
తడారి.. ఎడారి!
అన్నదాతలకు పెద్ద కష్టమే వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణాడెల్టాకు ప్రభుత్వం సాగునీరు విడుదల
చేనుకు చేటు.. రైతుకు దుఃఖం
వరికి పొట్టదశలోనూ సాగునీరందని వైనం
ఎకరానికి రూ.20 వేల పెట్టుబడి
కృష్ణాడెల్టా భవితవ్యం ప్రశ్నార్థకం
మచిలీపట్నం : అన్నదాతలకు పెద్ద కష్టమే వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణాడెల్టాకు ప్రభుత్వం సాగునీరు విడుదల చేయకుండా మిన్నకుండిపోయింది. పట్టిసీమ ద్వారా సాగునీరిస్తామని సీఎం, మంత్రులు చెప్పడంతో ఆశపడి వరిసాగు చేశామని, చివరికి తమకు నిరాశే మిగిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి మట్టిపాలు
ఈ ఏడాది ఖరీఫ్ సెప్టెంబర్ 30తో ముగిసింది. ఈ సీజన్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉండగా 4.64 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తిచేశారు. 1.70 లక్షల ఎకరాల్లో నాట్లు పడలేదు. నాట్లు పూర్తిచేసిన పొలాల్లోని పైరు అడపాదడపా కురిసిన వర్షపునీరు కారణంగా బతికింది. డ్రెయిన్లు, బోరునీటి ఆధారంగా మరికొంత భూమిలోని పైరును రైతులు బతికించుకున్నారు. ప్రస్తుతం పైరు చిరుపొట్ట, పొట్టదశలో ఉంది. ఈ దశలో తప్పనిసరిగా వరికి నీరు కావాల్సిందే. నీరందకుంటే పైరు ఈతకు రాదని, వచ్చినా తాలు, తప్పలు వస్తాయని రైతులు అంటున్నారు. చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ, పామర్రు, మచిలీపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో చిరుపొట్ట, పొట్టదశలో ఉన్న వరి పొలాలు నెర్రెలిస్తున్నాయి. సాగునీరు అందకపోవడంతో మూడు రోజుల క్రితం పామర్రులో ఓ రైతు తన వరి పొలాన్ని దున్నేశాడు. ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ చోటుచేసుకుంటున్నాయి.
ఇంతా జరుగుతున్నా పాలకులు సాగునీటిని విడుదల చేసేందుకు కనీస చర్యలు తీసుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి ఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి పెట్టామని, వరిపైరు పొట్టదశలో ఉన్న సమయంలో నీరు అందుబాటులో లేకుంటే ఈ పెట్టుబడి అంతా మట్టిలో కలిసిపోతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. నాగార్జునసాగర్ నుంచి ఖరీఫ్ సీజన్‌లో 80 టీఎంసీల నీరు కృష్ణాడెల్టాకు విడుదల చేయాల్సి ఉండగా చుక్కనీరు కూడా ఇవ్వలేదు. నాగార్జునసాగర్ నుంచి కృష్ణాడెల్టాకు ప్రథమ వినియోగ హక్కు ఉన్నా పాలకులు పెదవి విప్పడం లేదని రైతులు విమర్శిస్తున్నారు.