సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నదీ బేసిన్ల పరిధిలో జల ప్రవాహాలు పుంజుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్ రెండో వారం నుంచే కృష్ణా పరీవాహకంలో కురిసిన వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టులోకి 50వేల క్యూసెక్కులకు పైగా వరద నీరొచ్చి చేరుతుండగా, రాష్ట్ర పరిధిలోని మేడిగడ్డ వద్ద గోదావరి ప్రవాహం ఆశాజనకంగా ఉంది.
ఆల్మట్టిలోకి కొత్తగా 25 టీఎంసీలు..
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టిలోకి నీటి ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రాజెక్టులోకి నిన్నమొన్నటి వరకు 20వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు రాగా, అది శుక్రవారం 42,659 క్యూసెక్కులకు పెరిగింది. శనివారం మరింత పెరిగి 57,346 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు 129 టీఎంసీలకు గానూ 50 టీఎంసీలకు చేరింది. ఈ నీటి సంవత్సరం ఆరంభమైన 20 రోజుల్లోనే 25 టీఎంసీల మేర కొత్త నీరొచ్చి చేరింది. గతేడాది ఈ సమయానికి ప్రాజెక్టులో కేవలం 22.50 టీఎంసీలు మాత్రమే ఉండగా, ఈ ఏడాది 28 టీఎంసీల మేర అదనంగా ఉండటంతో పరిస్థితి ఆశాజనకంగా కన్పిస్తోంది. ఇక నారాయణపూర్‌లోకి సైతం స్థానిక ప్రవాహాలు వస్తుండటంతో 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.
ప్రాజెక్టులోకి ఇప్పటివరకు 4 టీఎంసీల మేర కొత్తనీరు వచ్చి చేరగా, నిల్వలు 37.64 టీఎంసీలకు గానూ 24 టీఎంసీల మేర ఉన్నాయి. ఇక ఉజ్జయినిలోకి సైతం 3,105 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా, 117 టీ ఎంసీల నిల్వలకు గానూ 53 టీఎంసీల నిల్వలున్నాయి. ఈ ప్రవాహాలు క్రమంగా పెరిగితే గతేడాది మాదిరి జూలై రెండో వారానికి దిగువకు ప్రవాహాలు నమోదు కానున్నాయి. ఇక స్థానిక పరీవాహకంలో కురిసిన వర్షాలతో నాగార్జునసాగర్‌లోకి 1,455 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం సాగర్‌లో 312 టీఎంసీలకు గానూ 169.52 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలంలో 215 టీఎంసీలకు గానూ 35 టీఎంసీ, జూరాలలో 9.66 టీఎంసీలకు గానూ 4.71 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఇక గోదావరి పరీవాహకంలోనూ జల ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. మేడగడ్డ వద్ద శనివారం 15వేల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా, ఇవి ఈ నెల 25,26 నాటికి లక్ష క్యూసెక్కులకు పెరగవచ్చని ప్రాజెక్టు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment