
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల నేపథ్యంలో సీలేరులో జూన్ 5వ తేదీ వరకు జలవిద్యుదుత్పత్తిని నిలిపి వేయాలని జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనను ఏజీ జెన్‌కో (ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థ) ఆమోదించింది. గోదావరి ప్రవాహాన్ని జూన్ రెండో వారంలో పోలవరం స్పిల్ వే మీదుగా మళ్లించే ప్రక్రియ ప్రారంభమయ్యాక.. సీలేరులో మళ్లీ విద్యుదుత్పత్తిని ప్రారంభించనున్నారు. గతంలో గోదావరి ప్రవాహం దిగువకు వెళ్లేందుకు వీలుగా ఎగువ కాఫర్ డ్యామ్‌లో 300 మీటర్ల ఖాళీ ప్రదేశాన్ని వదిలారు. ఇప్పుడు ఆ ఖాళీ ప్రదేశాన్ని భర్తీ చేసే పనుల ప్రక్రియను వేగవంతం చేశారు.
గోదావరిలో సహజ సిద్ధ ప్రవాహం రెండు వేల క్యూసెక్కులు వస్తుండడంతో.. ఆ ప్రవాహాన్ని నిలుపుదల చేసేలా రింగ్ బండ్ వేసి ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును సగటున 38 మీటర్ల ఎత్తుకు పెంచే పనులను వేగవంతం చేశారు. గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించేందుకు నది నుంచి.. కుడి వైపునకు 2.18 కిమీల పొడవున అప్రోచ్ ఛానల్ తవ్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తయ్యాక.. స్పిల్ వే మీదుగా ప్రవాహాన్ని మళ్లిస్తారు. అనంతరం కాఫర్ డ్యామ్‌ను 42.5 మీటర్ల ఎత్తుకు పెంచే పనులను జూలై నాటికి పూర్తి చేసి.. వరద సమయంలోనూ ప్రధాన డ్యామ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పనులు చేపట్టి 2022 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment