ప్రాణహిత మహోగ్రం! | Heavy Water Inflow Into Pranahita Project | Sakshi
Sakshi News home page

ప్రాణహిత మహోగ్రం!

Published Mon, Jul 9 2018 2:00 AM | Last Updated on Mon, Jul 9 2018 2:23 AM

Heavy Water Inflow Into Pranahita Project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/భూపాలపల్లి/కాళేశ్వరం: ఎగువ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ఉగ్రరూపం దాలుస్తోంది. పరీవాహకంలోని వాగులు, వంకల నుంచి భారీ నీరు వచ్చి చేరడంతో ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. ఇదే సమయంలో గోదావరి పరీవాహకంలోనూ వర్షాలు ఎక్కువగా ఉండటంతో ఈ రెండు నదులు కలిసే కాళేశ్వరం వద్ద ఆదివారం సాయంత్రానికి ఏకంగా 2.56 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదయ్యాయి. శనివారం 84 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండగా ఒక్క రోజులోనే ఏకంగా 1.72 లక్షల మేర పెరిగాయి. 

ఎస్సారెస్పీలోకి స్థిరంగా ప్రవాహాలు 
ఎస్సారెస్పీలోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం ప్రాజెక్టులోకి 3,542 క్యూసెక్కుల మేర ప్రవాహం వచ్చింది. దీంతో ప్రాజెక్టు నీటి నిల్వ 90.31 టీఎంసీలకు గానూ 11.80 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్‌లో ఎస్సారెస్పీకి కొత్తగా 5.64 టీఎంసీల మేర నీరు వచ్చింది. అత్యధికంగా కడెం ప్రాజెక్టులోకి 18,718 క్యూసెక్కుల మేర నీరు వస్తోంది. ప్రాజెక్టు వాస్తవ నిల్వ 7.60 టీఎంసీలకు గానూ 7 టీఎంసీలకు నీరు చేరుకుంది. దీంతో ఒక గేటును ఐదు అడుగుల మేర ఎత్తి 6,259 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మధ్యాహ్నానికి ఇన్‌ఫ్లో తగ్గడంతో గేటు దించేశారు. ఎల్లంపల్లిలోకి 3,314 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, నిల్వలు 20.18 టీఎంసీలకు 6.30 టీఎంసీలకు చేరుకున్నాయి. 

ఆల్మట్టికి రోజుకు 5 టీఎంసీలు 
కర్ణాటకలో భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి రోజుకు 5 టీఎంసీల చొప్పున 53,383 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు మట్టం ఆదివారం సాయంత్రానికి 47.91 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్‌లో మొత్తంగా ప్రాజెక్టులోకి 24 టీఎంసీల నీరు చేరింది. ఇంకో 60 టీఎంసీల నీరు చేరితే అక్కడి నుంచి దిగువ నారాయణపూర్‌కు, అక్కడి నుంచి జూరాలకు ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది.  

ఇక తుంగభద్రలోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. 7,661 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు నిల్వలు 100 టీఎంసీలకు గాను ప్రస్తుతం 42.34 టీఎంసీలకు చేరింది. నారాయణపూర్‌కు ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్ర పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోయాయి. జూరాలలో 9.66 టీఎంసీలకు గానూ 5.77, నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీలకు గానూ 133.37 టీఎంసీలు, శ్రీశైలంలో 215 టీఎంసీలకు గానూ 29 టీఎంసీల నిల్వలున్నాయి. 

పెరిగిన గోదావరి ఉధృతి 
మూడు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గోదావరి ఉధృతి పెరిగింది. మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద ఆదివారం సాయంత్రం 7.01 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. ఇక్కడ నీటి మట్టం 11 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం అంతర్రాష్ట వంతెనను తాకుతూ నీరు పరుగుపెడుతొంది. కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల్లోని గ్రామాల వెంట జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఐలాపురం, ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూపాలపల్లి ఏరియాలోని గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఉపరితల గనుల్లో డంపర్లు, డోజర్లు, షావల్స్, బెంజ్‌ లారీలు వెళ్లే పరిస్థితి లేదు. సుమారు 24 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. 

పూర్తిగా నిలిచిన ‘మేడిగడ్డ’పనులు 
ప్రాణహిత ఉధృతి పెరిగిన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద జరుగుతున్న బ్యారేజీ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 100 మీటర్ల ఎత్తుతో జరుగుతుండగా ప్రస్తుతం అక్కడ 93.68 మీటర్ల ఎత్తుతో ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ పంప్‌ హౌస్‌ ప్రాంతంలో ఏకంగా 99.20 మీటర్ల ఎత్తుతో ప్రవాహ ఉధృతి ఉంది. 

అప్రమత్తంగా ఉండండి 
కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదల ప్రమాదం పొంచి ఉందని.. అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రాజెక్టు ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, హరిరామ్‌ ఆదేశాలిచ్చారు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి, సంబంధిత చీఫ్‌ ఇంజనీర్లకు ప్రతి విషయాన్ని చేరవేయాలని సూచించారు. ఆదివారం ఈ మేరకు వారి సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపారు. వరదలకు సంబంధించిన రిపోర్డులను గంట గంటకు తెలియజేయాలని ఈఎన్‌సీలు చెప్పినట్లు ఇంజనీర్లు పేర్కొన్నారు.     – కాళేశ్వరం ఇంజనీర్లకు ఈఎన్‌సీల సమాచారం 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement