సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజన్న కల సాకారమవుతోంది. కృష్ణాడెల్టా పరిధిలోని 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన పులిచింతల ప్రాజెక్టు తొలిసారిగా రైతులకు అందుబాటులోకి వస్తోంది. ఈ ఖరీఫ్‌లో 11 టీఎంసీల నీటిని నిల్వ చేయాలనే నిర్ణయానికి అనుకూలంగా ప్రాజెక్టు వద్ద 4 టీఎంసీల నీటిని నిల్వ చేశారు.
ఇప్పటికే శ్రీశైలం నిండగా, మరో వారంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వరద నీటితో పూర్తిగా నిండే అవకాశాలున్నాయి. ఆ తరువాత అదనంగా వచ్చే నీటిని సాగర్ నుంచి దిగువకు విడుదల చేసి పులిచింతల వద్ద నిల్వ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ముంపు ప్రాంతాల బాధితులను పునరావాస ప్రాంతాలకు వెంటనే తరలించి 11 టీఎంసీల నీటిని ప్రాజెక్టు వద్ద నిల్వ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖరీఫ్ సీజను ప్రారంభంలో వర్షాభావం, ఆల్మట్టి డ్యామ్ పూర్తిగా నిండకపోవడం వంటి కారణాల వల్ల కృష్ణాడెల్టాలో వరినాట్లు ఆలస్యమయ్యాయి. క్రమంగా వరద నీటితో డ్యామ్‌లు నిండుతుండ టంతో సాగునీటి సమస్యను అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
జలయజ్ఞంలో భాగంగా నిర్మితమైన పులిచింతల ప్రాజెక్టు ఆగస్టు 15 నుంచి రైతులకు అందుబాటులోకి వచ్చింది.24 గేట్లను పూర్తిగా కిందకు దించి నీటిని నిల్వ చేయడం ప్రారంభించారు. సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టు మధ్య ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాగు లేరు, చంద్రవంక తదితర వాగులు పొంగి ఆ వరద నీరంతా కృష్ణానదిలోకి చేరుకున్నది.
సాగర్ నుంచి విడుదలైన నీటిలో కొంత భాగం నది బేసిన్‌లో నిల్వ ఉండి పోయింది. వర్షాలకు నదినీటి ప్రవాహ వేగం పెరిగి మిగులు నీరంతా ప్రాజెక్టుకు చేరుకున్నది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఇరిగేషన్ శాఖ ఇప్పటి వరకు 4 టీఎంసీల నీటిని భవిష్యత్ అవసరాలకు నిల్వ ఉంచింది.
మరో వారం రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందని, ఆ తరువాత మిగులు నీటిని దిగువకు విడుదల చేసి పులిచింతల ప్రాజెక్టు వద్ద మొత్తం 11 టిఎంసీలను నిల్వ చేస్తామని పులిచింతల ప్రాజెక్టు ఎస్‌ఈ చంద్రశేఖర్ ‘సాక్షి’కి వివరించారు.
జలయజ్ఞ ఫలం
Published Tue, Sep 2 2014 2:03 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement