Dharur
-
కాపురానికి వెళ్లిన యువతిపై కన్నేసిన యువకుడు.. తీరా..
ధరూరు: తన కోరిక తీర్చాలంటూ ఓ వివాహితను వేధించడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో వేధించిన యువకుడితో పాటు సహకరించిన 8 మందిపై కేసు నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా రేవులపల్లి ఎస్ఐ రవి కథనం ప్రకారం.. మండలంలోని మార్లబీడుకు చెందిన రేణుక (20)కు కొన్ని నెలల కిందట జాంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. చదవండి: మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని మరదలుకు చెప్పి ఈ క్రమంలో ఈనెల 25వ తేదీన వ్యవసాయ పొలానికి వెళ్లింది. ఒంటరిగా ఉన్న రేణుకను అదే గ్రామానికి చెందిన గాళ్ల వీరేశ్ తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. అదే గ్రామానికి చెందిన వీరేశ్ బంధువులు మరో ఎనిమిది మంది వీరేశ్‌ను పెళ్లి చేసుకోవాలని వేధించారు. దీంతో 26న ఆమె తన పుట్టింటికి మార్లబీడు వెళ్లింది. తీవ్ర మనస్తాపంతో 28న రేణుక మంగళవారం మార్లబీడులో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కర్నూలులోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రేవులపల్లి ఎస్ఐ రవి తెలిపారు. చదవండి: హుజురాబాద్.. తుపాకులు అప్పగించాలె.. లేదంటే -
ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..?
ధరూరు: ప్రో కబడ్డీ పోటీలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావాసి ఎంపికయ్యాడు. త్వరలో జరగనున్న ప్రో కబడ్డీ పోటీల్లో తెలుగు టైటాన్స్ జట్టు తరఫున జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని భీంపురం గ్రామానికి చెందిన గాళ్ల రాజురెడ్డి బరిలోకి దిగనున్నాడు. తెలుగు టైటాన్స్ జట్టుకు నడిగడ్డ ప్రాంతానికి చెందిన యువకుడు ఎంపికవడంపై ఉమ్మడిజిల్లావ్యాప్తంగా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంత కబడ్డీ ఆటగాళ్లతోపాటు అసోసియేషన్ నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొనే జట్టుకు రాజురెడ్డి ఎంపికవడం జిల్లాకే గర్వకారణమని సామాజిక కార్యకర్త సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. పోటీల్లో బాగా రాణించి జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా రాజురెడ్డిని పలువురు అభినందించారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
ఇంటి స్లాబ్ వేస్తుండగా విద్యుదాఘాతం
ధారూరు/వికారాబాద్: ఇంటికి స్లాబ్ వేయిస్తున్న క్రమంలో ఇంటి యజమాని, మేస్త్రీకి విద్యుదాఘాతం కావడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ధారూరు మండల పరిధిలోని కేరెళ్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ధారూరు మండంల కేరెళ్లి గ్రామనికి చెందిన చంద్రారెడ్డి(55) గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి ఆదివారం స్లాబ్ వేయించారు. కూలీలంతా కిందకు దిగినప్పటికీ పైన సెంట్రింగ్ మేస్త్రీ సురేష్ మాత్రం చంద్రారెడ్డి సూచన మేరకు పైనే ఉన్నాడు. ఇంటిపైకీ ఎవరు ఎక్కకుండా కింద ఉన్న ఇనుపరాడ్‌ను మెట్లపై అడ్డంగా పెట్టేందుకు పైకీ తీసుకెళ్లాడు చంద్రారెడ్డి. ఇనుపరాడ్‌ను అడ్డంగా పెట్టేందుకు ప్రయతి్నస్తున్న సమయంలో పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు ఇనుపరాడ్ తగిలింది. యజమానిని రక్షించబోయిన మేస్త్రీ సురేష్ కూడా షాక్‌కు గురియ్యాడు. విద్యుత్ షాక్‌తో ఇద్దరూ భవనం పైనుంచి కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మొదట వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారుల తీరుపై మండిపడ్డ గ్రామస్తులు.. కొత్త ఇంటి నిర్మాణానికి స్లాబ్ వేస్తున్నామని, విద్యుత్ సరఫరాను నిలిపివేయాలనీ చంద్రారెడ్డి విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నారు. వారెవరు వినలేరని, గత్యంతరం లేక జాగ్రత్తగా స్లాబ్ వేయించిన ఇనుపరాడ్ మెట్లకు అడ్డంగా పెట్టేందుకు ప్రయతి్నస్తూ షాక్‌కు గురిౖయె ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వాపోయారు. అధికారుల నిర్లక్షమే చంద్రారెడ్డి, మేస్త్రీ ప్రమాదానికి కారణమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ మరో ఘటనలో బాలుడికి గాయాలు.. దోమ: విద్యుదాఘాతంతో బాలుడికి గాయాలైన సంఘటన మండల పరిధిలోని గుండాల్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన కోళ్ల రవి, చెన్నమ్మ దంపతుల కుమారుడు శ్రీకాంత్ చెయ్యి విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుదాఘతానికి గురై కొట్టుకుంటుండంగా మరో బాలుడు పట్టుకునే ప్రయత్నం చేశాడు. అతడికి కూడా విద్యుత్‌షాక్ తగలడంతో పక్కకు జరిగి కేకలు వేశాడు. అటుగా వెళ్తున్న గ్రామానికి చెందిన జనుమాండ్ల వెంకట్‌రెడ్డి గమనించి వెంటనే కర్రతో కొట్టగా శ్రీకాంత్ కిందపడిపోయాడు. వెంటనే కొస్గీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా రెండు నెలల క్రితం గ్రామస్తులకు ఆసరా పెన్షన్లు, రేషన్ బియ్యం అందించేందుకు పాఠశాల ఆవరణలో విద్యుత్ సరఫరా తీసుకుని అలాగే వదిలివేశారు. అతుకులతో కూడిన విద్యుత్ కనెక్షన్ తొలగించాలని గ్రామస్తులు చెప్పిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవ్వరూ పట్టించుకలేదని గ్రామస్తులు తెలిపారు. -
నాలుగు మాటలు.. ఆరు హత్యలు..
వికారాబాద్: ఒంటరి మహిళలతో స్నేహం చేయడం.. మద్యం తాగించి, మాయమాటలు చెప్పడం.. పథకం ప్రకారం హత్య చేయడం.. ఆపై బంగారం, డబ్బు దోచుకోవడం.. ఇదీ ఓ కిరాతకుడి బాగోతం.. ఇలా ఇప్పటికి ఆరు హత్యలు చేశాడు. గతంలో పలుసార్లు జైలుకు కూడా వెళ్లాడు. ఇటీవల జరిగిన ఓ మహిళ హత్య కేసును ఛేదిస్తున్న పోలీసులకు కిల్లర్ పట్టుబడ్డాడు. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం అల్లీపూర్‌కు చెందిన మాల కిష్టప్పపై పలు కేసులు నమోదయ్యాయి. ధారూర్ మండలం అవుసుపల్లికి చెందిన అమృతమ్మ (38) కూలీ పనులు చేసేందుకు వికారాబాద్‌లోని అడ్డాకు వచ్చింది. చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో భర్త చంద్రయ్య వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, సిరిగేట్‌పల్లి రైల్వే గేటు సమీపంలో పొలం పక్కన మృతదేహం ఉందన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరున్నారు. ఆ మృతదేహం అమృతమ్మదేనని గుర్తించారు. మృతురాలి శరీరంపై నగలు లేకపోవడాన్ని గమనించిన పోలీసులు ఎవరో బంగారం, నగదు కోసమే హత్య చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలతో ఆరా.. దర్యాప్తులో భాగంగా వికారాబాద్‌లోని కూలీల అడ్డా వద్దకు వెళ్లి ఆరా తీశారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలతో కేసును ఛేదించే యత్నం చేశారు. ఆ రోజు ఉదయం అడ్డా నుంచి ఆటోలో అమృతమ్మ ఆలంపల్లి వైపు వెళ్లినట్లు గమనించారు. దీంతో పాటు ఓ బంగారం తాకట్టు దుకాణంలో బంగారాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేయగా ఆధార్ కార్డు లేకపోవడంతో పెట్టుకోలేదు. హత్య ఇలా చేశాడు.. అల్లీపూర్‌కు చెందిన మాల కిష్టప్ప అమృతమ్మకు ఉదయం కల్లు తాగించాడు. అనంతరం ఆటోలో కొత్తగడి వైపు వెళ్లి సిరిగేట్‌పల్లికి వెళ్లే రోడ్డు వద్ద ఆటో దిగారు. ఇద్దరూ నడుచుకుంటూ రైల్వే బ్రిడ్జి సమీపంలోని ఓ పొలంలోకి వెళ్లారు. ఈమె మద్యం మత్తులో ఉండగా, హత్య చేసి పారిపోయినట్లుగా గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని పారిపోయాడు. 1985 నుంచి నేర చరితుడే.. 50 ఏళ్ల కిష్టప్ప ధారూరు పరిధిలో 1985లో మొదటి హత్య చేయగా, 2008లో వికారాబాద్ పీఎస్ పరిధిలో ఓ హత్య చేశాడు. 2008లో తాండూరులో హత్య చేసి బంగారం దోచుకున్నాడు. 2010లో యాలాల పీఎస్ పరిధిలో సెల్‌ఫోన్, డబ్బుల కోసం హత్య చేశాడు. 2016లో వికారాబాద్‌లో హత్య చేసి డబ్బు, సెల్‌ఫోన్ తీసుకున్నాడు. గతంలో జరిగిన ఓ హత్య కేసులో ముగ్గురు పాల్గొనగా, మిగతావన్నీ తాను ఒక్కడు చేసినవే. మహిళలను హత్య చేయడంతో పాటు రెండు కేసుల్లో మహిళలను గుర్తు పట్టకుండా కాల్చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు పంపారు. -
కరోనా: క్యూలైన్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
సాక్షి, వికారాబాద్: ప్రభుత్వం ప్రకటించిన కరోనా సాయాన్ని తీసుకునేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఖాతాల్లో జమ అయిన రూ.1500 కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. కరోనా భయాల నేపథ్యంలో డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లిన ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ వరుసల్లో నిలుచోవడంతో కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పడుతున్నాయి. మీరు ఈ వీడియోలో చూస్తున్న దృశ్యాలు.. వికారాబాద్ జిల్లాలోని ధరూరు మండల కేంద్రం ఎస్బీఐ ధరూర్ శాఖ వద్ద రోడ్డుకు ఇరువైపులా మహిళలు వరుసలో నిలుచున్నవి. అయితే, వందలాది మంది సొమ్ము విత్ డ్రా కోసం ఎర్రటి ఎండలో బారులు తీరుతూ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు. ఈక్రమంలోనే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కేంద్రంలో నానోత్ కమల (45) అనే మహిళ శుక్రవారం గుండెపోటుకు గురై మృతి చెందారు. కరోనా ఆర్థిక సాయం కోసం తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద ఆమె క్యూలైన్లో నిలుచుండగా ఘటన జరిగింది. (చదవండి: గాంధీలో డ్యూటీ.. కానిస్టేబుల్‌కు కరోనా!) -
ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే.. విగ్రహ ప్రతిష్ఠ..!
