పోలవరం ప్రాజెక్ట్ అప్పర్ కాపర్‌డ్యామ్
సాక్షి, అమరావతి: గోదావరికి వరద వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తిచేసే దిశగా అధికారులు పనులను వేగవంతం చేశారు. డెల్టాలో రబీ పంటలకు నీటిని సరఫరా చేసేందుకు కాఫర్ డ్యామ్ రీచ్–3లో 400 మీటర్లను ఖాళీగా వదిలేశారు. రబీ పంటలు నూర్పిళ్ల దశకు చేరుకోవడంతో ఖాళీగా వదిలిన ప్రదేశాన్ని భర్తీచేసేందుకు సిద్ధమయ్యారు. ఎగువ సీలేరు, దిగువ సీలేరు కేంద్రాల నుంచి ఏపీ జెన్‌కో (ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థ) విద్యుదుత్పత్తి చేస్తూ 4 వేల క్యూసెక్కుల నీటిని వదులుతోంది. ఇది కాఫర్ డ్యామ్ రీచ్–3లో ఖాళీ ప్రదేశాన్ని భర్తీచేయడానికి అడ్డంకిగా మారింది. దీంతో జూన్ వరకు విద్యుదుత్పత్తిని నిలిపివేసి కాఫర్ డ్యామ్‌ను పూర్తిచేయడానికి సహకరించాలని ఏపీ జెన్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌లను కోరినట్లు పోలవరం చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌బాబు ‘సాక్షి’కి చెప్పారు. నీటి ప్రవాహం తగ్గగానే ఖాళీ ప్రదేశాన్ని శరవేగంగా భర్తీచేసి.. జూన్ నాటికి కాఫర్ డ్యామ్‌ను సిద్ధం చేస్తామన్నారు. గోదావరి నదిపై పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామన్నగూడెం వద్ద 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం విదితమే. ప్రాజెక్టులో నీటిని నిల్వచేసే ప్రధాన ఆనకట్ట (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్–ఈసీఆర్‌ఎఫ్)ను 2,467.5 మీటర్ల పొడవున మూడు భాగాలుగా నిర్మించాలి. ఈసీఆర్‌ఎఫ్‌ను నిర్మించాలంటే.. గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించేలా ఈసీఆర్‌ఎఫ్‌కు ఎగువన 2,480 మీటర్లు, దిగువన 1,617 మీటర్ల పొడవున కాఫర్ డ్యామ్‌లు నిర్మించాలి. ఎగువ కాఫర్ డ్యామ్‌ను 42.5 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్‌ను 30.50 మీటర్ల ఎత్తున
నిర్మించాలి.
4 రీచ్‌లుగా ఎగువ కాఫర్ డ్యామ్
ఎగువ కాఫర్ డ్యామ్‌ను 4 రీచ్‌లుగా నిర్మిస్తున్నారు. రీచ్–1ను 0 నుంచి 480 మీటర్లు, రీచ్–2ను 480 నుంచి 1,700 మీటర్లు, రీచ్–3ని 1,700 నుంచి 2,100 మీటర్లు, రీచ్–4ను 2,100 నుంచి 2,480 మీటర్లుగా విభజించారు. డెల్టాలో రబీ పంటలకు నీరు సరఫరా చేయడానికి వీలుగా కాఫర్ డ్యామ్ రీచ్–3లో 400 మీటర్ల మేర ఖాళీ ప్రదేశాన్ని వదిలేశారు. మిగతా మూడు రీచ్‌లలోను కాఫర్ డ్యామ్ పనులను చేపట్టారు. జూన్‌లోగా కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేస్తేనే.. వరదను స్పిల్ వే మీదుగా మళ్లించడానికి సాధ్యమవుతుంది. అప్పుడే ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేయడానికి మార్గం సుగమం అవుతుంది. డెల్టాలో రబీ పంటలు నూర్పిళ్ల దశకు చేరుకోవడంతో రీచ్–3లో ఖాళీ ప్రదేశాన్ని భర్తీచేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గోదావరి సహజసిద్ధ ప్రవాహం కనిష్టస్థాయికి చేరుకుంది. సీలేరు నుంచి కూడా ప్రవాహం తగ్గగానే ఖాళీ ప్రదేశాన్ని భర్తీచేసే పనులు చేపడతారు.
కార్యాచరణ ప్రణాళిక ప్రకారమే..
గోదావరికి వచ్చే వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి.. జూన్ నుంచి ఈసీఆర్‌ఎఫ్ పనులను ప్రారంభించి గడువులోగా పూర్తి చేయడానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారమే అధికారులు పనులు చేయిస్తున్నారు. స్పిల్ వే దాదాపుగా కొలిక్కి వచ్చింది. అప్రోచ్ చానల్, స్పిల్ చానల్ పనులు వేగంగా సాగుతున్నాయి. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
Comments
Please login to add a commentAdd a comment