ఆశల చిగురు!
మొదలైన ఖరీఫ్ పంటల సాగు
* సాగర్ కింద 4 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళిక
* నీటి విడుదల కోసం రేపు బోర్డుకు లేఖ రాయనున్న రాష్ట్రం
* ఎస్సారెస్పీ కింద 4.63 లక్షల ఎకరాలకు నీరివ్వాలని సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద సాగు ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు వస్తుండటంతో రైతుల ఆశలు మొగ్గ తొడుగుతున్నాయి. ఇప్పటికే మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటివనరుల కింద జోరుగా ఖరీఫ్ పంటల సాగు జరుగుతుండగా భారీ ప్రాజెక్టుల కింద సాగుకు రైతులు నడుం బిగిస్తున్నారు.
ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, నిజాం సాగర్, జూరాల, ఆర్డీఎస్, కడెం, మూసీ, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 21.29 లక్షల మేర ఆయకట్టు ఉంది. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు చేరకపోవడంతో సాగు పరిస్థితి దారుణంగా తయారైంది. 2014-15లో మొత్తం లక్ష్యంలో కేవలం 7.90 లక్షల ఎకరాలే సాగవగా 2015-16 నాటికి అది 72 వేలకు పడిపోయింది. అయితే ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడం, ప్రాజెక్టుల్లోకి ఆశించిన మేర నీరు చేరుతుండటంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది.
ఇప్పటికే ఎగువ నుంచి భారీ ప్రవాహాలతో కృష్ణమ్మ వస్తుండటంతో జూరాల కింద పంటల సాగుకు నీటి విడుదల మొదలైంది. ప్రాజెక్టు కింద మొత్తంగా 1,04,741 ఎకరాల మేర ఉండగా ఇప్పటికే 80వేల ఎకరాలకు పైగా సాగు మొదలైనట్లు తెలుస్తోంది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ల కింద 4.60 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక సిద్ధమవగా ఇప్పటికే నీటి విడుదల ప్రక్రియ మొదలైంది. ఈ ప్రాజెక్టు కింద సుమారు 2.50 లక్షల ఎకరాల మేర సాగు పుంజుకున్నట్లు నీటిపారుదలశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
శ్రీశైలం ప్రాజెక్టుకు స్ధిరంగా ప్రవాహాలు కొనసాగుతుండటం, ఇప్పటికే నీటి నిల్వ 165 టీఎంసీలకు పెరగడంతో మరో రెండు వారాల్లో శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేసే అవాకశాలున్నాయి. దీనివల్ల ఆలస్యంగా అయినా ఎడమ కాల్వ కింద ఉన్న 6.40 లక్షల ఎకరాల్లో కనీసం 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించే అవకాశాలున్నాయని నీటిపారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సాగర్ నుంచి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సాగు అవసరాలకు నీటిని విడుదల చేసేలా కృష్ణా బోర్డుకు లేఖ రాయాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బోర్డుకు అధికారులు మంగళవారం లేఖ రాయనున్నారు.
ఎస్సారెస్పీ కింద ఖరీఫ్ కార్యాచరణ షురూ
రెండేళ్లుగా నిస్సారంగా ఉన్న ఎస్సారెస్పీలోకి ఈ ఏడాది 45 టీఎంసీల మేర నీరు రావడం, మరింతగా ప్రవాహాలు కొనసాగుతుండటం ఆయకట్టు రైతాంగానికి ఊరటనిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీరిచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రాజెక్టు నుంచి సాగు అవసరాలు 17.18 టీఎంసీలు విడుదల చేయడంతోపాటు లోయర్ మానేరు డ్యామ్‌కు 10 టీఎంసీలు, ఎత్తిపోతల పథకాలకు 3.95 టీఎంసీలు విడుదల చేయాలని సీఎం సూచించినట్లుగా తెలిసింది. మొత్తంగా ప్రాజెక్టు కింద 4.63 లక్షల ఎకరాలకు నీరివ్వాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు లక్ష్యం 1.65 లక్షల ఎకరాల్లో 30 వేల ఎకరాలకు సెప్టెంబర్ తొలి వారంలో నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో ప్రాజెక్టు కింద పంప్‌హౌస్‌ట్రయల్ రన్‌ను ఈ నెల చివరి వారంలో నిర్వహించనున్నారు.