సాక్షి, ధారూరు: రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిలో గుర్తుతెలియని వ్యక్తులు గుడిసెను ఏర్పాటు చేసి అందులో రాయిని ప్రతిష్ఠించి పూజలు చేసిన సంఘటన ధారూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలిపి వివరాల ప్రకారం.. ధారూరు మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాల పక్కన గల ప్రభుత్వ భూమిలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుడిసె వేసి పైన ఓ జెండాను ఏర్పాటు చేసి దేవాలయంగా మార్చారు. అందు లో రాయిని ప్రతిష్ఠించి పూజలు చేసి వెళ్లిపోయారు. ఉదయాన్నే గుడిసె దేవాలయాన్ని చూ సి ఆశ్చర్యానికి గురైన స్థానికులు, ఉర్ధూ మీడియం పాఠశాల సిబ్బంది విషయాన్ని పోలీ సులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే ధారూరు సర్కిల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ స్నేహవర్షతో పాటు రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సర్పంచ్ చంద్రమౌళిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీఆర్ఓ గోపాల్ పంచనామా నిర్వహించి పోలీసులకు వివరాలు అందజేయగా ఆకతాయి వ్యక్తులు చేసిన పనిగా నిర్ధారించుకొని అందరి సమక్షంలో గుడిసెను, అందులోని రాయిని తొలగించారు. -
భక్తిశ్రద్ధలతో మెథడిస్ట్ జాతర
సాక్షి, ధారూరు: ధారూరు మెథడిస్ట్ వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన క్రిస్టియన్ జాతర గురువారం మూ డో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కాలి నడకన వచ్చేవారి సంఖ్య అధికమవుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలోని గుల్బర్గా, బీదర్, బీజాపూర్, సోలాపూర్ నుంచి యువతీయువకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటే ఏసుక్రీస్తు తమ కోర్కెలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రధాన శిలువ వద్ద ప్రార్థనలు చేసేందుకు భక్తులు పోటీపడుతున్నారు. జాతరలో క్రీస్తు శిలువలు, బైబిల్ గ్రంథాలు, జీసస్ చిత్ర పటాలు, బ్యానర్లు, ఫొటోలను విక్రయిస్తున్నారు. వేడుకల ప్రాంగణంలో తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో క్రీస్తును స్మరిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. సీఐ రాజశేఖర్ అధ్వర్యంలో పోలీసులు వాహనాలను నియంత్రించి పార్కింగ్ స్థలాలకు మళ్లిస్తున్నారు. -
రేపటి నుంచి మెథడిస్ట్ క్రిస్టియన్ ఉత్సవాలు
సాక్షి, ధారూరు: దేశంలోనే ఎక్కడా జరగని మెథడిస్ట్ క్రిస్టియన్ ఉత్సవాలు ఈనెల 12వ తేదీ నుంచి వికారాబాద్ జిల్లా ధారూరులో ప్రారంభమవుతున్నాయి. విశాలమైన ప్రదేశం కాగ్నా నది పక్కన స్టేషన్‌ధారూరు–దోర్నాల్ గ్రామాల మధ్య ఉత్సవాలు కొనసాగుతాయి. 96 సంవత్సరాలుగా లక్షలాది మంది భక్తులతో ఉత్సవాలను నిర్వహించడం ప్రత్యేకం. ఈ సంవత్సరం కూడా దాదాపు 10 లక్షల మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్‌లో ఈ ఉత్సవాలను నిర్వహింస్తుంటారు. దాదాపు 35 ఎకరాల స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలు ఆరు రోజులపాటు కొనసాగుతాయి. ఉత్సవాలకు బీదర్, గుల్బర్గా, రాయచూర్, సోలాపూర్, బెంగళూర్, బెల్గాం, గోవా తదితర ప్రాంతాల నుంచే కాక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు. వీరితో పాటు విదేశాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారు. జాతరకు వచ్చే వీఐపీల కోసం నిర్వాహకులు తగిన సౌకర్యాలు కల్పిస్తునారు. 2019లో నిర్వాహకులు 97వ జాతరను కొనసాగిస్తున్నారు. ఉత్సవాల విశేషాలు జాతర ప్రధాన ప్రాంగణంలో ఇప్పచెట్లు ఆనవాళ్లు మెథడిస్ట్ క్రిస్టియన్ ఉత్సవాల్లో ఏసుక్రీస్తు నామంతో కీర్తనలు, భజనలు, ప్రార్థనలు హోరెత్తుతాయి. క్రీస్తు శిలువ దగ్గర ఆరు రోజులపాటు నిత్యం ప్రార్థనలు కొనసాగుతూనే ఉంటాయి. వక్తల ప్రసంగాలు, నిర్వాహకులతో వివిధ కార్యక్రమాలు కొనసాగుతాయి. జాతరకు వచ్చిన ప్రతి భక్తుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హుండీలలో బంగారం, వెండితో పాటు నగదును దానంగా వేస్తారు. ఏసుక్రీస్తు పేరుతో చాలా మంది గొర్రెలు, మేకలు, కోళ్ళు, కోడిగుడ్లు, ఆవులు దానంగా నిర్వాహకులకు అందజేస్తారు. ప్రభుత్వ ఏర్పాట్లు రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేస్తూ యాత్రికులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర మైనారిటి కమిషన్ చైర్మన్ ఖమ్రోద్దిన్, కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎస్పీ నారాయణ, డీఆర్ఓ మోతీలాల్, డీఆర్డీఓ జాన్సన్, జిల్లా పంచాయతి అధికారి రిజ్వాన, డివిజన్, మండల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక నిఘా యాత్రికుల నీటి అవసరాలను తీర్చే కాగ్నా నది జాతర ప్రాంగణంలో ప్రత్యేకంగా అన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ నిఘాను పెంచారు. కాగ్నా నదిపై ఉన్న పాత వంతెనను తొలగించి కొత్త వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో మట్టి రోడ్డు వేసి ఇరువైపుల బారికెడ్లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తాగునీటి వసతి, మరుగుదొడ్లు, స్నానాల గదులు, ఫ్లడ్‌లైట్లు, చెత్త కుండీలు, మెడికల్ క్యాంపు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. భారీ సంఖ్యలో పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ప్రత్యేక రైలు ధారూరు, బీదర్ మధ్యన ప్రత్యేక రైలు నడుస్తోంది. జాతర జరిగే రోజుల్లో హైదరాబాద్–ముంబాయి మధ్య కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ధారూరు స్టేషన్లో ఆగుతాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు వేసి ధారూరు జాతర ప్రాంగణం వరకు నడిపిస్తారు. -
మైకుల వైర్లు కట్ చేయించిన ఎస్సై!
సాక్షి, ధారూరు: మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వినాయకుల ఊరేగింపులో ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఓవరాక్షన్ చేసి హల్చల్ చేశారు. దీంతో యువత, భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఎస్ఐ ఎవరికీ చెప్పకుండా మైకులకు ఉన్న వైర్లను కట్‌చేసి సౌండ్ సిస్టంను బంద్ చేయించారు. దీంతో యువకులతోపాటు భక్తులు ఆందోళనకు దిగారు. మైకులకు అనుమతి ఇవ్వకుంటే వినాయక విగ్రహాలను కదలనివ్వమని, పోలీస్‌స్టేషన్‌లో విగ్రహాలను పెడతామని, పోలీసులే నిమజ్జనం చేసుకోవాలని స్పష్టం చేశారు. కొద్దిసేపు ఎస్ఐ పట్టించుకోకుండా ఊరుకున్నారు. దీంతో యువకులు పోలీసుల వాహనం ఎదుట బైఠాయించారు. ‘జై బోలో.. గణేశ్ మహరాజ్ కీ జై’ అంటూ నినదించారు. చివరకు ఎస్ఐ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సర్పంచ్ చంద్రమౌలి, గ్రామస్తులు చర్చలు జరిపారు. ధారూరు సీఐ రాజశేఖర్ జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో ఎస్ఐ మిన్నుకండిపోయారు. అనంతరం యువకులు శాంతించి నిమజ్జనం పూర్తి చేయడంతో సమస్య సద్దుమణిగంది. -
అంత్యక్రియలకు వస్తూ ...అనంతలోకాలకు
సాక్షి, ధారూరు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళుతూ ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ధారూరు మండలంలోని ఎబ్బనూర్ గ్రామానికి చెందిన చాకలి భీమయ్య(28) రోడ్డు ప్రమాదంలో గురువారం రాత్రి మృతిచెందాడు. కాగా, ఇదే గ్రామానికి చెందిన మృతుడి దాయాదులు చాకలి గోపాల్, జగన్ అన్నదమ్ములు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం గ్రామానికి వలస వెళ్లారు. మరణవార్త తెలుసుకున్న గోపాల్, జగన్‌లు శుక్రవారం ఉదయం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రామచంద్రాపురం నుంచి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో బయలుదేరారు. ఎబ్బనూర్ చెరువు మూలమలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ వీటి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీకొట్టింది. ఇందులో ప్రయాణిస్తున్న గోపాల్, జగన్ భార్యలు కమలమ్మ(44), శారద(32)తో పాటు జగన్ కూతురు అర్చన(11) అక్కడిక్కడే మృతిచెందారు. గోపాల్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఇతని పెద్ద కూతురు సంతోష(22) చేయి విరిగింది. జగన్ మొదటి కూతురు అక్షయ(13) తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయింది. క్షతగాత్రులను వెంటనే ప్రైవేటు వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో గోపాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఆటో నడుపుతున్న జగన్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. ఈ సంఘటనతో మండల ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతదేహాల వద్ద కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కాగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఎబ్బనూర్ గ్రామానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అన్నదమ్ములు కష్టజీవులు గోపాల్ సొంతంగా ఆటో కొనుగోలు చేసి నడుపుతుండగా, తమ్ముడు జగన్ తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తుంటాడు. వీరి భార్యలు దుస్తులు ఇస్త్రీ చేస్తూ కుటుంబ పోషణకు కొంత చేయూతను అందిస్తున్నారు. వారి పిల్లలను నివాసం ఉండే చోటు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోనే చదివిస్తున్నారు. గ్రామంలో ఉపాధి లేక అంతర్ జిల్లాకు వెళితే విధి వక్రీకరించి తమ భార్యలను కోల్పోయామని వారు రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. -
క్రికెట్ టోర్నీ ప్రారంభం
ధరూరు : క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు మానసికోల్లాసాన్నిస్తాయని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో ముస్తఫా స్మారక క్రికెట్ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులు మైదానంలో క్రీడా స్పూర్తిని ప్రదర్శించాలని కోరారు. ప్రతి ఓటమి గెలుకు పునాది లాంటిదన్నారు. అంతకు ముందు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, నాయకులు జాకీర్, నిర్వాహకులు ప్రవీణగౌడ్, మహ్మద్, మునీర్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు. -
బంద్ సంపూర్ణం విజయవంతం
ధరూరు : ధరూరులో కాంగ్రెస్ నాయకులు జయసింహారెడ్డి, రాజారెడ్డి, నీలహళ్లి వెంకటేశ్వరరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిల నేతత్వంలో బైక్ ర్యాలీ తీసి.. స్థానిక వైఎస్సార్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం జరగనున్న అఖిలపక్ష సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఇక్కడి ప్రజల ఆకాంక్షను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో వేమారెడ్డి, కిష్టన్న, శేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లు సత్యన్న, హన్మంతరాయ, తిరుమల్‌రెడ్డి, సత్యన్న, లక్ష్మన్న, శ్రీనివాస్‌గౌడ్, సోమశేఖర్‌రెడ్డి, యువరాజ్, ధర్మారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రేవులపల్లి పోలీస్‌స్టేషన్‌లో నాయకులు.. అఖిలపక్ష పార్టీల పిలుపు మేరకు చేపట్టిన నడిగడ్డ బంద్‌ను భగ్నం చేసేందుకు పోలీసులు గద్వాలకు చెందిన అఖిలపక్ష నాయకులు, జిల్లా సాధన సమితి ముఖ్య నేతలను తెల్లవారుజామునే అరెస్టు చేసి రేవులపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. గద్వాలలో అరెస్టు చేసిన నాయకులు కష్ణారెడ్డి, వెంకట్రాములు, నాగరాజు, రాజశేఖరరెడ్డి, అతికూర్ రెహమాన్, సుదర్శన్, తదితరులను మధ్యాహ్నం వరకు స్టేషన్లో ఉంచి.. అనంతరం విడిచిపెట్టారు. -
నేటినుంచి దర్వేష్ అలీ ఉర్సు
ధరూరు : మండల కేంద్రంలోని దర్వేష్‌అలీ దర్గా ఉర్సు ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హిందూముస్లింలు కలిసి జరుపుకొనే ఉర్సు ఉత్సవాలు సోమవారం గంధంతో ప్రారంభమవుతాయి. ఇప్పటికే దర్గా వద్ద ఏర్పాట్లను మత పెద్దలు ముమ్మరం చేశారు. ఏటా జరిగే ఈ ఉత్సవాలకు జిల్లాలోని ఆయా ప్రాంతాలతోపాటు ఏపీలోని కర్నూలు, అనంతపురం, పుణె, మహారాష్ట్ర, ముంబాయి ప్రాంతాల నుంచి భక్తులు దర్గాకు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఇందుకనుగుణంగా దర్గాలో ఏర్పాట్లను చేస్తున్నారు. మంగళవారం ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. బుధవారం సైతం ఉత్సవాలను నిర్వహించి గురువారంతో ముగించనున్నట్లు నిర్వాహకులు వాహబ్సాబ్, దర్వేష్‌అలీ తెలిపారు. -
జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో
ధరూరు: ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో శనివారం తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టుకు ఉదయం 32,270 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరగా రాత్రి 7.30గంటల వరకు 25వేల క్యూసెక్కులకు తగ్గింది. రాత్రి 8గంటల వరకు జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.400 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టులో 9.418 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సమాంతర కాలువ ద్వారా 1500 క్యూసెక్కులు వదులుతున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్ ద్వారా 1500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్టు ద్వారా 630 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి అనంతరం 16వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 20,430 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి జెన్కో జలవిద్యుత్ కేంద్రంలోని ఐదు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేస్తున్న జెన్కో అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో దశల వారిగా ఒక్కో యూనిట్‌ను నిలుపుదల చేస్తూ వచ్చారు. చివరకు రాత్రి 8గంటల వరకు 1, 2 యూనిట్ల విద్యుదుత్పత్తి నిమిత్తం 16వేల క్యూసెక్కుల నీటిని వినియోగించుకొని పూర్తి స్థాయిలో 78 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు జెన్కో అధికారులు చెప్పారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఇదిలాఉండగా ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 36.54 టీఎంసీలుగా ఉంది. ఈ ప్రాజెక్టుకు 4829 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా విద్యుదుత్పత్తి, కెనాల్స్ ద్వారా 4681 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 128.19 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టుకు 26,889 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 5836 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లు పీజేపీ అధికారులు చెప్పారు. -
ధారూరులో 40.6 మిల్లీమీటర్ల వర్షం
ధారూరు: ధారూరు మండల పరిధిలో మంగళవారం రాత్రి 40.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షానికి వాగులు, చెరువులు, కుంటల్లో నీరు చేరింది. ఖరీఫ్‌లో విత్తిన పంటలకు కొంతకాలంగా వర్షాలు లేకపోవడంతో వాడుముఖం పట్టాయి. ఈనేపథ్యంలో ఓ మోస్తారు వాన కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఖరీఫ్‌లో మండల పరిధిలో 7035 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు పంటలు సాగుచేస్తున్నారు. -
చింతపండు దొంగలించాడని..
ధరూరు: రంగారెడ్డి జిల్లా ధరూరు మండలం గుడిదొట్ల గ్రామంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. నర్శింహులు(30) అనే వ్యక్తి చింతపండు దొంగతనం చేశాడని కావరి రాము అనే వ్యక్తి గ్రామంలో పంచాయతీ పెట్టాడు. అంతేకాకుండా అతనిని గ్రామస్తులు చితకబాదారు. దాంతో అవమానంగా భావించిన నర్శింహులు ఇంటికెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామస్తులు అవమానించడంతోనే నర్శింహులు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. -
డీజిల్ ట్యాంకర్ బోల్తా :12 వేల లీటర్ల డీజిల్ నేలపాలు
ధరూర్ (రంగారెడ్డి) : వేగంగా వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. బోల్తా కొట్టిన ట్యాంకర్లో ఉన్న డీజిల్ లీక్ అవడంతో స్థానిక గ్రామాలకు చెందిన వారు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ధరూర్ మండలం ఒంటిమామిడి చెట్టు గ్రామంలో మంగళవారం జరిగింది. హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ గ్రామ శివారులోని మూల మలుపు వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్యాంకర్లో ఉన్న 12 వేల లీటర్ల డీజిల్ నేల పాలయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
ఎన్టీఆర్ వల్లే తెలంగాణ దివాళా
ధారూరు: దివంగత ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు అధికారంలోకి వచ్చినపుడే తెలంగాణలోని ఐటీ రంగం బెంగళూర్‌కు తరలివెళ్లిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాలో 705 గ్రామ పంచాయతీలు ఉండగా ఎంపీ ధారూరు మండలంలోని నాగసమందర్ గ్రామాన్ని సంసాద్ ఆదర్శ దత్తత గ్రామంగా ఎంపిక చేసుకున్నారు. శనివారం ఎంపీ గ్రామానికి చేరుకుని సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్టీఆర్ పాలన వల్ల తెలంగాణ దివాళా తీసిందని, ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందిందని విమర్శించారు. కిలో రూ. 2ల బియ్యం పంపిణీ వల్ల ఆంధ్రకే మేలు జరిగిందన్నారు. ప్లానింగ్ లేకుం డా మద్యపాన నిషేధం అమలు చేయడంతో రాష్ట్ర ఆదాయానికి గండి పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వేరుపడిన చరిత్ర, జియోగ్రఫీని మర్చి పక్క రాష్ట్ర దివంగత నేత పేరిట శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌కు ఎన్టీఆర్ టెర్మినల్‌గా పేరు పెట్టడం సరి కాదన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన దిగంగత ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు పేరును పెడితే తమకు అభ్యంతరం లేదన్నారు. విజయవాడకు ఎన్టీఆర్ పేరును ఖరారు చేస్తే మంచిదని ఆయన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు సూచించారు. ఎన్టీఆర్ పేరును తొలగించకపోతే తాను పార్లమెంట్లో నిలదీస్తానని హెచ్చరించారు. తాను దత్తత తీసుకున్న నాగసమందర్ గ్రామానికి నెలకోసారి వస్తానని, 3 నెలల్లో అనుకున్న విధంగా అభివృద్ధి జరిగితే మరో రెండు గ్రామాలను దత్తత తీసుకుంటానని పేర్కొన్నారు. గ్రామానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించి అందులో గ్రామస్థుల పూర్తి వివరాలను నమోదు చేయిస్తానని చెప్పారు. ఇక్కడ రూపే కార్డును అందరికీ అందజేస్తామని, దీనితో 6 నెలల పాటు లావాదేవీలు జరిపితే ప్రభుత్వ పరంగా వారి ఖాతాలో రూ. 5 వేలు జమ చేయిస్తామని పేర్కొన్నారు. టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేస్తాం జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టుగా ఉన్న కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేయిస్తామని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. నాగసమందర్ గ్రామంలోని సమస్యలను తెలుకునేందుకు శనివారం ఎంపీ గ్రామంలో పాదయాత్ర చేసి ప్రజలతో మాట్లాడారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రాజెక్టు ప్రాంతంలో టూరిజంను ఏర్పాటు చేస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల నుంచి కొంత మొత్తంలో రుసుమును వసూలు చేసి ఆ డబ్బులను ఈ గ్రామంలోనే ఖర్చు పెడతామని అన్నారు. ఐటీ కంపెనీలు, ఎన్ఆర్ఐలతో మాట్లాడి గ్రామంలో అభివృద్ధి చేసేందుకు వారి సహకారాన్ని కోరుతామని అన్నారు. ఎమ్మెల్యే బి. సంజీవరావు మాట్లాడుతూ నాగసమందర్ గ్రామాన్ని పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేయడానికి ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని, గ్రామంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. దారూరు పీఏసీఎస్ చెర్మైన్ హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ పత్తి రైతులకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 5 వేలు వచ్చేలా పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి రైతులకు న్యాయం చేయాలని ఎంపీని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ఉమాపార్వతి, ఎంపీటీసీ సభ్యుడు బాలప్ప, సర్పంచ్ శ్రీనివాస్, ధారూరు పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, డెరైక్టర్ బస్వరాజ్, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు వరద మల్లికార్జున్, రాజునాయక్‌లు, మండల టీఆర్ఎస్ కన్వీనర్ కుమ్మరి శ్రీనివాస్, రాష్ట్ర టీఆర్ఎస్ కార్యదర్శి కనకయ్య, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి శుభప్రదపటేల్, జిల్లా కార్మిక విభా గం అధ్యక్షుడు కృష్ణయ్య, రైతు విబాగం అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, తహసీల్దార్ విజయ, ఇన్చార్జీ ఎంపీడీఓ కాలుసింగ్, ఎబ్బనూర్ సర్పంచ్ రాజేం దర్‌రెడ్డి, జిల్లా, మండల టీఆర్ఎస్ నాయకులు రవీందర్‌రెడ్డి, రాజారత్నం, శాంతకుమార్, సర్వేశం, శేఖర్, ప్రశాంత్, రామచంద్రయ్య, మల్లారెడ్డి, సంతోష్‌కుమార్, రాములు, రాంరెడ్డి, దస్తయ్య, రామస్వామి, రుద్రారం వెంకటయ్య, కావలి అంజయ్య, విజయకుమార్, నందు తదితరులు పాల్గొన్నారు.