Rabi crop
-
పప్పు ధాన్యాల సేకరణ షురూ
సాక్షి, అమరావతి: రబీ పంట ఉత్పత్తుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇచ్చి న ప్రభుత్వం.. తాజాగా మినుము, పెసలు, వేరుశనగ సేకరణకూ అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా కొనుగోలుకు ఏపీ మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. రబీ 2023–24 సీజన్లో 7 లక్షల ఎకరాల్లో శనగ, 7.50 లక్షల ఎకరాల్లో మినుము, 1.92 లక్షల ఎకరాల్లో పెసలు, 1.61 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. శనగ 5.26 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84 వేల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు. క్వింటాల్ శనగలకు రూ.5,440, పెసలుకు రూ.8,558, మినుముకు రూ.6,950, వేరుశనగకు రూ.5,850 చొప్పున ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించింది. 2.75 లక్షల టన్నుల సేకరణకు అనుమతి కనీస మద్దతు ధరకు శనగలు 1,14,163 టన్నుల సేకరణకు గత నెలాఖరున ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా 97,185 టన్నుల మినుము, 46,463 టన్నుల వేరుశనగ, 17,505 టన్నుల పెసలు సేకరణకు అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏపీ మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పంట కోతల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్ఎఫ్ ఐడీ ట్యాగ్ వేస్తున్నారు. మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం రబీ పంట ఉత్పత్తుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శనగలు, మినుము, పెసలు, వేరుశనగ సేకరిస్తున్నాం. మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కని వారు ఆర్బీకేల్లో తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలి. మార్కెట్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. తొందరపడి ఏ ఒక్క రైతు తమ పంట ఉత్పత్తులను ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు అమ్ముకోవద్దు. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ పనులు వేగవంతం
సాక్షి, అమరావతి: గోదావరికి వరద వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తిచేసే దిశగా అధికారులు పనులను వేగవంతం చేశారు. డెల్టాలో రబీ పంటలకు నీటిని సరఫరా చేసేందుకు కాఫర్ డ్యామ్ రీచ్–3లో 400 మీటర్లను ఖాళీగా వదిలేశారు. రబీ పంటలు నూర్పిళ్ల దశకు చేరుకోవడంతో ఖాళీగా వదిలిన ప్రదేశాన్ని భర్తీచేసేందుకు సిద్ధమయ్యారు. ఎగువ సీలేరు, దిగువ సీలేరు కేంద్రాల నుంచి ఏపీ జెన్కో (ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థ) విద్యుదుత్పత్తి చేస్తూ 4 వేల క్యూసెక్కుల నీటిని వదులుతోంది. ఇది కాఫర్ డ్యామ్ రీచ్–3లో ఖాళీ ప్రదేశాన్ని భర్తీచేయడానికి అడ్డంకిగా మారింది. దీంతో జూన్ వరకు విద్యుదుత్పత్తిని నిలిపివేసి కాఫర్ డ్యామ్‌ను పూర్తిచేయడానికి సహకరించాలని ఏపీ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లను కోరినట్లు పోలవరం చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌బాబు ‘సాక్షి’కి చెప్పారు. నీటి ప్రవాహం తగ్గగానే ఖాళీ ప్రదేశాన్ని శరవేగంగా భర్తీచేసి.. జూన్ నాటికి కాఫర్ డ్యామ్‌ను సిద్ధం చేస్తామన్నారు. గోదావరి నదిపై పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామన్నగూడెం వద్ద 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం విదితమే. ప్రాజెక్టులో నీటిని నిల్వచేసే ప్రధాన ఆనకట్ట (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్–ఈసీఆర్ఎఫ్)ను 2,467.5 మీటర్ల పొడవున మూడు భాగాలుగా నిర్మించాలి. ఈసీఆర్‌ఎఫ్‌ను నిర్మించాలంటే.. గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించేలా ఈసీఆర్‌ఎఫ్‌కు ఎగువన 2,480 మీటర్లు, దిగువన 1,617 మీటర్ల పొడవున కాఫర్ డ్యామ్‌లు నిర్మించాలి. ఎగువ కాఫర్ డ్యామ్‌ను 42.5 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్‌ను 30.50 మీటర్ల ఎత్తున నిర్మించాలి. 4 రీచ్‌లుగా ఎగువ కాఫర్ డ్యామ్ ఎగువ కాఫర్ డ్యామ్‌ను 4 రీచ్‌లుగా నిర్మిస్తున్నారు. రీచ్–1ను 0 నుంచి 480 మీటర్లు, రీచ్–2ను 480 నుంచి 1,700 మీటర్లు, రీచ్–3ని 1,700 నుంచి 2,100 మీటర్లు, రీచ్–4ను 2,100 నుంచి 2,480 మీటర్లుగా విభజించారు. డెల్టాలో రబీ పంటలకు నీరు సరఫరా చేయడానికి వీలుగా కాఫర్ డ్యామ్ రీచ్–3లో 400 మీటర్ల మేర ఖాళీ ప్రదేశాన్ని వదిలేశారు. మిగతా మూడు రీచ్‌లలోను కాఫర్ డ్యామ్ పనులను చేపట్టారు. జూన్‌లోగా కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేస్తేనే.. వరదను స్పిల్ వే మీదుగా మళ్లించడానికి సాధ్యమవుతుంది. అప్పుడే ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేయడానికి మార్గం సుగమం అవుతుంది. డెల్టాలో రబీ పంటలు నూర్పిళ్ల దశకు చేరుకోవడంతో రీచ్–3లో ఖాళీ ప్రదేశాన్ని భర్తీచేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గోదావరి సహజసిద్ధ ప్రవాహం కనిష్టస్థాయికి చేరుకుంది. సీలేరు నుంచి కూడా ప్రవాహం తగ్గగానే ఖాళీ ప్రదేశాన్ని భర్తీచేసే పనులు చేపడతారు. కార్యాచరణ ప్రణాళిక ప్రకారమే.. గోదావరికి వచ్చే వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి.. జూన్ నుంచి ఈసీఆర్ఎఫ్ పనులను ప్రారంభించి గడువులోగా పూర్తి చేయడానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారమే అధికారులు పనులు చేయిస్తున్నారు. స్పిల్ వే దాదాపుగా కొలిక్కి వచ్చింది. అప్రోచ్ చానల్, స్పిల్ చానల్ పనులు వేగంగా సాగుతున్నాయి. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. -
రబీ రాజు.. మొక్కజొన్న
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి అదిరిపోయింది. వ్యవసాయ రంగానికి లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో పంట కోత, నూర్పిడి, రవాణా, కొనుగోళ్లకు ఎటువంటి ఆటంకం లేకుండా పోయింది. రాష్ట్రంలో రబీలో సాగు చేసిన మొక్కజొన్న విస్తీర్ణంలో పంట కోతలు వివిధ జిల్లాల్లో సగటున 70 శాతం పూర్తి కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 80, 90 శాతం వరకు పూర్తి అయ్యాయి. కాగా మొక్కజొన్న దిగుబడిలో ఆంధ్రప్రదేశ్.. దేశంలో రెండో స్థానంలో, ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉంది. మూడో ముందస్తు అంచనా ప్రకారం.. 2019–20 రబీలో హెక్టార్‌కు అత్యధికంగా 7,588 కిలోల దిగుబడి సాధించింది. పొరుగునున్న తెలంగాణ కంటే ఇది 490 కిలోలు అధికం. అలాగే మన రాష్ట్రంలో ఖరీఫ్ దిగుబడి కంటే ఇది 2,873 కిలోలు ఎక్కువ కావడం గమనార్హం. రబీ మొక్కజొన్నసేకరణ ఇలా.. ► ప్రభుత్వం 348 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిలో 228 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. మిగతా చోట్ల పంట ఎప్పుడు చేతికి వస్తే అప్పుడు కొనుగోళ్లు మొదలుపెడతారు. ► బుధవారం వరకు 1,977 మంది రైతుల నుంచి 13,029 టన్నుల మొక్కజొన్నల్ని కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.22.93 కోట్లు. ప్రస్తుత సమస్యలివీ.. ► గోనె సంచులు దొరకడం లేదు. మార్క్‌ఫెడ్ ద్వారా గోనె సంచులు అందించేందుకు డీఎంసీఎస్లతో చర్చలు జరుగుతున్నాయి. ► గ్రామ వ్యవసాయ సహాయకుల్లో (వీఏఏ) కొంతమందికి పౌరసరఫరాల సంస్థ నుంచి పాస్వర్డ్ రాలేదు. ఫలితంగా కొనుగోళ్లలో జాప్యం జరుగుతుంది. ► ధాన్యం సేకరణ కేంద్రం (పీపీసీ) యాప్‌లో ఇ–కర్షక్ డేటా కనిపించట్లేదని అక్కడక్కడా వినిపిస్తోంది. రైతుల డేటా మార్క్‌ఫెడ్, పౌరసరఫరాల సంస్థ యాప్‌ల్లో కనిపించట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తున్నామని అధికారులంటున్నారు. ► కోత యంత్రాలకు ఎకరానికి రూ.2,800ను ప్రభుత్వం నిర్దేశించగా యజమానులు రూ.3,300 నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు. వ్యాపారులు మోసం చేస్తే ఉపేక్షించ వద్దు.. ► రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించినందున రైతులెవ్వరూ కంగారు పడి తక్కువ ధరకు అమ్ముకోవద్దు. ► కరోనా నేపథ్యంలో విత్తన ఉత్పత్తి, శుద్ధికి ఇబ్బంది లేకుండా సీడ్మెన్ అసోసియేషన్‌తో సమన్వయం. ► అక్కడక్కడా ఎంఎస్పీకి మొక్కజొన్నల్ని కొనడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ఏదో ఒక సాకు చూపి ఎంఎస్పీ రూ.1,760లో ఎంతో కొంత కోత వేస్తున్నట్టు, కొందరు వ్యాపారులు.. రైతులు తక్కువకు అమ్ముకునేలా చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ► పాస్ పుస్తకం ఎవరి పేరుంటే వారే కొనుగోలు కేంద్రాలకు రావాలన్న నిబంధనను మహిళల విషయంలో సడలించాలని వినతులు వస్తున్నాయి. దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటాం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి మరో వారంలోపు కోతలు పూర్తవుతాయి ► ఏదైనా గ్రామంలో 85 మెట్రిక్ టన్నులకు మించి జొన్న, మొక్కజొన్నల దిగుబడి ఉంటే అక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పాం. లేదంటే.. రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక కేంద్రాన్ని పెట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించాం. ► కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,760. దీనికన్నా ఎవరన్నా తక్కువకు అడిగితే వ్యవసాయ శాఖ అధికారులకు లేదా 1907కు ఫిర్యాదు చేయాలి. – అరుణ్ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ గిట్టుబాటు ధర ప్రకటించడం హర్షణీయం నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న వేశా. లాక్‌డౌన్‌తో రవాణా లేని సమయంలో క్వింటాల్‌ను రూ.1,450కి మించి అమ్ముకోలేకపోయా. ఈ దశలో ప్రభుత్వం రూ. 1,760 గిట్టుబాటు ధరను ప్రకటించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయం. – తోరం పోశయ్య, సీతానగరం, తూర్పుగోదావరి జిల్లా -
రబీ పంటల బీమాపై పల్లెల్లో ప్రచారం
సాక్షి, అమరావతి: రైతులపై ఆర్ధిక భారాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పంటల బీమా పథకంపై విస్తృత అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. పంటల బీమా కింద గుర్తించిన సాగు భూమినంతటినీ పథకం పరిధిలోకి తెచ్చేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను వినియోగించుకోవాలని నిర్ణయించారు. పల్లెల్లో వ్యవసాయ సంబంధిత సేవలు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ), గ్రామ ఉద్యాన సహాయకులు, గ్రామ సెరికల్చర్ సహాయకులను నియమించింది. వీరి ద్వారా పంటల బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని సంకల్పించింది. ఇందుకు సహకరించాలని కోరుతూ వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ కలెక్టర్లకు లేఖలు రాశారు. క్షేత్రస్థాయిలో ఆయా విభాగాలు పంట కోత ప్రయోగాలు నిర్వహించే పనులను వ్యవసాయ శాఖ సమన్వయం చేస్తూ అర్హులైన రైతుల క్లెయిమ్‌లను పరిష్కరిస్తుంది. శనగకు 31 వరకు గడువు.. రబీలో అత్యధికంగా పండించే పంటల్లో ప్రధానమైన శనగ (బెంగాల్ గ్రామ్)ను సాగు చేసే రైతులు ఈనెల 31వతేదీ వరకు ఇ–కర్షక్ ద్వారా బీమా చేయించుకోవచ్చు. మిగతా రబీ పంటలకు ఫిబ్రవరి 15లోగా బీమా చేయించుకోవచ్చు. వాస్తవ సాగుదారులైనా, కౌల్దారులైనా ఇ–కర్షక్ ఆధారంగానే గుర్తిస్తారు. ఆమేరకు అందులో వివరాలు కచ్చితంగా ఉండాలి. గ్రామ స్థాయిలో సేకరించిన సమాచారానికి పూర్తి బాధ్యత ఆయా గ్రామాల్లోని వీఏఏలు, వీహెచ్‌ఏలు, వీఆర్వోలదే. బ్యాంకులు మినహాయించుకుంటే తిరిగివ్వాలి... రుణం తీసుకున్నా, తీసుకోకపోయినా ఆయా రైతుల వివరాలను ఇ–కర్షక్‌లోనే నమోదు చేయాలి. రైతుల వివరాలను నమోదు చేయాల్సిన బాధ్యత బ్యాంకులకు ఉండదు. ఒకవేళ ఏదైనా బ్యాంకు గత ఏడాది అక్టోబర్ 1వతేదీ తర్వాత రుణాలు తీసుకున్న రైతుల నుంచి పంటల బీమా కోసం డబ్బులు మినహాయించుకుని ఉంటే ఆ మొత్తాన్ని తిరిగి అన్నదాతలకు చెల్లించాలి. ఇప్పటికే ఏదైనా బ్యాంకు పంటల బీమా కోసం మినహాయించుకున్న సొమ్మును ఆన్లైన్ ద్వారా బీమా సంస్థకు చెల్లించి ఉంటే ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కు పంపాలని కోరతాయి. పంట కోత ప్రయోగాలపై యాప్ పంట కోత ప్రయోగాల నిర్వహణకు ఆర్థిక, గణాంకాల డైరెక్టర్ నిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను అభివృద్ధి చేస్తారు. సీజన్ చివరిలో ఏ పంటలకు కోత అనంతరం ప్రయోగాలు నిర్వహించారు? దిగుబడి ఎంత? తదితర వివరాలను వ్యవసాయ శాఖకు పంపాలి. వీటి ఆధారంగా వ్యవసాయ శాఖ క్లెయిమ్‌లను లెక్కకడుతుంది. ఉల్లి వంటి వాటి పంట కోత ప్రయోగాలను ఉద్యాన శాఖ నిర్వహిస్తుంది. పంట నష్టం, క్లెయిమ్‌ల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న పీఎంఎఫ్‌బీవై, ఆర్‌డబ్య్లుబీసీఐఎస్ విధానాలనే కొనసాగిస్తారు. అర్హమైన క్లెయిమ్‌లను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా పరిష్కరించి ఆధార్ అనుసంధానిత లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేస్తుంది. బీమా ఇలా... - బీమా వర్తించే పంటలు, సాగుదారుల వివరాలను ఇ–కర్షక్ ద్వారా మాత్రమే సేకరిస్తారు. - బీమా చేయించుకునే ప్రతి రైతుకు ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉండాలి. - ప్రధాని పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై) ద్వారా పునర్ వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పధకం (ఆర్‌డబ్య్లుబీసీఐఎస్) కింద గుర్తించిన పంటలై ఉండాలి. -
కౌలు రైతులకూ పంటల బీమా!
సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించాలని కేంద్రం యోచిస్తోంది. రానున్న రబీ పంటల సాగుపై ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఇటీవల జాతీయ వర్క్‌షాప్ నిర్వహించింది. దీనికి తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. వ్యవసాయ భూమికి యజమాని పేరుతో పట్టా ఉండటం వల్ల కౌలు రైతులు సాగు చేసే పంటలకు బీమా సమస్యగా మారింది. వారికి ఒకప్పుడు కార్డులు ఇచ్చినా, చాలాచోట్ల భూ యజమానులు కౌలుదార్లను మార్చుతుండటంతో అవి వృథాఅవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలతో కూలంకషంగా చర్చించి కౌలు రైతులకు పంటల బీమా అందేలా చేయాలని రబీ సదస్సులో కేంద్రం తెలిపినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు కౌలు రైతులకు బీమా విషయంపై కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. వాటిని అధ్యయనం చేసి తెలంగాణలో అమలు చేసే అంశాన్ని రాష్ట్రం పరిశీలిస్తోంది. డిజిటల్ డివైజ్‌తో భూసార పరీక్ష.. వ్యవసాయ భూముల సారాన్ని తెలుసుకోవడం వ్యవసాయ శాఖకు సమస్యగా మారింది. సంబంధిత వ్యవసాయ భూమి నుంచి మట్టి నమూనాలు సేకరించి, వాటిని లేబొరేటరీకి పంపించి పరీక్షించడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. దీంతో లక్షలాది ఎకరాల భూమికి భూసార కార్డులు ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరడంలేదు. ఈ నేపథ్యంలో రబీ సదస్సులో దీనికి సంబంధించి కొత్త ప్రతిపాదనలను కేంద్రం ప్రవేశపెట్టింది. డిజిటల్ డివైజ్‌తో భూసార పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. రబీకి సిద్ధం.. అందుబాటులో విత్తనాలు.. రానున్న రబీ సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ సాగు మొదలుకానుండటంతో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచింది. ఈ విషయాన్ని కేంద్రానికి వివరించింది. రబీకి కేంద్రం 12.10 లక్షల టన్నుల ఎరువులు కేటాయించగా, ఇప్పటికే డీలర్లు, మార్క్‌ఫెడ్, కంపెనీల వద్ద 6.35 లక్షల టన్నులున్నాయి. అలాగే 5.82 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. అందులో 1.64 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 1.33 లక్షల క్వింటాళ్ల శనగ, 2.38 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను ఉంచినట్లు వ్యవసాయ వర్గాలు తెలిపాయి. -
కంకుల చుట్టూ ముళ్లు.. కావలికి చెల్లు!
కంకుల చుట్టూ ముళ్లుండే రకం జొన్న పంటను సాగు చేస్తూ గడచిన పదేళ్లుగా నిలకడగా ఆదాయం ఆర్జిస్తున్నారు నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్కటూర్ గ్రామ రైతులు. గతంలో ఆ గ్రామంలోని రైతులు రబీ పంటగా తెల్ల, ఎర్ర జొన్నలను సాగు చేసేవారు. చెట్లు, బీడు భూములు ఎక్కువగా ఉండటంతో పక్షుల తాకిడి ఎక్కువగా ఉండేది. పంట చేతికొచ్చే సమయంలో ఇవి జొన్న పంటను ఆరగించేసేవి. ఎన్ని పనులున్నా మానుకొని మరీ కుటుంబంలో ఒకరు పగలంతా కావలి కాయాల్సి వచ్చేది. దాదాపు 40 రోజులు ప్రతి రైతు కుటుంబంలోనూ ఒక మనిషి పూర్తిగా ఆ పనికే సమయం కేటాయించాల్సి రావటంతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అధిక విస్తీర్ణంలో జొన్న పంటను సాగు చేసే రైతులు పక్షులు పంటపై వాలకుండా చూడటానికి అమితంగా శ్రమించాల్సి వచ్చేది. ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో ముళ్లజొన్న సాగు ఆ గ్రామ రైతుల పాలిట ఆపద్బాంధవిగా మారింది. ముళ్లజొన్న పంట కాలం నాలుగు నెలలు. ఇది ప్రధానంగా పశుగ్రాసానికి పనికొచ్చే రకం. వెల్కటూర్ రైతులు విత్తన పంటగా సాగు చేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలు ముళ్లజొన్న విత్తనాలను రైతులకు ఇవ్వటంతో పాటు, సాగు చేసిన పంటను తిరిగి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అప్పటి నుంచి ఈ గ్రామంలో ముళ్లజొన్న సాగు క్రమంగా పెరిగి ప్రస్తుతం 600 ఎకరాలకు చేరింది. ముందుగా పొలాన్ని దుక్కి చేసుకొని అక్టోబర్ ఆఖరివారంలో ప్రతి 18 సాళ్లకు ఒక సాలు చొప్పున మగ విత్తనాన్ని విత్తుకున్నారు. వారం విరామం తర్వాత మధ్య సాళ్లలో ఆడ విత్తనాన్ని విత్తుకున్నారు. కూలీలతో ఒకసారి కలుపు తీయించారు. నాలుగు తడులు ఇచ్చారు. వరికోత మిషన్‌తో పంట నూర్పిడి చేశారు. ముళ్ల జొన్నల తొడిమె నలుపు రంగులోను, గింజ లేత ఎరుపు రంగులోను ఉంటాయి. జొన్న కంకి చుట్టూ ముళ్లు ఉండటం వల్ల పిట్టలు పంటను పాడుచేసేందుకు సాహసిం^è డం లేదు. ముళ్ల జొన్నలో ఎకరాకు 22 –25 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. క్వింటాల్‌కు రూ. 1,800 కనీస ధరగా ఒప్పందం చేసుకొని విత్తన కంపెనీ కొనుగోలు చేస్తున్నది. పచ్చ, తెల్ల జొన్నలు మార్కెట్లో క్వింటాలుకు రూ. 2,100 పలుకుతుంటే విత్తన ముళ్ల జొన్నలకు రూ. 100 – 150లు ఎక్కువ ధర రైతులకు అందుతోంది. దుక్కి, ఎరువులు, కూలీలు వంటి ఖర్చులు రూ. 6 వేలు పోను ఎకరాకు రూ. 30 వేల నికరాదాయం రైతులకు లభిస్తోంది. కావలి కాయాల్సిన అవసరం లేకపోవటంతో రైతులు ఇతర పొలం పనులకు సమయాన్ని సర్దుబాటు చేసుకుంటున్నారు. పక్షుల నుంచి పంటను కాపాడుకునేందుకు చీరలు కట్టటం, దిష్టి బొమ్మలు ఏర్పాటు చేయటం, టపాసులు కాల్చటం వంటి పద్ధతులను గతంలో అనుసరించేవారు. ముళ్లజొన్న సాగు వల్ల రైతులకు ఆ శ్రమ తప్పి, నికరాదాయం పెరిగింది. – బొమ్మెన భూమేష్, సాక్షి, బాల్కొండ, నిజామాబాద్ జిల్లా చీడపీడలు రావు,చాకిరీ తక్కువ! ముళ్లజొన్నలో మంచి దిగుబడి వస్తున్నది. చీడపీడలు రావు. పక్షుల కోసం కావలి కాయాల్సిన అవసరం లేదు. చాకిరీ తక్కువ. అందుకే 10 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నా. – గుండేటి సాయిరెడ్డి (99124 75349), ముళ్లజొన్న రైతు, వెల్కటూర్, మెండోరా మండలం, నిజామాబాద్ జిల్లా కంకుల చుట్టూ ముళ్లుంటాయి! ముళ్ల జొన్న కంకులకు చుట్టూతా ముళ్లు ఉంటాయి. దీంతో పక్షులు కంకులపై వాలాలంటేSభయ పడుతున్నాయి. ముళ్ల జొన్నను పిట్టల నుంచి కాపాడుకోవడానికి కాపలా ఉండాల్సిన అవసరం లేకపోవడంతో నిశ్చింతగా సాగు చేస్తున్నా. – రాజేశ్వర్ (99124 16865) ముళ్లజొన్న రైతు, వెల్కటూర్, మెండోరా మండలం, నిజామాబాద్ జిల్లా పిట్టలతో ఎలాంటి బాధ లేదు నిరుడు వరకు ఎర్ర జొన్న పంటను సాగు చేశాను. కాపలా కాయడం ఇబ్బందిగా మారింది. దీంతో ఈ ఏడాది ముళ్ల జొన్న పంటను సాగు చేశాను. ఇప్పుడు పిట్టలతో ఎలాంటి బాధ లేదు. – రాజన్న, ముళ్లజొన్న రైతు, వెల్కటూర్, మెండోరా మం., నిజామాబాద్ జిల్లా -
యాసంగి యాతన
- పెట్టుబడికి పైసల్లేక రైతులు విలవిల - రుణాలకు మొహం చాటేస్తున్న బ్యాంకులు - ఇప్పటికిప్పుడు ఇవ్వలేమని స్పష్టీకరణ - ప్రైవేటు వ్యాపారుల వద్దా పుట్టని అప్పు - రుణ లక్ష్యం రూ.11,640 కోట్లు.. ఇచ్చింది 4 వేల కోట్లే - రబీ పంటలకు ముగుస్తున్న బీమా గడువు - బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ప్రీమియం చెల్లించలేని పరిస్థితి సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సెప్టెంబర్‌లో కురిసిన కుండపోత వర్షాలకు చెరువులు, జలాశయాలు నిండి భూగర్భ జలాలు పెరిగినా.. బ్యాంకుల నుంచి సహకారం లేకపోవడంతో అన్నదాతలు కుదేలైపోతున్నారు. రైతులకు పంట రుణాలివ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీ సమస్య ఉన్నందున రుణాలివ్వబోమని తేల్చి చెబుతున్నాయి. రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోతోంది. రూ.500, వెయ్యి నోట్ల రద్దుతో అప్పులోళ్ల వద్దా నగదు లేకుండా పోయింది. అటు బ్యాంకుల వద్ద రుణాలు అందక.. ప్రైవేటు వడ్డీ అప్పులు పుట్టక రైతులు అల్లాడుతున్నారు. ఎరువులు కొనేందుకు కూడా డబ్బుల్లేక దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పంటల సాగు జరిగినా.. ఎరువులకు డిమాండ్ పెరగలేదని వ్యవసాయ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సమావేశాలతో సరి..! రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇప్పించడంలో వ్యవసాయ శాఖ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారే కానీ కీలకమైన సమయంలో రైతులకు పంట రుణాలు ఇప్పించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ రబీ(యాసంగి)లో రూ.11,640 కోట్ల పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. బ్యాంకులు కేవలం రూ.4 వేల కోట్లకు మించి ఇవ్వలేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అందులో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) ద్వారా రైతులకు ఇవ్వాల్సిన రబీ రుణ లక్ష్యం రూ.2,200 కోట్లు కాగా.. కేవలం రూ.100 కోట్లే ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పాత నోట్ల డిపాజిట్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని టెస్కాబ్ ఎండీ మురళీధర్‌రావు ‘సాక్షి’కి చెప్పారు. ఆర్బీఐ నుంచి తమకు ఇప్పటివరకు తమకు రూ.240 కోట్లు మాత్రమే కొత్త కరెన్సీ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అందువల్లే రైతులకు రుణాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. రబీలో మొత్తంగా 15 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారని అంచనా వేయగా... ఇప్పటివరకు కేవలం 6 లక్షల మంది రైతులకే బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. బీమా గోవిందా... ఈ నెల 15వ తేదీదో రబీలో మొక్కజొన్న, శనగ పంటలకు బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగియనుంది. వరి, మిరప వంటి ఇతర పంటలకు ఈ నెలాఖరకల్లా గడువు ముగియనుంది. పంట రుణాలు తీసుకునే రైతులందరి నుంచి బీమా ప్రీమియం సొమ్మును బ్యాంకులు మినహాయించుకుంటాయి. ఆ సొమ్మును బీమా కంపెనీలకు చెల్లిస్తాయి. కానీ తాజా పరిస్థితులు రైతులను పంటల బీమాకు దూరం చేసేలా కనిపిస్తున్నాయి. పంట రుణాలు ఇవ్వకపోవడంతో లక్షలాది మంది రైతులు నష్టపోనున్నారు. పంట రుణం ఇవ్వకుంటే ప్రీమియం చెల్లించడమూ కష్టమేనని టెస్కాబ్ ఎండీ అంటున్నారు. రబీ సాగు లక్ష్యం 30.45 లక్షల ఎకరాలు కాగా.. అందులో ఆహారధాన్యాల సాగు లక్ష్యం 27.07 లక్షల ఎకరాలు. అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.33 లక్షల ఎకరాలు. 3.70 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాల పంటలు వేయాలని నిర్ణయించారు. రుణాలందకుంటే ఆ పంటలు సాగు చేసే అనేక మంది రైతులు ప్రీమియం చెల్లించక పరిహారం నష్టపోయే ప్రమాదముంది. వాతావరణం అనుకూలించక, ఇతరత్రా కారణాలతో పంటకు నష్టం జరిగితే బీమా అందుకునే అవకాశం ఉండదు. గడువు ముగిశాక రుణం ఇచ్చినా ప్రీమియం చెల్లించడానికి అవకాశం ఉండదు. రుణాలివ్వడంలేదు: రాజు కారుకొండ, నవాబుపేట మండలం, మహబూబ్‌నగర్ జిల్లా పోయిన ఏడాది మొక్కజొన్న, వరికి బీమా చేయించాను. అకాల వర్షాలు, వడగళ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నా నేటి వరకు బీమా డబ్బులు రాలేదు. మళ్లీ ఇన్సురెన్స్ ఎలా చేయించాలి? రబీకి బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. పెట్టుబడులకు చేతిలో పైసల్లేవు. ఈయన పేరు ఇందుర్తి రంగారెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామం. ఈ రబీ(యాసంగి)లో నాలుగున్నర ఎకరాల్లో మిరప సాగు చేశాడు. రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టాడు. కానీ బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికిప్పుడు రుణాలు ఇవ్వని బ్యాంకర్లు చెబుతుండటంతో బయట అప్పులు చేయాల్సి వస్తుందని ఆయన ఆవేదన చెందుతున్నాడు. బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో మిరప పంటకు ప్రీమియం చెల్లించే పరిస్థితి కూడా లేదని వాపోతున్నాడు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినా బ్యాంకులు తమ వద్ద నుంచి వడ్డీ సొమ్ము వసూలు చేస్తున్నారని చెబుతున్నాడు. -
సస్యరక్షణకు సమయమిదే!
అనంతపురం అగ్రికల్చర్ : రబీలో వేసిన వేరుశనగకు అక్కడక్కడా ఆకుముడుత పురుగు ఆశించినందున సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సహదేవరెడ్డి తెలిపారు. అలాగే వాతావరణానికి అనుగుణంగా కంది, పత్తి, వరి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడంతోపాటు కోళ్లు, గొర్రెల పెంపకందారులకూ కొన్ని సూచనలు చేశారు. - రబీ పంటగా నీటి వసతి కింద సాగు చేసిన వేరుశనగకు అక్కడక్కడా ఆకుముడుత తెగులు కనిపిస్తోంది. దీని నివారణకు ఎకరాకు 400 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ లేదా 320 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 500 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. - ఈ నెల 20వ తేదీలోగా రబీ వేరుశనగ సాగు చేసుకోవాలి. 3 గ్రాముల మాంకోజెబ్ + 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. దీనివల్ల విత్తనం, భూమి ద్వారా వచ్చే చీడపీడలు, తెగుళ్లను అరికట్టవచ్చు. ఎకరాకు 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్‌ఫాస్పేట్ ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. - కందిలో శనగపచ్చ పురుగు ఆశించినందున పూత, కాయ దశల్లో ఉన్న పంటకు 2 మి.లీ. క్వినాల్ఫాస్ లేదా 1.5 మి.లీ. అసిఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే మారుకామచ్చల పురుగు నివారణకు 2.5 మి.లీ. క్లోరోఫైరిపాస్ లేదా 1 గ్రాము అసిఫేట్ లేదా 1 గ్రాము థయోడికార్బ్ లేదా 0.75 మి.లీ. నొవాల్యురాన్ లేదా 0.2 మి.లీ. స్పైనోసాడ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అవకాశం ఉంటే నీటి తడులు ఇచ్చుకోవాలి. - పత్తిలో గులాబీరంగు కాయతొలచు పురుగు ఆశించిన ప్రాంతాల్లో ఎకరాకు నాలుగు నుంచి 6 ఫిరమోన్ ఎరలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉనికి, ఉధృతిని గమనించాలి. నివారణకు 2 మి.లీ. ప్రొపికొనజోల్ కానీ, 1.5 గ్రాముల లార్విన్ కానీ 2 మి.లీ. క్లోరోఫైరిపాస్ కానీ ఏదో ఒకటి తీసుకుని దానికి 1 మి.లీ.నువాన్ను జత చేసి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. - వరిలో సుడిదోమ నివారణకు 1.6 మి.లీ. బుప్రోపెజిన్ లేదా 2 మి.లీ. ఇథోఫెన్ఫ్రోక్స్ లేదా 1.5 గ్రాముల అసిఫేట్ లేదా ఇమిడాక్లోప్రిడ్కు 0.25 గ్రాములు ఎథిప్రోల్ను జత చేసి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. - ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గినందున కోళ్ల ఫారాలలో ఇన్ఫ్రారెడ్ బల్బులు లేదా కృత్రిమ ఇంక్యుబేటర్ల ద్వారా ఉష్ణోగ్రతలను నియంత్రించుకోవాలి. కోళ్ల పెంటను అమ్మోనియా వాసన లేకుండా ఎప్పటికప్పుడు తీసివేస్తుండాలి. - ప్రస్తుత వాతావరణంలో గొర్రెల్లో నీలినాలుక (బ్లూటంగ్) వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నందున ముందస్తుగా టీకాలు వేయించుకోవాలి. వాతావరణం పొడిగా ఉంటుంది వచ్చే మూడు రోజులు జిల్లాలో వాతావరణం పొడిగా ఉంటుంది. హైదరాబాద్ వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు ఈ నెల 11వ తేదీ వరకు ఎలాంటి వర్షసూచనా లేదు. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల వరకు, రాత్రిళ్లు 19 నుంచి 21 డిగ్రీల వరకు నమోదు కావచ్చు. గాలిలో తేమ ఉదయం 55 నుంచి 80 శాతం, మధ్యాహ్నం 32 నుంచి 44 శాతం మధ్య ఉండవచ్చు. గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. -
ఒకటి నుంచే రబీ సాగు
గడువు తేదీలతో వ్యవసాయ కేలండర్ సాక్షి, హైదరాబాద్ : రబీ పంటలసాగుపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల మేరకు చర్యలు తీసుకునేందుకు సమామత్తమైంది. నేలలను బట్టి సాగు చేయాల్సిన పంటల వివరాలను వెల్లడించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే వివిధ రకాల పంటల సాగు మొదలుపెట్టాలని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. 2016-17 రబీ కేలండర్‌ను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించారు. దీన్ని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి బుధవారం అందజేశారు. రబీ సీజన్ లో పంటలు వేయాల్సిన గడవు తేదీలను వారు ప్రకటించారు. దాని ప్రకారం వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పెసర పంటలను వచ్చేనెల ఒకటోతేదీ నుంచే వేయడం ప్రారం భించాలని సూచించారు. ఉత్తర తెలంగాణలో వేరుశనగ, పెసర పంటలను వచ్చే నెల 20వ తేదీ వరకు వేసుకోవచ్చని, దక్షిణ తెలంగాణలో వేరుశనగను మాత్రం నవంబర్ 15 వరకు వేసుకోవచ్చని వెల్లడించారు. శనగ, మొక్కజొన్న పంటలను అన్ని జిల్లాల్లోనూ నవంబర్ 15 వరకు వేసుకోవడానికి అనుకూలమని శాస్త్రవేత్తలు ప్రకటించారు. నవంబర్ 15 తేదీ తర్వాతే స్వల్పకాల వ్యవధి గల వెరైటీ వరి నారు మాత్రమే పోయాలని స్పష్టం చేశారు. ఇలా చేస్తే ఆశించినంత దిగుబడి వస్తుందని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ రాజిరెడ్డి తన నివేదికలో వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో తేలికపాటి భూముల్లో వేరుశనగ, కుసుమ పంటలు, నల్లరేగడి, ఎర్రనేలల్లో పొద్దు తిరుగుడు, కుసుమ, శనగ, కంది పంటలు వేయాలన్నారు. అదనంగా 10 లక్షల ఎకరాల్లో రబీ సాగు వర్షాల నేపథ్యంలో రబీ సీజన్లో పెద్దఎత్తున పంటలను సాగు చేసేలా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వాస్తవంగా రబీలో 33.64 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. కానీ ఈసారి అదనంగా మరో 10 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని, బోర్లు, బావుల కింద కూడా సాగు చేయాలని ఆదేశించారు. మూడో వంతు సబ్సిడీపై శనగ, వేరుశనగ విత్తనాలు వచ్చే రబీకి శనగ, వేరుశనగ విత్తనాలను మూడో వంతు సబ్సిడీకి ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఎప్పటికో ఆధునికీకరణ?’
• కృష్ణాడెల్టా పనుల్లో తీవ్ర జాప్యం ఏడేళ్లలో చేసింది సగం పనులేతాగునీరు విడుదల చేశాకే పనులు ప్రారంభం అరకొరగానే నీటి విడుదల రెండు నెలల్లోనే మళ్లీ తాగునీటి సమస్య సాక్షి, విజయవాడ: కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వాస్తవంగా ఈ ఏడాది రబీ పంట లేదు. ఆధునికీకరణ పనులకు తగినంత సమయం ఉంది. ఇప్పటివరకు పనులు చేయించేందుకు అధికారులు సమాయత్తం కాలేదు. జిల్లాలోని అనేక చెరువుల్లో నీరు లేదు. వాటిని నింపిన తరువాతనే ఆధునికీకరణ పనులు చేపట్టే అవకాశాలు కనపడుతున్నాయి. నాలుగు టీఎంసీల నీరు విడుదల... కృష్ణా డెల్టా పరిధిలో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య ఉధృతమవుతోంది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కృష్ణా యాజమాన్య బోర్డు నాలుగు టీఎంసీల నీరు విడుదల చేసింది. నీరు పులిచింతలకు వచ్చిన తరువాత అక్కడ కొంత నిల్వ చేస్తారు. మిగిలిన నీటిని ప్రకాశం బ్యారేజ్‌కి వదులుతారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 8.6 అడుగుల నీరు ఉంది. కనీసం 11 అడుగుల వచ్చే వరకు నీటిని నిల్వ చేస్తారు. ఆ తరువాతనే కాల్వలకు వదిలే అవకాశం ఉంది. ఇదంతా జరిగే సరికి మరో పక్షం రోజులు పడుతుంది. ఆ తరువాత జిల్లాలో 370 చెరువులు నింపాల్సి ఉంటుంది. మచిలీపట్నం, పెడన, బంటుమల్లి, కృత్తివెన్ను, పెడన, గుడివాడ తదితర ప్రాంతాల్లోని కొన్ని చెరువులు ఇప్పటికే అడుగంటాయి. మిగిలిన చెరువుల్లో పది నుంచి 30 శాతం మాత్రమే నీరు ఉంది. ప్రస్తుతం వచ్చే నీటిలో కొంత కాల్వల్లోనే ఇంకిపోతుంది. ఈ లెక్కన సాగర్, శ్రీశైలం నుంచి వచ్చే నీరు చెరువులు వద్దకు చేరేసరికి సుమారుగా 20 నుంచి 30 రోజులు పడుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. చెరువులను పూర్తిగా నింపితే మూడు నాలుగు నెలల వరకు నీటి ఎద్దడి ఉండదు. ఇప్పుడు వచ్చే నీటితో 50 శాతం చెరువులు నిండే అవకాశాలు ఉన్నాయి. అంటే రెండు నెలలకే గ్రామాల్లో నీటి సమ స్య వచ్చే అవకాశంఉంది. మే నాటికి మరళా కృష్ణా యాజ మాన్య బోర్డును అడిగి మరికొంత నీటితో చెరువులు నిం పాల్సి ఉంటుంది. ఈ విధంగా పైనుంచి వచ్చే నీటిని కాల్వ ల ద్వారా కిందకు వదులుతూ పోతే కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులు వేగంగా చేయడం ఏమాత్రం సాధ్యపడదు. అనుమతించినా.. చేరుకోని లక్ష్యం కృష్ణా డెల్టా ఆధునికీకరణకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయంలో 2007 నవంబర్‌లో రూ.4,573 కోట్లతో 84 ప్యాకేజీలకు ప్రభుత్వం అనుమతించింది. రూ.3003.862 కోట్లకు ఒప్పందంతో పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో కృష్ణా జిల్లా 46 ప్యాకేజ్‌లకు రూ.1486.954 కోట్లు, గుంటూరు జిల్లాలో 38 ప్యాకేజ్‌లకు రూ. 1516. 91 కోట్లు కేటాయించారు. గతేడాది మార్చి వరకు మొత్తం రూ.1387.16 కోట్ల పనులు జరిగాయి. గతేడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు రూ.300 కోట్ల పనులు చేయాలని లక్ష్యం గా నిర్ణయించుకున్నారు. అయితే కేవలం రూ.116కోట్ల పనులు మాత్రమే జరిగాయి. మొత్తంగా రూ.1503. 16 కోట్ల పనులు జరిగాయి. ఆ తరువాత వర్షాలు పడడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఈ లెక్కన ఎనిమిది ఏళ్లల్లో సగం పనులు మాత్రమే జరిగాయని ఇరిగేషన్ లెక్కలు చెబుతున్నాయి. రబీ లేకపోయినా.... ఈ ఏడాది రబీ లేదు. మార్చి నుంచి జూలై వరకు కృష్ణా డెల్టా పనులు జరుగుతాయని రైతులు భావించారు. అరకొరగానే పనులు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. చెరువులకు నీరు నింపిన తరువాత కాల్వలు ఎండి పనులు ప్రారంభించే సరికి రెండు నెలల కన్నా ఎక్కువ సమయం ఉండడం లేదు. ఫలితంగా రైతులకు కడగండ్లు తప్పడం లేదు. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
మెదక్ టౌన్ : అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని రాజిపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన రైతు సాయిలు (55) తనకున్న మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. సాగు భూమిలో నీటి వసతి కోసం ఇటీవల రెండు బోర్లు వేయించాడు. ఇందు కోసం రూ. 1.50 లక్షలు అప్పు చేశాడు. అయినప్పటికీ చుక్కనీరు పడలేదు. రబీ పంట పూర్తిగా ఎండిపోతుండడంతో దాన్ని చూసి తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక శుక్రవారం పొలం వద్ద వెళ్లి పురుగుల మందు తాగాడు. విషయం గమనించిన ఇరుగుపొరుగు పొలాల రైతులు సాయిలును వెంటనే మెదక్ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతునికి భార్య నర్సమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు మెదక్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. -
భయమొద్దు.. రబీని గట్టెక్కిస్తాం
ఏలూరు : రబీ పంటను గట్టెక్కించేందుకు కచ్చితమైన చర్యలు చేపడుతున్నామని.. ఈ విషయంలో రైతులెవరూ భయపడాల్సిన పనిలేదని కలెక్టర్ కె.భాస్కర్ హామీ ఇచ్చారు. పంటల్ని కాపాడేందుకు రెండు రోజుల్లో సీలేరు నుంచి అదనపు నీటిని తీసుకువస్తున్నట్టు చెప్పారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని 48 మండలాల తహసిల్దార్లు, వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. జిల్లాలో 4.60 లక్షల ఎకరాల్లో వరి వేసేందుకు అనుతించామని ఆయన పేర్కొన్నారు. వంతులవారీ విధానంలో చేలకు నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. మెరక ప్రాంతంలోని 30 వేల ఎకరాల్లో పంటకు నీరు పూర్తి స్థాయిలో అందటం లేదని, సీలేరు నుంచి అదనపు జలాలను తీసుకువచ్చి రబీ పంటను కాపాడతామని అన్నారు. ఈ విషయంలో రైతులకు భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు. గత ఖరీఫ్ సీజన్లో 34 శాతం వర్షపాతం తగ్గినా, గోదావరిలో నీటి లభ్యత తగ్గుముఖం పట్టినా పంటలకు నీటిని సక్రమంగా అందించామని గుర్తు చేశారు. రైతులు కూడా కష్టపడి అధిక దిగుబడులు సాధించారన్నారు. రానున్న 15రోజులపాటు మరింత కష్టపడి వంతులవారీ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయగలిగితే రబీలో పంట దిగుబడి పెరుగుతుందన్నారు. ఇందుకోసం అధికారులు కంకణబద్ధులై పనిచేయాలని కోరారు. డ్రెయిన్లలో ఎక్కడికక్కడ మోటార్లను ఏర్పాటు చేసి నీటిని పంట కాలువల్లోకి మళ్లించాలని, అక్కడి నుంచి చేలకు అందించాలని ఆదేశించారు. తహసిల్దార్లు, వ్యవసాయ, నీటిపారుదల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మోటార్లకు అయ్యే డీజిల్ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. చేపల చెరువులకు నీటిని మళ్లించకుండా చూడాలన్నారు. శివారు భూములకు సమృద్ధిగా నీరు అందేలా కాలువలలో నీటి మట్టాలు ఉండేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ బి.శ్రీనివాసయాదవ్, ఈఈ కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి రానివ్వం
ఏలూరు :జిల్లాలో రబీ పంటను సాగునీటి ఎద్దడి నుంచి గట్టెక్కించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఇరిగేషన్ ఏలూరు సర్కిల్ ఎస్ఈ బి.శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సాగునీటి ఎద్దడి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయమై మంగళవారం ఆయనను ప్రశ్నించగా, కార్యాచరణ ప్రణాళికను వెల్లడిం చారు. కాలువలు, డ్రెయిన్లలో అడ్డుకట్టలు వేయడంతోపాటు పెద్దఎత్తున ఆయిల్ ఇంజిన్లు వినియోగించి నీటిని ఎత్తిపోస్తామని ఆయన పేర్కొన్నారు. వంతులవారీ విధానాన్ని పర్యవేక్షించేందుకు 45 మంది రిటైర్డ్ లస్కర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో వినియోగిస్తున్నామన్నారు. డ్రెయినేజీ డివి జన్ పరిధిలోని 25 మంది రెగ్యులర్ లస్కర్ల సేవలను అవసరమైన ప్రాం తాల్లో ఉపయోగిస్తున్నామని తెలిపారు. డెల్టాలో నీటిఎద్దడి గల శివారు ఆయకట్టుకు ఎత్తిపోతల ద్వారా నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో కాలువలు, డ్రెయిన్లపై 127 చోట్ల అడ్డుకట్టలు వేసి నీటిని మళ్లించాలని నిర్ణయించామని గుర్తు చేశారు. అయితే, అంతమేరకు అవసరం లేకుండానే 30 చోట్ల అడ్డుకట్టలు వేసి 65 ఆయిల్ ఇంజిన్లు ఏర్పాట్లు చేసి శివారు ప్రాంతాలకు నీరిస్తున్నామన్నారు. కొన్నిచోట్ల తూములను ఎత్తివేసి నీటిని అనధికారికంగా మళ్లిస్తున్నారనే సమాచారం నేపథ్యంలో అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పెట్రోలింగ్ జరిపించేందుకు నిర్ణయించామని ఎస్ఈ వివరించారు. మూడు వారాల పాటు వంతులవారీ విధానంలో నీళ్లిస్తే పంటలను రక్షించుకోవచ్చన్నారు. ఇప్పటివరకు వచ్చిన సమస్యలు పెద్దవి కానప్పటికీ, వాటిని అధిగమించి పంటలను పూర్తిస్థాయిలో రక్షించాలన్న కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. సాగు చేపట్టిన 4.60 లక్షల ఎకరాల్లో 40 శాతం విస్తీర్ణంలో ముందుగానే నాట్లు పడ్డాయన్నారు. అక్కడ కోతలు పూర్తయితే శివారు ప్రాంతాలపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. సీలేరు నుంచి అదనపు జలాలు గోదావరి నుంచి 3,800 క్యూసెక్కుల ప్రవాహ జలాలు, సీలేరు నుంచి 4,900 క్యూసెక్కులతో కలిపి మొత్తం 7,277 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఎస్ఈ చెప్పారు. ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీలేరు నుంచి అదనంగా మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని తీసుకుంటున్నామన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఈ నెలాఖరు నాటికి కాలువలను కట్టివేస్తామని చెప్పారు. తాగునీటి అవసరాలకు మంచినీటి చెరువుల్లో పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఎత్తిపోతలతో సాగునీరు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ)కి చెందిన ఎత్తిపోతల పథకం ద్వారా యలమంచిలి మండలంలోని శివారు ఆయకట్టులో 3వేల ఎకరాలకు సాగునీటిని మళ్లించే పనులను ప్రారంభించామని ఎస్ఈ తెలిపారు. నక్కల డ్రెయిన్ వద్ద 150 హెచ్‌పీ మోటార్లతో డ్రెయిన్ నీటిని మళ్లిస్తామన్నారు. మొగల్తూరు మండలంలోని ఎత్తిపోతల పథకానికి రెండు, మూడు రోజుల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి శేరేపాలెం, కొప్పర్రు ప్రాంతాలకు ఆయిల్ ఇంజిన్లు ద్వారా పంపింగ్ చేస్తామని చెప్పారు. నేడు కలెక్టర్ సమీక్ష రబీ పంటకు నీటి సరఫరా విషయమై కలెక్టర్ కె భాస్కర్ బుధవారం సమీక్షించనున్నారు. ఇందులో మండల, డివిజన్ స్థాయిలో నీటిని సరఫరాపై గస్తీ బృందాల ఏర్పాటు, ఎత్తిపోతల నుంచి నీటి మళ్లింపుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కృష్ణా నుంచి 300 క్యూసెక్కుల మళ్లింపు గోదావరి కాలువ కింద శివారు ప్రాంతాలకు తూర్పులాకుల నుంచి 300 క్యూసెక్కుల కృష్ణా నీటిని ప్రజాప్రతినిధుల చొరవతో వెనక్కి మళ్లిస్తున్నామని చెప్పారు. దెందులూరు, కొవ్వలి, పొతునూరు చానల్, భీమడోలు, పూళ్ల ప్రాంతాలకు కూడా ఈ నీటిని రెండు రోజుల్లో మళ్లించే అవకాశం ఉందన్నారు. నీటిని క్రమశిక్షణతో వాడుకోవాలి రానున్న కాలంలో పంటను కాపాడుకునేందుకు రైతులు క్రమశిక్షణ పాటించి నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ఎస్ఈ శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఇష్టారాజ్యంగా నీటిని వాడుకుని దుర్వినియోగం చేయకుండా, అవసరాల మేరకు ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. మార్చి నెలాఖరు నాటి వరకు రైతులు నీటి వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
నీటి యుద్ధాలు ప్రారంభం
మర్లగుమ్మి నీటికోసం రైతుల మధ్య వాదన ఇదే విషయమై గతేడాదీ కొట్లాట కోనాం నీటి విడుదలకు అధికారుల హామీ చోడవరం: రబీ పంటలను కాపాడుకునేందుకు సాగునీటి కోసం యుద్ధాలు ప్రారంభమయ్యాయి. వరహాపురం మీదుగా కొండ గెడ్డలోవచ్చే కోనాం జలాశయం నీటి కోసం చీడికాడ మండలం వరహాపురం, చోడవరం మండలం దామునాపల్లి, మైచర్లపాలెం గ్రామాల రైతుల మధ్య మంగళవారం వివాదం నెలకొంది. దామునాపల్లి, మైచర్లపాలెం పరిధిలోని భూములకు నీరందించేందుకు మర్లగుమ్మి చానల్ ప్రత్యేక కాలువ ఉంది. దీనిద్వారా చివ రి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందకపోవడంతో దామునాపల్లి, మైచర్లపాలెం ప్రాంతాల్లో చెరకు, రబీవరి దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో వరహాపురం పొలాల మీదుగా మర్లగుమ్మి ఛానల్ స్లూయీస్ నుంచి ప్రవహించే కొండగెడ్డ తమ పొలాల మీదుగా ప్రవహిస్తున్నందున, ఆ నీటిని తమకు కూడా ఇవ్వాలని రెండు గ్రామా ల రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాము వినియోగించుకోగా మిగిలిన కొండగెడ్డ నీరు దిగువప్రాంతానికి వెళ్తుందని వరహాపురం రైతులు వాది స్తున్నారు. ఈ వివాదం ఇరు ప్రాంతాల రైతుల మధ్య మూడేళ్లుగా సాగుతోంది. గతేడాది కొట్లాటకు దారితీసింది. సాగునీటి కొరత ఏర్పడటం వల్ల వారిమధ్య మళ్లీ వివాదం చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా కొండగెడ్డకు నిర్మించిన చెక్‌డ్యాం స్లూయీస్‌లను కాంక్రీట్‌తో మూసి, దిగువకు నీరు రా కుండా చేశారని దామునాపల్లి, మైచర్లపాలెం ప్రాంతాల రైతులు పోలీసు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కోనాం జలాశయం డిప్యూటీ ఇంజనీర్ కె.మాధవి, చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు కనిశెట్టి మచ్చిరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిబంధనలకు వ్యతిరేకంగా వేసిన కాంక్రీట్‌ను తొలగించాలని డీఈ ఆదేశించారు. నీరు దిగువప్రాంతానికి వెళ్లేలా వెంటనే మైచర్లపాలెం, దామునపల్లి రైతులు కాంక్రీట్ దిమ్మలను కొద్దిగా తొలగించారు. ఇది అన్యాయమంటూ వరహాపురం రైతులు అధికారులను అడ్డగించారు. తాము ఎంతో ఖర్చుపెట్టి, కాలువల్లో పూడిక తీసి నీరు తెచ్చుకున్నామని, అలాంటిది ఇప్పుడు దిగువ ప్రాంతానికి ఎలా నీరు ఇస్తారని ధ్వజమెత్తారు. వెంటనే కోనాం నీరును మర్లగుమ్మి ఛానల్ ద్వారా కొండగెడ్డలోకి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, రైతుల ఎవరి వాదన వారు అధికారులకు వినిపించారు. జలాశయం నీరు విడుదల చేస్తామని డీఈ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు
షోలాపూర్ న్యూస్‌లైన్: అకాల వర్షాలు రబీ పంటకు చేటు చేశాయి. దీంతో రైతాంగానికి ఏమీపాలుపోని పరిస్థితి తలెత్తింది. మరోవైపు మరోవారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంటుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పట్టణంతోపాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు మధ్యమధ్యలో కొంత విశ్రాంతి ఇచ్చినప్పటికీ రోజంతా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పట్టణంతోపాటు కారుమాల, సాంగోలా, మాళశిరస్, అకులుజ్, మాఢా, పండరీపూర్, మోహల్, బార్షీ, అక్కల్కోట్, దక్షిణ, ఉత్తర షోలాపూర్ తదితర తాలూకాలపై అకాల వర్షం తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు ఈ కారణంగా జనజీవనం కూడా అస్తవ్యస్తమైంది. మొక్కజొన్న, ద్రాక్ష, దానిమ్మ, బొప్పాయి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే అక్కల్కోట్, తుల్జాపూర్ తాలూకాలలోని నీటి ఎద్దడి ప్రాంతాల్లోని పంటలకు ఈ వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. అయితే ఈసారి జిల్లాల్లో దిగుబడి మాత్రం తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ముంబైలో భారీవర్షం: ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి మబ్బులు కనిపించకపోయినప్పటికీ తెల్లవారుజామున రెండుగంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురి సింది. ముంబైతోపాటు నవీ ముంబై, ఠాణేలలో దీని ప్రభావం కనిపించింది. -
కలవరిమాయె
అప్పులెలా తీరుతాయి సాగర్ కాలువ ఆయకట్టు భూములు మావి. రబీ వరికి సాగర్ నీరు విడుదల చేయమంటున్నారు. ఆరుతడి పంటలే వేసుకోవాలంటున్నారు. ఆరుతడి పంటలు వేస్తే మా అప్పులు తీరవు. ఖరీఫ్‌లో సాగుచేసిన మిర్చి, పత్తి పంటలు ఎండిపోయాయి. ఈ ఏడాది తీవ్ర నష్టాలు వస్తున్నాయి. అంతోఇంతో నష్టాలు పూడాలంటే వరి వేసుకోక తప్పదు. సాగర్ నిండా నీళ్లున్నా ఇవ్వకపోతే మేము ఏమి చేయాలి? - జింకల ఆంజనేయులు, నాగవరప్పాడు సాక్షి, ఖమ్మం: జిల్లాలోని నాగార్జుసాగర్ ఆయకట్టుతో పాటు ఆయకట్టేతర ప్రాంతాల్లో రైతులకు రబీ రంది పట్టుకుంది. సాగర్ ఆయకట్టు పరిధిలోనూ రబీలో ఆరుతడి పంటలే వేసుకోవాలని ఇప్పటికే ఎన్నెస్పీ అధికారులు ప్రకటించడంతో వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. రబీలో మరింతగా విద్యుత్ కోతలు పెరగనుండడంతో బోరుబావులు కింద కూడా వరి సాగు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నెస్పీ ఆయకట్టేతర ప్రాంతాల్లోని రైతుల్లోనూ ఆందోళన నెలకొంది. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతలతో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చితో పాటు పలు పంటలను సాగు చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటల దిగుబడి బాగా తగ్గింది. సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరందక పంటలు ఎండిపోయాయి. రబీలో అన్ని పంటల సాగు చేసుకోవచ్చని రైతులు భావించారు. కానీ ఈ సీజన్లో వర్షాభావం, విద్యుత్ కోతల నేపథ్యంలో నీరు ఎక్కువగా అసరమయ్యే వరి సాగు చేయవద్దని, ఆరుతడి పంటలనే వేసుకోవాలని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అయినా జిల్లాలో మాత్రం ఖరీఫ్ వరి కోతలు పూర్తి అయిన ప్రాంతాల్లో ఇప్పటికే వరి నాట్లు ప్రారంభమయ్యాయి. ఈ రబీలో అన్ని పంటల సాధారణ విస్తీర్ణం 87,018 హెక్టార్లు కాగా 20,315 హెక్టార్లలో పంటలను రైతులు ఇప్పటికే సాగు చేశారు. వరి సాధారణ విస్తీర్ణం 36,481 హెక్టార్లకు 684 హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి. సాగర్ నిండా నీళ్లు ఉన్నాయని.. చివరి వరకు నీళ్లు వస్తాయనే ధీమాతో నేలకొండపల్లి, సత్తుపల్లి, మధిర, బోనకల్, ముదిగొండ ప్రాంతాల్లో రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. గత రబీలో కూడా ఆరుతడి పంటలే వేసుకోవాలని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత రైతుల ఆందోళనలతో పంట చేతికి వచ్చే వరకు సాగర్ నీళ్లు విడుదల చేశారు. అయితే మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండలాల్లో గతంలో చివరి ఆయకట్టు భూములకు నీరందక వరి ఎండిపోయింది. ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రతిసారీ అధికారులు ప్రకటనలకే పరిమితమవుతున్నారు తప్ప.. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో విసృ్తతంగా ప్రచారం చేయకపోవడంతో చివరకు రైతులు వరిసాగు చేస్తున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో అప్పుల పాలవుతున్నారు. ఈ రబీలో కూడా ఓవైపు వరి సాగుకు సిద్ధమవుతున్న రైతులు మరోవైపు చివరి వరకు నీళ్లు రాకపోతే పంట చేతికి అందదని అప్పుల ఊబి లో కూరుకపోతామనే ఆందోళనతో ఉన్నారు. మెట్ట రైతుల ఆందోళన చెరువులు, బోరుబావుల కింద వరి సాగు చేయాలనుకుంటున్న రైతులు ఆందోళనలో ఉన్నారు. కొద్ది మొత్తంలో సాగు చేద్దామనుకున్న ఖరీఫ్‌లోనే విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడిన రైతులు రబీలో భారీగా కోతలు తప్పవని అంచనా వేస్తున్నారు. ఆరుతడి పంటలు వేసినా అడపాదడపా తడులు ఇవ్వాలి కాబట్టి కరెంట్ ఎన్ని గంటలు వస్తుందో.. పంట ఎండిపోతే పరిస్థితి ఎంటనే సందిగ్ధంలో ఉన్నారు. ఈశాన్య రైతుల పవనాల ప్రభావం జిల్లాలో అంతగా లేకపోవడంతో ఈ రబీలో ఆరుతడి పంటల సాగు పడిపోయింది. గత ఏడాది రబీలో జొన్న 1,239 హెక్టార్లలో సాగు చేశారు. ఈ సారి కేవలం 164 హెక్టార్లలోనే వేశారు. గతంలో మినుములు 4,083 హెక్టార్లలో సాగు చేస్తే ప్రస్తుతం 1,587 హెక్టారలోనే సాగు చేస్తున్నారు. రబీలో వర్షాలు లేకపోవడంతో ముందస్తుగానే రైతులు ఆరుతడి పంటల సాగునూ తగ్గించారు. గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం రబీలో 87,018 హెక్టార్లు సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనావేశారు. సీజన్ ప్రారంభమై నెలరోజులు గడిచినా ఇప్పటి వరకు కేవలం 20,315 హెక్టార్లలోనే పంటలు వేశారు. ఈ సీజన్లో మొక్కజొన్న అత్యధికంగా 4,539 హెక్టార్లు, అపరాలు 5,290 హెక్టార్లలో సాగు చేశారు. సాగర్ ఆయకట్టు పరిధిలో వరి నూర్పిడి మరో 15 రోజుల్లో పూర్తి కానుంది. వరి సాగుచేద్దామనుకుంటున్న రైతులు 303 హెక్టార్లలో వరి నార్లు పోశారు. ఆరుతడి పంటలు వేసుకోవాలన్న అధికారుల సూచనలను పెడచెవిన పెట్టారు. నీళ్లు ఎలాగైనా వస్తాయన్న నమ్మకంతో వరి సాగుకే మొగ్గుచూపుతున్నారు. తీవ్ర వర్షాభావం, సాగర్ నీళ్లు రాకపోతే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని ఓవైపు ఆందోళన చెందుతూనే...మరోవైపు వరి సాగు చేయకపోతే గిట్టుబాటు కాదని ఆ పంటవైపు మొగ్గుచూపుతున్నారు. ఖరీఫ్ వెతలతో రబీలో కలిసి వస్తుందనుకున్న రైతులను వర్షాభావం, విద్యుత్ కోతలు, సాగర్ ఆయకట్టులో ఆరుతడి పంటల ప్రకటనలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. -
కర్ణాటక కరుణిస్తేనే జూరాల ఆయకట్టు పరిధిలో సాగు
‘నారాయణపూర్’ నీళ్లొదలాలని డిమాండ్ మూడేళ్లుగా నీటి నిలిపివేతతో అన్నదాతకు సమస్యలు గద్వాల: జూరాల రబీ ఆయకట్టు భవితవ్యం కర్ణాటక నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు పరిధిలో రబీ పంటలకు నీటిని విడుదల చేస్తే అక్కడి ఆయకట్టు ద్వారా రీజనరేట్ అయి.. అక్కడి నుంచి నదిలో చేరి జూరాల రిజర్వాయర్‌కు చేరుతోంది. తద్వారా జూరాల పరిధిలో రెండో పంటకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. ఇలా కర్ణాటక నుంచి వస్తేనే జూరాల పరిధిలోని రబీకి పంటలకు నీళ్లివ్వాలని, లేనిపక్షంలో తాగునీటి అవసరాల కోసం వాడుకోవాలని అధికారులు నిర్ణయించారు. అయితే, దీనిపై కర్ణాటక నిర్ణయం కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. 2012లో నారాయణపూర్ ఆయకట్టులో రబీ పంటకు నీటి విడుదల చేయకుండా కర్ణాటక అధికారులు నిలిపివేశారు. దీంతో జూరాల ప్రాజెక్టు పరిధిలో పంట పూర్తయ్యే దశలో నీళ్లులేక రైతులు పెద్దఎత్తున నష్టపోయారు. 2013 రబీలోనూ నారాయణపూర్ ప్రాజెక్టు పరిధిలో రబీ పంట ఉంటుందన్న నమ్మకంతో, రబీ పంటకు నీటి విడుదల చేశారు. చివరి సమయంలో కర్ణాటక అర్థంతరంగా నీటి విడుదలను నిలిపి వేయడంతో పంటలకు నీళ్లందని పరిస్థితి ఏర్పడింది. ఉన్న నీళ్లను పంటలు ఎండిపోకుండా అందించేందుకు అధికారులు ఇబ్బందులు పడ్డారు. గత రెండు రబీ సీజన్లలో కర్ణాటక తీరు కారణంగా జూరాల రైతులు నష్టపోయిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నెలాఖరులోగా నారాయణపూర్ ప్రాజెక్టు రబీ పంటపై కర్ణాటక అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాతే జూరాల రబీపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని అధికారులు ఎదురు చూస్తున్నారు. జూరాల ఆయకట్టు పరిధిలో కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా లక్షా 7వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. గత రబీ సీజన్లో 57వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఐఏబీలో తీర్మానించారు. ఇది నమ్మిన రైతులు పంటలు సాగుచేసుకొని తీవ్రంగా నష్టపోయారు. ైపై నుంచి నీళ్లు రాకపోతే మళ్లీ నష్టపోతామన్న ఉద్దేశంతో రబీలో వేరుశనగ సాగు చేసుకునేందుకు స్పష్టమైన ప్రకటన చేయాలని జూరాల అధికారులను రైతులు కోరుతున్నారు. వచ్చే నెలలో వేరుశనగను విత్తుకునేందుకు ఇప్పటి నుంచి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాల్సి ఉన్నందున జూరాల అధికారులను కలసి నీటి విడుదల ఉంటుందా లేదా అనే విషయంపై స్పష్టత కోరారు. ఈ విషయమై జూరాల ఎస్ఈ ఖగేందర్‌ను వివరణ కోరగా, నారాయణపూర్ ప్రాజెక్టు పరిధిలో రబీ సీజన్ ఉంటేనే జూరాల ఆయకట్టు పరిధిలో రబీ సీజన్‌కు నీటిని అందించేందుకు అవకాశం ఉంటుందని.. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.