- మార్కెట్ ధర మేరకు పరిహారమివ్వాలని రైతుల డిమాండ్
- ఎకరాకు రూ. పది లక్షలైనా ఇవ్వాలంటున్న మాజీ సైనికోద్యోగులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) భూసేకరణ ఓ కొలిక్కి రావడం లేదు. మార్కెట్ ధర మేరకు పరిహారం ఇస్తేనే భూసేకరణకు అంగీకరిస్తామని డీకేటీ భూముల రైతులు స్పష్టీకరిస్తున్నారు. ఎకరాకు కనిష్టంగా రూ.పది లక్షలు పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని మాజీ సైనికోద్యోగులు తెగేసి చెబుతున్నారు. పరిహారంపై డీకేటీ భూముల లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించడంతో భూసేకరణ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద ఐఐటీ క్యాంపస్ ఏర్పాటుకు 530 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
ఇందులో 430 ఎకరాల డీకేటీ భూమి.. మరో వంద ఎకరాలు మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన భూమి. ఈ భూమిలో ఐఐటీ క్యాంపస్‌కు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీతో శంకుస్థాపన చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ.. తిరుపతి ఉప ఎన్నికతో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో శంకుస్థాపనకు బ్రేక్ పడింది. ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అవసరాల కోసం సేకరిస్తున్న డీకేటీ భూములు ఎకరానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వంతున పరిహారం అందిస్తున్నారు.
కానీ.. మేర్లపాక వద్ద ఎకరం భూమి బహిరంగ మార్కెట్‌లో రూ.కోటి.. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధర మేరకు రూ.ఐదు లక్షలు పలుకుతోంది. మార్కెట్ ధర మేరకు పరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని డీకేటీ భూముల లబ్ధిదారులు ఆది నుంచి తెగేసి చెబుతూ వస్తున్నారు. కానీ.. పరిహారం చెల్లించే అంశంపై అధికారులు నోరుమెదపడం లేదు. దీంతో ఆగ్రహించిన డీకేటీ భూముల రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మార్కెట్ ధరల మేరకు పరిహారం ఇప్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో భూసేకరణ ప్రక్రియకు బ్రేక్ పడింది.
శ్రీకాళహస్తి మండలం పోలి, మన్నవరం గ్రామాల్లో మన్నవరం(ఎన్‌టీపీసీ-బీహెచ్‌ఈఎల్) విద్యుదుత్పత్తి పరికరాల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేసే సమయంలోనూ ప్రైవేటు భూములతోపాటూ డీకేటీ, మాజీ సైనికోద్యోగుల భూములను సేకరించారు. మాజీ సైనికోద్యోగులకు ఆ ప్రాంతంలో ఉన్న భూమికి బదులుగా మరో ప్రాంతంలో భూమిని కేటాయించి.. తక్కిన రైతులకు పరిహారం అందించారు.
మేర్లపాకలో భూములు కోల్పోతున్న మాజీ సైనికోద్యోగులు ఎకరానికి కనిష్టంగా రూ.పది లక్షలు పరిహారం ఇస్తేనే భూసేకరణకు అంగీకరిస్తామని స్పష్టీకరిస్తున్నారు. మాజీ సైనికోద్యోగుల ప్రతిపాదనపై కూడా రెవెన్యూ అధికారులు స్పందించక పోవడం గమనార్హం.