srcp
-
ప్రాణహిత మహోగ్రం!
సాక్షి, హైదరాబాద్/భూపాలపల్లి/కాళేశ్వరం: ఎగువ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ఉగ్రరూపం దాలుస్తోంది. పరీవాహకంలోని వాగులు, వంకల నుంచి భారీ నీరు వచ్చి చేరడంతో ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. ఇదే సమయంలో గోదావరి పరీవాహకంలోనూ వర్షాలు ఎక్కువగా ఉండటంతో ఈ రెండు నదులు కలిసే కాళేశ్వరం వద్ద ఆదివారం సాయంత్రానికి ఏకంగా 2.56 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదయ్యాయి. శనివారం 84 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండగా ఒక్క రోజులోనే ఏకంగా 1.72 లక్షల మేర పెరిగాయి. ఎస్సారెస్పీలోకి స్థిరంగా ప్రవాహాలు ఎస్సారెస్పీలోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం ప్రాజెక్టులోకి 3,542 క్యూసెక్కుల మేర ప్రవాహం వచ్చింది. దీంతో ప్రాజెక్టు నీటి నిల్వ 90.31 టీఎంసీలకు గానూ 11.80 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్లో ఎస్సారెస్పీకి కొత్తగా 5.64 టీఎంసీల మేర నీరు వచ్చింది. అత్యధికంగా కడెం ప్రాజెక్టులోకి 18,718 క్యూసెక్కుల మేర నీరు వస్తోంది. ప్రాజెక్టు వాస్తవ నిల్వ 7.60 టీఎంసీలకు గానూ 7 టీఎంసీలకు నీరు చేరుకుంది. దీంతో ఒక గేటును ఐదు అడుగుల మేర ఎత్తి 6,259 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మధ్యాహ్నానికి ఇన్‌ఫ్లో తగ్గడంతో గేటు దించేశారు. ఎల్లంపల్లిలోకి 3,314 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, నిల్వలు 20.18 టీఎంసీలకు 6.30 టీఎంసీలకు చేరుకున్నాయి. ఆల్మట్టికి రోజుకు 5 టీఎంసీలు కర్ణాటకలో భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి రోజుకు 5 టీఎంసీల చొప్పున 53,383 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు మట్టం ఆదివారం సాయంత్రానికి 47.91 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్లో మొత్తంగా ప్రాజెక్టులోకి 24 టీఎంసీల నీరు చేరింది. ఇంకో 60 టీఎంసీల నీరు చేరితే అక్కడి నుంచి దిగువ నారాయణపూర్‌కు, అక్కడి నుంచి జూరాలకు ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. ఇక తుంగభద్రలోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. 7,661 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు నిల్వలు 100 టీఎంసీలకు గాను ప్రస్తుతం 42.34 టీఎంసీలకు చేరింది. నారాయణపూర్‌కు ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్ర పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్లకు ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోయాయి. జూరాలలో 9.66 టీఎంసీలకు గానూ 5.77, నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీలకు గానూ 133.37 టీఎంసీలు, శ్రీశైలంలో 215 టీఎంసీలకు గానూ 29 టీఎంసీల నిల్వలున్నాయి. పెరిగిన గోదావరి ఉధృతి మూడు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి ఉధృతి పెరిగింది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద ఆదివారం సాయంత్రం 7.01 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. ఇక్కడ నీటి మట్టం 11 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం అంతర్రాష్ట వంతెనను తాకుతూ నీరు పరుగుపెడుతొంది. కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల్లోని గ్రామాల వెంట జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఐలాపురం, ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూపాలపల్లి ఏరియాలోని గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఉపరితల గనుల్లో డంపర్లు, డోజర్లు, షావల్స్, బెంజ్ లారీలు వెళ్లే పరిస్థితి లేదు. సుమారు 24 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. పూర్తిగా నిలిచిన ‘మేడిగడ్డ’పనులు ప్రాణహిత ఉధృతి పెరిగిన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద జరుగుతున్న బ్యారేజీ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 100 మీటర్ల ఎత్తుతో జరుగుతుండగా ప్రస్తుతం అక్కడ 93.68 మీటర్ల ఎత్తుతో ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ పంప్ హౌస్ ప్రాంతంలో ఏకంగా 99.20 మీటర్ల ఎత్తుతో ప్రవాహ ఉధృతి ఉంది. అప్రమత్తంగా ఉండండి కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదల ప్రమాదం పొంచి ఉందని.. అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రాజెక్టు ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్‌రావు, హరిరామ్ ఆదేశాలిచ్చారు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి, సంబంధిత చీఫ్ ఇంజనీర్లకు ప్రతి విషయాన్ని చేరవేయాలని సూచించారు. ఆదివారం ఈ మేరకు వారి సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపారు. వరదలకు సంబంధించిన రిపోర్డులను గంట గంటకు తెలియజేయాలని ఈఎన్సీలు చెప్పినట్లు ఇంజనీర్లు పేర్కొన్నారు. – కాళేశ్వరం ఇంజనీర్లకు ఈఎన్సీల సమాచారం -
జూన్‌కల్లా ఎస్సారెస్పీ రెండో దశ
పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశం * నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎస్సారెస్పీ రెండో దశను వచ్చే జూన్ నాటికి పూర్తి చేసి నిర్ణీత ఆయకట్టుకు నీరివ్వాలన్నారు. ఎస్సారెస్పీ-2 పనులపై నెలకోసారి సమీక్షిస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కాళేశ్వరం, నాగార్జున సాగర్ లోలెవల్ కెనాల్, డిండి, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పుట్టంగండి, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, మూసీ ఆధునీకరణ, ఉదయ సముద్రం ప్రాజెక్టుల భూసేకరణ, పులిచింతల ప్రాజెక్టు పరిధిలో భూ నిర్వాసితుల సహాయ, పునరావాస కార్యక్రమాలపై మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి హరీశ్‌రావు సమీక్షించారు. సాగర్ లోలెవల్ కెనాల్ పనులు నత్తనడకన సాగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టులోనే పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా పెండింగ్‌లో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. పనుల్లో జాప్యాన్ని ఇక ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ నెల 10న లోలెవల్ కెనాల్ ఒక పంపు డ్రైరన్ ప్రారంభించాలని, 25న వెట్ రన్ చేయాలని మంత్రి ఆదేశించారు. అక్టోబర్‌లో అన్ని పంపులు నడపాలని సూచించారు. సమావేశంలో ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, ప్రభాకర్‌రెడ్డి, రవీంద్ర నాయక్, భాస్కర్‌రావు, భారీ నీటిపారుదలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీ, ఈఎన్సీ మురళీధర్, నల్లగొండ జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, సీఈలు సునీల్, బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మూసీ కింద 30 వేల ఎకరాలకు సాగునీరు మూసీ ప్రాజెక్టు కింద తక్షణం 30 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా కాల్వ పొడవునా పూడిక తొలగించాలని... ఇందుకోసం షార్ట్‌టర్మ్ టెండర్ పిలవాలని హరీశ్‌రావు ఆదేశించారు. మూసీ ఆధునీకరణకు రూ.56 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం దశలవారీగా నిధులు మంజూరు చేయనుందని తెలిపారు. ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యను అధిగమించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. సాగర్ లోలెవల్ కెనాల్ ప్యాకేజీ 81లో 61 ఎకరాలు, ప్యాకేజీ 110లో 130 ఎకరాలు సేకరించాల్సి ఉందని, దాన్ని పూర్తి చేయాలన్నారు. అలాగే డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు కోసం ఇంకా 2,233 ఎకరాలు, పెండ్లి పాకాల రిజర్వాయర్ కోసం 1,911 ఎకరాలు, ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద 1,649 ఎకరాలను త్వరితగతిన సేకరించాలని సూచించారు. పులిచింతల ముంపు గ్రామాల నిర్వాసితుల పునరావాసం కోసం రూ. 115 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ను కోరగా రూ. 66 కోట్లు విడుదల చేసిందని, ప్రస్తుతానికి ఆ నిధులతో పునరావాస చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. త్వరితగతిన ‘కాళేశ్వరం’ భూసేకరణ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఆలేరు, భువనగిరి, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు 2.62 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వనున్నందున సంబంధిత భూసేకరణ పనులు వేగవంతం చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చి రూ. 123 కోట్లు విడుదల చేసిన పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బున్యాదిగని కాల్వల విస్తరణ పనులను వెంటనే చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ వద్ద నిధులున్నప్పటికీ డిండి భూసేకరణ బిల్లుల చెల్లింపులో జాప్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈ, ఎస్‌ఈలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించారు. ప్రాధాన్యతలనుబట్టి చెల్లింపుల్లో వేగం పెంచాలని, ఇకపై అలసత్వం, నిరక్ష్యాన్ని సహించబోమన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో వేగం పెంచాలని, త్వరలోనే మూడో దశను ప్రారంభించనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. -
ఆశల చిగురు!
మొదలైన ఖరీఫ్ పంటల సాగు * సాగర్ కింద 4 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళిక * నీటి విడుదల కోసం రేపు బోర్డుకు లేఖ రాయనున్న రాష్ట్రం * ఎస్సారెస్పీ కింద 4.63 లక్షల ఎకరాలకు నీరివ్వాలని సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద సాగు ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు వస్తుండటంతో రైతుల ఆశలు మొగ్గ తొడుగుతున్నాయి. ఇప్పటికే మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటివనరుల కింద జోరుగా ఖరీఫ్ పంటల సాగు జరుగుతుండగా భారీ ప్రాజెక్టుల కింద సాగుకు రైతులు నడుం బిగిస్తున్నారు. ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, నిజాం సాగర్, జూరాల, ఆర్డీఎస్, కడెం, మూసీ, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 21.29 లక్షల మేర ఆయకట్టు ఉంది. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు చేరకపోవడంతో సాగు పరిస్థితి దారుణంగా తయారైంది. 2014-15లో మొత్తం లక్ష్యంలో కేవలం 7.90 లక్షల ఎకరాలే సాగవగా 2015-16 నాటికి అది 72 వేలకు పడిపోయింది. అయితే ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడం, ప్రాజెక్టుల్లోకి ఆశించిన మేర నీరు చేరుతుండటంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది. ఇప్పటికే ఎగువ నుంచి భారీ ప్రవాహాలతో కృష్ణమ్మ వస్తుండటంతో జూరాల కింద పంటల సాగుకు నీటి విడుదల మొదలైంది. ప్రాజెక్టు కింద మొత్తంగా 1,04,741 ఎకరాల మేర ఉండగా ఇప్పటికే 80వేల ఎకరాలకు పైగా సాగు మొదలైనట్లు తెలుస్తోంది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ల కింద 4.60 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక సిద్ధమవగా ఇప్పటికే నీటి విడుదల ప్రక్రియ మొదలైంది. ఈ ప్రాజెక్టు కింద సుమారు 2.50 లక్షల ఎకరాల మేర సాగు పుంజుకున్నట్లు నీటిపారుదలశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు స్ధిరంగా ప్రవాహాలు కొనసాగుతుండటం, ఇప్పటికే నీటి నిల్వ 165 టీఎంసీలకు పెరగడంతో మరో రెండు వారాల్లో శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేసే అవాకశాలున్నాయి. దీనివల్ల ఆలస్యంగా అయినా ఎడమ కాల్వ కింద ఉన్న 6.40 లక్షల ఎకరాల్లో కనీసం 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించే అవకాశాలున్నాయని నీటిపారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సాగర్ నుంచి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సాగు అవసరాలకు నీటిని విడుదల చేసేలా కృష్ణా బోర్డుకు లేఖ రాయాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బోర్డుకు అధికారులు మంగళవారం లేఖ రాయనున్నారు. ఎస్సారెస్పీ కింద ఖరీఫ్ కార్యాచరణ షురూ రెండేళ్లుగా నిస్సారంగా ఉన్న ఎస్సారెస్పీలోకి ఈ ఏడాది 45 టీఎంసీల మేర నీరు రావడం, మరింతగా ప్రవాహాలు కొనసాగుతుండటం ఆయకట్టు రైతాంగానికి ఊరటనిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీరిచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి సాగు అవసరాలు 17.18 టీఎంసీలు విడుదల చేయడంతోపాటు లోయర్ మానేరు డ్యామ్‌కు 10 టీఎంసీలు, ఎత్తిపోతల పథకాలకు 3.95 టీఎంసీలు విడుదల చేయాలని సీఎం సూచించినట్లుగా తెలిసింది. మొత్తంగా ప్రాజెక్టు కింద 4.63 లక్షల ఎకరాలకు నీరివ్వాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు లక్ష్యం 1.65 లక్షల ఎకరాల్లో 30 వేల ఎకరాలకు సెప్టెంబర్ తొలి వారంలో నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో ప్రాజెక్టు కింద పంప్హౌస్ట్రయల్ రన్‌ను ఈ నెల చివరి వారంలో నిర్వహించనున్నారు. -
గలగల గోదారి
భైంసా : జిల్లాపై కరువు మేఘాలు కమ్ముకున్నాయి. కారు మబ్బులు ఊరిస్తున్నాయి. వర్షించడం లేదు. ఖరీఫ్ పనులు ఆరంభమై నెల రోజులు గడిచినా వరుణుడు కరుణించడం లేదు. ప్రాజెక్టులు, చెరువులు అడుగంటుతున్నాయి. వేసిన విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి. మొలిచిన మొక్కలు నేలవాలుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గోదావరి పరీవాహాక ప్రాంతంలో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నీరందించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను మహారాష్ట్ర సర్కారు మంగళవారం ఎత్తింది. పోలీసు బందోబస్తు మధ్య వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎత్తారు. దీంతో బాబ్లీ ప్రాజెక్టులో 0.7 టీఎంసీల నీరు ఎస్సారెస్పీలోకి చేరుతోంది. గోదావరిలో జలకళ వర్షాలు కురియక గోదావరి నదిలో నీటి ప్రవాహం కనిపించలేదు. బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో బుధవారం బాసర గోదావరి వద్ద జలకళ కనిపించింది. గోదావరి నదిలో నీటి ప్రవాహంతో ఎత్తిపోతల పథకాలకు నీరు చేరనుంది. బాసర, కౌట, ఆష్టా ఎత్తిపోతలకు పరీవాహక నీటిరాకతో ఆయకట్టు రైతులకు కొద్దిమేర ఆశ చిగురిస్తుంది. శ్రీరాంసాగర్‌లో బాబ్లీ గేట్లు తెరవడంతో 0.7 టీఎంసీల నీరు చేరి 0.4 అడుగుల నీటి మట్టం పెరుగుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. అక్టోబర్ 28 వరకు.. వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య గోదావరి జలాల కోసం తీవ్రమైన పోరు కొనసాగింది. ఇరు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అత్యున్నత న్యాయస్థానం ఇరు రాష్ట్రాల వాదనలు విని మహారాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాల కోసం 2.84 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. బాబ్లీ ఇన్‌ఫ్లోను అడ్డుకోకుండా ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు నాలుగు నెలలపాటు గేట్లు ఎత్తి ఉంచాలని తీర్పు ఇచ్చింది. అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచే ఉంటాయి. భారీ వర్షాలు కురిస్తే పెద్ద మొత్తంలోనే ఎస్సారెస్పీలోకి వరద నీరు చేరనుంది. జిల్లా రైతులకు ఊరట మరో వారం రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో బాబ్లీ గేట్లు పైకి ఎత్తి వస్తున్న నీరు ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి చేరుతోంది. ఎస్సారెస్పీలోని నీరు చేరుతుండడంతో జిల్లా రైతుల్లో కొత్త ఆశ చిగురిస్తుంది. వర్షాలు కురిసే వరకు ప్రాజెక్టులో చేరే నీటిని అంచనా వేసి పంటలు వేసుకునేందుకు ఎస్సారెస్పీ ఆయాకట్టు రైతులు సన్నద్ధం అవుతున్నారు.