ఆల్మట్టికి భారీగా వరద నీరు...
జూరాల : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌కు శనివారం భారీస్థాయిలో వరదనీరు చేరింది. ఒక్కరోజే లక్ష క్యూసెక్కులకు పైగా నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 1,705 అడుగులుండగా శనివారంనాటికి 1,682.6 అడుగులకు చేరింది. మరో 18 అడుగులకు నీటి నిల్వ చేరితే ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న నారాయణపూర్‌కు.. అక్కడి నుంచి మన రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు కృష్ణానది వరద వచ్చే అవకాశం ఉంది. మరో పదిరోజుల్లోపే కృష్ణానది వరద జూరాలకు చేరే అవకాశం ఉండడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకెత్తాయి.
ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌కు భారీస్థాయిలో ఇన్‌ఫ్లో వస్తుండటంతోప్రాజెక్టు నుంచి మొదటిసారిగా 4,167 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్‌కు 786 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.30 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 80 క్యూసెక్కు వస్తుండగా తాగునీటి అవసరాల కొరకు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 100 క్యూసెక్కును దిగువకు విడుదల చేస్తున్నారు.