సకాలంలో పోలవరం పూర్తిచేస్తాం
సీఎం చంద్రబాబు వెల్లడి
- కృష్ణా డెల్టాకు జూన్‌లోనే నీరు ఇచ్చాం
- కుంటలు, చెక్‌డామ్‌ల వల్ల భూగర్భ జలాలు పెరిగాయి
- కృష్ణా తూర్పు డెల్టాకు నీరు విడుదల చేసిన సీఎం
సాక్షి, విజయవాడ/సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును సకాలంలోనే పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును ఏడాదిలోనే పూర్తి చేయడం ద్వారా కృష్ణాడెల్టాకు సాగునీరు అందిస్తున్నామన్నారు. విజయ వాడలోని కృష్ణా తూర్పు డెల్టా ప్రధాన హెడ్ స్లూయిస్ ద్వారా ప్రకాశం బ్యారేజీ నుంచి సీఎం సోమవారం సాగు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు పూజలు చేశారు. గేట్ల స్విచ్ ఆన్ చేసి 2,500 క్యూసె క్కుల నీటిని కాలువలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో సీఎం చంద్ర బాబు మాట్లాడుతూ.. ఏటా ఆగస్టులో కృష్ణాడెల్టా కాలువలకు నీరు అందించే వారని, ఈ ఏడాది జూన్‌లోనే పట్టిసీమ నుంచి తెచ్చిన గోదావరి నీరు ఇస్తున్నా మన్నారు. దీనివల్ల తుపాన్లు రావడానికి ముందే రైతులకు పంటలు చేతికి అందుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా విశాఖ నగరానికి తాగునీరు ఇస్తామన్నారు. గాలేరు–నగరి ప్రాజెక్టును అడ్డుకు న్నారని, రైతులకు నచ్చజెప్పి పరిహారం అందించామని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదుల అనుసంధానం పూర్తి చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలోని మడకశిర, కుప్పంలకు నీళ్లు తీసుకువెళ్లామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా రాబోయే సంవత్సరా లలో రాయలసీమకు నీరు అందిస్తామన్నారు.
భూగర్భ జలాలు పెరిగాయి..
రాష్ట్రంలో పంట కుంటలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించడం వల్ల భూగర్భ జలాలు 90 టీఎం సీలు పెరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటి వరకు కురిసిన వర్షాలు వల్ల భూగర్భ జలం మీటరు పెరిగిందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండటానికి రూ. 2 వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందించా మన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియచేస్తూ మైనార్టీల అభివృద్ధి కోసం రూ. 845 కోట్ల బడ్జెట్ కేటాయించామని, పెళ్లి చేసుకునే మైనార్టీ యువతులకు దుల్హాన్ పథకం కింద రూ. 100 కోట్లు ఇచ్చామన్నారు.
పనులు వేగవంతం చేయండి..
పోలవరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తన నివాసంలో పోలవరం ప్రాజెక్టు పనులపై ఆయన సమీక్ష నిర్వహించి వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సకాలంలో ప్రాజెక్టు పూర్తికి నిర్మాణ సంస్థలు, అధికారులు కలిసి రావాలని కోరారు.