సంఘటన స్థలంలో గుమిగూడిన జనాలు
సాక్షి, ధారూరు: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళుతూ ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ధారూరు మండలంలోని ఎబ్బనూర్ గ్రామానికి చెందిన చాకలి భీమయ్య(28) రోడ్డు ప్రమాదంలో గురువారం రాత్రి మృతిచెందాడు. కాగా, ఇదే గ్రామానికి చెందిన మృతుడి దాయాదులు చాకలి గోపాల్, జగన్ అన్నదమ్ములు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం గ్రామానికి వలస వెళ్లారు. మరణవార్త తెలుసుకున్న గోపాల్, జగన్‌లు శుక్రవారం ఉదయం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రామచంద్రాపురం నుంచి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో బయలుదేరారు.
ఎబ్బనూర్ చెరువు మూలమలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ వీటి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీకొట్టింది. ఇందులో ప్రయాణిస్తున్న గోపాల్, జగన్ భార్యలు కమలమ్మ(44), శారద(32)తో పాటు జగన్ కూతురు అర్చన(11) అక్కడిక్కడే మృతిచెందారు. గోపాల్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఇతని పెద్ద కూతురు సంతోష(22) చేయి విరిగింది. జగన్ మొదటి కూతురు అక్షయ(13) తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయింది. క్షతగాత్రులను వెంటనే ప్రైవేటు వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో గోపాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఆటో నడుపుతున్న జగన్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు.
ఈ సంఘటనతో మండల ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతదేహాల వద్ద కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కాగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఎబ్బనూర్ గ్రామానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
అన్నదమ్ములు కష్టజీవులు
గోపాల్ సొంతంగా ఆటో కొనుగోలు చేసి నడుపుతుండగా, తమ్ముడు జగన్ తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తుంటాడు. వీరి భార్యలు దుస్తులు ఇస్త్రీ చేస్తూ కుటుంబ పోషణకు కొంత చేయూతను అందిస్తున్నారు. వారి పిల్లలను నివాసం ఉండే చోటు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోనే చదివిస్తున్నారు. గ్రామంలో ఉపాధి లేక అంతర్ జిల్లాకు వెళితే విధి వక్రీకరించి తమ భార్యలను కోల్పోయామని వారు రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment