సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి అదిరిపోయింది. వ్యవసాయ రంగానికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో పంట కోత, నూర్పిడి, రవాణా, కొనుగోళ్లకు ఎటువంటి ఆటంకం లేకుండా పోయింది. రాష్ట్రంలో రబీలో సాగు చేసిన మొక్కజొన్న విస్తీర్ణంలో పంట కోతలు వివిధ జిల్లాల్లో సగటున 70 శాతం పూర్తి కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 80, 90 శాతం వరకు పూర్తి అయ్యాయి. కాగా మొక్కజొన్న దిగుబడిలో ఆంధ్రప్రదేశ్.. దేశంలో రెండో స్థానంలో, ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉంది. మూడో ముందస్తు అంచనా ప్రకారం.. 2019–20 రబీలో హెక్టార్‌కు అత్యధికంగా 7,588 కిలోల దిగుబడి సాధించింది. పొరుగునున్న తెలంగాణ కంటే ఇది 490 కిలోలు అధికం. అలాగే మన రాష్ట్రంలో ఖరీఫ్ దిగుబడి కంటే ఇది 2,873 కిలోలు ఎక్కువ కావడం గమనార్హం.
రబీ మొక్కజొన్నసేకరణ ఇలా..
► ప్రభుత్వం 348 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిలో 228 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. మిగతా చోట్ల పంట ఎప్పుడు చేతికి వస్తే అప్పుడు కొనుగోళ్లు మొదలుపెడతారు.
► బుధవారం వరకు 1,977 మంది రైతుల నుంచి 13,029 టన్నుల మొక్కజొన్నల్ని కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.22.93 కోట్లు.
ప్రస్తుత సమస్యలివీ..
► గోనె సంచులు దొరకడం లేదు. మార్క్‌ఫెడ్ ద్వారా గోనె సంచులు అందించేందుకు డీఎంసీఎస్‌లతో చర్చలు జరుగుతున్నాయి.
► గ్రామ వ్యవసాయ సహాయకుల్లో (వీఏఏ) కొంతమందికి పౌరసరఫరాల సంస్థ నుంచి పాస్‌వర్డ్ రాలేదు. ఫలితంగా కొనుగోళ్లలో జాప్యం జరుగుతుంది.
► ధాన్యం సేకరణ కేంద్రం (పీపీసీ) యాప్‌లో ఇ–కర్షక్ డేటా కనిపించట్లేదని అక్కడక్కడా వినిపిస్తోంది. రైతుల డేటా మార్క్‌ఫెడ్, పౌరసరఫరాల సంస్థ యాప్‌ల్లో కనిపించట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తున్నామని అధికారులంటున్నారు.
► కోత యంత్రాలకు ఎకరానికి రూ.2,800ను ప్రభుత్వం నిర్దేశించగా యజమానులు రూ.3,300 నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు.
వ్యాపారులు మోసం చేస్తే ఉపేక్షించ వద్దు..
► రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకటించినందున రైతులెవ్వరూ కంగారు పడి తక్కువ ధరకు అమ్ముకోవద్దు.
► కరోనా నేపథ్యంలో విత్తన ఉత్పత్తి, శుద్ధికి ఇబ్బంది లేకుండా సీడ్‌మెన్ అసోసియేషన్‌తో సమన్వయం.
► అక్కడక్కడా ఎంఎస్‌పీకి మొక్కజొన్నల్ని కొనడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. ఏదో ఒక సాకు చూపి ఎంఎస్‌పీ రూ.1,760లో ఎంతో కొంత కోత వేస్తున్నట్టు, కొందరు వ్యాపారులు.. రైతులు తక్కువకు అమ్ముకునేలా చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.
► పాస్ పుస్తకం ఎవరి పేరుంటే వారే కొనుగోలు కేంద్రాలకు రావాలన్న నిబంధనను మహిళల విషయంలో సడలించాలని వినతులు వస్తున్నాయి. దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటాం.
– కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి
మరో వారంలోపు కోతలు పూర్తవుతాయి
► ఏదైనా గ్రామంలో 85 మెట్రిక్ టన్నులకు మించి జొన్న, మొక్కజొన్నల దిగుబడి ఉంటే అక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పాం. లేదంటే.. రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక కేంద్రాన్ని పెట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించాం.
► కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,760. దీనికన్నా ఎవరన్నా తక్కువకు అడిగితే వ్యవసాయ శాఖ అధికారులకు లేదా 1907కు ఫిర్యాదు చేయాలి. – అరుణ్ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్
గిట్టుబాటు ధర ప్రకటించడం హర్షణీయం
నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న వేశా. లాక్‌డౌన్‌తో రవాణా లేని సమయంలో క్వింటాల్‌ను రూ.1,450కి మించి అమ్ముకోలేకపోయా. ఈ దశలో ప్రభుత్వం రూ. 1,760 గిట్టుబాటు ధరను ప్రకటించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయం.
– తోరం పోశయ్య, సీతానగరం, తూర్పుగోదావరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment