Almatti project
-
కృష్ణమ్మ కళకళ.. జలాశయాలకు పోటెత్తుతున్న వరద
కర్నూలు సిటీ/రాయచూరు రూరల్/హొసపేటె/ధవళేశ్వరం: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కొద్దిరోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు భారీగా వరద పోటెత్తుతోంది. శుక్రవారం ఆల్మట్టి డ్యామ్‌కు ఎగువ నుంచి 45,534 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 94 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దిగువకు 43,960 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా నారాయణపూర్ డ్యామ్ వైపు ఉరకలేస్తోంది. నారాయణపూర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 33.03 టీఎంసీలు కాగా ఇప్పటికే 29.05 టీఎంసీల నీరు చేరింది. దీంతో డ్యామ్‌లోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌లో వరద పరవళ్లు: కర్ణాటక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో తుంగభద్ర డ్యామ్‌కు వరద పోటెత్తుతోంది. శుక్రవారం ఒక్కరోజే 40 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరడంతో డ్యామ్‌లో జలకళ ఉట్టిపడుతోంది. మరో రెండు రోజుల్లో నీటినిల్వ 40 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉంది. డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37.897 టీఎంసీల నీరు ఉన్నట్టు తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 12న కర్ణాటక మునిరాబాద్‌లో నిర్వహించిన ఐసీసీ (ఇరిగేషన్ కన్సల్టెన్సీ కమిటీ) సమావేశంలో ఈ నెల 18 నుంచి ఎల్ఎల్సీ, హెచ్చెల్సీ కాల్వలకు నీటిని విడుదల చేయాలని కర్ణాటక అధికారులు నిర్ణయించారు. ఎల్ఎల్సీ కాల్వలో రాంసాగరం వద్ద జరుగుతున్న పనుల వల్ల నీటిని విడుదల చేయవద్దని ఏపీ ఇంజనీర్లు కోరడం, ఏపీ వాటా నీటికి ఇండెంట్ పెట్టకపోవడంతో నీటి విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. మరింత పెరిగిన గోదావరి వరద: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి శుక్రవారం మరింత పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద జలాలు బ్యారేజ్‌కు వచ్చి చేరుతున్నాయి. శుక్రవారం సాయంత్రం బ్యారేజ్ వద్ద 9.95 అడుగులకు నీటిమట్టం చేరింది. 1,37,390 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. -
కృష్ణమ్మ పరుగులు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరుగు లు పెడుతోంది. ఎగువ నుంచి శనివారం సాయంత్రం 98,975 క్యూసెక్కులు చేరుతుండగా రాత్రి 12 గంటలకు ఇది రెండు లక్షల క్యూసెక్కులకు పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ దఫా వరదకు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండవచ్చని అంచనా వేస్తున్నాయి. ► పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా, ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సగటున 72 మి.మీ.ల వర్షపాతం పడింది. దాంతో కృష్ణా, ఉపనదుల్లో గంట గంటకూ వరద పెరుగుతోంది. ► ఆల్మట్టిలోకి వరద పెరుగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) సూచనల మేరకు డ్యామ్ నీటినిల్వలను ఖాళీ చేసి దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోనూ అదే పరిస్థితి. దాంతో జూరాలకు భారీగా వరద చేరుతోంది. జూరాల వరదను దిగువకు వదులుతున్నారు. ► శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు జలాలు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్ నీటిమట్టం 558.20 అడుగులకు చేరుకుంది. ► అప్పర్ తుంగ, భద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీ నుంచి భారీ వరదను దిగువకు వదులుతుండటంతో తుంగభద్రలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ► పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, కిన్నెరసాని నుంచి నీటి ప్రవాహం చేరుతుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1.17 లక్షల క్యూసెక్కులు చేరుతుం డగా 7 వేల క్యూసెక్కులు డెల్టాకు, మిగిలిన 1.11 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
వారంలో దిగువకు కృష్ణమ్మ!
సాక్షి, హైదరాబాద్: ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు దిగువ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు నిండుతుండటం దిగువన ఉన్న ప్రాజెక్టులకు ఊరటనిస్తోంది. ఆల్మట్టిలోకి రోజురోజుకూ ప్రవాహాలు పెరుగుతుండగా, నారాయణపూర్ దాదాపుగా నిండేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం కొనసాగుతున్న మాదిరే ఆల్మట్టి, నారాయణపూర్‌లకు ప్రవాహాలు కొనసాగితే మరోవారంలోనే జూరాలకు భారీ ప్రవాహాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నెల 20కి ముందే దిగువకు.. ఆల్మట్టి ప్రాజెక్టులోకి శుక్రవారం 50 వేల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదుకాగా, శనివారం 73,791 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టుల నీటి నిల్వ 129 టీఎంసీలకుగాను 95 టీఎంసీలను దాటింది. దీంతో 21,130 క్యూసెక్కుల నీటిని పవర్‌హౌస్ ద్వారా దిగువన నారాయణపూర్‌కు వదిలేస్తున్నారు. ప్రాజెక్టులో మరో 35 టీఎంసీల నీరు చేరితే ప్రాజెక్టు నిండుకుండను తలపించనుంది. దీనికి మరో ఐదారు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత గేట్లెత్తి దిగువకు నీటివిడుదల చేయనున్నారు. నారాయణపూర్‌లోకి ఎగువ ప్రవాహానికి తోడు స్థానిక ప్రవాహాలు కలిపి 27,756 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 37.64 టీఎంసీలకు గానూ 32 టీఎంసీల నిల్వలున్నాయి. ఎగువ ప్రవాహాలను దృష్టిలో పెట్టుకొని రెండు, మూడు టీఎంసీల నిల్వల మేర ఖాళీ పెట్టి దిగువకు నీటివిడుదల చేయనున్నారు. అయితే ఆల్మట్టిలో మరో 30 టీఎంసీల నీరు చేరాక దిగువ నారాయణపూర్ ద్వారా జూరాలకు నీటి విడుదల చేసే అవకాశాలున్నాయని, దీనికి మరో వారం పట్టవచ్చని, ఈ నెల 20కి ముందే దిగువకు నీటి విడుదల ఉండొచ్చని నీటిపారుదల శాఖ వర్గాలు అం చనా వేస్తున్నాయి. తుంగభద్రకు 34,374 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో మొత్తం 100 టీఎంసీలకుగానూ 20 టీఎంసీల నిల్వ ఉంది. జూరాలకు 1,037 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నిల్వ 9.66 టీఎంసీలకుగానూ 7.78 టీఎంసీలుగా ఉంది. భీమా, నెట్టెంపాడుల ద్వారా 1,488 క్యూసెక్కుల మేర నీటిని పంపింగ్ చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజె క్టుకు సైతం స్థానికంగా 3,179 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 215 టీఎంసీలకు గానూ 37.20 టీఎంసీల నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌లోకి 1,668 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, పూర్తి నిల్వ 312 టీఎంసీలకు గాను 168.40 టీఎంసీలుగా ఉంది -
కృష్ణమ్మకు కొత్తనీరు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నదీ బేసిన్ల పరిధిలో జల ప్రవాహాలు పుంజుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్ రెండో వారం నుంచే కృష్ణా పరీవాహకంలో కురిసిన వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టులోకి 50వేల క్యూసెక్కులకు పైగా వరద నీరొచ్చి చేరుతుండగా, రాష్ట్ర పరిధిలోని మేడిగడ్డ వద్ద గోదావరి ప్రవాహం ఆశాజనకంగా ఉంది. ఆల్మట్టిలోకి కొత్తగా 25 టీఎంసీలు.. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టిలోకి నీటి ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రాజెక్టులోకి నిన్నమొన్నటి వరకు 20వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు రాగా, అది శుక్రవారం 42,659 క్యూసెక్కులకు పెరిగింది. శనివారం మరింత పెరిగి 57,346 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు 129 టీఎంసీలకు గానూ 50 టీఎంసీలకు చేరింది. ఈ నీటి సంవత్సరం ఆరంభమైన 20 రోజుల్లోనే 25 టీఎంసీల మేర కొత్త నీరొచ్చి చేరింది. గతేడాది ఈ సమయానికి ప్రాజెక్టులో కేవలం 22.50 టీఎంసీలు మాత్రమే ఉండగా, ఈ ఏడాది 28 టీఎంసీల మేర అదనంగా ఉండటంతో పరిస్థితి ఆశాజనకంగా కన్పిస్తోంది. ఇక నారాయణపూర్‌లోకి సైతం స్థానిక ప్రవాహాలు వస్తుండటంతో 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టులోకి ఇప్పటివరకు 4 టీఎంసీల మేర కొత్తనీరు వచ్చి చేరగా, నిల్వలు 37.64 టీఎంసీలకు గానూ 24 టీఎంసీల మేర ఉన్నాయి. ఇక ఉజ్జయినిలోకి సైతం 3,105 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా, 117 టీ ఎంసీల నిల్వలకు గానూ 53 టీఎంసీల నిల్వలున్నాయి. ఈ ప్రవాహాలు క్రమంగా పెరిగితే గతేడాది మాదిరి జూలై రెండో వారానికి దిగువకు ప్రవాహాలు నమోదు కానున్నాయి. ఇక స్థానిక పరీవాహకంలో కురిసిన వర్షాలతో నాగార్జునసాగర్‌లోకి 1,455 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం సాగర్‌లో 312 టీఎంసీలకు గానూ 169.52 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలంలో 215 టీఎంసీలకు గానూ 35 టీఎంసీ, జూరాలలో 9.66 టీఎంసీలకు గానూ 4.71 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఇక గోదావరి పరీవాహకంలోనూ జల ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. మేడగడ్డ వద్ద శనివారం 15వేల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా, ఇవి ఈ నెల 25,26 నాటికి లక్ష క్యూసెక్కులకు పెరగవచ్చని ప్రాజెక్టు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. -
నందికొండ.. నిండుకుండలా
సాక్షి, నాగార్జునసాగర్ : సాగర్ జలాశయంలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరువలో ఉంది. మూడు అడుగుల మేర నీటిమట్టం పెరగడానికి ఐదు టీఎంసీల నీరు వచ్చి చేరితే మరోమారు గేట్లు ఎత్తే అవకాశాలున్నట్లుగా ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి ఆదివారం సాయంత్రం 68,792 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా సాగర్ నుంచి విద్యుదుత్పాదన ద్వారా నదిలోకి 33,058 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువన కృష్ణా పరీవాహక ప్రాంతాలైన కర్నాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద రాక పెరిగింది. దీంతో ఆ ప్రాజెక్టుల గేట్లు తెరుచుకున్నాయి. దిగువకు వరద నీరు భారీగా వస్తుండటంతో ముందస్తుగానే నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి కృష్ణానదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో ఇలా.. జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,53,915 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నుంచి విడుదలవుతున్న నీటితో కలిసి శ్రీశైలం జలాశయానికి 2,26,564 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885అడుగులు కాగా 215.807 టీఎంసీలకు సమానం. ప్రస్తుతం 882.30 అడుగులకు చేరింది. 200.6588 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి విద్యుదుత్పాదనతో పాటు పోతిరెడ్డిపాడు తదితర ప్రాంతాలతో కలిపి 98,415 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 68,792క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కాగా సాగర్ జలాశయం నుంచి ఎడమ, కుడి కాల్వలకు విద్యుదుత్పాదనతో కృష్ణా డెల్టాకు 52,237 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలా శయం నీటిమట్టం 587.10 అడుగులకు చేరిం ది. 305.5646 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గరిష్ట నీటిమట్టం 590.00 అడుగులు కాగా 312.0450 టీఎంసీలు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టానికి చేరితే గేట్లు ఎత్తే అవకాశముంటుంది. సాగర్ నుంచి కూడా నీటిని స్పిల్‌వే మీదుగా విడుదల చేయనున్నారు. అప్రమత్తంగా ఉండాలి సాగర్ జలాశయానికి ఎగువనుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే జలాశయం గరిష్ట మట్టానికి చేరువలో ఉంది. డ్యాం దిగువనున్న రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని డ్యాం ఎస్ఈ టి.విజయ్‌కిరణ్‌రెడ్డి కోరారు. కృష్ణా తీర మండలాల పరిధిలోని తహసీల్దార్లు, ఆర్డీఓకు సమాచారం అందజేశారు. -
ఆల్మటి డ్యామ్ ఎత్తు పెంపులో కర్నాటక దూకుడు
-
ఆల్మట్టి @ లక్ష క్యూసెక్కులు
సాక్షి, హైదరాబాద్: ఆల్మట్టికి వరద పోటెత్తుతోంది. రోజురోజుకీ ప్రాజెక్టులోకి ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. దీంతో ప్రాజెక్టులో నిల్వలు గణనీయంగా పెరుగుతున్నాయి. మరోపక్క తుంగభద్రలోనూ అదే రీతిలో ప్రవాహాలు కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నిండేందుకు సిద్ధమవు తోంది. ఇక నారాయణపూర్‌లోనూ ఇప్పటికే చెప్పుకోదగ్గస్థాయిలో ప్రవాహాలు న్నాయి. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌లు నిండేందుకు మరో 50 టీఎంసీలు అవసరముంది. శ్రీశైలానికి కనీసం 40 టీఎంసీలు చేరినా దిగువ జూరాలకు నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. గతం కంటే 48 టీఎంసీలు ఎక్కువ.. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షా లతో ప్రాజెక్టుల్లోకి భారీ ప్రవాహాలు వస్తున్నాయి. కృష్ణానది విశ్వరూపం చూపిస్తోంది. అక్కడి ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో కర్ణాటకకు భారీగా ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో 4 రోజులుగా 40 వేల నుంచి 50 వేల క్యూసెక్కుల మేర ఆల్మట్టిలోకి ప్రవాహాలుండగా, అవి ఆదివారం ఉదయానికి లక్ష క్యూసెక్కులకు చేరింది. రోజుకు ఏకంగా 9 టీఎంసీలు వస్తుండ డంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. నీటినిల్వ 129.72 టీఎంసీలకుగాను 93 టీఎంసీలకు చేరింది. 36.72 టీఎంసీ లు చేరితే ప్రాజెక్టు నిండుకుండలా మారనుంది. గతేడాది ఇదే సమయానికి ఆల్మట్టి లో 48 టీఎంసీలే ఉండగా ఈసారి రెట్టిం పునిల్వలుండటం ఊరటనిస్తున్నాయి. -
ఆల్మట్టికి కృష్ణమ్మ పరవళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకల్లో గడిచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. చిన్న తరహా ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద ఉధృతి మరింత పెరిగింది. ఆల్మట్టిలోకి శనివారం ఉదయం 90,886 క్యూసెక్కుల మేర వరద వచ్చి చేరగా, అది సాయంత్రానికి మరింత పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో గత 4 రోజులుగా 40 వేల నుంచి 50 వేల క్యూసెక్కుల మేర ఆల్మట్టిలోకి ప్రవాహముండగా, అది శనివారానికి 90 వేల క్యూసెక్కులకు చేరింది. రోజుకు 9 టీఎంసీల మేర నీరు వచ్చి చేరుతుండటంతో వేగంగా ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం నీటినిల్వ 129.72 టీఎంసీలకుగానూ 83.78 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర లో రెండ్రోజుల కిందటి వరకు 20 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు నమోదు కాగా, ప్రస్తుతం 76,527 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో 100 టీఎంసీల నీరు నిల్వకుగానూ 66.02 టీఎంసీల నిల్వలున్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టులో 37.64 టీఎంసీ ల నిల్వకుగాను 23.81 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్, తుంగభద్రలో మరో 50 టీఎంసీల మేర నిల్వలు చేరితే దిగువనున్న జూరాలకు నీటి ప్రవాహాలు మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ వరదే మరిన్ని రోజులు కొనసాగితే 10 రోజుల్లోనే ఎగువ ప్రాజెక్టులు నిండి, దిగువకు నీటి ప్రవాహం మొదలయ్యే అవకాశముంది. ఆత్రుతగా దిగువ ప్రాజెక్టులు.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రవాహాలకు నోచుకోని రాష్ట్ర ప్రాజెక్టులు నీటి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా యి. ప్రస్తుతం రాష్ట్ర ప్రాజెక్టులకు కేవలం 10 టీఎంసీల మేర మాత్రమే నీరు రావడం, మరో 390 టీఎంసీ ల మేర నీరు వస్తే కానీ ప్రాజెక్టులు నిండే అవకాశం లేకపోవడంతో అవన్నీ ఎగువ ప్రవాహాలపైనే ఆధారపడ్డాయి. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీల నిల్వకుగానూ 20 టీఎంసీల నీరే ఉండగా, నాగార్జున సాగర్‌లో 312 టీఎంసీలకుగానూ లభ్యతగా ఉన్నది 133 టీఎంసీలు మాత్రమే. ఈ ప్రాజెక్టుల్లో ఉన్న నిల్వ ల్లో వినియోగార్హమైనది 10 టీఎంసీలకు మించి ఉండదు. జూరాలలో 9.6 టీఎంసీలకుగానూ 5.68 టీ ఎంసీ నీరు నిల్వ ఉండగా, ఈ నీటిని సాగు అవసరాలకు విడుదల చేయాలని డిమాండ్లు పెరిగాయి. -
ప్రాణహిత మహోగ్రం!
సాక్షి, హైదరాబాద్/భూపాలపల్లి/కాళేశ్వరం: ఎగువ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ఉగ్రరూపం దాలుస్తోంది. పరీవాహకంలోని వాగులు, వంకల నుంచి భారీ నీరు వచ్చి చేరడంతో ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. ఇదే సమయంలో గోదావరి పరీవాహకంలోనూ వర్షాలు ఎక్కువగా ఉండటంతో ఈ రెండు నదులు కలిసే కాళేశ్వరం వద్ద ఆదివారం సాయంత్రానికి ఏకంగా 2.56 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదయ్యాయి. శనివారం 84 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండగా ఒక్క రోజులోనే ఏకంగా 1.72 లక్షల మేర పెరిగాయి. ఎస్సారెస్పీలోకి స్థిరంగా ప్రవాహాలు ఎస్సారెస్పీలోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం ప్రాజెక్టులోకి 3,542 క్యూసెక్కుల మేర ప్రవాహం వచ్చింది. దీంతో ప్రాజెక్టు నీటి నిల్వ 90.31 టీఎంసీలకు గానూ 11.80 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్లో ఎస్సారెస్పీకి కొత్తగా 5.64 టీఎంసీల మేర నీరు వచ్చింది. అత్యధికంగా కడెం ప్రాజెక్టులోకి 18,718 క్యూసెక్కుల మేర నీరు వస్తోంది. ప్రాజెక్టు వాస్తవ నిల్వ 7.60 టీఎంసీలకు గానూ 7 టీఎంసీలకు నీరు చేరుకుంది. దీంతో ఒక గేటును ఐదు అడుగుల మేర ఎత్తి 6,259 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మధ్యాహ్నానికి ఇన్‌ఫ్లో తగ్గడంతో గేటు దించేశారు. ఎల్లంపల్లిలోకి 3,314 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, నిల్వలు 20.18 టీఎంసీలకు 6.30 టీఎంసీలకు చేరుకున్నాయి. ఆల్మట్టికి రోజుకు 5 టీఎంసీలు కర్ణాటకలో భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి రోజుకు 5 టీఎంసీల చొప్పున 53,383 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు మట్టం ఆదివారం సాయంత్రానికి 47.91 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్లో మొత్తంగా ప్రాజెక్టులోకి 24 టీఎంసీల నీరు చేరింది. ఇంకో 60 టీఎంసీల నీరు చేరితే అక్కడి నుంచి దిగువ నారాయణపూర్‌కు, అక్కడి నుంచి జూరాలకు ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. ఇక తుంగభద్రలోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. 