Nagarujna sagar project
-
నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు గండి
సాక్షి, నిడమనూరు: నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం–వేంపాడ్ గ్రామాల మధ్య నారెళ్లగూడ మేజర్ సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కట్టకు బుధవారం భారీ గండి పడింది. సాయంత్రం 5.45 గం.కు యూటీ వద్ద నీరు కాల్వ లో సుడి తిరుగుతూ ఉండటం, కట్టకు కింది భాగంలోంచి నీరు అధికంగా వెళ్తుండటం గమనించారు. మొదట అయోమయానికి గురైన రైతులు, తర్వాత బుంగ పడిందని నిర్ధారణ చేసుకున్నారు. సాగర్ ఎడమ కాల్వకు 32.109 కిలోమీటర్ వద్ద ఉన్న యూటీకి (అండర్ టన్నెల్) కుడి పక్కన గండి పడి తర్వాత మొత్తం కొట్టుకుపోయింది. బుంగ కాస్తా పెరిగి గంటలోనే కట్టకు గండిపడింది. కట్ట 30 మీటర్ల మేర కొట్టుకు పోయింది. సాగర్ నుంచి వచ్చే నీరంతా పొలాలకు నర్సింహులగూడెం మీదుగా, నిడమనూరు సమీపంలోని వాగులోకి చేరాయి. వాగు ద్వారా నీరు వెళ్తుండటంతో నిడమనూరుకు ముప్పు తప్పింది. గండి పడిన ప్రాంతానికి తహశీల్దార్ ప్రమీల, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు వెళ్లి పరిశీలించారు. పూర్తిగా చీకటిపడటంతో ఎక్కడ ఎంత మేర గండి పడిందో అంచనా వేయలేకపోతున్నారు. విషయం తెలుకున్న సాగర్ ప్రాజెక్టు అధికారులు నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు బుధవారం రాత్రి నీటిని నిలిపివేశారు. నిడమనూరు–నర్సింహులగూడెం మధ్య కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపైకి నీరు రావడంతో ఒక పక్కనే రాకపోకలకు అనుమతిస్తున్నారు. ఆధునీకరణకు ముందు రెండు చోట్ల గండ్లు సాగర్ ఎడమకాల్వ కట్టకు ఆధునీకరణకు ముందు గండ్లుపడిన సందర్భాలున్నాయి. నిడమనూరు మండలం బీకే పహాడ్ సమీపంలోని వెంగన్నగూడెం మైనర్ తూము వద్ద, హాలియా మండలం ఇబ్రహీంపేట గ్రామం వద్ద కాల్వకట్టకు గండి పడింది. అప్పుడూ వ్యవసాయ పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాగర్ ఎడమకాల్వకు ఆధునీకరణ పనులు చేపట్టిన తర్వాత గండి పడటం మాత్రం ఇదే మొదటిసారి. కట్టబలోపేతం చేయడం వల్ల కట్టకు ఇబ్బంది లేకున్నా యూటీలను ఆధునీకరించకపోవడం వల్లే గండిపడింది. ఇదీ చదవండి: సరి లేదు ‘వరి’కేదీ!.. రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో నాట్లు -
నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత
-
నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత
సాక్షి, నల్గొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో నాగార్జున సాగర్ క్రస్టు గేట్లను సోమవారం అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో నాగార్జున సాగర్ గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. 8 గేట్లు ఎత్తి సుమారు అయిదు అడుగుల వరకు ఉన్న నీటిని దిగువకు విడుదల చేశారు. కాగా రెండు రోజుల పాటు వరద కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయం వరకు నాగార్జుసాగర్లోని నీటిని సమీక్షించి గేట్ల సంఖ్య పెంచాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని సాగర్ ఎస్ఈ ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కాగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేయడంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. సాగర్ జలాశయ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు. ఇక ఎగువన కృష్ణా పరీవాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద రాక పెరిగింది. దీంతో ఆ ప్రాజెక్టుల గేట్లు తెరుచుకున్నాయి. దిగువకు వరద నీరు భారీగా వస్తుండటంతో ముందుస్తుగానే నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి కృష్ణానదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. -
జలయజ్ఞ ఫలం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజన్న కల సాకారమవుతోంది. కృష్ణాడెల్టా పరిధిలోని 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన పులిచింతల ప్రాజెక్టు తొలిసారిగా రైతులకు అందుబాటులోకి వస్తోంది. ఈ ఖరీఫ్‌లో 11 టీఎంసీల నీటిని నిల్వ చేయాలనే నిర్ణయానికి అనుకూలంగా ప్రాజెక్టు వద్ద 4 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఇప్పటికే శ్రీశైలం నిండగా, మరో వారంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వరద నీటితో పూర్తిగా నిండే అవకాశాలున్నాయి. ఆ తరువాత అదనంగా వచ్చే నీటిని సాగర్ నుంచి దిగువకు విడుదల చేసి పులిచింతల వద్ద నిల్వ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముంపు ప్రాంతాల బాధితులను పునరావాస ప్రాంతాలకు వెంటనే తరలించి 11 టీఎంసీల నీటిని ప్రాజెక్టు వద్ద నిల్వ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖరీఫ్ సీజను ప్రారంభంలో వర్షాభావం, ఆల్మట్టి డ్యామ్ పూర్తిగా నిండకపోవడం వంటి కారణాల వల్ల కృష్ణాడెల్టాలో వరినాట్లు ఆలస్యమయ్యాయి. క్రమంగా వరద నీటితో డ్యామ్‌లు నిండుతుండ టంతో సాగునీటి సమస్యను అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. జలయజ్ఞంలో భాగంగా నిర్మితమైన పులిచింతల ప్రాజెక్టు ఆగస్టు 15 నుంచి రైతులకు అందుబాటులోకి వచ్చింది.24 గేట్లను పూర్తిగా కిందకు దించి నీటిని నిల్వ చేయడం ప్రారంభించారు. సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టు మధ్య ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాగు లేరు, చంద్రవంక తదితర వాగులు పొంగి ఆ వరద నీరంతా కృష్ణానదిలోకి చేరుకున్నది. సాగర్ నుంచి విడుదలైన నీటిలో కొంత భాగం నది బేసిన్లో నిల్వ ఉండి పోయింది. వర్షాలకు నదినీటి ప్రవాహ వేగం పెరిగి మిగులు నీరంతా ప్రాజెక్టుకు చేరుకున్నది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఇరిగేషన్ శాఖ ఇప్పటి వరకు 4 టీఎంసీల నీటిని భవిష్యత్ అవసరాలకు నిల్వ ఉంచింది. మరో వారం రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందని, ఆ తరువాత మిగులు నీటిని దిగువకు విడుదల చేసి పులిచింతల ప్రాజెక్టు వద్ద మొత్తం 11 టిఎంసీలను నిల్వ చేస్తామని పులిచింతల ప్రాజెక్టు ఎస్ఈ చంద్రశేఖర్ ‘సాక్షి’కి వివరించారు.