కర్ణాటక కరుణిస్తేనే జూరాల ఆయకట్టు పరిధిలో సాగు
‘నారాయణపూర్’ నీళ్లొదలాలని డిమాండ్
మూడేళ్లుగా నీటి నిలిపివేతతో అన్నదాతకు సమస్యలు
గద్వాల: జూరాల రబీ ఆయకట్టు భవితవ్యం కర్ణాటక నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు పరిధిలో రబీ పంటలకు నీటిని విడుదల చేస్తే అక్కడి ఆయకట్టు ద్వారా రీజనరేట్ అయి.. అక్కడి నుంచి నదిలో చేరి జూరాల రిజర్వాయర్‌కు చేరుతోంది. తద్వారా జూరాల పరిధిలో రెండో పంటకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. ఇలా కర్ణాటక నుంచి వస్తేనే జూరాల పరిధిలోని రబీకి పంటలకు నీళ్లివ్వాలని, లేనిపక్షంలో తాగునీటి అవసరాల కోసం వాడుకోవాలని అధికారులు నిర్ణయించారు. అయితే, దీనిపై కర్ణాటక నిర్ణయం కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. 2012లో నారాయణపూర్ ఆయకట్టులో రబీ పంటకు నీటి విడుదల చేయకుండా కర్ణాటక అధికారులు నిలిపివేశారు. దీంతో జూరాల ప్రాజెక్టు పరిధిలో పంట పూర్తయ్యే దశలో నీళ్లులేక రైతులు పెద్దఎత్తున నష్టపోయారు. 2013 రబీలోనూ నారాయణపూర్ ప్రాజెక్టు పరిధిలో రబీ పంట ఉంటుందన్న నమ్మకంతో, రబీ పంటకు నీటి విడుదల చేశారు. చివరి సమయంలో కర్ణాటక అర్థంతరంగా నీటి విడుదలను నిలిపి వేయడంతో పంటలకు నీళ్లందని పరిస్థితి ఏర్పడింది. ఉన్న నీళ్లను పంటలు ఎండిపోకుండా అందించేందుకు అధికారులు ఇబ్బందులు పడ్డారు. గత రెండు రబీ సీజన్లలో కర్ణాటక తీరు కారణంగా జూరాల రైతులు నష్టపోయిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నెలాఖరులోగా నారాయణపూర్ ప్రాజెక్టు రబీ పంటపై కర్ణాటక అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాతే జూరాల రబీపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని అధికారులు ఎదురు చూస్తున్నారు.
జూరాల ఆయకట్టు పరిధిలో కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా లక్షా 7వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. గత రబీ సీజన్‌లో 57వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఐఏబీలో తీర్మానించారు. ఇది నమ్మిన రైతులు పంటలు సాగుచేసుకొని తీవ్రంగా నష్టపోయారు. ైపై నుంచి నీళ్లు రాకపోతే మళ్లీ నష్టపోతామన్న ఉద్దేశంతో రబీలో వేరుశనగ సాగు చేసుకునేందుకు స్పష్టమైన ప్రకటన చేయాలని జూరాల అధికారులను రైతులు కోరుతున్నారు. వచ్చే నెలలో వేరుశనగను విత్తుకునేందుకు ఇప్పటి నుంచి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాల్సి ఉన్నందున జూరాల అధికారులను కలసి నీటి విడుదల ఉంటుందా లేదా అనే విషయంపై స్పష్టత కోరారు. ఈ విషయమై జూరాల ఎస్‌ఈ ఖగేందర్‌ను వివరణ కోరగా, నారాయణపూర్ ప్రాజెక్టు పరిధిలో రబీ సీజన్ ఉంటేనే జూరాల ఆయకట్టు పరిధిలో రబీ సీజన్‌కు నీటిని అందించేందుకు అవకాశం ఉంటుందని.. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.