7,661 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు నిల్వలు 100 టీఎంసీలకు గాను ప్రస్తుతం 42.34 టీఎంసీలకు చేరింది. నారాయణపూర్‌కు ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్ర పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్లకు ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోయాయి. జూరాలలో 9.66 టీఎంసీలకు గానూ 5.77, నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీలకు గానూ 133.37 టీఎంసీలు, శ్రీశైలంలో 215 టీఎంసీలకు గానూ 29 టీఎంసీల నిల్వలున్నాయి. పెరిగిన గోదావరి ఉధృతి మూడు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి ఉధృతి పెరిగింది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద ఆదివారం సాయంత్రం 7.01 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. ఇక్కడ నీటి మట్టం 11 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం అంతర్రాష్ట వంతెనను తాకుతూ నీరు పరుగుపెడుతొంది. కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల్లోని గ్రామాల వెంట జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఐలాపురం, ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూపాలపల్లి ఏరియాలోని గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఉపరితల గనుల్లో డంపర్లు, డోజర్లు, షావల్స్, బెంజ్ లారీలు వెళ్లే పరిస్థితి లేదు. సుమారు 24 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. పూర్తిగా నిలిచిన ‘మేడిగడ్డ’పనులు ప్రాణహిత ఉధృతి పెరిగిన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద జరుగుతున్న బ్యారేజీ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 100 మీటర్ల ఎత్తుతో జరుగుతుండగా ప్రస్తుతం అక్కడ 93.68 మీటర్ల ఎత్తుతో ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ పంప్ హౌస్ ప్రాంతంలో ఏకంగా 99.20 మీటర్ల ఎత్తుతో ప్రవాహ ఉధృతి ఉంది. అప్రమత్తంగా ఉండండి కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదల ప్రమాదం పొంచి ఉందని.. అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రాజెక్టు ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్‌రావు, హరిరామ్ ఆదేశాలిచ్చారు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి, సంబంధిత చీఫ్ ఇంజనీర్లకు ప్రతి విషయాన్ని చేరవేయాలని సూచించారు. ఆదివారం ఈ మేరకు వారి సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపారు. వరదలకు సంబంధించిన రిపోర్డులను గంట గంటకు తెలియజేయాలని ఈఎన్సీలు చెప్పినట్లు ఇంజనీర్లు పేర్కొన్నారు. – కాళేశ్వరం ఇంజనీర్లకు ఈఎన్సీల సమాచారం -
ఆల్మట్టి ఎత్తుపై కర్ణాటక రాజకీయం!
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు - తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతుల కోసం ఒత్తిళ్లు - ఇప్పటికే కేంద్ర మంత్రిని కలసిన కర్ణాటక మంత్రులు - అనుమతులు సాధించి రాజకీయ లబ్ధి పొందే యత్నం - కేంద్రం తలొగ్గితే తెలంగాణ ఎడారే! సాక్షి, హైదరాబాద్: ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు రాజకీయ రంగు పులుముకుంటోంది.. ఆల్మట్టి ఎత్తు పెంపుపై ఆధారపడి చేపట్టిన ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు సాధించుకొనేందుకు కర్ణాటక ప్రభుత్వం రాజకీయ కోణాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు కర్ణాటక మంత్రులు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిని కలసి విజ్ఞప్తులు చేసినట్లు తెలిసింది. మరోవైపు ఆ రాష్ట్రంలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ పార్టీల పెద్దలు కూడా ఈ పథకాలకు అనుమతులు సాధించి.. ఘనతను తమ ఖాతాలో వేసుకోవాలని యోచిస్తున్నారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు.. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచుకునేందుకు కర్ణాటక చాలాకాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆ పెంపుతో అదనంగా లభించే నీటిని వినియోగించుకునేలా తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేసింది. కానీ బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కాకపోవడం (అమల్లోకి రాకపోవడం)తోపాటు పలు ఇతర అంశాల నేపథ్యంలో ఈ ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం తిరస్కరించింది. అయితే కర్ణాటక చేపట్టిన ఈ తొమ్మిది ఎత్తిపోతల పథకాల నుంచి పలువురు కీలక నేతలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అందులో అధికార కాంగ్రెస్‌తోపాటు విపక్ష బీజేపీ నేతల నియోజకవర్గాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నేతలంతా ఎత్తిపోతల పథకాలకు ఎలాగైనా అనుమతులు సాధించాలన్న ఉద్దేశంతో ఉన్నారు. తద్వారా ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తున్నారు. ప్రయత్నాలు మొదలు.. ఇటీవల కర్ణాటక మంత్రులు ఇద్దరు కేంద్ర మంత్రిని కలసి ఎత్తిపోతల పథకాలకు అనుమతులపై విజ్ఞప్తులు చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచుకొనేందుకు బ్రిజేశ్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిందని, అందువల్ల దానిపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని వారు కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ పథకాలు పూర్తిచేస్తామని.. ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చాకే నీటి విని యోగం మొదలుపెడతామని వివరించినట్లు సమాచారం. మరోవైపు కర్ణాటకకు చెందిన పలువురు బీజేపీ కేంద్ర మంత్రులు సైతం.. ఆ ఎత్తిపోతల పథకాలకు అనుమతులపై దృష్టి సారించినట్లు తెలిసింది. తాము అనుమతులు సాధించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు సమాచారం. కర్ణాటక ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గితే.. కర్ణాటక ప్రభుత్వం, అక్కడి నేతల ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గితే.. కృష్ణా పరీవాహకంలో దిగువన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే విచ్చలవిడిగా నీటిని వినియోగించుకుంటున్న కర్ణాటక.. ఆ ఎత్తిపోతల పథకాలకు కూడా నీటిని వినియోగించుకుంటే దిగువకు చుక్క నీరు కూడా రాదని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. -
బిరబిరా కృష్ణమ్మ.. కదలి రావమ్మా!
► రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి కృష్ణా పరవళ్లు.. ► 100 టీఎంసీలకు చేరిన ఆల్మట్టి నిల్వ ► ప్రస్తుతం 1.42 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ► రెండు రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం.. ► ఇప్పటికే నారాయణపూర్‌కు 33 వేల క్యూసెక్కులు విడుదల ► మరో 20 టీఎంసీలు చేరితే దిగువకు కృష్ణమ్మ పరుగులు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం వైపు మరో రెండు మూడు రోజుల్లో కృష్ణమ్మ పరవళ్లు మొదలు కానున్నాయి. ఎగువ కర్ణాటకలో భారీగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు జలకళను సంతరించుకో వడంతో దిగువ ఆశలు సజీవమయ్యాయి. అక్కడ కురుస్తున్న వర్షాలకు తోడు స్థానిక ప్రవాహాలు తోడవడంతో ఆల్మట్టిలోకి నీటి ప్రవాహాల ఉధృతి కొనసాగుతోంది. దీంతో సోమవారం ఉదయానికి 88.94 టీఎంసీలు ఉన్న నిల్వ సాయంత్రానికి 100 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 1.42 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతుండటంతో రెండు రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశాలున్నాయి. వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకొని దిగువ నారాయణపూర్‌కి నీటి విడుదల కొనసాగుతుండటంతో అక్కడ మట్టాలు పెరిగాయి. రెండు ప్రాజెక్టుల్లో మరో 20 టీఎంసీల మేర నీరు చేరితే దిగువ జూరాలకు నీటి విడుదల జరిగే అవకాశాలున్నాయి. ఆల్మట్టికి జల కళ కృష్ణా పరీవాహకంలో గడిచిన పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి జలకళను సంతరించుకుంటోంది. ప్రాజెక్టులోకి ఈ పది రోజుల్లోనే సుమారు 70 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 1.42 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ఆల్మట్టి వాస్తవ నీటి మట్టం 1,705 అడుగుల కాగా ప్రస్తుతం 1,696.52 అడుగులకు నీరు చేరింది. 