డెల్టా ఆధునీకరణపై నిపుణుల కమిటీ! | Expert Committee to be assigned for Delta modeteration | Sakshi
Sakshi News home page

డెల్టా ఆధునీకరణపై నిపుణుల కమిటీ!

Published Thu, Sep 11 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

డెల్టా ఆధునీకరణపై నిపుణుల కమిటీ!

డెల్టా ఆధునీకరణపై నిపుణుల కమిటీ!

* 14న గుంటూరులో ఉన్నతస్థాయి సమీక్ష
* 37 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు రాక
* రద్దుకానున్న పనులు.. మరికొన్నింటికి టెండర్లు

 
 సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణాడెల్టా ఆధునీకరణ పనులపై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించే యోచనలో ఉంది. ఆరేళ్ల నుంచి పనులు ఆలస్యంగా జరగడానికి గల కారణాలను తెలుసుకుని ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ చేపట్టిన జలయజ్ఞంపై చర్యలు తీసుకుంటే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో డెల్టాల వారీగా సమీక్షలకు కొత్త ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా, ఈనెల 14న గుంటూరులోని జిల్లాపరిషత్ సమావేశ హాలులో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. భారీ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరగే ఈ సమావేశానికి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు హాజరుకానున్నారు.
 
  ఆరేళ్ల కిందట నిర్మాణ సంస్థలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం పనులు జరిగి ఉంటే 20 టీఎంసీల నీరు మిగులు ఉండేది. కొన్ని పనులు ఆలస్యం కావడానికి ప్రభుత్వం, మరికొన్నింటికి నిర్మాణ సంస్థలు కారణంగా తెలుస్తోంది. ఇంజనీర్లు సక్రమంగా అంచనాలు వేయకపోవడంతో పేరు ప్రఖ్యాతులు, సమర్థత కలిగిన నిర్మాణ సంస్థలు కూడా కొన్ని పనులను ప్రారంభించలేదు. ఏడాది పొడవునా నీరు ప్రవహించే కాలువలకు మరమ్మతులు చేయాలని, నల్లరేగడి కలిగిన కాలువలకు సిమెంట్ లైనింగ్ చేయాలని కొందరు ఇంజనీర్లు హడావుడిగా అంచనాలు తయారు చేశారు. ఈ కాలువలకు సిమెంట్ లైనింగ్ చేస్తే  బీటలు వారే అవకాశాలు ఎక్కువ. ఈ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు అనుగుణంగా అంచనాలు తయారుచేయాలి. అప్పట్లో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో కొందరు ఇంజనీర్లు సక్రమంగా అంచనాలు తయారు చేయలేకపోయారు. దీంతో నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించలేదు. భూసేకరణ, డిజైన్ల అనుమతిలో జాప్యం వల్ల కూడా నిర్మాణ సంస్థలు పనులు చేయలేకపోయాయి.
 
  దీనికి తాము బాధ్యులం కాబోమని ఆ సంస్థలు చెబుతున్నాయి. కొన్ని నిర్మాణ సంస్థలు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని పనులు ప్రారంభించలేదు. ఇటువంటి వాటిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నా ఆ సంస్థల అధిపతులు ప్రముఖ రాజకీయ పార్టీలకు చెందినవారు కావడంతో అధికారులు మిన్నకుండి పోయారు. ఈ కారణాలతో కృష్ణాడెల్టాలోని 13.35 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రభుత్వం రూ. 4,573 కోట్లను ఆధునీకరణ పనులకు కేటాయిస్తే రూ. 1,178 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికే నిర్మాణ సంస్థల పనితీరు, పనులు జరగకపోవడానికి గల కారణాలపై ఒక అవగాహన వచ్చిన ఇరిగేషన్ ఇంజనీర్లు కొన్నింటిని రద్దు చేసేందుకు నివేదికలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేకంటే పనుల పరిశీలన, నివేదిక ఇవ్వడానికి ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పదవీ విరమణ చేసిన చీఫ్ ఇంజనీర్లు, కృష్ణాడెల్టా చీఫ్ ఇంజనీర్ ఈ కమిటీలో సభ్యులుగా  ఉంటారు. వీరు ప్రభుత్వానికి ఇచ్చే నివేదికను ఆధారంగా చేసుకుని అవసరంలేని పనులను రద్దు చేసే అవకాశం ఉంది. పనులు చేయని నిర్మాణ సంస్థల ఒప్పందాన్ని రద్దు చేసి, చర్యలు తీసుకుంటారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. రద్దు కానున్న పనుల్లో రైతులకు అవసరమైనవి ఉంటే వాటికి టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement