కళకళలాడుతున్న జూరాల రిజర్వాయర్
ధరూరు: ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో శనివారం తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టుకు ఉదయం 32,270 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరగా రాత్రి 7.30గంటల వరకు 25వేల క్యూసెక్కులకు తగ్గింది. రాత్రి 8గంటల వరకు జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.400 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులో 9.418 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సమాంతర కాలువ ద్వారా 1500 క్యూసెక్కులు వదులుతున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్ ద్వారా 1500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్టు ద్వారా 630 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి అనంతరం 16వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 20,430 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
జెన్‌కో జలవిద్యుత్ కేంద్రంలోని ఐదు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేస్తున్న జెన్‌కో అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో దశల వారిగా ఒక్కో యూనిట్‌ను నిలుపుదల చేస్తూ వచ్చారు. చివరకు రాత్రి 8గంటల వరకు 1, 2 యూనిట్ల విద్యుదుత్పత్తి నిమిత్తం 16వేల క్యూసెక్కుల నీటిని వినియోగించుకొని పూర్తి స్థాయిలో 78 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు జెన్‌కో అధికారులు చెప్పారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్లు తెలిపారు.
ఇదిలాఉండగా ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 36.54 టీఎంసీలుగా ఉంది. ఈ ప్రాజెక్టుకు 4829 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా విద్యుదుత్పత్తి, కెనాల్స్ ద్వారా 4681 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 128.19 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టుకు 26,889 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 5836 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లు పీజేపీ అధికారులు చెప్పారు.