినియోగించుకోమని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో వరద ఉన్నప్పుడు కృష్ణలో కూడా వరద ఉంటే పట్టిసీమ లిఫ్టును వినియోగించుకోమని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. కృష్ణా డెల్టాకు అవసరమైనప్పుడు మాత్రమే లిఫ్టు ద్వారా నీటిని తరలిస్తామన్నారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమ లిఫ్టు వల్ల ఉపయోగం లేదని, జేబులు నింపుకోవడానికే ప్రభుత్వం ఈ పథకాన్ని చేపడుతోందంటూ ‘సాక్షి’లో శుక్రవారం ‘పట్టిసీమలో పరమ రహస్యం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల మట్టం వరకు నీటిని నిల్వ ఉంచుతామని, ఆమేరకే గోదావరి నుంచి నీటిని తీసుకొస్తామన్నారు. గోదావరి లిఫ్టు ద్వారా మళ్లించే నీటితో కృష్ణా డెల్టాను కాపాడితే, ఆ మేరకు మిగిలే నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమకు వాడుకుంటామన్నారు. 70 టీఎంసీల కృష్ణా నీటిని రాయలసీమ ప్రాజెక్టుల్లో నిల్వ ఉంచుతామన్నారు. పట్టిసీమ లిఫ్టుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 1లో ఎక్కడా.. గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు వాడతామని పేర్కొనలేదని, మరి కృష్ణా డెల్టాకు వాడే కృష్ణా జలాలను మిగిల్చి రాయలసీమకు ఎలా ఇస్తారు? అని అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు.