తూర్పు డెల్టాలో 37 శాతం నాట్లు పూర్తి | East Delta, a full 37 percent of the seeding | Sakshi
Sakshi News home page

తూర్పు డెల్టాలో 37 శాతం నాట్లు పూర్తి

Published Mon, Aug 25 2014 2:12 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

తూర్పు డెల్టాలో 37 శాతం నాట్లు పూర్తి - Sakshi

తూర్పు డెల్టాలో 37 శాతం నాట్లు పూర్తి

  • ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాసరావు
  • అవనిగడ్డ :  కృష్ణా డెల్టా ఆయకట్టు పరిధిలోని తూర్పుడెల్టాలో 37 శాతం వరినాట్లు పూర్తయినట్లు ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పటి వరకు తూర్పుడెల్టాలో 4.15లక్షల ఎకరాల్లో నాట్లు వేసినట్లు తెలిపారు. పులిగడ్డ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని పశ్చిడెల్టాలో 1.79 లక్షల ఎకరాల్లో నాట్లు వేయగా, 31 శాతం పూర్తయినట్లు చెప్పారు.

    యనమలకుదురు లాకుల నుంచి నిమ్మగడ్డ లాకు వరకు ఒకే స్థాయిలో సాగునీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీకాకుళం, ఘంటసాల ప్రాంతాల్లోని కాలువ చివరి భూములకు సాగునీరందడం లేదని రైతులు తమ దృష్టికి తీసుకురావడంతో వంతులువారీ విధానాన్ని అమలుచేయాలని సూచించినట్లు చెప్పారు.

    వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులందరూ ఒకేసారి వ్యవసాయ పనులు ప్రారంభించటంతో సాగునీటి ఎద్దడి ఏర్పడిందని, సాగునీటి విడుదలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించటానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దివిసీమలోని కాలువ చివరి భూములకు సైతం పూర్తిస్థాయిలో సాగునీరు అందించటమే తమ లక్ష్యమని చెప్పారు. సాగునీటి వినియోగంపై కృష్ణారివర్ బోర్డు అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు.

    సెప్టెంబరు 15వ తేదీలోపు వరినాట్లు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. కరువు కాలువకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నామని, సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకుని, ముందస్తుగా నాట్లు వేయటానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వరినాట్లు పూర్తయిన తర్వాత ఇలాంటి వర్షాభావ పరిస్థితులే నెలకొంటే వంతులువారీ విధానం అమలుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఈఈ జి.గంగయ్య, డీఈ భానుబాబు, ఆర్‌సీ డీఈ ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement