వచ్చేసింది.. మెథడిస్ట్ జాతర..! | tomorrow from Methodist Christian celebrations | Sakshi
Sakshi News home page

వచ్చేసింది.. మెథడిస్ట్ జాతర..!

Published Sun, Nov 9 2014 11:58 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

tomorrow from Methodist Christian celebrations

* రేపటినుంచి ఉత్సవాలు
* పది లక్షల మంది హాజరవుతారని అంచనా
* ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు

 ధారూరు: రాష్ట్రంలో సమ్మక్క, సారక్క జాతర తర్వాత అంతటి ప్రాముఖ్యతను పొందిన ధారూరు మెథడిస్ట్ క్రిస్టియన్ ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. 35 ఎకరాల సువిశాల స్థలంలో కాగ్నా నది ప్రవాహ తీరాన మండలంలోని స్టేషన్‌ధారూరు, దోర్నాల్ గ్రామాల మధ్యన ఈ జాతరను 92 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచే కాకుండా బీదర్, గుల్బర్గ, రాయచూర్, సోలాపూర్, బెంగుళూర్, బెల్గాం, గోవా తదితర ప్రాంతాల నుంచే కూడా భక్తులు తరలివస్తుంటారు. వీరికితోడు విదేశాల నుంచి కూడా ప్రత్యేక ఆహ్వానితులుంటారు. ఈసారి ఉత్సావాలకు కనీసం 10 లక్షల మంది యాత్రికులు హాజరవుతారని జాతర కార్యదర్శి సీహెచ్ అనంతయ్య చెబుతున్నారు. 6 రోజులపాటు సాగే ఈ ఉత్సవాలు వచ్చే ఆదివారంతో ముగుస్తాయి.
 
ఉత్సవాలకు చరిత్ర.....
ఇక్కడ జాతర నిర్వహించడం వెనుక విశేషంగా ఇద్దరి కృషి ఉంది. 1921లో గుల్బర్గ నుంచి రైలులో రెవరెన్ సీమండ్స్, అతని మిత్రుడు జేటీ సీమండ్స్‌లు హైదరాబాద్ బయలుదేరారు. ధారూరు స్టేషన్‌లో సాంకేతిక కారణాలతో రైలు 3 గంటలపాటు ఆగడంతో వారిద్దరూ రైలునుంచి దిగి కాగ్నా నది సమీపంలోని స్థలంలో ఏసుక్రీస్తు ప్రార్థన చేశారు. తమ కోరిక నెరవేరితే ఈస్థలంలో ఏటా ఉత్సవాలు నిర్వహించాలని వారు నిశ్చయించుకుంటారు. హైదరాబాద్ వెళ్లగానే వారి కోరిక నెరవేరడంతో వారు ప్రార్థించిన స్థలంలో ఇప్పచెట్టు కింద ఏసుక్రీస్తు శిలువను స్థాపించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఐదుగురితో ప్రారంభమైన మెథడిస్ట్ క్రిస్టియన్ ఉత్సవాలకు 2013 నవంబర్‌లో 5 లక్షల మంది హాజరైనట్లు అంచనా. జాతరకు వచ్చిన ప్రతి భక్తుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హుండీల్లో బంగారం, వెండితోపాటు నగదును కూడ దానంగా వేస్తారు. ఏసుక్రీస్తు పేరు తో చాలా మంది మేకలు, కోళ్లు, కోడిగుడ్లు, ఆవులు దానంగా నిర్వాహకులకు అంది స్తారు.
 
ముమ్మరంగా ఏర్పాట్లు  
ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తాగునీటి వసతి, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తోంది. భారీ సంఖ్యలో పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. ధారూరు, బీదర్ల మధ్యన జాతర కోసం ప్రత్యేక రైలును నడిపిస్తారు. జాతర జరిగే రోజుల్లో హైదరాబాద్-ముంబై మధ్యన అన్ని రకాల ఎక్స్‌ప్రెస్ రైళ్లు ధారూరు స్టేషన్‌లో ఆగుతాయి. వివిధ రూట్లలో ఆర్‌టీసీ ప్రత్యేక సర్వీసులు వేసి ధారూరు స్టేషన్ వరకు నడిపిస్తారు. ప్రస్తుతం జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

దేశ, విదేశాల నుంచి వచ్చే యాత్రికుల కోసం ప్రాంగణంలో తట్టలతో ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక జాతరకొచ్చే యాత్రికుల నీటి అవసరాలను కాగ్నా నది తీరుస్తుంది. గత మూడేళ్లుగా వర్షాలు సరిగ్గా లేక కాగ్నాలో నీటి ప్రవాహం తగ్గి గతంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈసారి నదిలో నీటి ప్రవాహం పుష్కలంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిర్వాహకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement