నీటిమట్టాన్ని తెలిపే స్కేల్
సాక్షి, నాగార్జునసాగర్ : సాగర్ జలాశయంలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరువలో ఉంది. మూడు అడుగుల మేర నీటిమట్టం పెరగడానికి ఐదు టీఎంసీల నీరు వచ్చి చేరితే మరోమారు గేట్లు ఎత్తే అవకాశాలున్నట్లుగా ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి ఆదివారం సాయంత్రం 68,792 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా సాగర్ నుంచి విద్యుదుత్పాదన ద్వారా నదిలోకి 33,058 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఎగువన కృష్ణా పరీవాహక ప్రాంతాలైన కర్నాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద రాక పెరిగింది. దీంతో ఆ ప్రాజెక్టుల గేట్లు తెరుచుకున్నాయి. దిగువకు వరద నీరు భారీగా వస్తుండటంతో ముందస్తుగానే నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి కృష్ణానదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
ఇన్‌ఫ్లో ఇలా..
జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,53,915 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నుంచి విడుదలవుతున్న నీటితో కలిసి శ్రీశైలం జలాశయానికి 2,26,564 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885అడుగులు కాగా 215.807 టీఎంసీలకు సమానం. ప్రస్తుతం 882.30 అడుగులకు చేరింది. 200.6588 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి విద్యుదుత్పాదనతో పాటు పోతిరెడ్డిపాడు తదితర ప్రాంతాలతో కలిపి 98,415 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ జలాశయానికి 68,792క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కాగా సాగర్ జలాశయం నుంచి ఎడమ, కుడి కాల్వలకు విద్యుదుత్పాదనతో కృష్ణా డెల్టాకు 52,237 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలా శయం నీటిమట్టం 587.10 అడుగులకు చేరిం ది. 305.5646 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గరిష్ట నీటిమట్టం 590.00 అడుగులు కాగా 312.0450 టీఎంసీలు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టానికి చేరితే గేట్లు ఎత్తే అవకాశముంటుంది. సాగర్ నుంచి కూడా నీటిని స్పిల్‌వే మీదుగా విడుదల చేయనున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
సాగర్ జలాశయానికి ఎగువనుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే జలాశయం గరిష్ట మట్టానికి చేరువలో ఉంది. డ్యాం దిగువనున్న రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని డ్యాం ఎస్‌ఈ టి.విజయ్‌కిరణ్‌రెడ్డి కోరారు. కృష్ణా తీర మండలాల పరిధిలోని తహసీల్దార్లు, ఆర్డీఓకు సమాచారం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment