కృష్ణా నదికి వరదనీరు భారీగా చేరడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద పెరిగిన నీటిమట్టం (ఇన్‌సెట్‌లో) నీటిమట్టం కొలిచే స్కేల్
పాలకులు తలచుకుంటే ప్రజలకు అద్భుత పాలనను అందించవచ్చు.. అదే పాలకులు స్వప్రయోజనాల కోసం పాకులాడితే.. జనాలకు కష్టాలు.. నష్టాలు తప్ప మిగిలేది ఏమీఉండదు. కృష్ణా తీరం వద్ద కొలువుదీరిన సీఎం ఇంటి కోసం అన్నదాతలకు అవస్థలు తెచ్చే కార్యం కొనసాగుతోంది. డెల్టాకు వరప్రదాయని ప్రకాశం బ్యారేజిలో నీటి నిల్వకు కొర్రీలు పెడుతూ కర్షకులకు కడగండ్లు తెచ్చేపనిలో పడ్డారు.
సాక్షి, విజయవాడ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్న చందంగా కృష్ణా నదీతీరంలో రాజధాని ఏర్పాటు.. సీఎం నివాసం.. కృష్ణా డెల్టాకు ముప్పుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీ వద్ద పూర్తిస్థాయిలో సాగునీరు నిల్వ చేసుకునేందుకు అవకాశం లేకుండాపోతోంది.
13 అడుగులకు గాను..9.5 అడుగులకే పరిమితం..
ప్రకాశం బ్యారేజీ వద్ద 13 అడుగుల వరకు నీరు నిల్వ చేసుకోవచ్చు. గతంలో 12 అడుగుల వరకు వరద నీరు నిల్వ చేసేవారు. దశాబ్దం క్రితం 12 అడుగుల గేట్లపై మరో అడుగు ఐరన్ షీట్లు వేసి గేట్లు ఎత్తు పెంచారు. దీంతో 13 అడుగుల వరకు కనీస నీటిని నిల్వ చేయవచ్చు. అయితే 13 అడుగుల నీరు నిల్వచేస్తే నదీ తీరంలో సీఎం ఇంటి సమీపంలోకి వరద నీరు వచ్చి చేరుతుందని ఇరిగేషన్ సిబ్బంది చెబుతున్నారు. దీనికితోడు కొండవీటి వాగు ద్వారా ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు కూడా రాదు. అదే జరిగితే రాజధాని ప్రాంతం మునిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న సూచనల మేరకు ప్రకాశం బ్యారేజీ వద్ద కనీసం 12 అడుగుల మేర కూడా నీటిని నిల్వ చేయడం లేదు. మంగళవారం 9.5 అడుగులకు నీటి మట్టం తగ్గించేశారు. దీనివల్ల సీఎం ఇంటికి ఇబ్బంది ఉండదని, కొండవీటి వాగులోని నీరు కూడా నదిలోకి వచ్చి చేరుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
కృష్ణా డెల్టాకు ఇబ్బందే..
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి మున్నేరు, కట్టలేరు నుంచి 1,13,534 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, కిందకు 1,41,250 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 54 గేట్లను నాలుగు అడుగుల మేర, 15 గేట్లను 2 అడుగుల మేర పైకెత్తి సముద్రంలోకి వరద నీటిని వదులుతున్నారు. వారం రోజులుగా 22 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేశారు.
పూర్తయిన వరి నాట్లు
కృష్ణా తూర్పుడెల్టా కింద కృష్ణా, పశ్చిమగోదావరి, పశ్చిమ డెల్టా కింద గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగు నీరు అందుతుంది. 13.5 లక్షల ఎకరాల ఆయకట్టులో గుంటూరు జిల్లాలో 5.71 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. డెల్టా పరిధిలో చాలావరకు వరి నాట్లు పూర్తయ్యాయి. ఇటీవల నాట్లు వేసిన పొలాల్లోని పైరు డిసెంబర్ నెలాఖరు వరకు ఉంటుంది. అప్పటి వరకు పొలాలకు విడతల వారీగా నీటి తడులు పెట్టాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం వస్తున్న వరద నీరు ఆగిపోతే కృష్ణా డెల్టాకు తిరిగి నీటి కష్టాలు ప్రారంభమవుతాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద కనీసం 13 అడుగుల మేర నీరు నిల్వ చేయకపోతే, వరద తగ్గిన తరువాత కనీసం వారం రోజులకైనా పంట కాలువలకు నీరు ఇవ్వలేరు. 13 అడుగుల వరకు నీరు నిల్వ అవకాశం ఉన్నా.. కేవలం సీఎం ఇంటి భద్రత కోసం 9.5 అడుగులకు పరిమితి చేయడాన్ని రైతు సంఘాల నాయకులు తప్పుపడుతున్నారు.
అన్నదాతలకు అవస్థలు తేవడం తగునా?
ప్రకాశం బ్యారేజీలో నాలుగు అడుగులు తక్కువగా నీరు నిల్వ చేయడం వల్ల కనీసం ఒక టీఎంసీ నీరు తగ్గిపోతుంది. ఇప్పుడు నీటిని సముద్రం పాలుచేసి తరువాత రైతులను ఇబ్బంది పెట్టడం ఎంతమేరకు సమజసమని రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది నవంబర్ నాటికే పట్టిసీమ పడకేసింది. ఈ ఏడాది పులిచింతలలోనూ ఇప్పటి వరకు 3 టీఎంసీలు మించిలేవు. దీంతో రైతులకు ఈ సీజన్‌లోనూ సాగునీటి కటకటలు తప్పేలా లేవు.
Comments
Please login to add a commentAdd a comment