jala yagnam project
-
డెల్టా ఆధునీకరణపై నిపుణుల కమిటీ!
* 14న గుంటూరులో ఉన్నతస్థాయి సమీక్ష * 37 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు రాక * రద్దుకానున్న పనులు.. మరికొన్నింటికి టెండర్లు సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణాడెల్టా ఆధునీకరణ పనులపై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించే యోచనలో ఉంది. ఆరేళ్ల నుంచి పనులు ఆలస్యంగా జరగడానికి గల కారణాలను తెలుసుకుని ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ చేపట్టిన జలయజ్ఞంపై చర్యలు తీసుకుంటే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో డెల్టాల వారీగా సమీక్షలకు కొత్త ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా, ఈనెల 14న గుంటూరులోని జిల్లాపరిషత్ సమావేశ హాలులో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. భారీ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరగే ఈ సమావేశానికి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు హాజరుకానున్నారు. ఆరేళ్ల కిందట నిర్మాణ సంస్థలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం పనులు జరిగి ఉంటే 20 టీఎంసీల నీరు మిగులు ఉండేది. కొన్ని పనులు ఆలస్యం కావడానికి ప్రభుత్వం, మరికొన్నింటికి నిర్మాణ సంస్థలు కారణంగా తెలుస్తోంది. ఇంజనీర్లు సక్రమంగా అంచనాలు వేయకపోవడంతో పేరు ప్రఖ్యాతులు, సమర్థత కలిగిన నిర్మాణ సంస్థలు కూడా కొన్ని పనులను ప్రారంభించలేదు. ఏడాది పొడవునా నీరు ప్రవహించే కాలువలకు మరమ్మతులు చేయాలని, నల్లరేగడి కలిగిన కాలువలకు సిమెంట్ లైనింగ్ చేయాలని కొందరు ఇంజనీర్లు హడావుడిగా అంచనాలు తయారు చేశారు. ఈ కాలువలకు సిమెంట్ లైనింగ్ చేస్తే బీటలు వారే అవకాశాలు ఎక్కువ. ఈ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు అనుగుణంగా అంచనాలు తయారుచేయాలి. అప్పట్లో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో కొందరు ఇంజనీర్లు సక్రమంగా అంచనాలు తయారు చేయలేకపోయారు. దీంతో నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించలేదు. భూసేకరణ, డిజైన్ల అనుమతిలో జాప్యం వల్ల కూడా నిర్మాణ సంస్థలు పనులు చేయలేకపోయాయి. దీనికి తాము బాధ్యులం కాబోమని ఆ సంస్థలు చెబుతున్నాయి. కొన్ని నిర్మాణ సంస్థలు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని పనులు ప్రారంభించలేదు. ఇటువంటి వాటిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నా ఆ సంస్థల అధిపతులు ప్రముఖ రాజకీయ పార్టీలకు చెందినవారు కావడంతో అధికారులు మిన్నకుండి పోయారు. ఈ కారణాలతో కృష్ణాడెల్టాలోని 13.35 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రభుత్వం రూ. 4,573 కోట్లను ఆధునీకరణ పనులకు కేటాయిస్తే రూ. 1,178 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికే నిర్మాణ సంస్థల పనితీరు, పనులు జరగకపోవడానికి గల కారణాలపై ఒక అవగాహన వచ్చిన ఇరిగేషన్ ఇంజనీర్లు కొన్నింటిని రద్దు చేసేందుకు నివేదికలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేకంటే పనుల పరిశీలన, నివేదిక ఇవ్వడానికి ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పదవీ విరమణ చేసిన చీఫ్ ఇంజనీర్లు, కృష్ణాడెల్టా చీఫ్ ఇంజనీర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరు ప్రభుత్వానికి ఇచ్చే నివేదికను ఆధారంగా చేసుకుని అవసరంలేని పనులను రద్దు చేసే అవకాశం ఉంది. పనులు చేయని నిర్మాణ సంస్థల ఒప్పందాన్ని రద్దు చేసి, చర్యలు తీసుకుంటారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. రద్దు కానున్న పనుల్లో రైతులకు అవసరమైనవి ఉంటే వాటికి టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. -
రాజన్న రాజ్యంలో.. జలయజ్ఞం
బాబు పాలన: బాబు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు కానీ, కనీసం ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తికాలేదు. ఆ కారణం వల్లనే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మనకు వ్యతిరేకంగా వచ్చింది. - కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి వరద జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులను అప్పట్లోనే నిర్మించి ఉంటే ట్రిబ్యునల్ తీర్పు మనకు అనుకూలంగా వచ్చేది. - బాబు హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసిన వ్యయం రూ. 700 కోట్లు మాత్రమే. అంటే.. ఏడాదికి వంద కోట్లను కూడా ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయలేదు. - ఇంకుడుగుంతలపై చూపిన శ్రద్ధ భారీ ప్రాజెక్టులపై చూపలేదు. - ఆనాడు కేంద్రంలో తానే చక్రం తిప్పానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు... కేంద్రంలో మాట్లాడి ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపలేకపోయారు. మన రాష్ట్ర సాగునీటి హక్కులు కాపాడలేక పోయారు. రాజన్న రాజ్యం అందుబాటులోకి వచ్చిన ప్రతి నీటి బిందువునూ ఒడిసి పట్టుకుని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూనే రాష్ట్ర ప్రజలందరికీ తాగునీటి సౌకర్యం కల్పించాలని కలలుగన్న ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన మహాయజ్ఞం... జలయజ్ఞం! దివి నుంచి భువికి గంగను రప్పించే భగీరథయత్నం.. కరవు కాటకాలను తరిమికొట్టడానికి చేపట్టిన వజ్రాయుధం.. కోటి ఎకరాలకు నీరందించి రైతన్న భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు మహానేత తీసుకున్న దృఢసంకల్పం జలయజ్ఞం! - ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో జలయజ్ఞం ప్రారంభించారు వైయస్సార్. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో 86 ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు. - జలయజ్ఞం కింద చేపట్టిన 86 ప్రాజెక్టుల్లో ఐదేళ్లలోనే 12 ప్రాజెక్టులను పూర్తిచేశారు. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి, సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించారు. - ఐదేళ్లలోనే రూ. 53 వేల కోట్లను ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు చేశారు. చాలా ప్రాజెక్టులు చివరిదశకు చేరుకున్నాయి. - ఆయన హయాంలో వేగంగా జరిగిన పోలవరం ప్రాజెక్టు పనులు తర్వాత పూర్తిగా నిలిచిపోయాయి. డిజైన్‌ను మార్చడం వల్ల మళ్ళీ టెండర్లను ఖరారు చేయానికే ప్రభుత్వం మూడేళ్ళ సమయాన్ని తీసుకుంది. వైఎస్ మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు పనులు అదే వేగంతో జరిగినట్టయితే... ఈ సమయానికి పూర్తయి...పశ్చిమ గోదావరి జిల్లాలో 7.2 లక్షల ఆయకట్టుకు నీటి వసతిని కల్పించడంతో పాటు కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల నీటిని తరలించడానికి, విశాఖపట్టణానికి 30 టీఎంసీల నీటి సరఫరాకు అవకాశం ఉండేది. - ఆ ఒక్క ప్రాజెక్టునే కాదు, మహానేత మరణానంతరం ఇతర ప్రాజెక్టులను సైతం పట్టించుకున్న నాధుడే లేడు. జగన్ సంకల్పం పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కూడా తానే తీసుకుంది. పోలవరంతోపాటు పెండింగ్‌లో ఉన్న గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాతిపదికపై నిర్మాణం పూర్తిచేయడం జరుగుతుంది. ప్రాజెక్టుల నిర్మాణ ప్రభావం మైనింగ్, ట్రాన్స్పోర్ట్, మాన్యుఫ్యాక్చరింగ్, వినిమయ రంగాలపై ప్రసరించి, 2004-09 మధ్య విస్తరించిన అభివృద్ధి మాదిరిగానే ఆయా రంగాల పురోగతికి దోహదం చేస్తుంది. సిమెంట్, స్టీల్, నిర్మాణ సామగ్రి... వీటన్నింటి కొనుగోళ్ళూ పెరగటం, మైనింగ్, ట్రాన్స్‌పోర్టు పెరగటం అంటే ఆర్థిక వ్యవస్థకు మొత్తంగా మళ్ళీ జీవం పోయటమే!