ఉరికొస్తూ... ఊపిరిలూదుతూ...   | Water Flow Increasing In Irrigation Projects In Telangana | Sakshi
Sakshi News home page

ఉరికొస్తూ... ఊపిరిలూదుతూ...  

Published Mon, Aug 24 2020 4:41 AM | Last Updated on Mon, Aug 24 2020 4:41 AM

Water Flow Increasing In Irrigation Projects In Telangana - Sakshi

వరద జలాల రాకతో కళకళలాడుతున్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

సాక్షి, హైదరాబాద్‌: విస్తారంగా వర్షాలు.. పరవళ్లు తొక్కుతున్న ప్రవాహాలు.. నిండుకుండల్లా ప్రాజెక్టులు.. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న తాజా దృశ్యం. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు బిరబిరా వస్తూ సాగునీటి ప్రాజెక్టులకు కొత్త ఊపిరిలూదాయి. ఇప్పటికే కృష్ణా బేసిన్‌లో ఆల్మట్టి నుంచి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయగా, గోదావరిలో సింగూరు, నిజాంసాగర్‌ మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే లోయర్‌ మానేరు, మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తేశారు. రెండు, మూడు రోజుల్లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లు తెరుచుకునే అవకాశాలున్నాయి. 

నిండేందుకు సిద్ధంగా ఎస్సారెస్పీ...
ఎగువ నుంచి స్థిరంగా ప్రవాహాలు వస్తుండటంతో ఎస్సారెస్పీ జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 90.31 టీఎంసీలకుగానూ 78 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ఆదివారం ఉదయం 52 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగగా, అది మధ్యాహ్నానికి 18 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా, నీటి ప్రవాహాల్లో హెచ్చుతగ్గులున్నాయి. 23 నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి ఏర్పడుతున్న నేపథ్యంలో విస్తారంగా వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రవాహాలు పుంజుకుంటే రెండు, మూడు రోజుల్లో ప్రాజెక్టు నిండొచ్చని భావిస్తున్నారు. 90 టీఎంసీలకు గానూ 85 టీఎంసీల మేర నీరు చేరిన వెంటనే గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు.

బోసిపోయిన సింగూరు, నిజాంసాగర్‌...
అన్ని ప్రాజెక్టులకు భిన్నంగా సింగూరు, నిజాంసాగర్‌ ప్రాజెక్టులు దర్శనమిస్తున్నాయి. అవి పూర్తిగా బోసిపోయి కనిపిస్తున్నాయి. సింగూరులో 29.91 టీఎంసీలకు కేవలం 2.81 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. స్థానిక పరీవాహకం నుంచి 1,122 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ సీజన్‌లో ఇంతవరకు కేవలం 2.80 టీఎంసీల మేర మాత్రమే కొత్తనీరు వచ్చి చేరింది. నిజాంసాగర్‌లో 17.80 టీఎంసీలకు కేవలం 1.72 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం 2 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ సీజన్‌లో కొత్తగా వచ్చి చేరిన నీరు కేవలం ఒక టీఎంసీ మాత్రమే. ఈ రెండు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 4.50 టీఎంసీల లభ్యత ఉంటే అందులో కొత్తగా వచ్చింది 3.80 టీఎంసీలు. గత ఏడాదితో పోలిస్తే ప్రాజెక్టులో 4 టీఎంసీల మేర అధికంగా నిల్వ ఉంది. వచ్చే సెప్టెంబర్‌లో భారీ తుఫాన్‌లు వస్తే ఈ ప్రాజెక్టుల్లోకి భారీ ప్రవాహాలు వస్తాయేమోనని ఇంజనీర్లు ఆశాభావంతో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement