సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాప్రజల చిరకాలవాంఛ నెరవేరే క్రమంలో కీలక ముందడుగు పడింది. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగమార్గాన్ని మూడేళ్లలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్, భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శుల సమక్షంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఎట్టి పరిస్థితుల్లో సొరంగమార్గాన్ని మూడేళ్లలో పూర్తిచేసేలా యుద్ధప్రాతిపదికన పనులు చేయాలని, ఇందుకు గాను ఉన్న అవాంతరాలను వెంటనే తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో పాటు డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకాలను కూడా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నా, నక్కలగండి ప్రాజెక్టుపై మాత్రం మరోమారు సమావేశ మై చర్చించాలని అభిప్రాయపడింది.
ఏం చేద్దాం..?
శాసనసభలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎస్‌ఎల్‌బీసీపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేసీఆర్, హరీష్‌రావులతో పాటు జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూరనర్సయ్యగౌడ్, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతి, భాస్కరరావు, గొంగిడి సునీత, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిశోర్‌లతో పాటు సీపీఐ నుంచి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రవీంద్రకుమార్, సీపీఎం నుంచి సున్నం రాజయ్య, వైఎస్సార్‌సీపీ నుంచి తాటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణంలో ఎదురవుతున్న అవాంతరాలను ఎలా అధిగమించాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా పెరిగిన ధరల ప్రకారం తనకు ఎస్కులేషన్ చార్జీలు చెల్లించాలని ప్రాజెక్టు కాంట్రాక్టర్ 2012లో పెట్టుకున్న దరఖాస్తు గురించి నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వంతో తాను 2005లో ఒప్పందం కుదుర్చుకున్నానని, అయితే 2012వరకు సిమెంటు, స్టీలు, ఇంధనం, విద్యుత్ ధరలు పెరిగినందున, సకాలంలో ప్రభుత్వం నిధులివ్వని కారణంగా ప్రాజెక్టు పూర్తి కాలేదని, తనకు ఎస్కులేషన్ చార్జీలు ఇవ్వాలని కాంట్రాక్టర్ ఆ దరఖాస్తులో పేర్కొన్నారు.
దీనిపై రాష్ట్రప్రభుత్వం అప్పుడే నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ దేశవ్యాప్తంగా జరుగుతున్న టన్నెల్ పనులు, అంతర్జాతీయ నిబంధనలను పరిశీలించి కాంట్రాక్టర్ చేసుకున్న దరఖాస్తును అంగీకరించాలని, ఎస్కులేషన్ చార్జీలు చెల్లించాలని సిఫారసు చేసిందని సభ్యులకు వివరించారు. ఇందుకోసం కాంట్రాక్టర్ ప్రతిపాదించిన విధంగా చేయకపోయినా రూ.723 కోట్ల వరకు ఎస్కులేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దీనిపై జిల్లా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసును పరిగణనలోకి తీసుకుని కాంట్రాక్టర్‌కు వెంటనే మొబిలైజేషన్ అడ్వాన్సులిచ్చి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కోరారు. దీనికి సీఎంతో పాటు మంత్రి, ఆర్థికశాఖ అధికారులు కూడా అంగీకరించారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టర్‌తో మాట్లాడి నిలిచిపోయిన 19కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వకం పనులు త్వరలోనే ప్రారంభం చేయాలని నిర్ణయించారు.
డిండి, బ్రాహ్మణవెల్లెంల కూడా
ఈ ప్రాజెక్టుతో పాటు టెండర్‌దశలో ఉన్న డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అసంపూర్తిగా ఉన్న బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకాన్ని గురించి కూడా సమావేశంలో చర్చించారు. డిండి రిజర్వాయర్ పనులు టెండర్‌దశలో ఉన్నందున ఈ పనులను కొనసాగించి ఎస్‌ఎల్‌బీసీతో పాటు పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, ఇందుకు అవసరమైన రూ. 325 కోట్లను చెల్లించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి కోరడంతో అందుకు కూడా సీఎం అంగీకరించారు. ఇక, జిల్లాలోని మరో ఉపయుక్తమైన నక్కలగండి ప్రాజెక్టుపై కూడా చర్చ జరిగినా దీనిపై మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. దీనిపై సీఎం మాట్లాడుతూ జూరాల-పాకాల ప్రాజెక్టు నుంచి డిండి వరకు కృష్ణానీరు వ స్తున్నందున, ఇక మిగిలిన ప్రాంతాన్ని ఏం చేద్దామన్నది మరోమారు సమావేశమై చర్చిద్దామని చెప్పినట్టు సమాచారం.
ముచ్చటగా మూడేళ్లలో..
Published Fri, Nov 21 2014 1:49 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement