జూన్‌కల్లా ఎస్సారెస్పీ రెండో దశ
పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశం
* నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎస్సారెస్పీ రెండో దశను వచ్చే జూన్ నాటికి పూర్తి చేసి నిర్ణీత ఆయకట్టుకు నీరివ్వాలన్నారు. ఎస్సారెస్పీ-2 పనులపై నెలకోసారి సమీక్షిస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కాళేశ్వరం, నాగార్జున సాగర్ లోలెవల్ కెనాల్, డిండి, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పుట్టంగండి, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, మూసీ ఆధునీకరణ, ఉదయ సముద్రం ప్రాజెక్టుల భూసేకరణ, పులిచింతల ప్రాజెక్టు పరిధిలో భూ నిర్వాసితుల సహాయ, పునరావాస కార్యక్రమాలపై మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి హరీశ్‌రావు సమీక్షించారు.
సాగర్ లోలెవల్ కెనాల్ పనులు నత్తనడకన సాగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టులోనే పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా పెండింగ్‌లో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. పనుల్లో జాప్యాన్ని ఇక ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ నెల 10న లోలెవల్ కెనాల్ ఒక పంపు డ్రైరన్ ప్రారంభించాలని, 25న వెట్ రన్ చేయాలని మంత్రి ఆదేశించారు. అక్టోబర్‌లో అన్ని పంపులు నడపాలని సూచించారు. సమావేశంలో ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, ప్రభాకర్‌రెడ్డి, రవీంద్ర నాయక్, భాస్కర్‌రావు, భారీ నీటిపారుదలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషీ, ఈఎన్‌సీ మురళీధర్, నల్లగొండ జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, సీఈలు సునీల్, బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మూసీ కింద 30 వేల ఎకరాలకు సాగునీరు
మూసీ ప్రాజెక్టు కింద తక్షణం 30 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా కాల్వ పొడవునా పూడిక తొలగించాలని... ఇందుకోసం షార్ట్‌టర్మ్ టెండర్ పిలవాలని హరీశ్‌రావు ఆదేశించారు. మూసీ ఆధునీకరణకు రూ.56 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం దశలవారీగా నిధులు మంజూరు చేయనుందని తెలిపారు. ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యను అధిగమించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు.
సాగర్ లోలెవల్ కెనాల్ ప్యాకేజీ 81లో 61 ఎకరాలు, ప్యాకేజీ 110లో 130 ఎకరాలు సేకరించాల్సి ఉందని, దాన్ని పూర్తి చేయాలన్నారు. అలాగే డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు కోసం ఇంకా 2,233 ఎకరాలు, పెండ్లి పాకాల రిజర్వాయర్ కోసం 1,911 ఎకరాలు, ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద 1,649 ఎకరాలను త్వరితగతిన సేకరించాలని సూచించారు. పులిచింతల ముంపు గ్రామాల నిర్వాసితుల పునరావాసం కోసం రూ. 115 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ను కోరగా రూ. 66 కోట్లు విడుదల చేసిందని, ప్రస్తుతానికి ఆ నిధులతో పునరావాస చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి సూచించారు.
త్వరితగతిన ‘కాళేశ్వరం’ భూసేకరణ
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఆలేరు, భువనగిరి, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు 2.62 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వనున్నందున సంబంధిత భూసేకరణ పనులు వేగవంతం చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చి రూ. 123 కోట్లు విడుదల చేసిన పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బున్యాదిగని కాల్వల విస్తరణ పనులను వెంటనే చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ వద్ద నిధులున్నప్పటికీ డిండి భూసేకరణ బిల్లుల చెల్లింపులో జాప్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈ, ఎస్‌ఈలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించారు. ప్రాధాన్యతలనుబట్టి చెల్లింపుల్లో వేగం పెంచాలని, ఇకపై అలసత్వం, నిరక్ష్యాన్ని సహించబోమన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో వేగం పెంచాలని, త్వరలోనే మూడో దశను ప్రారంభించనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు.