రైతులను రెచ్చగొడతారా : ఎంపీ గుత్తా
కాంగ్రెస్, టీడీపీలపై ఎంపీ గుత్తా ధ్వజం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సాగునీటి ప్రాజెక్టులను ఆహ్వానిస్తామని చెబుతూనే రైతులను రెచ్చగొట్టడం తగదని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో లోపాలుంటే ప్రభుత్వానికి తెలియజేయూలని కాంగ్రెస్, టీడీపీలకు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం తన నివాసంలో విలేకరులతో గుత్తా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కిరణ్ కేబినెట్‌లో మంత్రి పదవుల కోసం కుక్కిన పేనులా ఉన్న బృందమే ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడుతోందన్నారు.
కాంగ్రెస్, టీడీపీ నేతలు ఒక్కటై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రాజెక్టులను అడ్డుకున్న నాయకులు భవిష్యత్తులో అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోతారని అన్నారు.
గిత్త గాడు.. గత్తగాడితో కలసి మాట్లాడతారా?
కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడడం సరైంది కాదని, ఆయన జాతీయ నాయకుడు కాబట్టి జాతీయ స్థాయిలోనే మాట్లాడితే బాగుంటుందని ఎంపీ గుత్తా వ్యాఖ్యానించారు. ‘మీరు జాతీయ స్థాయిలోనే మాట్లాడాలి. ఎల్లన్న, మల్లన్న.. గిత్తగాడు.. గత్తగాడు... పిట్ట గాండ్లతో కలిసి మాట్లాడితే మాకే సిగ్గేస్తోంది.’ అని ఎద్దేవా చేశారు. ఇక, మంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపడతారని అడిగిన ప్రశ్నకు గుత్తా బదులిస్తూ ‘నాకు మంత్రి పదవి గురించి ఆలోచనే లేదు. అందుకోసం ప్రయత్నమూ చేయడం లేదు. ముఖ్యమంత్రి ఇష్టం.’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.