భైంసా : జిల్లాపై కరువు మేఘాలు కమ్ముకున్నాయి. కారు మబ్బులు ఊరిస్తున్నాయి. వర్షించడం లేదు. ఖరీఫ్ పనులు ఆరంభమై నెల రోజులు గడిచినా వరుణుడు కరుణించడం లేదు. ప్రాజెక్టులు, చెరువులు అడుగంటుతున్నాయి. వేసిన విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి. మొలిచిన మొక్కలు నేలవాలుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గోదావరి పరీవాహాక ప్రాంతంలో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నీరందించడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను మహారాష్ట్ర సర్కారు మంగళవారం ఎత్తింది. పోలీసు బందోబస్తు మధ్య వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎత్తారు. దీంతో బాబ్లీ ప్రాజెక్టులో 0.7 టీఎంసీల నీరు ఎస్సారెస్పీలోకి చేరుతోంది.
గోదావరిలో జలకళ
వర్షాలు కురియక గోదావరి నదిలో నీటి ప్రవాహం కనిపించలేదు. బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో బుధవారం బాసర గోదావరి వద్ద జలకళ కనిపించింది. గోదావరి నదిలో నీటి ప్రవాహంతో ఎత్తిపోతల పథకాలకు నీరు చేరనుంది. బాసర, కౌట, ఆష్టా ఎత్తిపోతలకు పరీవాహక నీటిరాకతో ఆయకట్టు రైతులకు కొద్దిమేర ఆశ చిగురిస్తుంది. శ్రీరాంసాగర్‌లో బాబ్లీ గేట్లు తెరవడంతో 0.7 టీఎంసీల నీరు చేరి 0.4 అడుగుల నీటి మట్టం పెరుగుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.
అక్టోబర్ 28 వరకు..
వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య గోదావరి జలాల కోసం తీవ్రమైన పోరు కొనసాగింది. ఇరు రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అత్యున్నత న్యాయస్థానం ఇరు రాష్ట్రాల వాదనలు విని మహారాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాల కోసం 2.84 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. బాబ్లీ ఇన్‌ఫ్లోను అడ్డుకోకుండా ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు నాలుగు నెలలపాటు గేట్లు ఎత్తి ఉంచాలని తీర్పు ఇచ్చింది. అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచే ఉంటాయి. భారీ వర్షాలు కురిస్తే పెద్ద మొత్తంలోనే ఎస్సారెస్పీలోకి వరద నీరు చేరనుంది.
జిల్లా రైతులకు ఊరట
మరో వారం రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో బాబ్లీ గేట్లు పైకి ఎత్తి వస్తున్న నీరు ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి చేరుతోంది. ఎస్సారెస్పీలోని నీరు చేరుతుండడంతో జిల్లా రైతుల్లో కొత్త ఆశ చిగురిస్తుంది. వర్షాలు కురిసే వరకు ప్రాజెక్టులో చేరే నీటిని అంచనా వేసి పంటలు వేసుకునేందుకు ఎస్సారెస్పీ ఆయాకట్టు రైతులు సన్నద్ధం అవుతున్నారు.
గలగల గోదారి
Published Thu, Jul 3 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement
Advertisement