cusecs
-
శ్రీశైలానికి పోటెత్తిన వరద!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో వరదతో శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటి చేరిక పెరిగింది. నీటిమట్టం డెడ్ స్టోరేజీ (854 అడుగులు)ని దాటింది. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో జూరాల నుంచి 1,52,368 క్యూసెక్కులు, తుంగభద్రపై ఉన్న సుంకేశుల బ్యారేజీ ద్వారా 1,61,988 క్యూసెక్కులు.. కలిపి 3,14,256 క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి చేరుతోంది. శనివారం సాయంత్రానికి ప్రాజెక్టులో నీటిమట్టం 854 అడుగులకు, నిల్వ 90 టీఎంసీలకు పెరిగింది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 125 టీఎంసీలు అవసరం. వరద ఉద్ధృతి ఇదేస్థాయిలో కొనసాగితే ఆరు రోజుల్లో శ్రీశైలం నిండే అవకాశముంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వానలు పడుతుండటంతో తుంగభద్రలో వరద స్థిరంగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు కూడా నిండి ఉండటంతో వచ్చిన నీటిని దిగువకు వదులుతున్నారు. దీనితో మరో రెండు, మూడు రోజులు శ్రీశైలంలోకి ప్రస్తుత స్థాయిలోనే ప్రవాహం కొనసాగనుంది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు 31,784 క్యూసెక్కులు (రోజుకు 2.75 టీఎంసీలు) వదులుతోంది. ఇక నాగార్జునసాగర్‌కు దిగువన వర్షాలు తెరిపి ఇవ్వడంలో పులిచింతల ప్రాజెక్టులోకి వరద తగ్గింది. ప్రకాశం బ్యారేజీకి కూడా ప్రవాహం 11,081 క్యూసెక్కులకు పడిపోయింది. కృష్ణా డెల్టా కాల్వలకు 3,700 క్యూసెక్కులు వదులుతూ మిగతా 7,381 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
శ్రీశైలంలోకి 3.7 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం ఎట్టకేలకు కనీస స్థాయిని దాటింది. శనివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.7 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో నీటి మట్టం 855.60 అడుగులకు చేరింది. ప్రస్తుతం శ్రీశైలంలో 93.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 122 టీఎంసీలు అవసరం. కృష్ణా బేసిన్లో ఎగువన శనివారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఈ వరద కనీసం వారం రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఆదివారం శ్రీశైలంలోకి కనీసం 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, దాని ఉపనదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టిలోకి భారీ ఎత్తున వరద వస్తుండటంతో.. దిగువకు అంతే స్థాయిలో వరదను వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోనూ అదే పరిస్థితి. జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండటంతో విద్యుదుత్పత్తి చేస్తూ.. స్పిల్‌వే గేట్లు ఎత్తేసి 3.72 లక్షల క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. తుంగభద్రలో వరద ఉధృతి పెరగడంతో టీబీ డ్యాంలోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. దాంతో నీటి నిల్వ 74.58 టీఎంసీలకు చేరుకుంది. టీబీ డ్యాం నిండాలంటే ఇంకా 26 టీఎంసీలు అవసరం. వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగితే మరో మూడు, నాలుగు రోజుల్లో టీబీ డ్యాం నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత గేట్లు ఎత్తేసి.. వరదను దిగువకు విడుదల చేస్తారు. ఆ జలాలు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతాయి. దిగువకు విడుదల చేస్తున్న నీటిలో సాగర్‌కు 29305 క్యూసెక్కులు చేరుతున్నాయి. -
