Methodist Christian celebration
-
భక్తిశ్రద్ధలతో మెథడిస్ట్ జాతర
సాక్షి, ధారూరు: ధారూరు మెథడిస్ట్ వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన క్రిస్టియన్ జాతర గురువారం మూ డో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కాలి నడకన వచ్చేవారి సంఖ్య అధికమవుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలోని గుల్బర్గా, బీదర్, బీజాపూర్, సోలాపూర్ నుంచి యువతీయువకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటే ఏసుక్రీస్తు తమ కోర్కెలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రధాన శిలువ వద్ద ప్రార్థనలు చేసేందుకు భక్తులు పోటీపడుతున్నారు. జాతరలో క్రీస్తు శిలువలు, బైబిల్ గ్రంథాలు, జీసస్ చిత్ర పటాలు, బ్యానర్లు, ఫొటోలను విక్రయిస్తున్నారు. వేడుకల ప్రాంగణంలో తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో క్రీస్తును స్మరిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. సీఐ రాజశేఖర్ అధ్వర్యంలో పోలీసులు వాహనాలను నియంత్రించి పార్కింగ్ స్థలాలకు మళ్లిస్తున్నారు. -
రేపటి నుంచి మెథడిస్ట్ క్రిస్టియన్ ఉత్సవాలు
సాక్షి, ధారూరు: దేశంలోనే ఎక్కడా జరగని మెథడిస్ట్ క్రిస్టియన్ ఉత్సవాలు ఈనెల 12వ తేదీ నుంచి వికారాబాద్ జిల్లా ధారూరులో ప్రారంభమవుతున్నాయి. విశాలమైన ప్రదేశం కాగ్నా నది పక్కన స్టేషన్ధారూరు–దోర్నాల్ గ్రామాల మధ్య ఉత్సవాలు కొనసాగుతాయి. 96 సంవత్సరాలుగా లక్షలాది మంది భక్తులతో ఉత్సవాలను నిర్వహించడం ప్రత్యేకం. ఈ సంవత్సరం కూడా దాదాపు 10 లక్షల మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్లో ఈ ఉత్సవాలను నిర్వహింస్తుంటారు. దాదాపు 35 ఎకరాల స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలు ఆరు రోజులపాటు కొనసాగుతాయి. ఉత్సవాలకు బీదర్, గుల్బర్గా, రాయచూర్, సోలాపూర్, బెంగళూర్, బెల్గాం, గోవా తదితర ప్రాంతాల నుంచే కాక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు. వీరితో పాటు విదేశాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారు. జాతరకు వచ్చే వీఐపీల కోసం నిర్వాహకులు తగిన సౌకర్యాలు కల్పిస్తునారు. 2019లో నిర్వాహకులు 97వ జాతరను కొనసాగిస్తున్నారు. ఉత్సవాల విశేషాలు జాతర ప్రధాన ప్రాంగణంలో ఇప్పచెట్లు ఆనవాళ్లు మెథడిస్ట్ క్రిస్టియన్ ఉత్సవాల్లో ఏసుక్రీస్తు నామంతో కీర్తనలు, భజనలు, ప్రార్థనలు హోరెత్తుతాయి. క్రీస్తు శిలువ దగ్గర ఆరు రోజులపాటు నిత్యం ప్రార్థనలు కొనసాగుతూనే ఉంటాయి. వక్తల ప్రసంగాలు, నిర్వాహకులతో వివిధ కార్యక్రమాలు కొనసాగుతాయి. జాతరకు వచ్చిన ప్రతి భక్తుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హుండీలలో బంగారం, వెండితో పాటు నగదును దానంగా వేస్తారు. ఏసుక్రీస్తు పేరుతో చాలా మంది గొర్రెలు, మేకలు, కోళ్ళు, కోడిగుడ్లు, ఆవులు దానంగా నిర్వాహకులకు అందజేస్తారు. ప్రభుత్వ ఏర్పాట్లు రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేస్తూ యాత్రికులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర మైనారిటి కమిషన్ చైర్మన్ ఖమ్రోద్దిన్, కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎస్పీ నారాయణ, డీఆర్ఓ మోతీలాల్, డీఆర్డీఓ జాన్సన్, జిల్లా పంచాయతి అధికారి రిజ్వాన, డివిజన్, మండల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక నిఘా యాత్రికుల నీటి అవసరాలను తీర్చే కాగ్నా నది జాతర ప్రాంగణంలో ప్రత్యేకంగా అన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ నిఘాను పెంచారు. కాగ్నా నదిపై ఉన్న పాత వంతెనను తొలగించి కొత్త వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో మట్టి రోడ్డు వేసి ఇరువైపుల బారికెడ్లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తాగునీటి వసతి, మరుగుదొడ్లు, స్నానాల గదులు, ఫ్లడ్లైట్లు, చెత్త కుండీలు, మెడికల్ క్యాంపు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. భారీ సంఖ్యలో పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ప్రత్యేక రైలు ధారూరు, బీదర్ మధ్యన ప్రత్యేక రైలు నడుస్తోంది. జాతర జరిగే రోజుల్లో హైదరాబాద్–ముంబాయి మధ్య కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు ధారూరు స్టేషన్లో ఆగుతాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు వేసి ధారూరు జాతర ప్రాంగణం వరకు నడిపిస్తారు. -
వచ్చేసింది.. మెథడిస్ట్ జాతర..!
* రేపటినుంచి ఉత్సవాలు * పది లక్షల మంది హాజరవుతారని అంచనా * ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు ధారూరు: రాష్ట్రంలో సమ్మక్క, సారక్క జాతర తర్వాత అంతటి ప్రాముఖ్యతను పొందిన ధారూరు మెథడిస్ట్ క్రిస్టియన్ ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. 35 ఎకరాల సువిశాల స్థలంలో కాగ్నా నది ప్రవాహ తీరాన మండలంలోని స్టేషన్ధారూరు, దోర్నాల్ గ్రామాల మధ్యన ఈ జాతరను 92 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచే కాకుండా బీదర్, గుల్బర్గ, రాయచూర్, సోలాపూర్, బెంగుళూర్, బెల్గాం, గోవా తదితర ప్రాంతాల నుంచే కూడా భక్తులు తరలివస్తుంటారు. వీరికితోడు విదేశాల నుంచి కూడా ప్రత్యేక ఆహ్వానితులుంటారు. ఈసారి ఉత్సావాలకు కనీసం 10 లక్షల మంది యాత్రికులు హాజరవుతారని జాతర కార్యదర్శి సీహెచ్ అనంతయ్య చెబుతున్నారు. 6 రోజులపాటు సాగే ఈ ఉత్సవాలు వచ్చే ఆదివారంతో ముగుస్తాయి. ఉత్సవాలకు చరిత్ర..... ఇక్కడ జాతర నిర్వహించడం వెనుక విశేషంగా ఇద్దరి కృషి ఉంది. 1921లో గుల్బర్గ నుంచి రైలులో రెవరెన్ సీమండ్స్, అతని మిత్రుడు జేటీ సీమండ్స్లు హైదరాబాద్ బయలుదేరారు. ధారూరు స్టేషన్లో సాంకేతిక కారణాలతో రైలు 3 గంటలపాటు ఆగడంతో వారిద్దరూ రైలునుంచి దిగి కాగ్నా నది సమీపంలోని స్థలంలో ఏసుక్రీస్తు ప్రార్థన చేశారు. తమ కోరిక నెరవేరితే ఈస్థలంలో ఏటా ఉత్సవాలు నిర్వహించాలని వారు నిశ్చయించుకుంటారు. హైదరాబాద్ వెళ్లగానే వారి కోరిక నెరవేరడంతో వారు ప్రార్థించిన స్థలంలో ఇప్పచెట్టు కింద ఏసుక్రీస్తు శిలువను స్థాపించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఐదుగురితో ప్రారంభమైన మెథడిస్ట్ క్రిస్టియన్ ఉత్సవాలకు 2013 నవంబర్లో 5 లక్షల మంది హాజరైనట్లు అంచనా. జాతరకు వచ్చిన ప్రతి భక్తుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హుండీల్లో బంగారం, వెండితోపాటు నగదును కూడ దానంగా వేస్తారు. ఏసుక్రీస్తు పేరు తో చాలా మంది మేకలు, కోళ్లు, కోడిగుడ్లు, ఆవులు దానంగా నిర్వాహకులకు అంది స్తారు. ముమ్మరంగా ఏర్పాట్లు ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తాగునీటి వసతి, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తోంది. భారీ సంఖ్యలో పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ధారూరు, బీదర్ల మధ్యన జాతర కోసం ప్రత్యేక రైలును నడిపిస్తారు. జాతర జరిగే రోజుల్లో హైదరాబాద్-ముంబై మధ్యన అన్ని రకాల ఎక్స్ప్రెస్ రైళ్లు ధారూరు స్టేషన్లో ఆగుతాయి. వివిధ రూట్లలో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు వేసి ధారూరు స్టేషన్ వరకు నడిపిస్తారు. ప్రస్తుతం జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశ, విదేశాల నుంచి వచ్చే యాత్రికుల కోసం ప్రాంగణంలో తట్టలతో ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక జాతరకొచ్చే యాత్రికుల నీటి అవసరాలను కాగ్నా నది తీరుస్తుంది. గత మూడేళ్లుగా వర్షాలు సరిగ్గా లేక కాగ్నాలో నీటి ప్రవాహం తగ్గి గతంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈసారి నదిలో నీటి ప్రవాహం పుష్కలంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిర్వాహకులు చెబుతున్నారు.