సాక్షి, మంచిర్యాల : కళకళలాడుతున్న సాగునీటి ప్రాజెక్టుల కింద యాసంగి వ్యవసాయంపై జిల్లా రైతాంగం భారీగా ఆశలు పెట్టుకొంది. రెండేళ్లుగా ఖరీఫ్‌లోనే అంతంత మాత్రంగా ఉన్న సాగు ఈసారి యాసంగిలో మెరుగవుతుందని నీటి పారుదల శాఖ కూడా లెక్కలు వేస్తోంది. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులతోపాటు బోర్లు, బావుల ద్వారా ఈ యాసంగిలో 75 వేల ఎకరాల మేర సాగవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అయితే.. కేవలం సాగునీటి ద్వారానే 44 వేల ఎకరాలకు నీరందిస్తామని మంగళవారం కలెక్టర్ నేతృత్వంలో సాగిన జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశంలో నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది.
నీటిపారుదల శాఖ చెప్పే లెక్కలకు వాస్తవ పరిస్థితికి చాలా తేడా ఉండే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు పేర్కొనడం గమనార్హం. జిల్లాకు నీరందించే ప్రధానమైన కడెం (నారాయణరెడ్డి) ప్రాజక్టు పరిధిలో 6.82 టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద స్థిరీకరించిన ఆయకట్టు 38,984 ఎకరాలు కాగా, 6.82 టీఎంసీల నీరు విడుదలైతేనే ఈ మేరకు సాగవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.101 టీఎంసీల నీటి మట్టం ఉన్నప్పటికీ, నికర నీటి లభ్యత మాత్రం 2.26 టీఎంసీలే. గూడెం లిఫ్టు నుంచి 2.56 టీఎంసీలు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి 2టీఎంసీలు నీరు అందితేనే ప్రతిపాదిత 38,984 ఎకరాల ఆయకట్టు సాధ్యమవుతుంది. లేదంటే ఈ ప్రాజెక్టు కింద 28 వేల ఎకరాలకే నీరందించే అవకాశం ఉంది.
ఆయకట్టుకు స్థిరీకరణకు మధ్య సగం తేడా
ప్రాజెక్టుల్లోని నీటి లభ్యత ఆధారంగా వానాకాలం, యాసంగి సీజన్‌లలో నీటి స్థిరీకరణ జరుగుతుంది. ఈసారి కురిసిన భారీ వర్షాలతో కడెంతోపాటు నీల్వాయి, గొల్లవాగు, ర్యాలీవాగులలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కింద మొత్తం ఆయకట్టు 87,757 ఎకరాలు ఉండగా, యాసంగిలో మాత్రం 44 వేల ఎకరాలకే నీటి స్థిరీకరణ జరపడం గమనార్హం. కాగా వానకాలం పంటలనే ఇప్పటికీ కోయని పరిస్థితి జిల్లా పరిధిలో నెలకొంది. వానకాలం పంటలు ఆలస్యం కావడంతో యాసంగి కూడా వచ్చే నెల రెండో వారంలో ఆరంభమవుతుందని భావిస్తున్నారు. అప్పటి నుంచి 64 నీటి విడుదల రోజుల్లో మాత్రమే సాగు నీరందుతుంది. తరి, ఆరుతడి పంటల్లో గతంలో యాసంగిలో తరి పంటలు తక్కువ కాగా, ఈసారి పెరిగే అవకాశం ఉంది. ఆరుతడి పంటలు సాధారణ స్థాయిలోనే ఉండనున్నాయి.
గతేడాది యాసంగిలో 17 వేల ఎకరాల్లోనే సాగు
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గతేడాది యాసంగిలో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం గతేడాది 17 వేల ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. గత యాసంగిలో వరి పంట వేల ఎకరాల్లో నష్టపోగా, ఈసారి మాత్రం 50 వేల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేస్తున్నారు. కాగా.. మొన్నటి ఖరీఫ్‌లో కేవలం నాలుగు ఈ ప్రాజెక్టుల కింద 48,484 ఎకరాల ఆయకట్టు సాగయిందని నీటి పారుదల శాఖ చెపుతోంది. వర్షాధారం, ఇతర నీటి వనరుల ద్వారా కలుపుకొని జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో సాగయింది.
ప్రాజెక్టుల నీటి సామర్థ్యం (టీఎంసీలలో)
ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం ప్రస్తుత నీటి మట్టం
కడెం నారాయణరెడ్డి 7.603 6.101
నీల్వాయి 0.846 0.846
గొల్లవాగు 0.567 0.527
ర్యాలీవాగు 0.410 0.387
మొత్తం 9 .426 7.861
ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టు (ఎకరాల్లో)
ప్రాజెక్టు మొత్తం ఆయకట్టు ప్రతిపాదిత ఆయకట్టు ఖరీఫ్‌లో అయిన సాగు
కడెం నారాయణరెడ్డి 61,977 38,984 38,984
నీల్వాయి 13,000 2,500 1,500
గొల్లవాగు 9,500 1,100 6,000
ర్యాలీవాగు 3,280 1,500 2,000
మొత్తం 87,757 44,084 48,484