కృష్ణమ్మకు కొత్తనీరు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నదీ బేసిన్ల పరిధిలో జల ప్రవాహాలు పుంజుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్ రెండో వారం నుంచే కృష్ణా పరీవాహకంలో కురిసిన వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టులోకి 50వేల క్యూసెక్కులకు పైగా వరద నీరొచ్చి చేరుతుండగా, రాష్ట్ర పరిధిలోని మేడిగడ్డ వద్ద గోదావరి ప్రవాహం ఆశాజనకంగా ఉంది. ఆల్మట్టిలోకి కొత్తగా 25 టీఎంసీలు.. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టిలోకి నీటి ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రాజెక్టులోకి నిన్నమొన్నటి వరకు 20వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు రాగా, అది శుక్రవారం 42,659 క్యూసెక్కులకు పెరిగింది. శనివారం మరింత పెరిగి 57,346 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు 129 టీఎంసీలకు గానూ 50 టీఎంసీలకు చేరింది. ఈ నీటి సంవత్సరం ఆరంభమైన 20 రోజుల్లోనే 25 టీఎంసీల మేర కొత్త నీరొచ్చి చేరింది. గతేడాది ఈ సమయానికి ప్రాజెక్టులో కేవలం 22.50 టీఎంసీలు మాత్రమే ఉండగా, ఈ ఏడాది 28 టీఎంసీల మేర అదనంగా ఉండటంతో పరిస్థితి ఆశాజనకంగా కన్పిస్తోంది. ఇక నారాయణపూర్‌లోకి సైతం స్థానిక ప్రవాహాలు వస్తుండటంతో 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టులోకి ఇప్పటివరకు 4 టీఎంసీల మేర కొత్తనీరు వచ్చి చేరగా, నిల్వలు 37.64 టీఎంసీలకు గానూ 24 టీఎంసీల మేర ఉన్నాయి. ఇక ఉజ్జయినిలోకి సైతం 3,105 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా, 117 టీ ఎంసీల నిల్వలకు గానూ 53 టీఎంసీల నిల్వలున్నాయి. ఈ ప్రవాహాలు క్రమంగా పెరిగితే గతేడాది మాదిరి జూలై రెండో వారానికి దిగువకు ప్రవాహాలు నమోదు కానున్నాయి. ఇక స్థానిక పరీవాహకంలో కురిసిన వర్షాలతో నాగార్జునసాగర్‌లోకి 1,455 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం సాగర్‌లో 312 టీఎంసీలకు గానూ 169.52 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలంలో 215 టీఎంసీలకు గానూ 35 టీఎంసీ, జూరాలలో 9.66 టీఎంసీలకు గానూ 4.71 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఇక గోదావరి పరీవాహకంలోనూ జల ప్రవాహాలు క్రమంగా పెరుగుతున్నాయి. మేడగడ్డ వద్ద శనివారం 15వేల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా, ఇవి ఈ నెల 25,26 నాటికి లక్ష క్యూసెక్కులకు పెరగవచ్చని ప్రాజెక్టు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. -
హరీ కృష్ణ..
–కృష్ణా డెల్టాలో 59 వేల ఎకరాలు సాగుకు దూరం –మూడేళ్లుగా బీళ్లుగానే.. –24 వేల మంది రైతుల జీవితాలు ఛిన్నాభిన్నం –కూలీలు, భవన నిర్మాణ కార్మికులుగా మారిన వైనం –పట్టించుకోని పాలకులు ఏలూరు (మెట్రో) : ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచిన జిల్లాలో కృష్ణాడెల్టా పరిధిలోని రైతులు కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్నారు. సాగు నీరు రాక.. వేసిన ఆరుతడి పంటలు చేతికి రాక వేల మంది రైతులు కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా, తాపీ పనివారుగా మారుతున్నారు. మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా మిగిలిపోయారు. 59 వేల ఎకరాల్లో సాగు హుష్‌కాకి జిల్లాలో అత్యధిక మండలాల్లోని రైతులు గోదావరి డెల్టా సాగునీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఏలూరు, పెదపాడు, పెదవేగి, దెందులూరు మండలాల్లోని రైతులు సాగునీటి కోసం పూర్తిగా కృష్ణా నది నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడాలి. ఈ మండలాల్లో 59 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. 24 వేల మంది రైతులు ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం వరకూ వారు కూడా బాగానే సాగు చేస్తూ జీవనం సాగించేవారు. మూడేళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఖరీఫ్ కూడా ఉండటం లేదు. దీంతో కొందరు రైతులు అపరాల సాగు చేస్తూ వ్యవసాయాన్ని వదలలేక నష్టమో, కష్టమో భరిస్తుంటే దాదాపు 20 వేల మంది రైతులు, వారి కుటుంబాలు సాగును వదిలి కూలి పనుల బాట పట్టాల్సి వచ్చింది. కొందరు సమీపంలోని ఏలూరు నగరం వైపు తాపీ పనులకు వచ్చి జీవనం సాగిస్తుంటే, మరికొందరు ఉపాధి హామీ పనులతోనే జీవనం సాగిస్తున్నారు. ప్రయత్నాలు విఫలం గతేడాది పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు వెళ్తున్న సాగునీటిని జానంపేట వద్ద పైపుల ద్వారా (సైఫ¯ŒS సిస్టం) ఎత్తిపోసే యత్నాలు చేశారు. అయితే ఈ నీటి ద్వారా కేవలం 2 వేల 300 ఎకరాలను మాత్రమే కాపాడగలిగారు. ఈ యత్నాలు పూర్తిస్థాయిలో ఫలించకపోవడంతో ఇక ప్రభుత్వం కూడా ఈ డెల్టా వైపు కన్నెత్తి చూడటం లేదు. పూర్తిస్థాయిలో పట్టిసీమ నీటిని మళ్లిస్తే కృష్ణా డెల్టాలో పంటలు పండే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం కళ్లప్పగించి చూడటం తప్ప ఏమాత్రం కనికరించడం లేదు. ఆరుతడి పంటలతో అవస్థలే గత ఏడాది 15 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలైన మినుములు, పెసలు సాగు చేసేందుకు కొందరు రైతులు యత్నించినా తెగుళ్ల కారణంగా ఈ పంటలు చేతికిరాకుండానే పోయాయి. సాక్షాత్తూ తెగుళ్ల వల్ల కోల్పోయిన పంటలను చేతపట్టుకుని అధికార పార్టీ నేతలే జిల్లా కలెక్టర్‌ను కలిసి ఈ రైతులకు న్యాయం చేయాలని కోరారు. అయినా ఫలితం శూన్యం. -
ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
బాల్కొండ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన 25 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1077.60(46.20 టీఎంసీల) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రారంభమైన విద్యుదుత్పత్తి.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వార నీటి విడుదల చేపట్టడంతో ప్రాజెక్ట్ దిగువ భాగన ఉన్న జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఒక్క టర్బయిన్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. 9 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని జెన్కో అధికారులు తెలిపారు. -
మరో పది అడుగులే..
శివమొగ్గ : జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రముఖ జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. వానలు తగ్గడంతో వరదలు వచ్చిన ప్రాంతాల్లో సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయి. గత 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమకనుమల ప్రదేశాలైన మాణి డ్యాంలో 65 మిల్లీమీటర్లు, యడూరి 72 మి.మీ, హులికల్లు 70 మి.మీ, మాస్తీకట్టె 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక శివమొగ్గ 9.20 మి.మీ, తీర్థహళ్లి 72 మి.మీ, సాగర 15.40 మి.మీ, శికారిపుర 8.60 మి.మీ, సొరబ 16.40 మి.మీ, హొసనగర 21.20 మిల్లీమీటర్లు కురిసింది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఏడు తాలూకాల్లో 97.60 మి.మీ. వర్షపాతం నమోదైంది. లింగనమక్కి డ్యాం భర్తీకి పది అడుగులు మాత్రమే రాష్ట్రంలో ప్రముఖ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రమైన లింగనమక్కి డ్యాం భర్తీకి ఇక పది అడుగులు మాత్రమే మిగిలింది. డ్యాం గరిష్ట నీటిమట్టం 1,819 అడుగులు కాగా, శుక్రవారం ఉదయం 8.30 గంటలకు అందిన సమాచారం ప్రకారం నీటిమట్టం 1809.45 అడుగులకు చేరుకుంది. జలాశయ పరిసరాల్లో వర్షం తగ్గుముఖం పట్టడంతో డ్యాం ఇన్‌ఫ్లో 32,424 క్యూసెక్కులకు తగ్గింది. ఇక భద్రా జలాశయ నీటిమట్టం 186 అడుగులు కాగా, ఇప్పటికే గరిష్ట స్థాయి 184.10 అడుగులకు చేరుకుంది. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 29,667 క్యూసెక్కులు ఉండగా, అందులో 26,091 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగా జలాశయం ఇప్పటికే గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 60 వేల క్యూసెక్కులుండగా, అంతే పరిమాణంలో విడుదల చేస్తున్నారు. మాణి జలాశయం గరిష్ట నీటిమట్టం 594.36 అడుగులు కాగా, ప్రస్తుతం డ్యాంలో 586.63 అడుగుల నీరున్నాయి. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 4,484 క్యూసెక్కులు ఉంది. వర్షం తగ్గుముఖం పట్టడంతో పొంగి పొర్లుతున్న తుంగా, భద్రా, వరదా నదులు శాంతించాయి. ఎడతెరపిలేని వానల కారణంగా జిల్లాలో సుమారు రూ.100 కోట్లు న ష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.