ఎప్పటికో ఆధునికీకరణ?’
• కృష్ణాడెల్టా పనుల్లో తీవ్ర జాప్యం ఏడేళ్లలో చేసింది సగం పనులేతాగునీరు విడుదల చేశాకే పనులు ప్రారంభం అరకొరగానే నీటి విడుదల రెండు నెలల్లోనే మళ్లీ తాగునీటి సమస్య
సాక్షి, విజయవాడ: కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వాస్తవంగా ఈ ఏడాది రబీ పంట లేదు. ఆధునికీకరణ పనులకు తగినంత సమయం ఉంది. ఇప్పటివరకు పనులు చేయించేందుకు అధికారులు సమాయత్తం కాలేదు. జిల్లాలోని అనేక చెరువుల్లో నీరు లేదు. వాటిని నింపిన తరువాతనే ఆధునికీకరణ పనులు చేపట్టే అవకాశాలు కనపడుతున్నాయి.
నాలుగు టీఎంసీల నీరు విడుదల... కృష్ణా డెల్టా పరిధిలో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య ఉధృతమవుతోంది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కృష్ణా యాజమాన్య బోర్డు నాలుగు టీఎంసీల నీరు విడుదల చేసింది. నీరు పులిచింతలకు వచ్చిన తరువాత అక్కడ కొంత నిల్వ చేస్తారు. మిగిలిన నీటిని ప్రకాశం బ్యారేజ్‌కి వదులుతారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 8.6 అడుగుల నీరు ఉంది. కనీసం 11 అడుగుల వచ్చే వరకు నీటిని నిల్వ చేస్తారు. ఆ తరువాతనే కాల్వలకు వదిలే అవకాశం ఉంది.
ఇదంతా జరిగే సరికి మరో పక్షం రోజులు పడుతుంది. ఆ తరువాత జిల్లాలో 370 చెరువులు నింపాల్సి ఉంటుంది. మచిలీపట్నం, పెడన, బంటుమల్లి, కృత్తివెన్ను, పెడన, గుడివాడ తదితర ప్రాంతాల్లోని కొన్ని చెరువులు ఇప్పటికే అడుగంటాయి. మిగిలిన చెరువుల్లో
పది నుంచి 30 శాతం మాత్రమే నీరు ఉంది. ప్రస్తుతం వచ్చే నీటిలో కొంత కాల్వల్లోనే ఇంకిపోతుంది. ఈ లెక్కన సాగర్, శ్రీశైలం నుంచి వచ్చే నీరు చెరువులు వద్దకు చేరేసరికి సుమారుగా 20 నుంచి 30 రోజులు పడుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. చెరువులను పూర్తిగా నింపితే మూడు నాలుగు నెలల వరకు నీటి ఎద్దడి ఉండదు. ఇప్పుడు వచ్చే నీటితో 50 శాతం చెరువులు నిండే అవకాశాలు ఉన్నాయి. అంటే రెండు నెలలకే గ్రామాల్లో నీటి సమ స్య వచ్చే అవకాశంఉంది. మే నాటికి మరళా కృష్ణా యాజ మాన్య బోర్డును అడిగి మరికొంత నీటితో చెరువులు నిం పాల్సి ఉంటుంది. ఈ విధంగా పైనుంచి వచ్చే నీటిని కాల్వ ల ద్వారా కిందకు వదులుతూ పోతే కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులు వేగంగా చేయడం ఏమాత్రం సాధ్యపడదు. అనుమతించినా.. చేరుకోని లక్ష్యం
కృష్ణా డెల్టా ఆధునికీకరణకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయంలో 2007 నవంబర్‌లో రూ.4,573 కోట్లతో 84 ప్యాకేజీలకు ప్రభుత్వం అనుమతించింది. రూ.3003.862 కోట్లకు ఒప్పందంతో పనులు ప్రారంభమయ్యాయి.
ఇందులో కృష్ణా జిల్లా 46 ప్యాకేజ్‌లకు రూ.1486.954 కోట్లు, గుంటూరు జిల్లాలో 38 ప్యాకేజ్‌లకు రూ. 1516. 91 కోట్లు కేటాయించారు. గతేడాది మార్చి వరకు మొత్తం రూ.1387.16 కోట్ల పనులు జరిగాయి. గతేడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు రూ.300 కోట్ల పనులు చేయాలని లక్ష్యం గా నిర్ణయించుకున్నారు. అయితే కేవలం రూ.116కోట్ల పనులు మాత్రమే జరిగాయి. మొత్తంగా రూ.1503. 16 కోట్ల పనులు జరిగాయి. ఆ తరువాత వర్షాలు పడడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఈ లెక్కన ఎనిమిది ఏళ్లల్లో సగం పనులు మాత్రమే జరిగాయని ఇరిగేషన్ లెక్కలు చెబుతున్నాయి. రబీ లేకపోయినా....
ఈ ఏడాది రబీ లేదు. మార్చి నుంచి జూలై వరకు కృష్ణా డెల్టా పనులు జరుగుతాయని రైతులు భావించారు. అరకొరగానే పనులు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. చెరువులకు నీరు నింపిన తరువాత కాల్వలు ఎండి పనులు ప్రారంభించే సరికి రెండు నెలల కన్నా ఎక్కువ సమయం ఉండడం లేదు. ఫలితంగా రైతులకు కడగండ్లు తప్పడం లేదు.