నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న కృష్ణానది వరద
మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టుకు భారీ వరద వచ్చే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ హెచ్చరించడంతో ఆల్మట్టి ప్రాజెక్టు 26 క్రస్టుగేట్లను తెరిచారు. ప్రాజెక్టు నుంచి దిగువన నదిలోకి 1,43,387 క్యూసెక్కుల భారీ వరదను విడుదల చేస్తున్నారు.
జూరాల: మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టుకు భారీ వరద వచ్చే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ హెచ్చరించడంతో ఆల్మట్టి ప్రాజెక్టు 26 క్రస్టుగేట్లను తెరిచారు. ప్రాజెక్టు నుంచి దిగువన నదిలోకి 1,43,387 క్యూసెక్కుల భారీ వరదను విడుదల చేస్తున్నారు. అలాగే నారాయణపూర్ ప్రాజెక్టు 26 క్రస్టుగేట్లను ఎత్తి జూరాల రిజర్వాయర్‌కు 1,55,240 క్యూసెక్కుల భారీ వరదను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. దీంతో గురువారం రాత్రిలోగా కర్ణాటక నుంచి వస్తున్న భారీ వరదనీరు జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉన్న జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు ఎగువ నుంచి వరద రాగానే విద్యుదుత్పత్తి ద్వారా కిందకు విడుదల చేయనున్నారు.
పుష్కరాలకు పుష్కలం
దీంతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకు కష్ణానది తీరంలో రెండువైపులా నిర్మిస్తున్న పుష్కరఘాట్లకు వరద ముంచెత్తనుంది. పశ్చిమ కనుమలు, మహాబలేశ్వరం ప్రాంతాల్లో మంగళవారం దాదాపు 39 సెం.మీ వరకు భారీ వర్షాలు కురిశాయి. దీంతో అప్రమత్తమైన సాగునీటిపారుదల అధికారులు ఆల్మట్టి నుంచి నీటి విడుదల చేయడం ప్రారంభించారు.
నిండుకుండలా ఆల్మట్టి
ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 129 టీఎంసీలు కాగా 128 టీఎంసీలకు నీటిమట్టం చేరింది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. వరదను దష్టిలో ఉంచుకొని 26 క్రస్టుగేట్లను 80 సెం.మీ మేర ఎత్తి 1,43,387 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ఇప్పటికే 36.74 టీఎంసీలకు చేరింది. ఆల్మట్టి నుంచి వస్తున్న భారీ వరదకు అనుగుణంగా నారాయణపూర్‌లో 26 క్రస్టుగేట్లను మీటరు మేరకు ఎత్తారు. మొత్తం 1, 55,240 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు.
జూరాల నుంచి నీటివిడుదల
జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.53 టీఎంసీల నీటినిల్వ ఉంది. జూరాలకు ఇన్‌ఫ్లో 20వేల క్యూసెక్కులు వస్తుండగా, జూరాల రిజర్వాయర్ ద్వారా సమాంతర కాలువకు 1000 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 1500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, భీమా–1,2 లిఫ్టుల ద్వారా 1400 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 24వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.