కేసీ కెనాల్‌లో పూర్తిగా తగ్గిన నీటి ప్రవాహం
కడప సిటీ : కేసీ రైతుకు కన్నీరే మిగులుతోంది. మూడేళ్లుగా కరువుతో సతమతవుతున్నారు..శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది మందస్తుగానే భారీ వరదనీరు చేరడంతో వరి సాగు చేయొచ్చని ఆశపడ్డారు. వరినారు కూడా పోసుకున్నారు. తర్వాత అధికారులు నీటి విడుదలను నిలిపేశారు. కృష్ణా డెల్టాకు వదిలి..కేసీకి ఆపేసి అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లారు. కృష్ణాడెల్టా రైతులపై ఎందుకంత ప్రేమ.. తమపై ఎందుకంత వివక్ష అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కడుపుమండిన రైతన్నలు ఈ నెల 8న రోడ్డెక్కారు. వైఎస్సార్‌సీపీ నేతలు వీరికి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ప్రసుతం శ్రీశైలానికి వరదనీరు చేరుతోంది. ఇప్పటికైనా కేసీ ఆయకట్టు రైతులకు వరిసాగుకు సరిపడే నీళ్లిస్తామని స్పష్టమైన హామీ ప్రభుత్వం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
కేసీ ఆయకట్టు రైతులు గత మూడేళ్లుగా వరిసాగుకు దూరమయ్యారు.కేవలం బోర్లకింద ఆరుతడి పంటలు వేసుకుని కాలం వెళ్లదీశారు.అయితే కర్ణాటకలో వర్షాలు అధికంగా పడడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు చేరింది.దీంతో గత నెల 29 రాజోలికి నీటిని విడుదల చేశారు.అక్కడి నుంచి మైదుకూరు, చాపాడు కేసీకెనాల్‌కు, కుందూకు వదిలారు. ఈ సమయంలో ఆరుతడి పంటలకు నీరు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించలేదు.దీంతో కేసీ కాలువ కింద వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. నారుమడులు పోసుకున్నారు. సత్తువ కోసం జీలుగ కూడా వేశారు. ఈ తరుణంలో అధికారులు నీటిని నిలిపివేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఆగిపోయిందని, వరిసాగు చేసేందుకు నీళ్లు ఇవ్వడం కష్టమని, ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని చెప్పారు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
92వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకం
కేసీ కెనాల్‌కు నీటిసామర్థ్యం తగ్గిన సందర్భంలో శ్రీశైలంలో 872 అడుగుల నీటిమట్టం ఉంది. 854 అడుగులు ఉంచి మిగతా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.అయితే ఈ నీటిని కేసీకాలువకు ఇవ్వకుండా కృష్ణాడెల్టాకు 10టీఎంసీలు మళ్లించారు. దీంతో కేసీ కాలువకు నీరు ఆగిపోయింది. 92వేల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. మైదుకూరు నియోజకవర్గంలో 60వేల ఎకరాలు, కడపకు సంబంధించి 30 వేల ఎకరాలు, మిగతా ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉంది. మూడేళ్లుగా వరిపంటకు దూరమైన కేసీ ఆయకట్టు రైతులు ఈ ఏడాది నీళ్లు వచ్చాయని ఆనందపడి సాగుకు సిద్ధమయ్యారు. వారి ఆనందం రెండు రోజులకే ఆవిరైంది.
రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ
ప్రభుత్వం జిల్లా రైతులపై వివక్ష చూపుతోంది.వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు మొదటి నుంచి సవతిప్రేమ చూపిస్తున్నారు. కెసీ కాలువకు నీటి విడుదల విషయంలో ముఖ్యమంత్రి వక్రబుద్ధి మరోసారి బయటపడిందని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడుతున్నారు.మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి,ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి.అంజాద్‌బాషా,రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, జిల్లా రైతువిభాగం అధ్యక్షులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కేసీకి నీళ్లు ఇచ్చేవరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కేసీ కెనాల్‌కు రావాల్సిన నీటిని కృష్ణాడెల్టాకు తరలిస్తుంటే జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయనరెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని విమర్శించారు. మన వాటా కోసం కలిసి కట్టుగా పోరాడుదామని, అందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు
కేసీకాలువకు నీళ్లు రావడంతో ఈ ఏడాది 10 ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్ణయించా. నారుమడి పోశా. ఇందుకోసం రూ.2000 ఖర్చు అయింది.అధికారులు ఆరుతడి పంటలు సాగు చేయాలని చెబుతున్నారు.ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు.
– ఆంజనేయులు, రైతు, పల్లవోలు, చాపాడు మండలం
నిలువునా ముంచారు
మూడేళ్ల నుంచి వరిపంటకు దూరమయ్యాం.ఈ సారి కేసీకెనాల్‌కు నీళ్లు రావడంతో వరినారు వేశాం.ఇప్పుడేమే ఆరుతడి పంటలకు మాత్రమే నీళ్లు ఇస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది.నారుమడి కోసం ఎకరానికి రూ.2000 ఖర్చు అయింది. పాలకులు, అధికారులు రైతులను నిలువునా ముంచారు.
– సీసీ వెంకటసుబ్బారెడ్డి, తొండలదిన్నె, రాజుపాళెం మండలం
చంద్రబాబుకు రైతులంటే చిన్నచూపు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులంటే చిన్నచూపు. కడప రైతులపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది.కెసీ కెనాల్‌కు అర్ధాంతరంగా నిలిపివేయడం దారుణం. కేసీకెనాల్‌కు నీళ్లు ఇచ్చే వరకు రైతుల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తూనే ఉంటుంది.
– సంబటూరు ప్రసాద్‌రెడ్డి,వైఎస్సార్‌సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు
ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే...
శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గింది.అందువల్ల వరిసాగుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం. ఉన్నతాధికాల ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం.ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి అనుమతులు ఉన్నాయి. మళ్లీ వానలు అధికమై శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు వస్తే తర్వాత నిర్ణయం తీసుకుంటాం.
- జిలానీబాషా, డీఈఈ, కేసీ కెనాల్
Comments
Please login to add a commentAdd a comment