సాక్షి, హైదరాబాద్: ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు దిగువ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు నిండుతుండటం దిగువన ఉన్న ప్రాజెక్టులకు ఊరటనిస్తోంది. ఆల్మట్టిలోకి రోజురోజుకూ ప్రవాహాలు పెరుగుతుండగా, నారాయణపూర్ దాదాపుగా నిండేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం కొనసాగుతున్న మాదిరే ఆల్మట్టి, నారాయణపూర్‌లకు ప్రవాహాలు కొనసాగితే మరోవారంలోనే జూరాలకు భారీ ప్రవాహాలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఈ నెల 20కి ముందే దిగువకు..
ఆల్మట్టి ప్రాజెక్టులోకి శుక్రవారం 50 వేల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదుకాగా, శనివారం 73,791 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టుల నీటి నిల్వ 129 టీఎంసీలకుగాను 95 టీఎంసీలను దాటింది. దీంతో 21,130 క్యూసెక్కుల నీటిని పవర్‌హౌస్ ద్వారా దిగువన నారాయణపూర్‌కు వదిలేస్తున్నారు. ప్రాజెక్టులో మరో 35 టీఎంసీల నీరు చేరితే ప్రాజెక్టు నిండుకుండను తలపించనుంది. దీనికి మరో ఐదారు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత గేట్లెత్తి దిగువకు నీటివిడుదల చేయనున్నారు. నారాయణపూర్‌లోకి ఎగువ ప్రవాహానికి తోడు స్థానిక ప్రవాహాలు కలిపి 27,756 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 37.64 టీఎంసీలకు గానూ 32 టీఎంసీల నిల్వలున్నాయి.
ఎగువ ప్రవాహాలను దృష్టిలో పెట్టుకొని రెండు, మూడు టీఎంసీల నిల్వల మేర ఖాళీ పెట్టి దిగువకు నీటివిడుదల చేయనున్నారు. అయితే ఆల్మట్టిలో మరో 30 టీఎంసీల నీరు చేరాక దిగువ నారాయణపూర్ ద్వారా జూరాలకు నీటి విడుదల చేసే అవకాశాలున్నాయని, దీనికి మరో వారం పట్టవచ్చని, ఈ నెల 20కి ముందే దిగువకు నీటి విడుదల ఉండొచ్చని నీటిపారుదల శాఖ వర్గాలు అం చనా వేస్తున్నాయి. తుంగభద్రకు 34,374 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో మొత్తం 100 టీఎంసీలకుగానూ 20 టీఎంసీల నిల్వ ఉంది. జూరాలకు 1,037 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నిల్వ 9.66 టీఎంసీలకుగానూ 7.78 టీఎంసీలుగా ఉంది. భీమా, నెట్టెంపాడుల ద్వారా 1,488 క్యూసెక్కుల మేర నీటిని పంపింగ్ చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజె క్టుకు సైతం స్థానికంగా 3,179 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 215 టీఎంసీలకు గానూ 37.20 టీఎంసీల నిల్వ ఉంది. నాగార్జునసాగర్లోకి 1,668 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, పూర్తి నిల్వ 312 టీఎంసీలకు గాను 168.40 టీఎంసీలుగా ఉంది
Comments
Please login to add a commentAdd a comment