Jurala
-
జూరాల ఉగ్రరూపం
-
జూరాల నీటిని విడుదల చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి
ధరూరు(గద్వాల): ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి రైతులకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి ఆయన ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరితతో కలసి జూరా ల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ ల ద్వారా సాగు నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి రైతులకు సాగు నీరందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి వారికి న్యాయం జరిగేలా చూస్తున్నామన్నారు. వానాకాలం పంట కింద జూరాల ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగు నీరందిస్తామని, చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
రేపు జూరాలకు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వాటర్ ఇయర్లో తొలిసారి ఎగువ ప్రాజెక్టుల నుంచి దిగువకు కృష్ణా నదీ ప్రవాహాలు మొదలయ్యాయి. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్‌కు నీటి ప్రవాహాలు పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ డ్యామ్ రెండు గేట్లను ఎత్తి నదిలోకి నీటిని వదిలిపెడుతోంది. ఈ నీరంతా దిగువన జూరాల వైపుగా తన ప్రయాణం మొదలు పెట్టగా, మంగళవారానికి నీరు జూరాలకు చేరే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. దిగువకు పరుగు... గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కర్ణాటక, మహారాష్ట్రలో వాగులు, వంకలన్నీ ఉప్పొంగుతున్నాయి. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టులో వరద పెరిగింది. ఆదివారం ప్రాజెక్టులోకి 69,868 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో నిల్వ 129 టీఎంసీలకు 98 టీఎంసీలు చేరింది. ఇప్పటివరకు ప్రాజెక్టులోకి కొత్తగా 78 టీఎంసీల నీరు వచ్చింది. ప్రాజెక్టులో మరో 31 టీఎంసీల మేర ఖాళీ ఉన్నప్పటికీ ఎగువ నుంచి ప్రవాహాలు మరో వారంపాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి 36,130 క్యూసెక్కుల నీటిని పవర్‌హౌస్‌ల ద్వారా దిగువకు వదులుతున్నారు. దీంతో నారాయణపూర్‌లోకి ప్రవాహాలు మరింత పెరిగాయి. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 39,720 క్యూసెక్కుల నీరు వస్తోంది. అందులో నీటి నిల్వ 37.64 టీఎంసీలకుగాను 33.47 టీఎంసీలు ఉంది. మొత్తంగా ఆల్మట్టి, నారాయణపూర్‌లలో 35 టీఎంసీల మేర నిల్వలు ఖాళీగా ఉన్నప్పటికీ ఎగువ నుంచి ప్రవాహాలు కొనసాగే అవకాశాలు ఉండటంతో నారాయణపూర్ రెండు గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి ఆదివారం ఉదయం 11,240 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలారు. సాయంత్రానికి నీటి విడుదలను 26 వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ నీరంతా కర్ణాటకలోనే ఉన్న గూగుల్, గిరిజాపూర్ బ్యారేజీలను దాటుకుంటూ మంగళవారం నాటికి జూరాలకు చేరే అవకాశం ఉంది. జూరాలకు ఇప్పటికే స్థానిక పరీవాహకం నుంచి 4,140 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ఇక్కడ నిల్వ 9.66 టీఎంసీలకుగాను 8.10 టీఎంసీలు ఉన్నాయి. జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా ద్వారా 1,445 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహాలు పెరిగే అవకాశాల నేపథ్యంలో సోమ లేదా మంగళవారం నుంచి పవర్‌హౌస్ ద్వారా నీటిని దిగువనున్న శ్రీశైలానికి వదిలే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ప్రవాహాలు మరింత ఉధృతంగా ఉంటే జూరాల గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఇక శ్రీశైలానికి 2,557 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా నీటి నిల్వ 215 టీఎంసీలకుగాను 37.25 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్‌కు 1,202 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 312 టీఎంసీలకుగాను 168.35 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 11,102 క్యూసెక్కుల మేర ప్రవాహాలు పెరిగాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ 90 టీఎంసీలకుగాను 33.60 టీఎంసీలుగా ఉంది. -
ఎత్తిపోతలు షురూ!
సాక్షి, హైదరాబాద్: జూరాల ప్రాజెక్టుపై ఆధారపడ్డ ప్రాజెక్టుల నుంచి నీటి ఎత్తిపోతల ప్రక్రియ మొదలైంది. స్థానిక పరీవాహకంలో కురిసిన వర్షాలతో ప్రవాహాలు కొనసాగు తుండటంతో జూరాల మీద ఉన్న నెట్టెంపాడు నుంచి తొలి ఎత్తిపోతలు మొదలుపెట్టగా, భీమా, కోయిల్ సాగర్ ద్వారా నీటి ఎత్తిపోతకు రంగం సిద్ధంచేశారు. ప్రస్తుతం వచ్చిన నీటిని వచ్చినట్లు ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపనున్నారు. ఎగువ నుంచి ప్రవాహాలు పుంజుకున్నాక పూర్తిస్థాయి ఎత్తిపోతలు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది. వచ్చింది వచ్చినట్లు ఎత్తిపోత స్థానిక పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో జూరాలకు గడిచిన మూడు నాలుగు రోజులుగా 5వేల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. ఆదివారం సైతం ప్రాజెక్టు లోకి 5,703 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరిం ది. దీంతో ప్రాజెక్టులోకి ఈ సీజన్లో 2.70 టీఎంసీల కొత్త నీరు రావడంతో ప్రాజెక్టు నీటిమట్టం 9.66 టీఎంసీలకు గానూ 7.04 టీఎంసీలకు చేరింది. ప్రవాహాలు కొనసా గితే ప్రాజెక్టు నిండనుంది. ఎగువన ఆల్మట్టి లోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నా యి. దీనిలోకి ప్రస్తుతం 9,359 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టులో నీటి నిల్వ 129 టీఎంసీలకు గాను 74 టీఎంసీలకు చేరింది. ఇక్కడ గరిష్టంగా మరో 50 టీఎంసీలు చేరగానే దిగువకు నీటి విడుదల మొదలుకానుంది. ఒక్కసారి దిగువకు వరద మొదలైతే కొనసాగుతూనే ఉంటుంది. అప్పటికే జూరాల నిండి ఉంటే నీరంతా దాని దిగువన ఉన్న శ్రీశైలానికి వెళుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జూరాలకు వస్తున్న నీటిని వచ్చింది వచ్చినట్లు ఎత్తిపోయాలని నిర్ణయించారు. వరద మొదలైతే ఆయకట్టుకు నీరు శనివారం రాత్రి నుంచి ప్రభుత్వ ఆదేశాలతో నెట్టెంపాడు మోటార్‌ను ఆన్‌చేసి 448 క్యూసెక్కుల నీటిని రేలంపాడ్ రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. నేడో, రేపో భీమా, కోయిల్‌సాగర్‌లో ఒకట్రెండు పంపులను నడిపించి రిజర్వాయర్లు నింపనున్నారు. ఈ మూడు లిఫ్టులను పూర్తిస్థాయిలో నడిపిస్తే రోజుకు 4వేల క్యూసెక్కుల మేర నీటిని తరలించే అవకాశం ఉంది. ఎగువ నుంచి వరద మొదలయ్యాక ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తూ చెరువులు నింపనున్నారు. బీమా కింద 2లక్షలు, నెట్టెంపాడు కింద 2లక్షలు, జూరాల కాల్వల కింద లక్ష, కోయిల్‌సాగర్ కింద 30వేల ఎకరాలకు నీరివ్వాలని భావిస్తున్నారు. బీమా కింద 248 చెరువులు, కోయిల్‌సాగర్ కింద 37, జూరాల కింద 185, నెట్టెంపాడు కింద 100, ఆర్డీస్ కింద 5 చెరువులు నింపేలా ప్రణాళిక ఉంది. గత ఏడాది వరద ఉధృతంగా ఉండటంతో 90 శాతం చెరువులు నింపగలిగారు. ఈ ఏడాది సైతం జూలై 15 తర్వాత వరద ఉంటుందని, అప్పట్నుంచి చెరువులు పూర్తిస్థాయిలో నింపి ఆయకట్టుకు నీరివ్వాలని సాగునీటి యంత్రాంగం యోచిస్తోంది. -
జూరాలలో మరో సోలార్ ప్రాజెక్టు
సాక్షి, ద్వాల టౌన్: జూరాల, లోయర్ జూరాల ప్రాజెక్టుల వద్ద మరో 19 మెగావాట్ల సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఎగువ జూరాల జలవిద్యుత్ కేంద్రం వద్ద ఐదు ఎకరాల్లో ఒక మెగావా ట్ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన కేంద్రం విజయవంతమైంది. ఈ ప్రాంతంలో అ న్ని సీజన్లలోనూ పగటి పూట 30 డిగ్రీలకు తగ్గకుండా ఎండ తీవ్రత ఉంటుంది. కాబట్టి సోలా ర్ విస్తరణకు సరైన ప్రాంతం కావడంతో విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద జలవిద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాటి ద్వారా విద్యుదుత్పత్తి చేయడంతోపా టు ప్రాజెక్టుల వద్ద మిగులు భూముల్లో సోలార్ పవర్ విస్తరణకు మొగ్గుచూపుతున్నారు. 50 ఎకరాల మిగులు భూమిలో ఎగువ జూరాల ప్రాజెక్టు వద్ద 2012 నుంచి ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి నిరాటంకంగా సాగుతోంది. దీంతో జూరాల వద్ద మిగులుగా ఉన్న మరో 50 ఎకరాల భూమిలో మరో 8 మెగావాట్ల విద్యుత్‌ను అందించేలా సోలార్ యూనిట్‌ను విస్తరించాలని నిర్ణయించారు. లోయర్ జూరాల వద్ద మిగులుగా ఉన్న సాగునీటి శాఖకు చెందిన 90 ఎకరాల భూమిలో మరో 11 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటులో ఒక మెగావాట్ విద్యుత్‌ను అందించేలా సోలార్ యూనిట్ల పరికరాలను అమర్చడానికి రూ.3 కోట్ల మేర వ్యయమవుతుంది. జూరాల, లోయర్ ప్రాజెక్టులతోపాటు తెలంగాణలో సాగునీటి శాఖ వద్ద మిగులుగా ఉన్న భూముల్లో సోలార్ యూనిట్లను నెలకొల్పేందుకు కార్యాచరణ రూపొందించారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద 20 మెగావాట్లు, పాల్వంచ కేటీపీఎస్ వద్ద 8 మెగావాట్లు, పెద్దపల్లి వద్ద 5 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నిర్మించేందుకు ఇప్పటికే డీపీఆర్ చేశారు. వాటికి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించింది. కేటీపీఎస్, పులిచింతల, పెద్దపల్లి ప్రాజెక్టుల మిగులు భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా మొదటి దశ పనులకు రూ.75 కోట్లతో టెండర్లను పూర్తి చేయడంతోపాటు ఒప్పందాలు చేయడంతో పనులు ప్రారంభం కానున్నాయి. జూరాల, లోయర్ ప్రాజెక్టుల వద్ద సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచితే వేసవిలో గ్రిడ్ ద్వారా ఈ ప్రాంతానికి విద్యుత్‌ను అందించేందుకు మరింత సౌలభ్యం ఏర్పడనుంది. ఆదాయం ఇచ్చే వనరు.. సాగునీటి ప్రాజెక్టుల వద్ద జలవిద్యుత్తోపాటు సోలార్ విద్యుదుత్పత్తి విస్తరించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. జూరాల, లోయర్ జూరాల ప్రాజెక్టుల వద్ద సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్ణయించాం. మిగులు భూముల్లో సోలార్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మరింత విద్యుత్‌ను అందుకోడానికి వీలవుతుంది. ఒక మెగావాట్‌కు ఒకేసారి పెట్టుబడి పెడితే దాదాపు రెండు దశాబ్దాలపాటు ఉత్పత్తి అందిస్తుంది. కేవలం నిర్వహణ చేయాల్సి ఉంటుంది. జెన్కోకు సోలార్ కూడా అధిక ఆదాయాన్ని ఇచ్చే వనరుగా మారింది. – సురేష్, సీఈ, టీఎస్ జెన్కో -
జురాల ప్రాజెక్టుకు భారీగా వస్తున్న వరద
-
నందికొండ.. నిండుకుండలా
సాక్షి, నాగార్జునసాగర్ : సాగర్ జలాశయంలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరువలో ఉంది. మూడు అడుగుల మేర నీటిమట్టం పెరగడానికి ఐదు టీఎంసీల నీరు వచ్చి చేరితే మరోమారు గేట్లు ఎత్తే అవకాశాలున్నట్లుగా ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి ఆదివారం సాయంత్రం 68,792 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా సాగర్ నుంచి విద్యుదుత్పాదన ద్వారా నదిలోకి 33,058 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువన కృష్ణా పరీవాహక ప్రాంతాలైన కర్నాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద రాక పెరిగింది. దీంతో ఆ ప్రాజెక్టుల గేట్లు తెరుచుకున్నాయి. దిగువకు వరద నీరు భారీగా వస్తుండటంతో ముందస్తుగానే నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి కృష్ణానదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో ఇలా.. జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,53,915 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నుంచి విడుదలవుతున్న నీటితో కలిసి శ్రీశైలం జలాశయానికి 2,26,564 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885అడుగులు కాగా 215.807 టీఎంసీలకు సమానం. ప్రస్తుతం 882.30 అడుగులకు చేరింది. 200.6588 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి విద్యుదుత్పాదనతో పాటు పోతిరెడ్డిపాడు తదితర ప్రాంతాలతో కలిపి 98,415 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 68,792క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కాగా సాగర్ జలాశయం నుంచి ఎడమ, కుడి కాల్వలకు విద్యుదుత్పాదనతో కృష్ణా డెల్టాకు 52,237 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలా శయం నీటిమట్టం 587.10 అడుగులకు చేరిం ది. 305.5646 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గరిష్ట నీటిమట్టం 590.00 అడుగులు కాగా 312.0450 టీఎంసీలు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టానికి చేరితే గేట్లు ఎత్తే అవకాశముంటుంది. సాగర్ నుంచి కూడా నీటిని స్పిల్‌వే మీదుగా విడుదల చేయనున్నారు. అప్రమత్తంగా ఉండాలి సాగర్ జలాశయానికి ఎగువనుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే జలాశయం గరిష్ట మట్టానికి చేరువలో ఉంది. డ్యాం దిగువనున్న రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని డ్యాం ఎస్ఈ టి.విజయ్‌కిరణ్‌రెడ్డి కోరారు. కృష్ణా తీర మండలాల పరిధిలోని తహసీల్దార్లు, ఆర్డీఓకు సమాచారం అందజేశారు. -
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద
సాక్షి, కర్నూలు : శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద నీరు తగ్గుతోంది. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి 7,19,725 క్యూసెక్కుల వరదనీరు విడుదల కాగా శ్రీశైలం డ్యామ్‌కు మొత్తం 7,73,917 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 10 గేట్ల ద్వారా 8,60,012 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరుకుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.0114 టీఎంసీల నీరు ఉంది. జూరాల : రికార్డు స్థాయిలో జూరాల నుంచి శ్రీశైలానికి ఇప్పటికే 555.641 టీఎంసీలు నీరు చేరింది. ప్రాజెక్టు నీటి వివరాలు.. ఇన్ ఫ్లో : 7,20,000 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 7,19,725 క్యూసెక్కులు ప్రస్తుత నీటి నిల్వ : 5.943 టీఎంసీలు పూర్తిస్థాయి నీటి నిల్వ : 9.657 టీఎంసీలు ప్రస్తుతం నీటి నిల్వ మట్టం : 316.500 మీటర్లు పూర్తిస్థాయి నీట్టి మట్టం: 318.516 మీటర్లు -
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
-
రేపు శ్రీశైలానికి కృష్ణా జలాలు
సాక్షి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్/గద్వాల టౌన్: ఎగువ కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా కృష్ణా నదీ జలాలు దిగువకు వస్తుండటంతో జూరాల నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి ఏకంగా ఎగువ నుంచి లక్ష క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరుతుండటంతో సాయంత్రం ఏడు గంటలకు ప్రాజెక్టులో నీటి నిల్వ 9.66 టీఎంసీలకుగాను 5.5 టీఎంసీలకు చేరింది. ఎగువ ఆల్మట్టిలోకి 2 లక్షల క్యూసె క్కుల వరద వస్తుండటంతో అంతే నీటిని దిగువ నా రాయణపూర్కు వదులుతున్నారు. నారాయణపూర్ సైతం ఇప్పటికే నిండటంతో 20 గేట్లు ఎత్తి 1.90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ జూరాలకు వదులుతున్నారు. ఈ నీరంతా జూరాలకు చేరి నిల్వ పెరగడంతో జూరాల నుంచి నీటి విడుదల మొదలైంది. నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1 ద్వారా 1,300 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ ద్వారా 315 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తుండగా కుడి, ఎడమ కాల్వలకు 900 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేశారు. దీంతోపాటు జూరాల విద్యుదుత్పత్తి ద్వారా 21 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండటంతో ఆ నీరంతా శ్రీశైలం దిశగా పరుగులు తీస్తోంది. జూరాల నుంచి విడుదలైన జలాలు గురువారం ఉదయానికి శ్రీశైలం చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను 31 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వ ఉంది. ఇక్కడ నీటి నిల్వ 854 అడుగులకు చేరిన వెంటనే తెలంగాణ, ఏపీ నీటి వినియోగం మొదలు పెట్టనున్నాయి. ఇప్పటికే కల్వకుర్తి ద్వారా నీటి ఎత్తిపోతలకు పంపులు సిద్ధం చేసుకోవాలని సీఎం కేసీఆర్ ఇంజనీర్లను ఆదేశించారు. గతేడాదితో పోలిస్తే జూరాల జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి 10 రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. -
ఇక ఎత్తిపోసుడే
సాక్షి, హైదరాబాద్: ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన కృష్ణా జలాలు మంగళవారం ఉదయానికి జూరాల చేరనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జూరాలకు వచ్చే నీటిని వచ్చినట్లుగా ఎత్తిపోసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంది. జూరాల నిర్ణీత మట్టాలకు నిల్వ చేరిన వెంటనే నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పంపులను ప్రారంభించి కృష్ణా జలాల ఎత్తిపోతలను చేపట్టనుంది. గతేడాది 50 టీఎంసీల మేర నీటిని జూరాలపై ఆధారపడిన ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు తరలించగా ఈ ఏడాది అంతకుమించి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఎగువ నుంచి రాగానే ఎత్తిపోత పశ్చిమ కనమల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి వరద ఉధృతి పెరిగిన విషయం తెలిసిందే. సోమవారం సైతం ఆల్మట్టిలోకి లక్ష క్యూసెక్కుల మేర వరద వస్తుండగా అంతే మొత్తం నీటిని దిగువ నారాయణపూర్‌కు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టిలో ప్రస్తుతం 129 టీఎంసీలకుగాను 123 టీఎంసీల మేర నిల్వ ఉంది. ఇక నారాయణపూర్‌లో సైతం 37 టీఎంసీలకుగాను 32 టీఎంసీల నిల్వ ఉండగా అందులోంచి 18 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదిలారు. ఈ నీరు జూరాల వైపు వస్తోంది. సోమవారం మధ్యాహ్నమే జూరాలకు ముందున్న కర్ణాటకలోని గూగల్ బ్యారేజీని కృష్ణా వరద దాటగా మంగళవారం ఉదయానికి జూరాలను చేరుకోనుంది. జూరాలలో ప్రస్తుతం 9.66 టీఎంసీలకుగాను 1.99 టీఎంసీల మేర నిల్వ ఉంది. ఇందులో మరో 5 టీఎంసీల నీరు చేరిన వెంటనే భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు పంపులు ప్రారంభం కానున్నాయి. దీంతోపాటే జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగనుంది. చర్యలు చేపట్టండి: కేసీఆర్ గోదావరి పరిధిలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతోపాటు కడెం, ఎల్లంపల్లిలో వరద మొదలైనందున వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వరద నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీర్లను ఆదేశించారు. ప్రాజెక్టుల్లో వరద పరిస్థితిపై కేసీఆర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కడెంకు చేరుకుంటున్న వరదతో ప్రాజెక్టు నిండి ఎల్లంపల్లికి వరద చేరుకునే అవకాశం ఉండటంతో గోలివాడ వద్ద ఉన్న పంపుల్లో ఎన్ని మోటార్లను నడిపిస్తారో పరిశీలించి నీటిని ఎత్తిపోయాలన్నారు. అలాగే కృష్ణా బేసిన్లో భారీ వరదలు వస్తున్నందున దానిపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ద్వారా గరిష్ట నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. శ్రీశైలానికి వరద చేరిన వెంటనే కల్వకుర్తి పంపులను సైతం నడిపించి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్నారు. దీంతోపాటే ప్రతి బ్యారేజీ వద్ద గేట్ల నిర్వహణ, పంపులు మోటార్ల మరమ్మతు పనులు ఉంటే తక్షణమే చేసుకొని ఇంజనీర్లు ఆయా ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశానికి సీఎంవో స్మితా సబర్వాల్, ఓఎస్డీ శ్రీపతి దేశ్‌పాండే, ఈఎన్సీ మురళీధర్ తదితరులు హాజరయ్యారు. -
ఎత్తిపోతలకు సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్ : మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, మహాబలేశ్వర్‌లో ఒక్క రోజులోనే 24 సెంటీమీటర్ల వర్షం కురవడంతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు జలకళ పెరుగుతోంది. ఇప్పటికే ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండుకోవడం.. మరో నాలుగైదు టీఎంసీల నీరు ప్రాజెక్టులకు చేరితే ఆపై వచ్చే నీరంతా దిగువకు విడుదల చేసే అవకాశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో వారం, పది రోజుల్లోనే జూరాలకు ప్రవాహాలు కొనసాగే అవకాశాల నేపథ్యంలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎత్తిపోసేందుకు అంతా సిద్ధం చేయాలని నీటి పారుదల శాఖ ఇంజనీర్లను సీఎం కేసీఆర్ శనివారం ఆదేశించారు. ముఖ్యంగా నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పంపులను సిద్ధం చేసుకోవాలని ఆదేశించిన సీఎం వాటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓ అండ్ ఎం) నిధుల విడుదలకు ఓకే చెప్పారు. నిండుకుండలా ఆల్మట్టి ఇప్పటికే కురిసిన వర్షాలతో ఆల్మట్టి పూర్తిగా నిండింది. నిన్నమొన్నటి వరకు ప్రాజెక్టులోకి ప్రవాహాలు తగ్గి 11వేల క్యూసెక్కుల మేర వరద పోటెత్తగా.. అది శనివారం ఉదయానికి 22,593 క్యూసెక్కులకు, సాయంత్రానికి 25వేల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్ధ్యం 129 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 124.50 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వచ్చే వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకొని జలాశయాన్ని పూర్తిగా నింపకుండా కొంత ఖాళీగా ఉంచనున్నారు. ప్రస్తుతం ఆల్మట్టి నుంచి విద్యుదుత్పత్తి ద్వారా 3,045 క్యూసెక్కుల నీటిని నారాయణపూర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో నారాయణపూర్‌లో నిల్వ 37 టీఎంసీలకు గానూ 31 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి 3,628 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 7,537 క్యూసెక్కుల నీటిని సాగునీటి అవసరాలకై కాల్వలకు వదులుతున్నారు. ప్రస్తుతం ఎగువ మహాబలేశ్వర్, పశ్చిమకనుమల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి లక్ష క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పైనున్న ప్రాజెక్టులు నిండిన నేపథ్యంలో.. నీటిని దిగువకు విడుదల చేయక తప్పనిసరి స్థితి ఏర్పడుతుంది. వరద ఉధృతిని బట్టి రెండు, మూడు రోజుల్లోనే ఆల్మట్టి గేట్లు ఎత్తే అవకాశం ఉందని, నారాయణపూర్ నుంచి కాల్వలకు నీటి విడుదల జరిగినా, వారం, పది రోజుల్లో ఆ నీరు దిగువ జూరాలకు చేరుతుందని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. వచ్చింది వచ్చినట్లే ఎత్తిపోత ఇక జూరాలకు వరద ప్రవాహం మొదలైన వెంటనే నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల పంపుల ద్వారా నీటి ఎత్తిపోత మొదలెట్టాలని, వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎత్తిపోసేలా కార్యాచరణకు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో పంపులను సిద్ధం చేసే పనిలో ఇంజనీర్లు నిమగ్నమయ్యారు. గతేడాది జూరాల కుడి, ఎడమ కాల్వల కింద ఉన్న లక్ష ఎకరాలకు 23 టీఎంసీల నీటి వినియోగించారు. ఈ నీటితో 149 చెరువులను సైతం నింపారు. ఈ ఏడాది లక్ష ఎకరాలకు నీరిచ్చేలా ఇప్పటికే అంతా సిద్ధం చేశారు. బీమాలోని రెండు స్టేజ్‌ల లిఫ్టు వ్యవస్థల ద్వారా గతేడాది 12 టీఎంసీల నీటిని వినియోగించి 1.2లక్షల ఎకరాలకు నీరందించగా, ఈ ఏడాది 1.70లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రెడీ అయింది. దీని ద్వారా కనీసంగా 180 చెరువులను నింపాలని భావిస్తున్నారు. ఇక నెట్టెంపాడు కింద 2లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా గతేడాది 7 టీఎంసీల నీటితో 80వేల ఎకరాలకు నీరందించగా, ఈ ఏడాది ఎత్తిపోసే నీటిని బట్టి 1.5లక్షల ఎకరాలకు నీరివ్వాలని, వందకు పైగా చెరువులు నింపాలని నిర్ణయించారు. ఇక కోయిల్‌సాగర్ ద్వారా సైతం 33వేల ఎకరాలకు నీరిచ్చేలా పంపులను తిప్పేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ప్రాజెక్టు పంపుల నిర్వహణ (ఓఅండ్ఎం)కు నిధుల అవసరం ఉండటంతో ఇంజనీర్లు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో బీమా మొదటి లిఫ్ట్‌కి రూ.3.40కోట్లు, లిఫ్టు–2కి రూ.4.66కోట్లు, నెట్టెంపాడుకు రూ.4.98కోట్లు, కోయిల్‌సాగర్‌కు రూ.2.34కోట్లకు సీఎం ఆమోదముద్ర లభించింది. వీటితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల ఓఅండ్ఎం కోసం రూ.6.30కోట్లకు ఆమోదం తెలిపారు. ఈ నిధులతో పంపులు, మోటార్లకు గ్రీజింగ్, ఆయిలింగ్, విద్యుత్ జనరేటర్లు ఏర్పాట్లు చేసుకోనున్నారు. కనిష్టంగా 50 టీఎంసీలు, గరిష్టంగా 70 టీఎంసీల నీటిని జూరాల, దానిపై ఆధారపడిన ప్రాజెక్టుల ద్వారా పంపింగ్ చేసి నీటి సరఫరా చేసేలా ఇంజనీర్లు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
బిరబిరా కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసుల దాహార్తిని తీర్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవ కార్యరూపం దాల్చింది. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి దిగువన ఉన్న జూరాలకు కర్ణాటక జల వనరుల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. నారాయణపూర్ డ్యామ్‌లో సరి పడినంత నీటి లభ్యత లేకపోవడంతో ఆల్మట్టి నుంచి శుక్రవారం అర్ధరాత్రి నారాయణపూర్‌కు నీరు విడుదల చేశారు. ఆల్మట్టి నుంచి విడుదలైన నీరు ఆదివారం నారాయణపూర్‌కు చేరిన తర్వాత.. అక్కడి నుంచి జూరాలకు నీటి విడుదల ప్రక్రియ కొనసాగనుంది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీఎం కోరడం, దానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే నారాయణపూర్ సామర్థ్యం 37.64టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 18.08 టీఎంసీల నీరుమాత్రమే ఉంది. నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరడంతో దిగువకు నీటి విడుదల సాధ్యం కాదు. దీంతో ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌కు నీటి విడుదల తప్పనిసరయింది. ఆల్మట్టిలోనూ 129.72 టీఎంసీల నిల్వలకు గానూ 30.38 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక్కడ డెడ్‌స్టోరేజీకి ఎగువన కేవలం 12 టీఎంసీల నిల్వలే ఉన్నప్పటికీ తెలంగాణ అవసరాల దృష్ట్యా శుక్రవారం అర్ధరాత్రి డ్యామ్ స్పిల్‌వే ద్వారా 5,161 క్యూసెక్కులు, పవర్‌హౌజ్ ద్వారా మరో 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు ఆదివారం ఉదయం నారాయణపూర్‌కు చేరే అవకాశం ఉంది. నారాయణపూర్‌లో కొద్దిగా నిల్వలు పెరిగిన వెంటనే స్పిల్‌వే ద్వారా జూరాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నారాయణపూర్ నుంచి జూరాలకు 180 కిలోమీటర్ల దూరం ఉండగా, మధ్యలో కర్ణాటకలోని గూగల్, గిరిజాపూర్ అనే చిన్నపాటి రిజర్వాయర్లను దాటుకొని నీరు జూరాలకు చేరాల్సి ఉంటుంది. ఇలా జూరాలకు నీరు చేరేందుకు వారం రోజులు పట్టనుండగా, కనీసం ఒక టీఎంసీ నీరు జూరాలకు చేరే అవకాశం ఉంటుందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఈ నీటితో జూన్ రెండో వారం వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ భగీరథ కింద తాగునీటి అవసరాలకు సర్దుబాటు చేయవచ్చని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
జూరాలకు 2.5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఈ వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక సీఎం కుమారస్వామికి కేసీఆర్ శుక్రవారం ఫోన్ చేసి కోరారు. కేసీఆర్ అభ్యర్థనపై అక్కడి అధికారులతో చర్చించిన కుమార స్వామి తెలంగాణకు నీరు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి కేసీఆర్‌కు తెలిపారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త అని కేసీఆర్ అన్నారు. ఆ జిల్లా ప్రజల తరఫున కుమారస్వామికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. వారం రోజుల్లో జూరాలకు... నిజానికి జూరాల వాస్తవ నీటి నిల్వ సామర్ధ్యం 9.66 టీఎంసీ కాగా ప్రస్తుతం అందులో కేవలం 1.93 టీఎంసీల నీటి నిల్వే ఉంది. పూర్తిగా డెడ్‌స్టోరేజీకి నిల్వలు చేరడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ భగీరథ కింద తాగునీటి అవసరాలు తీరడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి నీటి విడుదల అవస్యం కావడంతో కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి నీటి విడుదలకు ఒప్పించారు. ప్రస్తుతం ఎగువ నారాయణపూర్‌లో 37.64 టీఎంసీలకు గానూ 18.64 టీఎంసీల నిల్వలున్నాయి. అయితే ఇక్కడ ఎండీడీఎల్ పరిధిలోనే నీరుండటంతో ఆల్మట్టిలో లభ్యతగా ఉన్న 31.58 టీఎంసీల నిల్వల నుంచి కర్ణాటక నారాయణపూర్‌కు నీటి విడుదల చేసి, అటు నుంచి జూరాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. శుక్రవారం అర్ధరాత్రి లేక శనివారం నీటి విడుదల మొదలు పెట్టినా, వారం రోజుల్లో నీరు జూరాలకు చేరుతుందన్నారు. ఒక టీఎంసీ నీరు జూరాలను చేరినా జూన్ మొదటి వారం వరకు మహబూబ్‌గనర్ జిల్లా తాగునీటి అవసరాలు తీరినట్టేనని పేర్కొంటున్నారు. -
కర్ణాటక సీఎం కుమారస్వామికి కేసీఆర్ ఫోన్
-
కుమారస్వామితో ఫలించిన కేసీఆర్ దౌత్యం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం కర్ణాటక సీఎం కుమారస్వామితో ఫోన్లో మాట్లాడారు. జూరాలకు నీటి విడుదలపై ఆయన ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చించారు. జూరాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేసీఆర్ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కుమారస్వామి ప్రభుత్వం ...ఒకటి, రెండు రోజుల్లో నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కుమారస్వామితో ఫలించిన కేసీఆర్ దౌత్యం కాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఈ వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని సీఎం కేసీఆర్ అభ్యర్థించారు. కేసీఆర్ అభ్యర్థనపై కర్ణాటక అధికారులతో చర్చించిన సీఎం కుమారస్వామి తెలంగాణకు నీరు అందివ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కుమారస్వామి స్వయంగా ఫోన్ చేసి సీఎం కేసీఆర్ కు తెలిపారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త అని కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరఫున కుమారస్వామికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ, స్నేహ సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. కాగా, ఈ రోజు సాయంత్రం నుంచి జూరాలకు నీటి సరఫరా ప్రారంభం కానున్నది. -
జూరాలకు నేడు వరద
నారాయణపూర్ నుంచి 20 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల - ఉజ్జయిని డ్యామ్ నుంచి వస్తున్న 32 వేల క్యూసెక్కుల ప్రవాహాలు - ఇప్పటికే జూరాలకు కొనసాగుతున్న 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటకలలో భారీ వర్షాలకు అక్కడి ప్రాజెక్టులు నిండటంతో రాష్ట్రంవైపు కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. మహారాష్ట్రలోని ఉజ్జయిని ప్రాజెక్టు నుంచి 32 వేల క్యూసెక్కులు, కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి సుమారు 20 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయడంతో జూరాలవైపు వరద పరుగులెడుతోంది. శనివారం నాటికి ఈ ప్రవాహాలన్నీ కలిసి జూరాలకు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే జూరాల దాదాపు నిండటంతో దిగువనున్న శ్రీశైలానికి నీటి విడుదల జరిగే అవకాశం ఉంది. 6 టీఎంసీల మేర వరద వచ్చే అవకాశం మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ప్రాంతంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ప్రధాన ప్రాజెక్టు కోయినా డ్యామ్‌తోపాటు ఇతర చిన్న తరహా ప్రాజెక్టులన్నీ నిండటంతో దిగువన కర్ణాటకకు ఉధృతంగా ప్రవాహాలు వస్తున్నాయి. ఆల్మట్టి డ్యామ్‌లోకి గురువారం ఉదయం 56 వేల క్యూసెక్కుల మేర వరద రాగా సాయంత్రానికి అది మరింత పెరిగినట్లు నీటిపారుదల వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో అక్కడి నుంచి 33,750 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నారాయణపూర్‌కు వదులుతున్నారు. ఇప్పటికే నారాయణపూర్ పూర్తిగా నిండటంతో ప్రాజెక్టు నుంచి 16 వేల క్యూసెక్కులను స్పిల్‌వే ద్వారా, మరో 4,800 క్యూసెక్కులను పవర్‌హౌస్ ద్వారా దిగువకు వదులుతున్నారు. ఇక ఉజ్జయినీ డ్యామ్ నుంచి 30 వేల క్యూసెక్కులు స్పిల్ వే ద్వారా, మరో 2 వేల క్యూసెక్కులు పవర్‌హౌస్ ద్వారా విడుదలవుతున్నాయి. దీంతో జూరాలకు శనివారం నాటికి 50 వేలకుపైగా క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జూరాలకు వస్తున్న 10 వేల క్యూసెక్కుల ప్రవాహానికి ఎగువ ప్రవాహాలు జత కలిస్తే 6 టీఎంసీల నీరొచ్చే అవకాశముంది. ప్రస్తుతం జూరాలలో 9.66 టీఎంసీల నిల్వకుగాను 7.97 టీఎంసీల నిల్వ ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా శ్రీశైలానికి విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీల నిల్వకుగాను 24.13 టీఎంసీలే ఉన్నాయి. -
జూరాల నీటి విడుదలకు చర్యలు: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, పాలమూరు రైతాంగ అవసరాలకు అనుగుణంగా జూరాల నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. గురువారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, గద్వాల నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి కృష్ణమోహన్‌రెడ్డి, ఈఎన్సీ మురళీధర్‌రావు, జూరాల ఎస్ఈ రఘునాథ్‌లతో కలసి మంత్రి సమీక్షించారు. నారాయణపూర్, ఆల్మట్టి నుంచి వస్తున్న వరద నీటిపై చర్చించారు. జూరాల నుంచి భీమా ఫేజ్ 1, ఫేజ్ 2తోపాటు కోయిల్ సాగర్, నెట్టెంపాడులకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. ఎగువన ఉన్న కర్ణాటక నుంచి నీటి విడుదలకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు. -
అవసరమైన సిబ్బంది వివరాలివ్వండి...
జూరాల, సింగూరు భద్రతపై కదిలిన నీటిపారుదల శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగు, తాగు నీటి ప్రాజెక్టులైన జూరాల, సింగూరు డ్యామ్‌ల నిర్వహణ విషయంలో నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ ఫిబ్రవరి 20న ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనంపై ఆ శాఖ అధికారులు స్పందించారు. ఈ డ్యామ్‌ల భద్రతకు పెద్దపీట వేయాల్సిన నీటి పారుదల శాఖ అధికారులు వాటి నిర్వహణ, అందుకు తీసుకోవా ల్సిన చర్యల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అంశంపై ఈఎన్సీ మురళీధర్ సోమవారం సంబంధిత వెకానికల్ అండ్ వర్క్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వివరణ కోరారు. ప్రాజెక్టుల పరిధిలో ప్రస్తుతం ఉన్న గేట్లు, క్రేన్స్, జనరేటర్ల వివరాలు అడిగారు. గ్రీజింగ్, వెల్డింగ్, గేట్ల నిర్వహణకు అవసరమైన సిబ్బంది గురించి కూడా వివరాలు కోరినట్లు నీటి పారుదల శాఖ వర్గాల ద్వారా తెలిసింది. కాగా జూరాల పరిధిలో వర్క్ ఇన్స్పెక్టర్, గేటు ఆపరేట్లర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, వాచ్మెన్లు, ఆపరేటర్లు కలిపి మొత్తంగా 19మంది వరకు అవసరం ఉండగా.. ప్రస్తుతం ఒక్క ఉద్యోగి కూడా అక్కడ లేడు. సింగూరు పరిధిలోనూ 13 మంది సిబ్బంది అవసరం ఉండగా ఒక హెల్పర్, ఇద్దరు వాచ్మెన్లు మాత్రమే ఉన్నారు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ నీటిపారుదల శాఖ దృష్టికి తెచ్చింది. -
శ్రీశైలం డ్యాం నీటిమట్టం 880.60 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 880.60 అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నం వరకు ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి వస్తున్న 8వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నిలిచిపోయింది. శ్రీశైలం జలాశయం నుంచి 32,041 వేల క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతాలకు విడుదలవుతోంది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో నాలుగు జనరేటర్లతో ఉత్పత్తి చేస్తూ 23,341 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. అలాగే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 6వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2,700 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 191.2118 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
జూరాలకు జలకళ
8 క్రస్టుగేట్ల ఎత్తివేత లక్ష 18వేల క్యూసెక్కులు విడుదల శ్రీశైలానికి బిరబిరా కష్ణమ్మ జూరాల : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో శనివారం భారీగా వరదనీరు వచ్చి చేరింది. లక్షా 26వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 8 క్రస్టుగేట్లను తెరచి 84,176 క్యూసెక్కుల వరద నీటిని స్పిల్‌వే ద్వారా విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి ద్వారా 32వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మొత్తం 1,18,756 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని శ్రీశైలం రిజర్వాయర్‌కు వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.41 టీఎంసీల నీటినిల్వ కొనసాగిస్తున్నారు. కోయిల్‌సాగర్‌కు 630 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 1500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువలకు 450 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటినిల్వను కొనసాగిస్తున్నారు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో 29,057 క్యూసెక్కులు వస్తుండగా మూడు గేట్లను తెరచి 11,500 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కులు, మొత్తం 56,500 క్యూసెక్కుల వరద నీటిని నారాయణపూర్‌కు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.28 టీఎంసీల నీటినిల్వ ఉంది. రిజర్వాయర్‌కు 52,340 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 9 గేట్లను తెరచి 61,560 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 6వేల క్యూసెక్కులు మొత్తం 67,560 క్యూసెక్కుల వరద నీటిని జూరాల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. -
జూరాలకు 14వేల క్యూసెక్కులు
జూరాల : కృష్ణానది పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు బుధవారం 14వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ 9.65టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.41టీఎంసీలుగా ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాలువలకు 450క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 750క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీని నుంచి ఎత్తిపోతల పథకాలు నెట్టెంపాడుకు 1,500క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 630క్యూసెక్కులు, భీమా లిఫ్ట్–1కు 1,300క్యూసెక్కులు, లిఫ్ట్–2 ద్వారా 750క్యూసెక్కులను అధికారులు పంపింగ్ చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద పెరిగింది. 56,319క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో ఈ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ 129.72టీఎంసీలు కాగా ప్రస్తుతం 122.83టీఎంసీలుగా ఉంది. విద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ ఇన్‌ఫ్లో వరద శుక్రవారం నాటికి జూరాల ప్రాజెక్టుకు చేరుకునే అవకాశముంది. అలాగే నారాయణపూర్ ప్రాజెక్టుకూ ఇన్‌ఫ్లో పెరిగింది. ప్రస్తుతం 35,908క్యూసెక్కుల వరద వస్తుండగా నీటినిల్వ మట్టాన్ని పెంచుతూ ఆరువేల క్యూసెక్కులను విద్యుదుత్పత్తి ద్వారా జూరాల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. -
స్వల్పంగా పెరిగిన శ్రీశైలం నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైల జలాశయ నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. శుక్రవారం 872.40 అడుగులుగా ఉన్న నీటిమట్టం శనివారం సాయంత్రం సమయానికి 872.60 అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నం నుంచి జూరాల నుంచి శ్రీశైలానికి విడుదలయ్యే నీరు నిలిచిపోయింది. రెండు జలవిద్యుత్ కేంద్రాలలో ఎటువంటి ఉత్పాదన జరగలేదు. జలాశయంలోని బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 4,500 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 152.8314 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. -
శ్రీశైలానికి పెరిగిన వరద
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయానికి మంగళవారం వరద ప్రవాహం పెరిగింది. జూరాల నుంచి 16వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో మంగళవారం 24వేల క్యూసెక్కులకు చేరుకుంది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 26,338 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 19,519 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రేగ్యులేటర్ ద్వారా 4,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 150.8076 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 872.10 అడుగులకు చేరుకుంది. -
శ్రీశైలం డ్యాం నీటి మట్టం 872.40 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యాం నీటిమట్టం సోమవారం సాయంత్రం సమయానికి 872.40 అడుగులకు చేరుకుంది. ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో పెరిగింది. శ్రీశైలానికి 16వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 26,406 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 19,881 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 4,500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 151.8195 టీఎంసీల నీరు నిల్వ ఉంది.