129.7 టీఎంసీలకు గానూ సోమవారం ఉదయానికి 88.94 టీఎంïసీల నీటి లభ్యత ఉంది. ఉదయం నుంచి భారీగా ప్రవాహాలు కొనసాగడంతో సాయంత్రానికి మట్టం 100 టీఎంసీలకు చేరినట్లు కర్ణాటక నీటి పారుదల వర్గాలు తెలంగాణ అధికారులకు సమాచారం ఇచ్చాయి. భారీ వరదను దృష్టిలో పెట్టుకొని పవర్ హౌజ్ ద్వారా 33 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి నుంచి వదిలిన నీరంతా దిగువ నారాయణపూర్‌కు వస్తుండటంతో ఆ ప్రాజెక్టు నిండేందుకు సిద్ధంగా ఉంది. నారాయణపూర్‌లో 37.64 టీఎంసీ సామర్థ్యానికి గానూ సోమవారం ఉదయం 29.88 టీఎంసీల నీరు లభ్యంగా ఉంది. ఉదయం నుంచి 35,740 క్యూసెక్కుల ప్రవాహాలు ఉండటంతో ప్రాజెక్టు ఏ క్షణమైనా నిండే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు నిండేందుకు మరో రెండు, మూడు రోజులు పడుతుందని, అదే జరిగితే దిగువ జూరాలకు నాలుగు రోజుల్లో కృష్ణా ప్రవాహాలు నమోదవుతాయని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జూరాలలో 9.6 టీఎంసీల సామర్థ్యానికి గానూ 6.73 టీఎంసీల నిల్వ ఉంది. ఒక్కసారి ప్రవాహాలు మొదలైతే ప్రాజెక్టు నీటిపై ఆధారపడిన ఆయకట్టుకు నీటి విడుదల మొదలు కానుంది. 5 లక్షల ఎకరాలకు సాగునీరు.. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి రెండుమూడు రోజుల్లో నీటి విడుదల జరిగే అవకాశం ఉండటం, మరో నాలుగు రోజుల్లో జూరాలకు ప్రవాహాలు ఉండే అవకాశం ఉన్నందున మహబూబ్‌నగర్‌లో జూరాలపై ఆధారప నడిన ఆయకట్టుకు నీరందించే ప్రక్రియపై నీటి పారుదల శాఖ దృష్టి పెట్టింది. జూరాల కింద ఉన్న లక్ష ఎకరాలకు నీటిని అందించడంతో పాటు బీమా నుంచి 2 లక్షలు, నెట్టెంపాడు నుంచి 1.5 లక్షలు, కోయిల్‌సాగర్ నుంచి 50 వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయా ప్రాజెక్టుల కింద చెరువులను నింపేందు కు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఇదివరకే అధికారులను ఆదేశించారు. -
ఆల్మట్టికి భారీగా వరద నీరు...
జూరాల : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌కు శనివారం భారీస్థాయిలో వరదనీరు చేరింది. ఒక్కరోజే లక్ష క్యూసెక్కులకు పైగా నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 1,705 అడుగులుండగా శనివారంనాటికి 1,682.6 అడుగులకు చేరింది. మరో 18 అడుగులకు నీటి నిల్వ చేరితే ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న నారాయణపూర్‌కు.. అక్కడి నుంచి మన రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు కృష్ణానది వరద వచ్చే అవకాశం ఉంది. మరో పదిరోజుల్లోపే కృష్ణానది వరద జూరాలకు చేరే అవకాశం ఉండడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకెత్తాయి. ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌కు భారీస్థాయిలో ఇన్‌ఫ్లో వస్తుండటంతోప్రాజెక్టు నుంచి మొదటిసారిగా 4,167 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్‌కు 786 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.30 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 80 క్యూసెక్కు వస్తుండగా తాగునీటి అవసరాల కొరకు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 100 క్యూసెక్కును దిగువకు విడుదల చేస్తున్నారు.