జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏసుక్రీస్తు శిలువ
సాక్షి, ధారూరు: దేశంలోనే ఎక్కడా జరగని మెథడిస్ట్ క్రిస్టియన్ ఉత్సవాలు ఈనెల 12వ తేదీ నుంచి వికారాబాద్ జిల్లా ధారూరులో ప్రారంభమవుతున్నాయి. విశాలమైన ప్రదేశం కాగ్నా నది పక్కన స్టేషన్‌ధారూరు–దోర్నాల్ గ్రామాల మధ్య ఉత్సవాలు కొనసాగుతాయి. 96 సంవత్సరాలుగా లక్షలాది మంది భక్తులతో ఉత్సవాలను నిర్వహించడం ప్రత్యేకం. ఈ సంవత్సరం కూడా దాదాపు 10 లక్షల మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్‌లో ఈ ఉత్సవాలను నిర్వహింస్తుంటారు. దాదాపు 35 ఎకరాల స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలు ఆరు రోజులపాటు కొనసాగుతాయి. ఉత్సవాలకు బీదర్, గుల్బర్గా, రాయచూర్, సోలాపూర్, బెంగళూర్, బెల్గాం, గోవా తదితర ప్రాంతాల నుంచే కాక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు. వీరితో పాటు విదేశాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారు. జాతరకు వచ్చే వీఐపీల కోసం నిర్వాహకులు తగిన సౌకర్యాలు కల్పిస్తునారు. 2019లో నిర్వాహకులు 97వ జాతరను కొనసాగిస్తున్నారు.
ఉత్సవాల విశేషాలు
జాతర ప్రధాన ప్రాంగణంలో ఇప్పచెట్లు ఆనవాళ్లు
మెథడిస్ట్ క్రిస్టియన్ ఉత్సవాల్లో ఏసుక్రీస్తు నామంతో కీర్తనలు, భజనలు, ప్రార్థనలు హోరెత్తుతాయి. క్రీస్తు శిలువ దగ్గర ఆరు రోజులపాటు నిత్యం ప్రార్థనలు కొనసాగుతూనే ఉంటాయి. వక్తల ప్రసంగాలు, నిర్వాహకులతో వివిధ కార్యక్రమాలు కొనసాగుతాయి. జాతరకు వచ్చిన ప్రతి భక్తుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హుండీలలో బంగారం, వెండితో పాటు నగదును దానంగా వేస్తారు. ఏసుక్రీస్తు పేరుతో చాలా మంది గొర్రెలు, మేకలు, కోళ్ళు, కోడిగుడ్లు, ఆవులు దానంగా నిర్వాహకులకు అందజేస్తారు.
ప్రభుత్వ ఏర్పాట్లు
రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేస్తూ యాత్రికులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర మైనారిటి కమిషన్ చైర్మన్ ఖమ్రోద్దిన్, కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎస్‌పీ నారాయణ, డీఆర్‌ఓ మోతీలాల్, డీఆర్‌డీఓ జాన్సన్, జిల్లా పంచాయతి అధికారి రిజ్వాన, డివిజన్, మండల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రత్యేక నిఘా
యాత్రికుల నీటి అవసరాలను తీర్చే కాగ్నా నది
జాతర ప్రాంగణంలో ప్రత్యేకంగా అన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ నిఘాను పెంచారు. కాగ్నా నదిపై ఉన్న పాత వంతెనను తొలగించి కొత్త వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో మట్టి రోడ్డు వేసి ఇరువైపుల బారికెడ్లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తాగునీటి వసతి, మరుగుదొడ్లు, స్నానాల గదులు, ఫ్లడ్‌లైట్లు, చెత్త కుండీలు, మెడికల్ క్యాంపు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. భారీ సంఖ్యలో పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది.
ప్రత్యేక రైలు
ధారూరు, బీదర్ మధ్యన ప్రత్యేక రైలు నడుస్తోంది. జాతర జరిగే రోజుల్లో హైదరాబాద్–ముంబాయి మధ్య కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ధారూరు స్టేషన్‌లో ఆగుతాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్‌టీసీ బస్సులు వేసి ధారూరు జాతర ప్రాంగణం వరకు నడిపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment