ప్రాజెక్టుల కోసం 40 వేల కోట్లు ఖర్చు | 40 thousand crores for use to Irrigation project : Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల కోసం 40 వేల కోట్లు ఖర్చు

Published Mon, Jun 5 2017 1:27 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

ప్రాజెక్టుల కోసం 40 వేల కోట్లు ఖర్చు - Sakshi

ప్రాజెక్టుల కోసం 40 వేల కోట్లు ఖర్చు

సాక్షి, అమరావతి: మూడేళ్లలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం ఎన్‌.చంద్రబాబునాయుడు చెప్పారు. రాబోయే రోజుల్లో మరో రూ.పదివేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. పోలవరంతోసహా ఏడు ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా మూడోరోజైన ఆదివారం విజయవాడలోని ఎ కన్వెన్షన్‌ హాలులో వ్యవసాయం, అనుబంధ రంగాలపై జరిగిన సదస్సు ముగింపులో ఆయన మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీకల్లా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే చరిత్ర తిరగరాసిన వారమవుతామని.. ప్రపంచంలో అలాంటి ప్రాజెక్టు ఎక్కడా లేదని అన్నారు.

 ఎండిపోయిన కృష్ణా డెల్టాకు నీరిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా గోదావరి నీటిని డెల్టాకిస్తామని, రైతులు నారుమళ్లు పోసుకోవాలని కోరారు. కృష్ణా డెల్టాకు కృష్ణానది నుంచి ఇచ్చేనీటిని పులిచింతల వద్ద నిల్వ చేస్తామన్నారు. మొబైల్‌ లిఫ్టుల ద్వారా రాష్ట్రంలోని చెరువులకు నీరిస్తామని చెప్పారు. అన్ని రాష్ట్రాలకంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. వేరే దేశాలు, రాష్ట్రాలతో పోటీపడి గతంలో పనిచేశానని, అందుకే ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి సాధించానని చెప్పుకొచ్చారు. తనకు ఏ కోరికా లేదని, ఆశ కూడా లేదని అన్నారు. రాష్ట్రంలో ఎవరికీ ఇవ్వని గౌరవాన్ని తనకిచ్చారని, అదే తాను ఇంకా కోరుకుంటున్నానని చెప్పారు.

మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్పేందుకు వస్తున్నారు..
కౌరవ సభలో ద్రౌపదికి అన్యాయం చేసినట్లు పార్లమెంటు తలుపులు మూసేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని, రాజకీయలబ్ధికోసం కాంగ్రెస్‌ పార్టీ ఇష్టానుసారం వ్యవహరించిందని చంద్రబాబు మండిపడ్డారు. అప్పుడు అధికారంలో ఉండి దెబ్బకొట్టారని, ఇప్పుడు అధికారం లేకపోయినా మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్పేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికొచ్చే ఆదాయంలో 32 శాతం వ్యవసాయం నుంచే వస్తుందని, అలాంటి వ్యవసాయం జరిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఆస్పత్రుల్లో చనిపోయినవారిని వాళ్ల ఇళ్లకు తీసుకెళ్లేందుకు త్వరలో మహాప్రస్థానం వాహనాల్ని ప్రవేశపెడుతున్నామని సీఎం చెప్పారు. చనిపోయిన వారిని ఈ వాహనాల్లో వారింటికి తీసుకెళ్లడంతోపాటు కుటుంబానికి రూ.30 వేలు చొప్పున ఇస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement